రాజుగోరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజుగోరు
కృతికర్త: కె.ఎన్.వై.పతంజలి
అంకితం: కాకర్లపూడి వేంకట విజయగోపాలరాజు, సీతాదేవి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నవల/నవలిక
విభాగం (కళా ప్రక్రియ): వ్యంగ్యం, హాస్యం
ప్రచురణ:
విడుదల: 1983
పేజీలు: 67
దీని తరువాత: వీరబొబ్బిలి

రాజుగోరు ప్రముఖ సంపాదకుడు, సాహిత్యకారుడు కె.ఎన్.వై.పతంజలి రచించిన వ్యంగ్య హాస్య నవలిక. పతంజలి స్వగ్రామమైన ఆలమండ కథాస్థలంగా రచించిన నవలికల మాలికలో ఇది మొదటిది. హాస్యం, వ్యంగ్యం ప్రధానంగా రచించిన ఈ నవలికలోని పాత్రలైన వీరబొబ్బిలి, ఫకీర్రాజు, గోపాత్రుడు తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధి పొందాయి.

రచన నేపథ్యం

[మార్చు]

పతంజలి రచించిన రాజుగోరు నవలిక చతుర మాసపత్రికలో 1983 ఏప్రిల్ సంచికలో ప్రచురితమైంది. ప్రముఖ కథకుడు, ఆనాడు పతంజలి కింది ఉద్యోగి నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ఈ గ్రంథకర్త పతంజలితో 1983 ప్రాంతంలో వివిధ సాహిత్యాంశాలు చర్చిస్తూండేవారు. ఆ సందర్భంగా జరిగిన చర్చలో పతంజలి అప్పటికే రచించిన సీరియస్ రచన ఖాకీవనం నవలనే కాక పతంజలి అభిమాన రచయిత టాల్‌స్టాయ్‌ని కూడా నామిని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో పతంజలి నామినితో పందెంలా మీ ఊరి వాళ్ల గురించి మీరొక కథ రాయండి, మా ఊరి వాళ్ళ గురించి నేనొకటి రాస్తాను. రాసి చతురకు పంపుదాం. ఐతే నాలుగే నాలుగు రోజుల్లో రాద్దాం అని అనుకున్నారు. ఫలితంగా పతంజలి రాజుగోరును నాలుగైదు రోజుల్లో, నామిని పాలపొదుగు రెండురోజుల్లో రచన చేశారు. అలా చతురకు పంపితే రాజుగోరు ప్రచురితమై, పాలపొదుగు తిరిగివచ్చింది.[1]
రాజుగోరు నవలికలోని పాత్రలు, కథాస్థలం పతంజలి అనంతరకాలంలో రచించిన వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు నవలికల్లో కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఈ నవలికలను నవలికల మాలికగా భావించవచ్చు.

ఇతివృత్తం

[మార్చు]

వచ్చీరాని వైద్యం చేసి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడవేసే నాటువైద్యుల కోవలోని అలమండ గ్రామస్థుడు ఫకీర్రాజు, అటువంటి వైద్యునికి శిష్యరికం చేసే గోపాత్రుడు కలగాడ గ్రామానికి చెందిన ఒక నాయుడి అత్తకు వైద్యం చేసేందుకు వెళ్తారు. వాళ్ళు రోగిపైన ప్రయోగం చేసి చూద్దామని పురాతనమైన సూదిమందు వేస్తారు. రోగి ప్రాణం ప్రమాదంలో పడుతుంది. ఆ స్థితిలో ఆమెను పెద్ద వైద్యుని వద్దకు తీసుకువెళ్తారు. ఆ వైద్యుడు విషయం తెలుసుకుని వారికి చీవాట్లేస్తాడు. ఆపైన ఫకీర్రాజు తమ బంగారపు పిసరు దొంగతనం చేశాడని కలగాడ నాయుడు జామి పోలీసుస్టేషనులో కేసు వేస్తాడు. జామి పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ ముస్లిం కావడంతో నవాబులు, రాజుల అనుబంధాన్ని గురించి మాట్లాడి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ బంగారపు దొంగ దొరికి ఫకీర్రాజు నేరస్థుడు కాదని నిరూపణ అవుతుంది. తమాషా పద్ధతిలో చెప్పే మరెన్నో విషయాలు ఈ నవలికలో ఉన్నాయి.[2]

శైలి

[మార్చు]

అప్పటివరకూ ఖాకీవనం, పెంపుడు జంతువులు వంటి సీరియస్ నవలలను రచించిన పతంజలి రాజుగోరు నవలలో హాస్యానికీ, వ్యంగ్యానికీ ప్రాధాన్యతనిచ్చారు. భేషజాలను, నాటువైద్యాన్ని హేళన చేస్తూ, తెలిసీ తెలియని వైద్యులు ప్రజారోగ్యంతో ఎలా ఆటలాడుకుంటారో చూపిన నవలిక ఇది. ఈ నవలికలోని పాత్రలే అనంతర కాలంలో ఆయన సాహిత్యంలో కొనసాగి తెలుగు సాహితీరంగంలో చిరకీర్తిని సంపాదించిపెట్టాయి. ప్రక్రియాపరంగా రాజుగోరు కథగా కొందరు భావించగా, నవలగా పతంజలి సాహిత్యం-నవలలు అనే సాహిత్య సర్వస్వ సంపుటంలో వర్గీకరించారు. అటు నవలకు ఉండే విస్తృతితోనూ లేక, ఇటు కథకు ఉండాల్సిన లక్షణాలూ లేక మధ్యేమార్గంగా నవలికగా మరికొందరు నిర్ణయించారు.

మూలాలు

[మార్చు]
  1. పతంజలి తలపులు(పుస్తకం):నా విస్తరాకు(వ్యాసం):నామిని సుబ్రహ్మణ్యం నాయుడు:పు.31,32
  2. రాజుగోరు:పతంజలి సాహితీసర్వస్వం:కె.ఎన్.వై.పతంజలి:మనసు ఫౌండేషన్ ప్రచురణ
"https://te.wikipedia.org/w/index.php?title=రాజుగోరు&oldid=3701706" నుండి వెలికితీశారు