రాజా కేశవదాస్
రాజా కేశవదాస్ | |
|---|---|
ఆలప్పుళలో రాజా కేశవదాస్ విగ్రహం | |
| ట్రావెన్‌కోర్ రాజ్యం దీవాన్ | |
| In office 1789–1798 | |
| చక్రవర్తి | ధర్మ రాజా |
| అంతకు ముందు వారు | కృష్ణన్ తంపి |
| తరువాత వారు | జయంతన్ శంకరన్ నంబూద్రి |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | కేశవ రామన్ పిళ్ళై 1745 మార్చి 17 కున్నత్తూర్, ట్రావెన్‌కోర్ |
| మరణం | 1799 ఏప్రిల్ 21 (వయసు: 54) |
| తల్లిదండ్రులు | మార్తాండన్ తంపి కాళియమ్మ పిళ్ళై |
రాజా కేశవదాస్ అసలు పేరు కున్నత్తూర్ కేశవన్ రామన్ పిళ్ళై, (17 మార్చి 1745 – 21 ఏప్రిల్ 1799; సంస్కృతం: కేశవదాస) ధర్మ రాజా కార్తీక తిరునాళ్ రామవర్మ పాలనా కాలంలో ట్రావెన్‌కోర్ దీవాన్. ఆయన సైనిక వ్యూహాలు, పరిపాలనా దక్షతకు ప్రసిద్ధి చెందాడు. ఆలప్పుళ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన ముఖ్య సూత్రధారి.[1]
తొలినాటి జీవితం
[మార్చు]రాజా కేశవదాస్ పూర్వపు ట్రావెన్‌కోర్ రాజ్యంలోని (ప్రస్తుత కన్యాకుమారి జిల్లాలో ఉన్న) కున్నత్తూర్ అనే చిన్న కుగ్రామంలో ఒక నాయర్ కుటుంబంలో 1745 మార్చి 17న కేశవ పిళ్ళైగా జన్మించాడు.[2][3] అతని పూర్తి పేరు కేశవ్ రామన్ పిళ్ళై.[4] మాతృస్వామ్య ఆచారాల ప్రకారం అతని మేనమామ రామన్ పిళ్ళై పేరు అతని పేరుకు చేర్చబడింది. అతని తండ్రి మార్తాండన్ తంపి ట్రావెన్‌కోర్ సైన్యంలో ప్రసిద్ధ యోధుడు. మార్తాండన్ తంపిని 'గ్రేట్ మాస్టర్' అని కూడా పిలిచేవారు. అతని తల్లి పేరు కున్నత్తూర్ ఇంటికి చెందిన కాళియమ్మ పిళ్ళై. రాజభవనంలో కమాండర్-ఇన్-చీఫ్ పదవిని వదులుకున్న తర్వాత, అతని తండ్రి సన్యాసం స్వీకరించి కాశీకి తిరిగి వెళ్ళాడు, అప్పుడు కుటుంబ భారం మొత్తం కేశవపిళ్ళై తలపై పడింది. అతను సరైన విద్యను అభ్యసించనప్పటికీ స్థానిక వ్యాపారవేత్త పూవత్ పోకుమూస మరైక్కార్ తన దుకాణంలోని ఖాతాలను చూసుకోవడానికి కేశవ్ పిళ్ళైని నియమించుకున్నాడు. చిన్న వయస్సులోనే కేశవ్ పిళ్ళై ప్రత్యేక ప్రతిభ కనబరిచాడు. కేశవ పిళ్ళై ద్వారా మరైకార్ వ్యాపారం వృద్ధి చెందింది. ఆ కలప వ్యాపారి తన షిప్పింగ్ వ్యాపార బాధ్యతలన్నింటినీ అతనికి అప్పగించాడు. అతను ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత ఆర్థిక జ్ఞానాన్ని పొందాడు, హిందుస్థానీ, పర్షియన్, డచ్ భాషలను నేర్చుకున్నాడు.[5]
