రాంభట్ల పార్వతీశ్వర శర్మ
ఈ వ్యాసంలో ఒకటి కంటే ఎక్కువ సమస్యలున్నాయి. దీన్ని మెరుగుపరచడంలో తోడ్పడండి. లేదా ఈ సమస్యల గురించి చర్చ పేజీలో చర్చించండి. (ఈ మూస సందేశాలను తీసెయ్యడం ఎలాగో తెలుసుకోండి)
|
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
పదో యేట నుండే పద్యంరాయడంలో పరిశ్రమచేస్తూ పదహారేళ్ల వయస్సులో అష్టావధానాన్ని చేసిన యువావధాని, శతావధాని డాక్టర్. రాంభట్ల పార్వతీశ్వర శర్మ. “అవధాన సుధాకర”, “అవధాన భారతి”, “అవధాన భీమ”, "అవధానకిశోర", "అసమాన ధారణాధురీణ" "నవయువావధాని" "క్షేమేంద్ర సారస్వత సరస్వతి" “అవధానకేసరి” “శతావధాని” డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ పద్యవిద్యలో ఆరితేరిన పండిత ప్రకాండులు. ఆశుకవితావిన్యాసంలో నిష్ణాతులు. వీరు అవధానవిద్యలో యువతకు ఆదర్శనీయులు.
"అక్షరలక్ష" గాయత్రీ మహామంత్రోపాసకులు లక్ష్మీ నరసింహ సోమయాజులు, సూర్యకాంతకామేశ్వరి దంపతులకు 1988లో శ్రీకాకుళంలో జన్మించారు. వీరి తాతగారు పార్వతీశ్వర శర్మగారి నుండి అవధాన విద్యను అభ్యసించారు. వీరి కుటుంబమంతా కవులు, పండితులు, సాహితీవేత్తలే. తమ 16వ ఏటనే తెలుగు సాహిత్యంలో విశిష్టమైన “అష్టావధానాన్ని” చేసి అందరి మెప్పులు పొంది అందర్నీ ఆశ్చర్యపరిచిన దిట్ట. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 73 అష్టావధానాలు చేసి, మాడుగుల, గరికిపాటి, మేడసాని, నరాల, కడిమిళ్ళ, కోట, పాలపర్తి, వద్దిపర్తి, జి.ఎమ్. రామశర్మ వంటి అవధానదిగ్గజాల ప్రశంసలందుకున్న ప్రతిభామూర్తి. Degree వరకు చదువుకున్నది సైన్స్ అయినా... తెలుగులోనూ, సంస్కృతంలో ఎం.ఏ.లను పూర్తిచేసారు. ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రవిశ్వవిద్యాలయంలో “U.G.C.” వారి “ఫెలోషిప్" తో ఆచార్యులు "అద్వైతసిద్ధిరత్నాకర" మద్దులపల్లి దత్తాత్రేయశాస్త్రి గారి పర్యవేక్షణలో క్షేమేంద్రుడి "ఔచిత్య విచార చర్చ" మీద ప్రీతితో “తెలుగు ప్రాచీన పంచకావ్యాలు - ఔచిత్యం” అన్న పరిశోధనతో పీహెచ్ .డీ.ను పూర్తి చేసి డాక్టరేట్ పట్టాను పొందారు.
2015, నవంబరులో... విశాఖ “కళాభారతి"లో మూడు రోజులపాటు “శతావధానం” చేసి సంచలనాత్మక రికార్డును సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా యువ కవి పండితుల్ని ఆశ్చర్య చకితుల్ని చేసారు. లెక్కకు మించిన ప్రసంగాలు... దూరదర్శన్ లోనూ, ఆకాశవాణిలోనూ వీరు నిర్వహించిన ఆశుకవితా ప్రదర్శనలు ప్రేక్షకులకు... సాహిత్య శ్రోతలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంటాయి.
- సాహిత్య రూపకాల్లో పింగళి సూరనగా, ధూర్జటి పాత్రల నుండి కందుకూరి వీరేశలింగం పాత్రల వరకు ఎన్నో ధరించారు.
- 2019వ సంవత్సరంలో అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, ఎన్నో అవధానాలు సాహిత్య, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు.
- మొదటిసారిగా టెక్సస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో చి. లలిత్ ఆదిత్యతో కలిసి ద్విగళావధానం చేసారు.
- అమెరికాలోని, ప్లోరిడా రాష్ట్రంలో ఒర్లాండో నగరంలో జరిగిన రెండు రోజుల 11వ అమెరికా తెలుగు సాహిత్య సదస్సు ఉత్సవాల్లో ముఖ్యాతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేశారు.
- సిలికానాంధ్ర వారి నిర్వహణలో ప్రపంచంలో అన్ని చోట్లనుండి పృచృకులు పాల్గొనగా టెక్సాస్ నుండి అంతర్జాలంలో ఆ-అవధానం నిర్వహించారు.
- TTD SVBC, అట్లాంటా తెలుగు సాహిత్య సంస్కృతి సంయుక్త నిర్వహణలో భారత దేశంలోనే తొలిసారిగా నిర్వహించిన తిరుమల తిరుపతి త్రిగళావధానంలో ఒక అవధానిగా మెరిసారు.
- Whatsapp, Zoom వంటి వాటి ద్వారా ONLINE అష్టావధానలు, శ్రీ తాతా సందీప్ శర్మతో కలిసి జంటగా అష్టావధానాలు నిర్వహిస్తున్నారు.
- ValleyVedika, USA వారు నిర్వహించిన "దశాంశ చతుర్గళ నవధానం"లో అవధానిగా అంతర్జాల మాధ్యమంలో కవితాధారలతో అశేష సాహిత్యాభిమానుల్ని ఓలలాడించారు.
