రాగవాసిష్ఠం
రాగవాశిష్ఠం | |
కృతికర్త: | |
---|---|
అనువాదకులు: | బోయి భీమన్న |
అంకితం: | సాక పేములు |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | పౌరాణిక - సాంఘిక నాటకం |
విభాగం (కళా ప్రక్రియ): | సాహిత్యం |
ప్రచురణ: | సంస్కృతి సంవర్ధక సమితి హైదరాబాదు |
విడుదల: | 1959 |
పేజీలు: | 157 |
ఈ పౌరాణిక సాంఘిక నాటకాన్ని బోయి భీమన్న (1911-2005) అరుంధతి - వసిష్ఠుల ప్రణయగాధను ఆధారంగా చేసుకొని 1959లో రాశాడు.[1]ఇది తన పద్దెనిమిదేండ్ల వయసులో రాశాడు.రస దృష్టితో కంటే సంఘప్రయోజన దృష్టితో వ్రాసిన నాటకం ఇది. దీనిని సంస్కృతి సంవర్ధక సమితి 1959లో ప్రచురించింది.
అంకితం
[మార్చు]ఈ నాటకాన్ని రచయిత తన మిత్రుడు సాక పేములుకు అంకితం చేశాడు. అంకిత పద్యం ఈవిధంగా ఉంది.
ముద్దుగ మూడుకాలముల మ్రొక్కులు గైకొని నా వశిష్ఠకున్
ఇద్దరి నీవు, అద్దరిని నేను; మనిద్దర మొక్క సారపుం
బద్దెము రీతి; కాన, కృతిబాలను దీని గ్రహింపుమయ్య,సం
పద్దృఢ మైత్రి; మీ కగు శుభమ్ములు, పేములు వర్య! ప్రేమమై
ఇతివృత్తము
[మార్చు]యమునా నదీ తీరాన వేదవనంలో నిష్ఠగా తపస్సు చేసుకొనే యువతపస్వి వశిష్ఠుడు, సంధవార్చడానికి నదీతీరానికి వచ్చి ప్రమాదవశాత్తు నదిలో కాలుజారి పడగా అరుంధతి రక్షిస్తుంది. తరువాత వారిద్దరూ పరస్పరం అనురక్తులౌతారు. ఒకరోజు అరుంధతీ వసిష్ఠులు నదీతీరాన ఉండగా వశిష్ఠుని సంరక్షకుడు, ఆశ్రమాధిపతీ అయిన ప్రాచీనుడు తటస్థ పడతాడు. అరుంధతి మాతంగకన్య అని అప్పుడు వశిష్ఠునకు తెలుస్తుంది. ప్రాచీనుడు అతనికి ఈ ప్రేమలోని వైరస్యాన్ని సూచించేసరికి వశిష్టుడు అరుంధతిని వదిలివస్తాడు. తరువాత అరుంధతి వశిష్ఠుని గెలుచుకోవడానికి తపశ్చర్య పూనుతుంది. వశిష్ఠుడు తనలోతాను సతమతమైపోయి ప్రాచీనుడిని ధిక్కరించే సమయానికి అరుంధతి తపస్సువల్ల లోకం కాటకంతో తల్లడిల్లుతుంది. తనమాట సాగదని తెలిసిన ప్రాచీనుడు పిడికెడు ఇసుక చేతబట్టి ఇసుకను అన్నంగా వండిపెట్టే స్త్రీ నీకు భార్య అవుతుందని ఆంక్ష పెడతాడు. కాటకంతో ఋషులు త్రిమూర్తుల వద్దకు రాయబారం పోతారు. చివరకు అరుంధతితో పాటు తానూ యోగాగ్నికి దగ్ధుడనౌతానని వశిష్ఠుడు సిద్ధపడడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమౌతాడు. పరమేశ్వరుని సన్నిధిలో అరుంధతిని పత్నిగా స్వీకరిస్తాడు వశిష్ఠుడు. అరుంధతి పాతివ్రత్యం వల్ల కాటకం తీరేవిధంగా కొండరాళ్ళు పిండివంటలవుతాయి. ఇసుక అన్నంగా మారుతుంది. పరమేశ్వరుడు ఆమెకు వ్యోమమండలంలో భర్తృసన్నిధానంలో స్థానమిచ్చి ప్రశంసిస్తాడు. ఇదీ ఈ నాటకంలోని కథ. ఆర్య - అనార్య భేదభావాన్ని తునాతునుకలు చేసి ప్రాచీనుడి నోరు మూయించి ఈ పారతంత్ర్య వాతావరణం నుండి వశిష్ఠుడు బయటపడటం ఈ నాటకంలోని పరమార్థం.
పాత్రలు
[మార్చు]ఈ నాటకంలోని కొన్ని పాత్రలు
- వశిష్ఠుడు
- అరుంధతి
- ప్రాచీనుడు
- పరమేశ్వరుడు
- కులగిరి
- గోష్పాదం
- కుంభోదరం మొదలైనవి.
మూలాలు
[మార్చు]- ↑ "రాగవాసిష్ఠం- నాటక వైశిష్ట్యం – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-01-29.
- [1]భారత డిజిటల్ లైబ్రరీలో పుస్తకప్రతి
- [2] Archived 2016-03-05 at the Wayback Machine భారతి మాసపత్రిక జనవరి 1960 సంచికలోని పుస్తక సమీక్ష