రాజ సేవలో
[మార్చు]
అప్పటి పాలకుడైన మహారాజు కార్తీక తిరునాళ్ (1758-1798) పై ఆధారపడిన మరైకర్లు తరచుగా రాజును కలుస్తుండేవారు. ఒక దశలో కేశవ పిళ్ళై తన నైపుణ్యాలతో రాజు అభిమానాన్ని పొందాడు. తదనంతరం రాజు అతనికి తన రాజభవనంలో స్థానం కల్పించాడు.[6] కేశవ పిళ్ళై ఈ సువర్ణావకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. సుమారు ఇరవై నాలుగేళ్ల వయసులో కేశవ పిళ్ళై సంప్రతి (రాష్ట్ర కార్యదర్శి) క్రింద రాజభవనంలో రాయసం (రచయిత) గా నియమితులయ్యాడు. అతను ఎంత జ్ఞానవంతుడు, ప్రభావవంతమైన వ్యక్తి అయ్యాడంటే, ప్రధానమంత్రి కూడా అతనిని సలహాలు అడిగేవాడు.[7] కులచల్ యుద్ధం తర్వాత అతను ట్రావెన్‌కోర్ కమాండర్-ఇన్-చీఫ్‌గా మారిన మార్తాండ వర్మతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు, డచ్ కెప్టెన్ డెలనాయ్ వంటి అధికారులతో పరిచయం పెంచుకున్నాడు, యుద్ధ వ్యూహాలలో ప్రావీణ్యం సంపాదించి పోర్చుగీస్, ఇంగ్లీష్ వంటి భాషలను నేర్చుకున్నాడు. కేశవ పిళ్ళై తెలివితేటలు, దేశభక్తి, దైవభక్తికి ముగ్ధుడైన మహారాజు 1765లో అతనికి రాయసం హోదా కల్పించాడు. పురక్కాడ్, కులచల్ వంటి ప్రదేశాలలో నివసిస్తున్న డచ్ కంపెనీలు, అంచుతెంగు లాంటి ప్రాంతాలలో నివసిస్తున్న ఆంగ్ల కంపెనీలతో నిరంతరం ఉత్తరప్రత్యుత్తరాలు జరపడం ద్వారా వాణిజ్యాన్ని పెంపొందించడంలో కేశవ పిళ్ళై ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను సంప్రతి (1768), సార్వభౌమ (1788) హోదాల ద్వారా ఎదిగి 1789 సెప్టెంబర్ 22న ట్రావెన్‌కోర్ దీవాన్ అయ్యాడు. వృద్ధాప్య వైకల్యం కారణంగా దీవాన్ చెంబకరామన్ పిళ్ళై రాజీనామా చేయడంతో ఆయన దీవాన్ పదవి చేపట్టాడు.[మూలాలు అవసరం] దళవ అనే పాత బిరుదు అతనికి రుచించలేదు. కాలానుగుణంగా ఉండేలా మహారాజు ఆమోదంతో పాత హోదా దళవను విడిచిపెట్టి ఆ బిరుదును దీవాన్‌గా మార్చాడు. ఆ విధంగా అతను ట్రావెన్‌కోర్ మొట్టమొదటి దీవాన్ అయ్యాడు.