భారతభూమిలోనూ, అమెరికాలోనూ ఎన్నో బిరుదులు వీరిని వరించాయి. జాతీయ అవార్డులు. ప్రభుత్వం వారి ఉగాది పురస్కారాలు, వివిధ విశ్వవిద్యాలయాల సన్మానాలు ఎన్నో అందుకున్నారు.. సాహిత్య రంగంలో తమ స్టాన్నాన్ని సుస్థిరం చేసుకున్న పార్వతీశ్వర శర్మ - ఆకాశవాణి "FM
రెయిన్ బో" లో RJ శర్మగా ఉత్తరాంధ్ర శోతలకు సుపరిచితులు. శ్రీరాంభట్లవేంకటీయం, మొదటిమొగ్గలు, ప్రతిభాస్వరాలు, శతావధానభారతి మొ.నవి రచించారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం -- ఐఐఐటి శ్రీకాకుళంలో - తెలుగుశాఖలో సహాయ ఆచార్యులుగా సేవలందిస్తున్నారు.
జీవిత విశేషాలు
[మార్చు]శ్రీ విభవనామ సంవత్సర మార్గశిర శుద్ధ పాడ్యమి - 1988 డిసెంబరు 9 న - "అక్షర లక్ష గాయత్రీ మహామంత్రోపాసకులు" రాంభట్ల లక్ష్మీనరసింహ సోమయాజులు సూర్యకాంత కామేశ్వరి దంపతులకు కనిష్ఠ పుత్రుడిగా శ్రీకాకుళంలో జన్మించారు. వీరిది విద్య, కళలు, సాహిత్యం, వైద్యవృత్తి నేపథ్యం ఉన్న కుటుంబం. వీరి ముత్తాతగారు డా. రాంభట్ల వేంకటరావు (కుప్పిలి డాక్టరు) వృత్తి రీత్యా వైద్యులైనా... సంస్కృతాంధ్రాల్లో కవి, వ్యవసాయ నిపుణులు, స్వాతంత్ర్య సమర యోధులు. ఈ వేంకటరావు గారి రెండవ కుమారుని పౌత్రుడు డా. రాంభట్ల పార్వతీశ్వర శర్మ.
విద్య
[మార్చు]ఆంధ్ర విశ్వకళాపరిషత్, తెలుగుశాఖ, విశాఖపట్నంలో తెలుగులో పంచకావ్యాలు - ఔచిత్యం గురించి పరిశోధన చేసి పీహెచ్.డి. పట్టాను పొందారు.
- పరిశోధనాంశం
- సంస్కృతంలోని క్షేమేంద్రరచిత "ఔచిత్యవిచారచర్చ" - తెలుగులో ప్రాచీన పంచకావ్యాలకు అన్వయం. (యూనివర్సీటీ గ్రాంట్స్‌కమిషన్ జూనియర్ రీసెర్చిఫెలోషిప్ - నెట్ పరీక్షలో విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రథమస్థానం. ఐచ్ఛికాంశం భారత భాగవతాల ప్రత్యేకాధ్యయనం.)
- పర్యవేక్షకులు
- ఆచార్య మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి, ప్రొఫసర్, తెలుగుశాఖ, ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం.
- ఎం.ఏ. సంస్కృతం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
- ఎం.ఏ. తెలుగు., ఆంధ్రవిశ్వకళాపరిషత్, విశాఖపట్నం.
- బియస్సీ మైక్రోబయాలజీ, డా|| వి.యస్. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మద్దిలపాలెం, విశాఖ.
- ఇంటర్మీడియట్ - మెడికల్ లాబ్ టెక్నీషియన్ కోర్సు, ప్రభుత్వ జూ|| కళాశాల పెందుర్తి, విశాఖ.
- తెలుగు భాషాపండిత అర్హత పరీక్ష 2012 లో ఆంధ్రవిశ్వకళా పరిషత్ పరిధిలో ప్రథమ స్థానం, రాష్ట్రస్థాయిలోద్వితీయ స్థానం.
ఉద్యోగములు
[మార్చు]- ప్రస్తుతం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, ఐఐఐటి శ్రీకాకుళం లో తెలుగు శాఖలో సహాయాచార్యులుగా పనిచేస్తున్నారు.
- భాషాబోధకులు - వినెక్స్, ఐ.ఏ.ఎస్. అకాడమి, ద్వారకానగర్, విశాఖలో పనిచేశారు.
- సివిల్ సర్వీసెస్, డి.ఎస్సీ. టెట్, డైట్‌సెట్, డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశాలు బోదించారు.
- రేడియో జాకీగా, ఎఫ్.ఎం రెయిన్‌బో, ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రంలో దాదాపు పది సంవత్సరాలు పాటు సేవలందించారు.
- అధ్యాపకులు - ప్రెసిడెన్సీ డిగ్రీ కళాశాల (ప్రైవేటు), శివాజీపాలెం, విశాఖలో విద్యాబోధన చేశారు.
పద్యప్రస్థానం
[మార్చు]2005 జూన్ 1 న అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటివరకు 73 అష్టావధానాలు చేసారు. పద్యరచనకు, అవధానవిద్యకు గురువు - సుప్రసిద్ధ పద్యకవి, నటులు, నాటకకర్త, రేడియో ప్రయోక్త అయిన వీరి పితామహులు శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ. వీరి ప్రోత్సాహంతో, శిక్షణలో పద్యపూరణలు చేస్తూ, ప్రఖ్యాతుల అవధానాల్లో పృచ్ఛకులుగా పద్యప్రక్రియపై పట్టు సాధిస్తూ తొలి అవధానానికి శ్రీకారం చుట్టారు, అవధాని పార్వతీశ్వర శర్మ. దేశ వ్యాప్తంగా వివిధ సాహిత్యసంస్థల ఆధ్వర్యవంలో తొలుత అష్టావధానాలు చేస్తూ తరువాత 2015 నవంబరులో విశాఖలో మూడు రోజులపాటు సంపూర్ణ శతావధానం చేసారు.
