రాచకొండ కోట
| రాచకొండ కోట | |
|---|---|
![]() Interactive map of the రాచకొండ కోట area | |
| General information | |
| Location | India |
| Completed | 1360 AD |
రాచకొండ కోట, యాదాద్రి జిల్లా రాచకొండలో ఉన్న చారిత్రిక కోట. [1] దీనిని సా.శ. 14వ శతాబ్దంలో రేచర్ల నాయక రాజు అనపోతనాయకుడు నిర్మించాడు. అప్పటి వరకు రేచర్ల నాయకులు అనుమగల్లు (ప్రస్తుత ఆమనగల్ ) వద్ద రాజధాని ఉండేది. సా.శ. 1360లో, అనపోతనాయకుడు అనుమగల్లు నుండి రాచకొండకు రాజధానిని మార్చాడు. అక్కడ అతను ఒక బలమైన కోటను నిర్మించాడు. [2]
పరిపాలనా సౌలభ్యం కోసం అనపోతనాయకుడు రాజ్యాన్ని రెండుగా విభజించాడు. అతని సోదరుడు మాదనాయకుడు దేవరకొండ నుండి పరిపాలించాడు. దేవరకొండ రాచకొండకు సామంత రాజ్యంగా ఉండేది. రేచర్ల నాయకులు సా.శ. 1430లో రాచకొండను బహమనీలకు కోల్పోయారు. కానీ దేవరకొండను మాత్రం 1475 వరకు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. చివరికి రేచర్ల రాజ్యం అంతరించిపోయి వారు హంపి విజయనగర రాజ్యంలో కలిసిపోయారు.


స్థానం
[మార్చు]ఇది యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ మండలంలో, హైదరాబాద్ నుండి 70 కి.మీ దూరాన ఉంది. రాచకొండ చేరుకోవడానికి చౌటుప్పల్ వరకు హైవేపై వెళ్ళి, అక్కడి మలుపు తీసుకొని మరో 25 కి.మీ. ముందుకు వెళ్ళాలి.[3] మరొక ప్రత్యామ్నాయం నాగార్జున సాగర్ హైవే తీసుకొని ఇబ్రహీంపట్నం నుండి మళ్లింపు తీసుకోవడం. ఇది ఎల్.బి.నగర్ నుండి 45 కి.మీ దూరంలో ఉంది.
చరిత్ర
[మార్చు]రాచకొండ కోటను కాకతీయ రాజు ప్రతాపరుద్రుని సైన్యాధిపతి అయిన రేచర్ల సింగమనాయకుని కుమారుడు రేచర్ల అనపోతనాయకుడు నిర్మించాడు. ఈ కోటను సా.శ. 1360 ప్రాంతంలో నిర్మించారు.
సా.శ. 1358 ప్రాంతంలో సింగమనాయకుడు తన రాజ్యాన్ని విస్తరించుకునే సమయంలో జల్లిపల్లి కోటపై దాడి చేశాడు. కోటను ముట్టడిస్తున్నప్పుడు సోమకుల క్షత్రియులు ఆయనను మోసం చేసి చంపారు. రెడ్డిలు, తెలుగు నాయకులు వారిని ప్రోత్సహించారు. సింగమనాయక కుమారులు అనపోతనాయకుడు, మాదనాయకుడు ఈ విషయం తెలుసుకుని, తమ సైన్యాలను సమీకరించుకుని సా.శ. 1361లో జల్లిపల్లి కోటపై దాడి చేసి యుద్ధంలో సోమకుల క్షత్రియులను ఓడించారు. వారు తమ ప్రతీకార చర్యను అంతటితో ఆపలేదు; రెడ్డి రాజులు, తెలుగు నాయకులను వెంబడించారు. వారు, రెడ్డిరాజుల ఆధీనంలో ఉన్న శ్రీశైల ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు, వారు కొండవీటి రెడ్డి రాజులతో ఘర్షణ పడ్డారు. అప్పుడు మాదనాయకుడు ధరణికోట సమీపంలో అనపోతారెడ్డిని ఓడించాడు. కానీ విజయం సాధించినప్పటికీ ధరణికోట పద్మనాయకుల చేతుల్లోకి రాలేదు. ఈ సంఘటన తర్వాత రెడ్డి, రాచకొండ పాలకుల మధ్య వైరం తగ్గలేదు. ఆ తరువాత వారిద్దరినీ బహమనీ, విజయనగర సామ్రాజ్యాలు ఆక్రమించుకున్నాయి.
రాచకొండ రాజ్యం ఉత్తరాన గోదావరి వరకు, దక్షిణాన శ్రీశైలం వరకు, పశ్చిమాన బహమనీ రాజ్యం వరకు, తూర్పున కొండవీడు వరకు విస్తరించి ఉండేది.
రాచకొండ రాజులు మొదట్లో బహమనీ రాజ్యానికి మద్దతు ఇచ్చారు. కానీ తరువాత సా.శ. 1424లో బహమనీలకు, విజయనగర రాజులకూ మధ్య జరిగిన యుద్ధంలో, వారు విజయనగర రాజ్యానికి తమ విధేయతను మార్చుకున్నారు. దీనితో బహమనీ సుల్తాను ఫిరోజ్ షా కోపగించాడు. విజయనగరంతో శాంతి ఒప్పందంపై సంతకం చేసి, తరువాత రాచకొండ రాజ్యంపై దాడి చేసి దానిని జయించాడు. సా.శ. 1433 నాటికి, కొన్ని కోటలు మాత్రమే రాచకొండ రాజుల నియంత్రణలో ఉన్నాయి.
అప్పుడు రాచకొండ రాజులు ఒరిస్సాకు చెందిన కపిలేశ్వర గజపతి సహాయం కోరుతూ, అతనికి పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. రాచకొండ రాజులకు సహాయం చేయడానికి ఆయన తన కుమారుడు హంవీరదేవుడిని (అంబర్ రాయ్ అని పిలుస్తారు) పెద్ద సైన్యంతో పాటు పంపాడు. సా.శ. 1461 నాటికి, రాచకొండ రాజులు తమ కోల్పోయిన కోటలన్నింటినీ తిరిగి పొందారు. హంవీరదేవుడి సహాయంతో ఓరుగల్లు రాజులుగా మారారు. కానీ క్రమంగా తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయి, ఒరిస్సా గజపతులకు సామంతులుగా మారారు.
నిజాం షా నేతృత్వంలోని బహమనీ రాజ్యం, మళ్ళీ సా.శ. 1475లో ఓరుగల్లుపై దాడి చేసి, ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ విధంగా రాచకొండ రాజ్యం సా.శ. 1350-60లో ఉద్భవించి చివరకు సా.శ. 1475లో బహమనీల ఆక్రమణ లోకి వెళ్ళింది.
రాచకొండ, దేవరకొండ రాజులు కొంతకాలం బహమనీ సుల్తాన్లకు, కొంతకాలం విజయనగర రాజులకూ, కొంతకాలం ఒరిస్సా గజపతులకూ మద్దతు ఇచ్చి వారి వారి శత్రువులతో పోరాడారు.
మూలాలు
[మార్చు]- ↑ Borah, Prabalika M. (29 August 2015). "Let's get away: Rachakonda" – via www.thehindu.com.
- ↑ Reddy, T. Karnakar (9 October 2014). "Tourists can't ask for more at Rachakonda!" – via www.thehindu.com.
- ↑ Borah, Prabalika M. (29 August 2015). "Let's get away: Rachakonda" – via www.thehindu.com.