మైసూర్ టిప్పు సుల్తాన్ ట్రావెన్‌కోర్‌పై దాడి చేసినప్పుడు కేశవ పిళ్ళై రాష్ట్ర సైన్యానికి కమాండెంట్‌గా ఉన్నాడు. కేశవ పిళ్ళై నాయకత్వంలో ట్రావెన్‌కోర్ సైన్యం మైసూర్ దళంతో పోరాడింది. తరువాత మైసూర్‌పై దాడి జరిగినప్పుడు టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నానికి వెనక్కి తగ్గవలసి వచ్చింది.[8]
మైసూర్‌పై అతని విజయాన్ని గుర్తిస్తూ ట్రావెన్‌కోర్ కార్తీక తిరునాళ్ మహారాజు కేశవ పిళ్ళైని ట్రావెన్‌కోర్ దీవాన్‌గా నియమించాడు. బ్రిటిష్ గవర్నర్ మార్నింగ్టన్ అతని పరిపాలనా ప్రతిభను మెచ్చుకుంటూ రాజా బిరుదుతో సత్కరించాడు.[9] దీవాన్‌గా రాజా కేశవదాస్ ట్రావెన్‌కోర్ రాజధానిని పద్మనాభపురం నుండి తిరువనంతపురంకు మార్చడానికి ప్రధాన కారకుడయ్యాడు.[10]
సైనిక శిక్షణ
[మార్చు]కేశవ పిళ్ళై జనరల్ యుస్టాచియస్ డి లానాయ్ ఆధ్వర్యంలో సైనిక శిక్షణ పొందాడు. ఈ శిక్షణ అతన్ని సమర్థవంతమైన జనరల్‌గా క్రియాశీలక సేవ చేయడానికి పరిపూర్ణుడిని చేసింది. అతను సైనిక కళలో బాగా శిక్షణ పొందాడు, అత్యవసర సమయాల్లో మొత్తం బ్రిగేడ్‌ను ఆదేశించే సామర్థ్యం కలిగి ఉన్నాడు. అతను జనరల్ డి లానాయ్ వద్ద డచ్ భాష, పోర్చుగీస్ భాషలు, పట్టాన్ అధికారుల వద్ద పర్షియన్ భాష, హిందుస్థానీ భాషలను నేర్చుకున్నాడు.
సంస్కరణలు
[మార్చు]ట్రావెన్‌కోర్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం కేశవ దాస్ ప్రధాన లక్ష్యం.[11] వాణిజ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేశాడు. వాణిజ్యం ద్వారా వచ్చిన లాభాలు రాష్ట్రం శాశ్వత సైన్యాన్ని నిర్వహించడానికి సహాయపడ్డాయి. ఇది టిప్పు సుల్తాన్‌తో పోరాటానికి అవసరమైన ఇతర సన్నాహాలు చేయడానికి కూడా సహాయపడింది. ముఖ్యంగా ఇది ఒక రకమైన యుద్ధ ఆర్థిక వ్యవస్థ. కన్యాకుమారి నుండి ఆలప్పుళ వరకు తీర ప్రాంతాలను సందర్శించి రాబోయే ఓడరేవులుగా మారే సామర్థ్యం ఉన్న ఆలప్పుళ, విళింజం ప్రాంతాలను అభివృద్ధి చేశాడు.[12]
- సైనిక సంస్కరణలు
అతని సైనిక సంస్కరణలలో పాత కోటల మరమ్మత్తు, అనేక కొత్త రహదారుల నిర్మాణం అత్యంత గమనార్హమైనవి. ఉదయగిరిలోని ఆయుధాగారంలో తుపాకులు, మందుగుండు సామగ్రి వేగంగా తయారు చేయబడ్డాయి.