అష్టావధానాలు
[మార్చు]అవధానానికి వీరి తాతగారు (పితామహులు) శ్రీరాంభట్ల పార్వతీశ్వరశర్మ గారు గురువు. వీరి నేతృత్వంలోనే 16వ ఏటనుండి అవధానాలు ప్రారంభించి చేస్తున్నారు. ఇప్పటివరుకూ ప్రపంచ వ్యాప్తంగా 73 అష్టావధానాలు చేశారు. మొదటి అవధానాన్ని 2005లో విజయనగరం జిల్లా, శృంగవరపుకోటలోని ధారగంగమ్మ దేవాలయంలో చేసారు.
ప్రాంతాలు - ఆధ్వర్యం వహించిన సంస్థలు - సందర్భాలు కొన్ని:
1. శృంగవరపుకోట - శ్రీ ధారగంగమ్మ ఆలయప్రాంగణం - (ఆంజనేయ, విఘ్నేశ్వరుల విగ్రహప్రతిష్ఠ) సందర్భంగా కుటుంబ సభ్యులే పృచ్ఛకులుగా మొదటి అవధానం చేసారు. శ్రీమతి రాంభట్ల సత్యవతమ్మ ఈ కార్యక్రమనిర్వాహకురాలు. ‘దహరానందనాథ’ దీక్షానామధేయులు రాంభట్ల వేంకటసోమయాజులు సంచాలకత్వంలో ఈ అవధానం విజయవంతమైంది.
2. విశాఖ పౌరగ్రంథాలయంలో - విశాఖసాహితి ఆధ్వర్యంలో గురుపూర్ణిమనాడు 2005వ సంవత్సరంలో ఆచార్య సార్వభౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి సంచాలకత్వలో, ఆచార్య కోలవెన్ను మలయవాసిని అధ్యక్షతన ఈ కార్యక్రమం విజయవంతమైంది.
3. డా. వి.యస్. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మద్దిలపాలెం, విశాఖలో డా. మీగడ రామలింగ స్వామిగారి సంచాలకత్వంలో మూడవ అవధానం.
4. చినముషిడివాడ - విశాఖ.
5. అనకాపల్లి - భారతవికాస్ పరిషత్ శ్రీ బులుసు వేంకటేశ్వరులు సంచాలకత్వంలో.
6. నాయుడుతోట, విశాఖ - భారతీకళ్యాణ మండపంలో.
7. విజయనగరం, మహారాజా సంగీత కళాశాల - విజయభావన సాహిత్యసంస్థ నిర్వహణలో ఉగాది సందర్భంగా.
8. హైదరాబాదు, శంకరమఠం - పదసాహిత్యపరిషత్ నిర్వహణలో - ఆచార్య మంగళగిరి ప్రమీలాదేవి సంచాలకత్వంలో
9. కొవ్వూరు- బాలాత్రిపుర సుందరి ఆలయప్రాంగణం. "అష్టావధాని" "పండిత" నేమాని రామజోగి సన్యాసిరావు సారధ్యంలో
10. శృంగవరపుకోట - పుణ్యగిరి కల్చరల్ అసోసియేషన్‌లో ఉగాది సందర్భంగా.
11. కొవ్వూరు- అభయ ఆంజనేయస్వామి ఆలయప్రాంగణంలో. "అష్టావధాని" "పండిత" నేమాని రామజోగి సన్యాసిరావు సారధ్యంలో
12. విశాఖ లలితపీఠం - లలితానగర్ - పూర్వపీఠాధిపతుల ఆరాధనోత్సవాల్లో.
13. హనుమంతవాక - వైజాగ్ బ్రాహ్మణ ఫోరం ప్రారంభోత్సవంలో ఉగాది సందర్భంగా 2010 లో
14. కొత్తవలస - జిందాల్ పాఠశాల - ఉపాధ్యాయల 3 రోజుల శిక్షణా తరగతుల సందర్భంగా.
15. డా. వి.యస్. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మద్దిలపాలెం, విశాఖలో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచశతాబ్ద్యుత్సవాలు సందర్భంగా.
16. విశాఖ పౌరగ్రంథాలయం - కళావేదిక సాహిత్యసంస్థ నిర్వహణలో- కళావేదిక వార్షికోత్సవం.
17. విశాఖ జిల్లాపరిషత్ సమావేశమందిరం - (గిడుగు వెంకటరామ్మూర్తి జయంత్యుత్సవం) తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా
18. పల్లెపాలెం - ఆంధ్ర కుటీరం, యానాం దరి - పిఠాపురాస్థానకవి శ్రీఓలేటి వేంకటరామశాస్త్రి జయంత్యుత్సవం
19. చోడవరం-గౌరీశ్వరస్వామి ఆలయం, పురాణసహిత కళ్యాణవేదిక, - శ్రీ అన్నమాచార్య సంగీతపీఠం - ఉగాది సందర్భంగా.
20. కలవరాయి అగ్రహారం - గణపతిముని స్మారక మందిరం, బొబ్బిలి దరి - గణపతిముని 75వ ఆరాధనోత్సవం సందర్భంగా.
21. విశాఖ శ్రీలలితపీఠం - లలితానగర్, విశాఖసాహితి- లలితాంబికా బ్రహ్మోత్సవాలు సందర్భంగా.
22. మాడుగుల, విశాఖజిల్లా - బాలవినాయక సేవాసంఘం వార్షికోత్సవంలో వినాయకచవితి సందర్భంగా.
23. విశాఖ శ్రీలలితపీఠం - లలితానగర్ - డా. రాంభట్ల వేంకటరావు మెమోరియల్ ట్రస్ట్. సుప్రసిద్ధ వైద్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి- అమెరికా, వారి పర్యవేక్షణలో.
24. జ్ఞానవాణి ఎఫ్.ఎం. 106.4, ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం, విశాఖవారి నిర్వహణలో ప్రప్రథమ ఎఫ్.ఎం. రేడియో సంపూర్ణ అష్టావధానం. (తెలుగు భాషాదినోత్సవం 2012.)
