రసమయి బాలకిషన్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన గాయకుడు, కవి, రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున మానకొండూర్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా నియమింపబడ్డాడు.[2]తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన సాంస్కృతిక బృందానికి నాయకత్వం వహించాడు.[3] ఆయన తెలంగాణ ధూం ధాం కమిటీకి కన్వీనరుగా వ్యవహరించాడు.[4] ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు 'జానపద గాయకుడు'విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.[5] సినిమాలలో నటించడమేకాకుండా స్వీయ నిర్మాణంలో ఒక సినిమాకు దర్శకత్వం వహించాడు.
రసమయి బాలకిషన్ తన జీవితాన్ని బల్లదీర్ లో ఉపాధ్యాయునిగా ప్రారంభించాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో సాంస్కృతిక విభాగంలో ఒక భాగమైనాడు. ఆయన సమావేశాలలో సభాసదులను వినోదపరచడానికి స్థానిక ఫోక్ సాంగ్స్, నృత్య కార్యక్రమాలను నిర్వహించేవాడు. 2009-10 లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించాడు.
ఆయన 2014 సాధారణ ఎన్నికలలో కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి శాసనసభ్యులుగా గెలుపొందాడు. ఆయన 2018లో ఎన్నికల్లో మానకొండూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రసమయి బాలకిషన్‌ను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా నియమిస్తూ 13 జూలై 2021న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[6] ఆయన హైదరాబాద్‌లోని సాంస్కృతిక సారథిభవన్‌లో 19 జూలై 2021న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.[7]
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు బీఆర్‌ఎస్ తరఫున మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో 9 మందితో రైతు ఆత్మహత్యలపై అధ్యయన కమిటీని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేశాడు. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సభ్యుడిగా ఉన్నారు.[8][9]
తెలంగాణ కలాలను, గళాలను ఊరూరా విస్తరించడంలో రసమయి బాగా కృషి చేసిండు. ఆయన తీసిన సిడిలలో ఊరు తెలంగాణ వంటి వీడియో సిడి అత్యంత ప్రజాదరణ పొందింది. ఇందులో పల్లె వెతలను పట్టి చూపిండు. ఎన్నో ఆడియో సిడిల ద్వారా ఉద్యమ గేయాలను ప్రజలకు పంచిపెట్టిండు.పదేళ్లుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో రసమయి ప్రత్యక్షంగా పాల్గొన్నడు.
రసమయి బాలకిషన్ 2021 నవంబరు 16న తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళలశాఖ నుంచి ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షణలో ‘తెలంగాణ సాధనలో మలివిడత సాంస్కృతిక ఉద్యమం (ధూం ధాం) పాత్ర’ అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను డాక్టరేట్ అందుకున్నాడు.[10]