- ఆలప్పుళ ఓడరేవు అభివృద్ధి

ఒక ఆదర్శవంతమైన ప్రదేశాన్ని కనుగొని ఆలప్పుళలో పక్కా ప్రణాళికతో కూడిన ఓడరేవు నగరాన్ని నిర్మించడం అతని ఎప్పటికైనా గొప్ప సహకారం.[13][14] భౌగోళిక, సముద్ర సంబంధిత కారణాల వల్ల అతను ఆలప్పుళను అత్యంత అనుకూలమైనదిగా గుర్తించాడు.[15] ఓడరేవుకు సరుకులను తీసుకురావడానికి అతను రెండు సమాంతర కాలువలను నిర్మించాడు, పారిశ్రామిక సంస్థలు, వాణిజ్యం, కార్గో కేంద్రాలను ప్రారంభించడానికి సూరత్, ముంబై, కచ్ నుండి వచ్చిన వ్యాపారులు, వర్తకులకు మౌలిక సదుపాయాలను అందించాడు. అతని కాలంలో ఆలప్పుళ పురోగతి సాధించి ట్రావెన్‌కోర్ ఆర్థిక నరాల కేంద్రంగా మారింది.[16][1] బాంబే, సౌరాష్ట్ర, సూరత్ నుండి వ్యాపారులు ఆలప్పుళ వైపు ఆకర్షితులయ్యారు.[17] కొచ్చిన్ వాణిజ్యాన్ని ఆలప్పుళ ఓడరేవుకు మళ్లించడానికి ప్రయత్నం జరిగింది.[18]
కాయిర్-మ్యాటింగ్, కాయిర్-యార్న్ ఎగుమతి కోసం ప్రధానంగా 1762లో ఈ ఓడరేవును ప్రారంభించారు. కలకత్తా, బొంబాయితో వాణిజ్యం కోసం కేశవదాస్ మూడు ఓడలను నిర్మించాడు, ఆలప్పుళ తూర్పు ప్రాంతంలో ఉత్పత్తి అయిన వస్తువులను నిల్వ చేయడానికి, పారవేయడానికి అనుకూలమైన డిపోను అందించింది.[19]
- విళింజం ఓడరేవు
విళింజంను రాజా కేశవ దాస్ చిన్న ఓడరేవుగా అభివృద్ధి చేశాడు.[20][21]
- ఎంసి రోడ్డు నిర్మాణం
కేరళ రాష్ట్రంలోని ట్రావెన్‌కోర్ ప్రాంతంలో ప్రధాన రాష్ట్ర రహదారి అయిన మెయిన్ సెంట్రల్ రోడ్ (ఎంసి రోడ్) రాజా కేశవదాస్ ట్రావెన్‌కోర్ దీవాన్‌గా ఉన్న సమయంలో నిర్మించబడింది.
- చాలై మార్కెట్ ప్రారంభం

ట్రావెన్‌కోర్ రాజ్యానికి నిత్యావసర వస్తువుల సరఫరాకు ఈ బజారును కేంద్ర బిందువుగా మార్చాలనే ఉద్దేశ్యంతో 18వ శతాబ్దం చివరలో రాజా కేశవదాస్ అధికారికంగా చాలై మార్కెట్‌ను స్థాపించాడు.[23] ట్రావెన్‌కోర్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి సరుకులను తీసుకెళ్లడానికి సమీపంలోని కిల్లి, కరమన నదులు ఉపయోగించబడ్డాయి.[1] రెండు నదులపై వంతెనలు నిర్మించబడ్డాయి. 1786లో కార్తీక తిరునాళ్ రామవర్మ తమిళనాడులోని పద్మనాభపురం నుండి తిరువనంతపురానికి మారాడు. ఇది చాలై అభివృద్ధికి సహాయపడింది.[24]
- నెడుంకోట్ట

కేశవదాస్ సాధించిన గొప్ప ఘనత టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకంగా ట్రావెన్‌కోర్‌ను రక్షించడం. కేశవదాస్ అధికారంలోకి వచ్చేసరికి టిప్పు ట్రావెన్‌కోర్ ముఖద్వారం వద్ద బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అతను డచ్ వారి నుండి క్రాంగనూర్, అయకోట్ట కోటలను కొనుగోలు చేశాడు. అతను ఇతర ప్రదేశాలలోని కోటలను మరమ్మతు చేసి, బాగా శిక్షణ పొందిన సైనికులతో సైన్యాన్ని బలోపేతం చేశాడు; మద్రాసులో ఇంగ్లీషు వారితో జరిపిన చర్చలలో రెండు కంపెనీ దళాలను పొంది కోట వద్ద మోహరించాడు. టిప్పుపై జరిగిన పోరాటంలో విజయం సాధించి ట్రావెన్‌కోర్ సరిహద్దుల నుండి అతనిని తరిమిగొట్టాడు, అతని తిరోగమనం కూడా అతనికి మనశ్శాంతిని ఇవ్వలేదు. సైనికులు చాలా దూరం ప్రయాణించి భారీ ప్రాణనష్టం తీసుకునే వరకు అతను టిప్పును వెంబడించాడు.[15]