25. పి.ఎన్.ఎమ్.హైస్కూలు- కూకట్‌పల్లి - హైదరాబాద్. పదసాహిత్యపరిషత్ - టంగుటూరి ప్రకాశంపంతులు జయంతి సందర్భంగా.
26. 'స్నేహ సంధ్య' సమావేశ మందిరం, స్నేహసంధ్య సంస్థ - విశాఖపట్నం.
27. మేడిచర్ల గ్రామంలోని శివాలయ ప్రాంగణం - కె.కోటపాడు దగ్గర, విశాఖజిల్లా.
28. వడ్డాది, చోడవరం, ప్రభుత్వ పాఠశాల, బాలల దినోత్సవం సందర్భంగా.
29. హైదరాబాదు - శ్రీరామ కృష్ణాపురం - కొత్తపేట దరి. - విశాఖ శ్రీ లలితా పీఠం మేనేజరు శ్రీవాడరేవు సుబ్బారావు గారి వైవాహిక వజ్రోత్సవం సందర్భంగా.
30. గురజాడ కళాక్షేత్రం - ప్రపంచతెలుగు మహాసభలు - జిల్లాయంత్రాంగం. 2012
31. పద్యకవితా సదస్సు, అనకాపల్లి వివేకానంద హాల్ - 2012
32. విశాఖసాహితి - శ్రీలలితాపీఠం సంయుక్తసభ - విజయనామసంవత్సర ఉగాది, 2013.
33, 34 అవధానాలు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, హైదరాబాద్. ఉదయం - మధ్యాహ్నం.
35. 'జయ' ఉగాది, ద్రావిడ బ్రాహ్మణ సంక్షేమసంఘం, లలితాకళ్యాణమండపం, సీతమ్మధార - 2014.
36. 'వైవాహిక అష్టావధానం' - కేవలం వివాహసంబంధమయిన అంశాలతో. సాహిత్య సురభి - విశాఖ పౌరగ్రంథాలయం. 13 మే 2015
పేరొందిన అవధానాల్లో కొన్ని
[మార్చు]విశాఖ పౌరగ్రంథాలయంలో - విశాఖసాహితి ఆధ్వర్యవంలో గురుపూర్ణిమనాడు 2005వ సంవత్సరంలో ఆచార్య సార్వభౌమ శ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి సంచాలకత్వలో, ఆచార్య కోలవెన్ను మలయవాసిని అధ్యక్షతన ఈ కార్యక్రమం విజయవంతమైంది.
"సీతకున్ జనియించె కృష్ణుడు చేతి శూలముతో మహిన్" అన్న సమస్యను క్రమాలంకారంలో పూరించిన విధానం, అలాగే అన్న, కన్న, విన్న, తిన్న, అనే దత్తపదిని భాగవతార్థంలో పూరించిన విధానం పండితుల ప్రశంసలను కురిపించాయి.
డా. వి.యస్. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మద్దిలపాలెం, విశాఖలో డా. మీగడ రామలింగ స్వామిగారి సంచాలకత్వంలో మూడవ అవధానంలో ఇచ్చిన సమస్య "ముండవు కావునన్ సుమసమూహము దెచ్చితి నీకు కాన్కగన్". ఈ సమస్యను పూరించిన విధానం ప్రేక్షకుల మన్ననలందింది.
విజయనగరం, మహారాజా సంగీత కళాశాల - విజయభావన సాహిత్యసంస్థ నిర్వహణలో ఉగాది సందర్భంగా చేసిన అవధానంలో దత్తపది అమ్మ, కొమ్మ, నిమ్మ, బొమ్మ. భాగవతార్థంలో అందించిన పూరణ విశేషంగా సబ్యుల్ని ఆకట్టుకుంది. ఇది ఏడవ అవధానం
హైదరాబాదు, శంకరమఠం - పదసాహిత్యపరిషత్ నిర్వహణలో - ఆచార్య మంగళగిరి ప్రమీలాదేవి సంచాలకత్వంలో చేసిన ఎనిమిదవ అవధానంలో శ్రీపాక ఏకాంబరాచార్యులు నిషిధ్ధాక్షరి అంశాన్ని నిర్వహించారు. ఆదిశంకరుల గురించి చెప్పిన ఈ పద్యం అందర్నీ అలరించింది.
కొవ్వూరు- బాలాత్రిపుర సుందరి ఆలయప్రాంగణం. "అష్టావధాని" "పండిత" నేమాని రామజోగి సన్యాసిరావు సారధ్యంలో చేసిన అవధానం తలమానికమైంది. పండితవర్గం అందించిన ప్రతి అంశం, పూరణ చిరస్థాయిగా నిలిచేవే.
డా. వి.యస్. కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మద్దిలపాలెం, విశాఖలో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచశతాబ్ద్యుత్సవాలు సందర్భంగా చేసిన అవధానంలో అన్ని అంశాలు దాదాపు కృష్ణదేవరాయల ఆస్థానపరంగానే వచ్చాయి. ఇచ్చిన అంశాల్లోని క్లిష్ట్నతను సరళమైన పూరణలతో అవధాని రమణీయంగా ఎదుర్కొన్నారు.
విశాఖ జిల్లాపరిషత్ సమావేశమందిరం - గిడుగు వెంకటరామ్మూర్తి జయంత్యుత్సవం - తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా చేసిన అవధానం విశాఖ జిల్లా యంత్రాంగం నిర్వహించింది. ప్రభుత్వనిర్వహణలో సాగిన తొలి అవధానమిది.
పల్లెపాలెం - ఆంధ్ర కుటీరం, యానాం దరి - పిఠాపురాస్థానకవి శ్రీఓలేటి వేంకటరామశాస్త్రి జయంత్యుత్సవం సందర్భంగా మధునాపంతుల సత్యనారయణ గారి ఆంధ్ర కుటీరంలో పండితుల మధ్య ఈ అవధానం జరిగింది.