- వ్యవసాయ, పారిశ్రామిక సంస్కరణలు
రాజా కేశవ దాస్ వ్యవసాయం, సంబంధిత పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకున్నాడు. నీటిపారుదల వసతులు కల్పించి కొత్త భూములను సాగులోకి తెచ్చాడు, వ్యవసాయదారులకు రుణాలు, పన్ను మాఫీతో ఆర్థికంగా సహాయం అందించబడింది. తిరువనంతపురం నగరం ఆధునికీకరించబడింది, సుందరంగా మార్చబడింది. రహదారులను విస్తరించి, కోటకు మరమ్మతులు చేశారు.[25]
- రెవెన్యూ సంస్కరణలు
ట్రావెన్‌కోర్ టంకశాలలో అనంతరాయెన్ ఫణమ్, చిన్న ఫణమ్, అనంతవరాహెన్ వంటి బంగారు నాణేలు ముద్రించబడ్డాయి.[26] సిర్కార్ పట్టం భూములపై నిలవరి అనే కొత్త పన్ను వసూలు చేయబడింది, దీని ద్వారా మంచి మొత్తంలో ఆదాయం వచ్చింది. రాష్ట్ర సరైన పరిపాలన కోసం చట్టవరియోల (నియమాలు, చట్టాల సేకరణ) రూపొందించబడింది. అనేక యుద్ధాలు, ఇతర అత్యవసర పరిస్థితుల ఫలితంగా ఏర్పడిన రాష్ట్ర అప్పులలో ఎక్కువ భాగాన్ని తీర్చడంలో దీవాన్ సఫలమయ్యాడు.
తరువాతి సంవత్సరాలు
[మార్చు]1798లో ధర్మ రాజా కార్తీక తిరునాళ్ మరణంతో ఆయన దీవాన్ పదవీకాలం ముగిసింది. అతని వారసుడు పదహారేళ్ల బలరామ వర్మ యువరాజు అయ్యాడు, అతను జయంతన్ శంకరన్ నంబూద్రి చేతిలో కీలుబొమ్మగా మారాడు.[27] రాజా కేశవదాస్ దేశద్రోహిగా ప్రకటించబడి గృహనిర్బంధంలో ఉంచబడ్డాడు, ఇది జయంతన్ శంకరన్ నంబూద్రి దీవాన్ పదవిని లాక్కోవడానికి సహాయపడింది. తరువాత అతని కుటుంబ ఆస్తులను జప్తు చేసి 1799 ఏప్రిల్ 21న విషం పెట్టి చంపారు.[28][29]
స్మారక చిహ్నాలు
[మార్చు]- ఆలప్పుళలో రాజా కేశవదాస్ పేరు మీద 1997లో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించారు.[30]
- తిరువనంతపురంలోని శాస్తమంగళంలో రాజా కేశవదాస్ ఎన్.ఎస్.ఎస్. హయ్యర్ సెకండరీ స్కూల్.
- ఆలప్పుళ- చంగనస్సేరి రహదారిలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు.
- ఆలప్పుళలో మెమోరియల్ పార్క్.
- ఎం. సి. రోడ్డు ప్రారంభంలో ఉన్న పట్టణానికి ఆయన పేరు మీద కేశవదాసపురం అని పేరు పెట్టారు.
మూలాలు
[మార్చు]- 1 2 3 Menon, A. Sreedhara (1967). A Survey of Kerala History (in ఇంగ్లీష్). D C Books. pp. 235–236. ISBN 978-81-264-1578-6.
- ↑ Abraham, M.V., A Concise History of Travancore, Tiruvalla, 1941, p. 28. South Travancore was a part of the erstwhile State of Travancore-cochin. It was formed out of the four Tamil speaking taluks of Agasteeswaram, Thovalai, Kalkulam and Vilavancode.
- ↑ Rajeev, Sharat Sunder (2018-03-30). "Kravilakathu Putten Veedu, a famed abode of a former Dewan". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2021-07-18.