20వ అవధానం కలవరాయి అగ్రహారం - గణపతిముని స్మారక మందిరం, బొబ్బిలి, విజయనగరం జిల్లా - గణపతిముని 75వ ఆరాధనోత్సవం సందర్భంగా.
ద్విగుణిత అష్టావధానం
[మార్చు]రాజమహేంద్రవరంలో కళాగౌతమి సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో పార్వతీశ్వరశర్మ ద్విగుణిత అష్టావధానాన్ని నిర్వహించారు.
శతావధానం
[మార్చు]2015 నవంబరు 18,19,20 తేదీల్లో ,విశాఖపట్నంలో జరిగింది. "కవిశేఖర" కొండేపూడి సుబ్బారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ శతావధానంలో శ్రీ పార్వతీశ్వర శర్మ చెప్పిన పద్యాలు ఆయన పాండిత్యానికి, పద్యనిర్మాణ నైపుణ్యానికి, భావగాంభీర్యానికి, చమత్కారానికి మచ్చుతునలుగా భాసించి సభాసదులైన రసజ్ఞుల ప్రశంసలందుకున్నాయి. పార్వతీశ్వరశర్మ ప్రజ్ఞాప్రభాసాలకు సూచకంగా "ప్రసన్న భారతి" సాహిత్య సంస్థ "అవధానభారతి" అన్న బిరుదంతో శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మగారిని సత్కరించింది.
చమత్కారాలు
[మార్చు]నల్లి బాధ
మెత్తని పాన్పుపైన మరి మేలిమి దుప్పటి కప్పినారుగా
నెత్తియు చూడగన్ దిగువనేరుగ నల్లులు దర్శనమ్మిడెన్
బిత్తర పోయితిన్ మదిని భీతియు పుట్టెను నేమిసేతునే
నిత్తరి,నెందు బోయెదను నిద్రయు బట్టదు నీరజేక్షణా!
దోమ
సీ పల్లె సీమలనైన పట్టణంబులనైన
విరివిగా మశకమ్ము దిరుగుచుండు
పూరిపాకలనైన, పుత్తడిండ్లను గాని
విరివిగా మశకమ్ము దిరుగుచుండు
జాతివర్గములన్న నీతి యేమియులేక
కులమతంబుల లింగ కొలత లేక
పేద ధనిక యన్న భేద మింతయు లేక
విరివిగా మశకమ్ము కరచునయ్య
తొండ మాశుగమ్ముగ చేర్చి తోలు గుచ్చి
రుధిర మాస్వాదనము జేయు మధురముగను!
అట్టిదోమలు సాధ్యమా అంతమగుట?
యెందరెందరు గద్దెల నెక్కిరేని!!
శునకం
దొంగల భయమా యుండదు
హంగయె శునకాల పెంప దాహా భువిలో!
ముంగిది యరవదు, శునకపు
సంఘంలో చేరి నన్ను సతమత పరిచెన్
అవధానాన్ని పేకాటతో పోలుస్తూ...
పేకముక్కకలియ పైకమ్ము మనదౌను
పాదమమరినంత పద్యమౌను
చేయితిరుగకున్న చింతయే మిగులురా
పదము తట్టకున్న పరువెపోవు
నీటి యెద్దడి:
అంబరంబున కేగిపోవగ నావిరై నదులన్నియున్
వెంబడించెను నీటి యెద్దడి వేగవేగమె వాడలం
దంబుధీ జలముప్పు నీరయె నన్నమే కఱవాయెనో
సాంబ శంకర! గంగ వీడుము సర్వలోక శుభంకరా!
తాంబూల సేవనం
తమలపాకుమీద తగినంత సుధరాసి
చిన్నముక్కతీసి చెక్కవేసి
వేలుపట్టినంత వేసిమసాలాను
చుట్టి తెచ్చితేను చూడు రుచిని
ధారావాహికలు
వంటమానివేసి వనితలందరు చేరి
టీవి చూడనేర్చె ఠీవిగాను
సీరియల్సు చూచి చేరి యేఢ్తురుకదా
యేడ్పు సీరియల్సె యెందు జూడ
నాయకుల తీరు
మాకే మీ ఓటనుచున్
మోకాలున మ్రొక్కుచుంద్రు పొల్పుగ ప్రజకున్
యీకాలపు టెన్నికలన్
హా! కాసుల నాయకత్వమబ్బెన్గదరా!
రచనలు
[మార్చు]- శ్రీ రాంభట్ల వేంకటీయము - (ముద్రితం) కీ.శే. డా|| రాంభట్ల వేంకటరావు (కుప్పిలి డాక్టరు) గారి సంగ్రహ జీవితచరత్ర, లఘుపద్యకావ్యం. 2007.
- మొదటి మొగ్గలు - వచన కవితావ్యాసంగం - 2012.
- ప్రతిభాస్వరాలు - పద్యకవితాసంపుటి - 2012.
- శతావధాన భారతి - శతావధాన పూరణ పద్యాలు - 2016
- తెలుగు ప్రాచీనపంచకావ్యాల్లో ఔచిత్య సిద్ధాంతం - పరిశీలన : సిద్ధాంత గ్రంథం - 2016.
ఆశీస్సులు – అభినందనలు
[మార్చు]"చి. రాంభట్ల పార్వతీశ్వర శర్మ చేసిన అష్టావధానము, రూపక పాత్రధారణ, ప్రసంగాలు చూచి, విని పద్యావిద్యాసరస్వతికి ఇతడు చేసిన సేవను చూచి ఎంతో సంతోషిస్తున్నాను. సారస్వత రంగంలో ఇంకా ఇంకా పైకి రాగల గుణగణములు, వినయ సౌశీల్యాది లక్షణాలు సమృద్ధిగా ఉండటం చేత భవిష్యత్తు మరింత బాగుండగలదని ఆశిస్తున్నాను. ఇప్పుడు చేసిన శతావధానం ఒక ప్రారంభం మాత్రమే. సమస్యాపూరణలు మొదలైనవన్నీ ప్రశంసనీయంగా ఉన్నవి. పరమేశ్వరి ఇతనికి అభీష్టసిద్ధిని ప్రసాదించుగాక."
- జగద్గురు కుర్తాళం శంకరాచార్య, విశాఖ శ్రీ లలితాపీఠాధిపతి, పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ మహాస్వామి
ఉ|| నీదు శతావధానమున నిండిన పద్యములెల్ల చూచి ప్ర
హ్లాదనమందినాను; విషయమ్మును- చెప్పిన తీరు- శబ్దసం
పాదన- శైలి- ధార- ప్రతిభామయమై వెలిగొందె; నింకనున్
సాధనతో సమగ్రమగు సాహితిలోన సమర్థుడౌననన్!
- మాడుగుల నాగఫణి శర్మ , అవధాన సరస్వతీ పీఠం , హైదరాబాద్.
"ఆత్మీయులు, ప్రతిభామూర్తి శ్రీరాంభట్లపార్వతీశ్వర శర్మగారి శతావధాన పద్యాలు చదువుతూ ఉంటే ఆనందమకరందరసాస్వాదనం చేసినట్లనిపించింది. ధారా శుద్ధి, ప్రసన్నత, మంచి ఊహలపోహళింపు, సద్య:స్ఫురణ - ఇత్యాదిగా అవధానప్రతిభామూర్తికుండదగిన లక్షణాలన్నీ ఈ కవికి పుంజీభూతంగా, రక్తనిష్ఠమై ఉన్నాయి."
శా|| పద్యారంభములందు నెత్తుగడనుద్భాసించు అందాలు; రం
గద్యుక్తిన్ సుమనోహరంబయిన ముక్తాయింపులెన్నన్ భళీ!
హృద్యంబౌ అవధానవిద్య పదిలంబెంతేని నీబుద్ధి, వి
ద్వద్యోధాగ్రణి! పార్వతీశ్వరకవీంద్రా! నిన్ ప్రశంసించెదన్!
- డా. మేడసాని మోహన్ , తిరుపతి.
ఉ|| ప్రాణము పోయగా పరమపావనమైన వధాన విద్యకున్
ధ్యానము చేసి, పద్యములు ధారణజేసి శతావధానివై
రాణ తనిర్చితంట! యిదెరా యవధానమనంగ, తెన్గు మా
గాణము నేలగా తగు వికాసము నందుమ పార్వతీశ్వరా!!
- డా. గరికిపాటి నరసింహారావు, హైదరాబాద్.
పద్య కళా తపస్వి
[మార్చు]ధూళిపాల మహాదేవమణి , రాజమహేంద్రవరం.
[మార్చు]మ|| అవధానామ్రపికీ నినాద గతితో నాహ్లాదమున్ పంచుచున్
కవితారమ్యవనీ విహార కరికిన్ కంఠీరవ ఖ్యాతివై
నవ భావంబులు, శబ్ద ధింధిములు విజ్ఞానాబ్ధి తారంగముల్
అవధానంబున పార్వతీశ్వరకవీ ఆద్యంతమున్ గూర్చితే!!
ఆచార్య సార్వభౌమ
[మార్చు]డా|| వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి, విశాఖపట్నం.
[మార్చు]శ్లో. ''శ్రీరాంభట్లకులాంభోధే: అవధాని సుధాకరమ్
పార్వతీశ్వరశర్మాణం పాయాద్వాణీ నిరంతరమ్''
21 నందీ పురస్కార విజేత, స్వర్ణకిరీట గ్రహీత
[మార్చు]డా. మీగడ రామలింగస్వామి , విశాఖపట్నం.
[మార్చు]"అవధానం చెయ్యడమే గొప్ప అనుకుంటే, శతావధానం చెయ్యడం చాలా గొప్ప. ఎంతో సాధన, ప్రతిభ, ధారణ మొదలగు అంశాలు ఉంటేనే గాని సాధ్యపడని విశిష్ట ప్రక్రియ. అలాంటి విశిష్టప్రక్రియను అతి పిన్న వయస్సు(26)లో మన శర్మ చేయడం, కృతకృత్యుడు కావడం నాకు ముఖ్యంగా చాలా ఆనందదాయకం.
శర్మ! అక్షర శిల్పుల చలువతోడ
దేశ దేశాల నీకీర్తి తిరుగుగాక!!
శతశతావధానాలతో సాగుగాక!!
తెలుగు వెలుగుతో నీప్రభ వెలుగుగాక!'
జాతీయసదస్సుల్లో పత్రసమర్పణలు
[మార్చు]1. ప్రబంధనాయికగా ఊర్వశి - ఎ.వి.ఎన్. కళాశాల, విశాఖ.
2. శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో వ్యతిరేక స్త్రీపాత్రలు - అనుకూలభావాలు - సిద్ధార్థకళాశాల, విజయవాడ.
3. గుఱ్ఱం జాషువ కవిత్వం - ఔచిత్యపోషణ - తెలుగుశాఖ, ఆంధ్రవిశ్వకళాపరిషత్.
4. ప్రసాదరాయ కులపతి అవధానసరస్వతి - ప్రభుత్వడిగ్రీకళాశాల, సిద్ధిపేట, మెదక్‌జిల్లా.
5. వేంకటరామకృష్ణ కవుల "ఔచిత్య విచారచర్చ" - అనువాద పద్ధతి
6. శ్రీ ఆముజాల నరసింహ మూర్తి "కన్నకూతురు" సాంఘికనాటకం - స్త్రీవాదాంశాలు.