- ↑ Shungoonny Menon, P., A History of Travancore, Cochin, 1983, p.146
- ↑ Parameswaran Pillai, History of Travancore, Trivandrum, 1944, p.31
- ↑ "Government Museum, Trivandrum, Travancore". Nature. 159 (4028): 57. 1947. Bibcode:1947Natur.159R..57.. doi:10.1038/159057b0. ISSN 0028-0836. S2CID 4154954.
- ↑ https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/70621/10/10_chapter%203.pdf[permanent dead link]
- ↑ Shungoonny Menon, P., A History of Travancore, Trivandrum, 1983, p.1.
- ↑ Velu Pillai, T.K., The Travancore State Manual, Vol.II, Trivandrum, 1996, p.156.
- ↑ "Statue of Raja Kesavadas to be erected in city". The Hindu. 2007-11-05. Retrieved 22 October 2014.
- ↑ Velu Pillai, T. K., The Travancore State Manual, Vol. II, Trivandrum, 1945, p.44.
- ↑ Lawerence, Jayaraj. "REFORMS OF RAJA KESAVA DAS". Research Journal of Indian Studies.
- ↑ "Alappuzha: A detailed Study for PSC | PSC Arivukal". www.pscarivukal.com. 19 May 2020. Retrieved 2021-07-20.
- ↑ "History | District Alappuzha, Government of Kerala | India" (in ఇంగ్లీష్). Retrieved 2021-07-20.
- 1 2 Deepa, T. (July 2013). "Raja kesava das and his reforms in travancore 1789 1799". University (in ఇంగ్లీష్).
- ↑ Kusuman, K. K. (1987). A History of Trade & Commerce in Travancore, 1600-1805 (in ఇంగ్లీష్). Mittal Publications. ISBN 978-81-7099-026-0.
- ↑ Thomas Pendant, A View of Hindustan, Vol. I, London, 1796, p.176.
- ↑ Thomas Pendant, A View of Hindustan, Vol. I, London, 1796, p.177
- ↑ Alappuzha, A brief history (2015-03-26). "prd.kerala.gov/alappuzha". Archived from the original on 26 March 2015. Retrieved 2021-07-15.
- ↑ "[PDF] kerala history - Brilliance College - Free Download PDF". nanopdf.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-20.
- ↑ Panikkar, K. M., History of Kerala (1498-1801), Annamalai Nagar, 1960, p. 223.
- ↑ "Trevandrum Bazaar". Chronicles of the London Missionary Society. 1890. Retrieved 2 November 2015.
- ↑ "Chalai". www.chalai.org. Retrieved 2021-07-20.
- ↑ "The tale of Chalai, Kerala's oldest market that is thriving even after centuries". The News Minute (in ఇంగ్లీష్). 2021-02-16. Retrieved 2021-07-20.
- ↑ Deepa, T (July 2013). Raja Kesava Das and his reforms in Travancore 1789 1799.
- ↑ Iswara Pillai, R., Raja Kesava Das Adhava Valia Dewanji, (Malayalam), Trivandrum, 1919, p.24.
- ↑ Kerala (India); Menon, A. Sreedhara (1962). Kerala District Gazetteers: Kottayam (in ఇంగ్లీష్). Superintendent of Government Presses. p. 210.
- ↑ Allen, Charles (2017-11-02). Coromandel: A Personal History of South India (in ఇంగ్లీష్). Little, Brown Book Group. ISBN 978-1-4087-0540-7.
- ↑ Sandy (2017-12-04). "Two-Century Old Stories of Chalai Bazaar – The Major Commodity Market of Thiruvananthapuram City". My Words & Thoughts (in ఇంగ్లీష్). Retrieved 2021-07-20.[permanent dead link]
- ↑ ആലപ്പുഴയിലെ രാജാ കേശവദാസ് നീന്തല്ക്കുളം ഈ മാസം തുറക്കും | Raja Kesavadas Swimming Pool (in ఇంగ్లీష్), 8 January 2021, retrieved 2021-07-20