7. నలుగురూ నడిచే త్రోవలో "ముళ్ళకంపలు"
పత్రికా వ్యాసాలు
[మార్చు]- చిత్రకవితా చైత్రకవి - పాల్కురికి - ప్రసంగవ్యాసం
- నవ్వూ... నువ్వెక్కడి దానివి? - స్మైల్‌ప్లీజ్ మాసపత్రిక - మే, 2012.
- వేణీ సంహారమ్ - కల్పనలు - సంభాషణావైచిత్రి - సుపథ దినపత్రిక - మే,2012.
- 'మార్గ’ దర్శకుడు శ్రీశ్రీ - విజన్ దిన పత్రిక - మే,2012.
- తెలుగు సాహిత్యంలో చర్చనీయాంశాలు - విజన్ దిన పత్రిక - మే,2012.
- నేటికాలపు సాహిత్యావధానాలు - సిలికానాంధ్ర, సుజనరంజని అంతర్జాల పత్రిక - మార్చి, 2013.
- కథానిలయ కథలు ( కాళీపట్నం రామారావు జీవితావిష్కరణ) - విశాఖ సంస్కృతి మాసపత్రిక, 2012.
- మూడురోజుల ముచ్చట : తెలుగుమహాసభల సమీక్షావ్యాసం - విద్య ఉద్యోగ దిక్సూచి, జనవరి, 2013.
- 'సురభిళం’ ( సురభి నాటకసంస్థ నాగేశ్వరరావు గారితో పరిచయం)- విశాఖసంస్కృతి, మార్చి, 2013.
- తెలుగు వార్తాపత్రికల్లోని భాష : తీరుతెన్నులు - ఇంటర్నేషల్ జర్నల్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషనల్
- రీసెర్చ్, సెప్టెంబర్-2014.
- (ఇదే వ్యాసం సిలికానాంధ్రవారి ’సుజనరంజని’ అంతర్జాలపత్రిక ఏప్రిల్-2015 సంచికలో ప్రచురితం.)
- భిన్నత్వంలో ఏకత్వం : విశాఖతత్త్వం - విశాఖ ఉత్సవ్ ప్రత్యేకసంచిక - 2015
- తెలుగు దిన పత్రికలు - పదసృజన - ఆంధ్రవిశ్వకళాపరిషత్ - ఆర్ట్స్ కాలేజీ జర్నల్, డిశంబరు -2015
సాహిత్య రూపకాలు - ధరించిన పాత్రలు
[మార్చు]- భువన విజయం : ధూర్జటి - 2011 జనవరి 1, శ్రీలలితాపీఠం, విశాఖ.
- ప్రాచీన ఆంధ్రకవులు : పాల్కురికి సోమన - 2011 ఫిబ్రవరి 17, శ్రీలలితాపీఠం, విశాఖ.
- భువన విజయం : పింగళి సూరన - 2011 మే 8, ఉక్కునగరం, స్టీల్‌ప్లాంట్, విశాఖప్నటం.
- భువన విజయం : పింగళి సూరన - 2011 మే 10, కళాభారతి, విశాఖప్నటం.
- దేవీ విజయం (విజయ దశమి సందర్భంగా) : అల్లసాని పెద్దన - 2011 అక్టోబరు 06
- శతక సరస్వతీ సాహిత్యసౌరభం : మారద వెంకయ్య - 2012 ఫిబ్రవరి 6, శ్రీలలితాపీఠం, విశాఖ.
- ధర్మ విజయం : గౌతమబుద్ధుడు - 2014 శ్రీలలితాపీఠం, విశాఖ.
- కందుకూరి ప్రభ : కందుకూరి వీరేశలింగం 2015 ఏప్రిల్ 27 పౌరగ్రంథాలయం, విశాఖ.
- ఆనందగజపతి ఆస్తానం - చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి - 2015 శ్రీలలితాపీఠం, విశాఖ.
రేడియో ప్రసంగాలు
[మార్చు]- అవధానం - వివిధ అంశాలు - ఆకాశవాణి, విశాఖపట్నంకేంద్ర ప్రసారం - 2006
- అవధానం - అవగాహన (ఉగాది సం|| గా) - జ్ఞానవాణి ఎఫ్.ఎం - ముఖాముఖి - 2012
- సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు - శతజయంత్యుత్సవం -జ్ఞానవాణి ఎఫ్.ఎం. - 2013.
- రాయప్రోలు రచనలు - జీవితం - రాయప్రోలు సుబ్బారావు వర్థంతి -జ్ఞానవాణి ఎఫ్.ఎం. - 2013.
- భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు - వారసత్వసంపద దినోత్సవం -జ్ఞానవాణి ఎఫ్.ఎం. - 2013.
- వసంతకేళి - హోళి - జ్ఞానవాణి ఎఫ్.ఎం. - 2014.
ఆశుకవితాప్రదర్శనలు
[మార్చు]- 'ఆశువుగా అవధానం’ - ప్రత్యక్షప్రసారం - దూరదర్శన్ సప్తగిరి విజయవాడకేంద్రం - 23-01-2015
- 'ఆశువుగా అవధానం’ - ప్రత్యక్షప్రసారం - దూరదర్శన్ సప్తగిరి విజయవాడకేంద్రం - 06-03-2015
- ఆశుకవితాప్రదర్శనం - ప్రత్యక్షప్రసారం - ఎఫ్.ఎమ్.రెయిన్‌బో 102- ఆకాశవాణి, విశాఖ - 21-02-2015 (అంతర్జాతీయమాతృభాషాదినోత్సవం సందర్భంగా)
- రాజకీయ అవధానం - టీవీ 5 న్యూస్ ఛానల్‌లో ఆశుకవితా ప్రదర్శనం. - 21.03.2015 ఉగాది సం||గా
బహుమతులు : పురస్కారాలు
[మార్చు]- "అవధాన కేసరి" - Valley Vedika, క్యాలీఫోర్నియా రాష్ట్రం, అమెరికా, 2020.
- భక్తి సాధనమ్ పత్రిక - భక్తి సేవా పురస్కారం, హైదరాబాద్ 2020.
- "క్షేమేంద్ర సారస్వత సరస్వతి" - తెలుగు కళాసమితి, న్యూజెర్సీ రాష్ట్రం, అమెరికా, 2019.
- "నవయువావధాని" - అంట్లాంటా, జార్జియా రాష్ట్రం, అమెరికా. 2019
- "అసమాన ధారణా ధురీణ" - ఇండియానాపోలిస్, ఇండియాన రాష్ట్రం, అమెరికా. 2019
- "అవధానకిశోర" - టాంటెక్స్, డాలస్, టెక్సాస్ రాష్ట్రం, అమెరికా. 2019
- వంగూరి ఫౌండేషన్, అమెరికా వారి 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు - సాహిత్యపురస్కారం, ఒర్లాండో, ఫ్లోరిడా రాష్ట్రం, అమెరికా 2019.
- నోరి నరసింహ శాస్త్రి యువరచయిత ప్రోత్సాహక పురస్కారం, హైదరాబాద్ - 2016.
- ఆంధ్ర సారస్వత సమితి - మచిలీపట్నం - 2016.
- "అవధాన భీమ" - బిరుదము - నెహ్రూ సాహితీ సమితి - ద్రాక్షారామ - 2016
- "అవధాన భారతి" బిరుదము - ప్రసన్నభారతి, విశాఖపట్నం. - 2015.
- శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది విశిష్ట పురస్కారం - విశాఖజిల్లాయంత్రాంగం - 2015
- 'అవధాన సుధాకర’ బిరుదము - విశాఖసాహితి, శ్రీ లలితాపీఠం సంయుక్తంగా - 2013.
- పద్యరచనలో ప్రథమ బహుమతి - స్నేహ - అంతర్‌కళాశాలల పోటీలు - 2005.
- 'అవధాని’ బిరుదము - డా||వి.యస్.కృష్ణా ప్రభుత్వడిగ్రీ కళాశాల,విశాఖ - 2006.
- రాష్ట్రస్థాయి పద్యరచన పోటీలలో ప్రథమ బహుమతి- బ్రహ్మకుమారీస్, హైదరాబాద్- 2006.
పద్యాలు కొన్ని
[మార్చు]ప్రార్థన పద్యాలు:
అజహరి రుద్రాదులకున్
భజన సులభుడైన వేల్పు వరదాయకునిన్
గజవక్తృ సంస్మరింతును
నిజ భక్తిన్ సర్వకార్య నిర్విఘ్నతకున్
వరవీణా మృదుపాణి! నీ చరణ సేవా భాగ్యమే గోరుదున్!
ధరలో నే కవి కైత చెప్పుటకు నీ దాక్షిణ్యమే దిక్కగున్!
స్వరమై నీ వెద నిల్చినన్ ! గళము తా పల్కున్ గదా శారదా!
స్థిరమోదంబిడి బ్రోచి ! నా ప్రతిభ నుద్దీపింపగా చేయుమా!
వాణీ నీ దయ లేని నాడు జగతిన్ వాక్సూనముల్ విచ్చునే
వీణా పాణి వినోద నాద చయ సంవిత్సంపదాశ్రేణి గీ
ర్వాణీ మ్రొక్కెద సర్వ శాస్త్ర జననీ వాగ్దాయినీ బ్రోచి బ్ర
హ్మాణీ పల్కుల రాణి సంతతము జిహ్వాగ్రమ్మునన్నిల్వుమా!!
వాణికి, నాది నీరజ భవాంచిత రాజ్ఞికి, స్తుత్య నిత్య గీ
ర్వాణ సమాన మానధన పండితషండ రసజ్ఞ సంవృత
శ్రేణికి, ధాతృ మానస వశీకరణాద్భుత కాచ్ఛపేయ ని
క్వాణ వినోదికిన్, కమల పావన పీఠికి నంజలించెదన్
పంచ ముఖంబులన్వెలసి భక్తుల బ్రోచెడు వేదమాత నీ
పంచ్అను చేరి వేడెదను పాదములన్ విడనింక దేవి నే
నెంచితి నీవ దైవముగ నేమని చెప్పుదు నీదు శక్తి రా
యంచయె వాహనమ్ముగ మదార్తిని దీర్చు మదంబరో నతుల్!
కలనైనన్ నిను మరువక
తలతుము రాంభట్ల వంశ దైవమ! సతమున్
నిలకడతో మము గాంచెడి
యిలువేలుపు వేంకమాంబ నెద ప్రార్థింతున్!!
రాంభట్లాన్వయ కీర్తి కేతనమునాన్ రాజిల్లె ముత్తాత, మా
కంభోజాక్షుని భంగి, సద్యశము దా నార్జించె, తద్భిక్షగా
నంభోజాసను భామినిం గొలువ శక్త్యాసక్తి నా కబ్బెనే
సంభావింతును వేంకటార్యుని మదిన్! సత్యమ్ము! నిత్యమ్ముగా!!
మూలాలు
[మార్చు]http://rambhatla.in/parichayam.html
http://rambhatla.in/americatour.html
http://rambhatla.in/organizers.html
ఇతర లింకులు
[మార్చు]https://www.auchithyam.com/
https://youtu.be/3usNfJsu-6k
https://www.facebook.com/DrRPSarma
https://www.youtube.com/DrRambhatlaParvatheeswaraSarma
- BLP articles lacking sources from మే 2021
- అత్మకథ లాంటి వ్యాసాలు from మే 2021
- Articles with topics of unclear notability from మే 2021
- All articles with topics of unclear notability
- Biography articles with topics of unclear notability
- Articles needing additional references from మే 2021
- Articles lacking reliable references from మే 2021
- All articles lacking reliable references
- Articles with self-published sources from మే 2021
- All articles with self-published sources
- మే 2021 from Articles lacking reliable references
- Articles with multiple maintenance issues
- మూలాలు లేని వ్యాసాలు
- అవధానులు