రాజ్‌పుత్ చిత్రకళ

రాజ్‌పుత్ చిత్రకళ (ఆంగ్లం: Rajput painting) 16వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు భారతదేశానికి కు చెందిన స్వతంత్ర హిందూ సామంత రాజ్యాలలో విలసిల్లిన చిత్రకళ. మొఘల్ చిత్రకళ ఆ కాలానికి సమకాలీనం అయితే, రాజ్‌పుత్ చిత్రకళ మాత్రం సాంప్రదాయికం, రసాత్మకం. ఇందులో పలు విభాగాలు ఉన్నవి: రాజస్థానీ చిత్రకళ (పశ్చిమ భారత చిత్రకళ), మధ్య భారత చిత్రకళ, పహారీ చిత్రకళ. [1] [2] పాశ్చాత్య వివరణాత్మక చిత్రాలు (illustrations), రాజస్థాన్ లో గోడల పై వేసే చిత్రాలు, పలు మతాల జానపద/సాంప్రదాయ చిత్రకళలతో బాటు మొఘల్ చిత్రకళ ప్రభావం కూడా ఈ చిత్రకళపై కలదు.[3] జోధ్‌పూర్, జైసల్మేర్, బికనీర్, జైపూర్, ఉదయ్‌పూర్ (రాజస్థాన్) లు కేంద్రాలుగా ఈ శైలి చిత్రకళ వర్థిల్లింది. ఈ ప్రాంతాలలో రాజపుత్ రాజ్యాల వైభవం, ఆ వంశం యొక్క వారసత్వాన్ని ఈ చిత్రకళ వివరిస్తుంది.[4]
వినియోగించబడే రంగుల వలన, ఉపయోగించబడే సాంకేతిక అంశాల వలన, ఈ శైలి చిత్రకళలో రాజసం ఉట్టుపడుతూ ఉంటుంది. దీనికి ఉన్న ప్రత్యేకతల వలన, భారతీయ కళాశైలి గనులలో వెలకట్టలేనంత విలువైనదిగా ఈ శైలి పరిగణింపబడుతోంది. చారిత్రక కథనాలను, మధ్య యుగ భారతదేశ సుసంపన్న సంస్కృతులను సంగమింపజేస్తూ కనబడే రాజపుత్ శైలి చిత్రకళ చరిత్రను మనకి దర్శంపజేసే ఒక కళా నేత్రం.[3]
చరిత్ర
[మార్చు]శిలాగుహ చిత్రకళ
[మార్చు]
భారతదేశం లో శిలాగుహ చిత్రకళ మధ్య ప్రదేశ్ లోని భీమ్‌బేట్కా శిలా గుహలు లో కలవు. పురాతన రాతి యుగం అయిన క్రీ.పూ 40,000-1500, మధ్య రాతి యుగం అయిన క్రీ.పూ 1500 - 8500 కాలంలో ఇవి చిత్రీకరించబడ్డాయి. పురాతన రాతి యుగం లో నృత్యం చేస్తోన్న మానవుల యొక్క, నాలుగు కాళ్ళ జంతువులను వేటాడుతోన్న మానవుల యొక్క చిత్రలేఖనాలు ఆకుపచ్చ, ఎరుపు రంగులలో కలవు. మధ్య రాతియుగం లో మరింత వివరాణాత్మకంగా, జీవిత చక్రంలో భాగాలు అయిన గర్భధారణ, శిశు జన్మం, శ్మశాన సన్నివేశాలు వంటి దైనందిన జీవిత ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం, భేధాలతో కూడిన వారి వస్త్రధారణ, జంతువుల చిత్రలేఖనాలు కలవు. [2]
అజంతా గుహలు
[మార్చు]
మహారాష్ట్ర లోని అజంతా గుహల లోని బౌద్ధ చిత్రకళ క్రీ.పూ 50 నుండి క్రీ.శ 100 మధ్యలో జరిగింది. గోడలపై, పైకప్పులపై క్షుణ్ణమైన రేఖాగణిత అంశాలతో, అత్యంత సహజంగా చిత్రీకరించబడటం వీటి ప్రత్యేకత. రాతి ఉపరితలాన్ని చిత్రకళకు అనువుగా మార్చటానికి, పలు పొరలలో ఆవుపేడ, మట్టి, గడ్డి పూసి, చివరగా సున్నపు తేట పూయటం జరిగింది. ఖనిజ మూలాలతో చేయబడిన రంగుల, పశువుల వెంట్రుకలతో చేసిన కుంచెలు వాడబడ్దాయి. బుద్ధుడి జీవిత చరిత్ర లోని ఘట్టాలు, అప్పటి వస్త్రధారణ, చేనేత, వాస్తుకళలు చిత్రీకరించబడ్డాయి. [2]
తాళపత్ర గ్రంథాలు, కాగితం పై చిత్రలేఖనం
[మార్చు]
అజంతా గుహల చిత్రకళ తర్వాత 6వ శతాబ్దంలో, కర్ణాటక లోని బాదామి గుహలు, 8వ శతాబ్దం లొ ఎల్లోరా గుహలు లో ఉన్న చిత్రకళలు, కళ అంతరించిపోలేదన్న వాదానికి బలం ఇస్తున్నాయి. [2]
ఆరవ శతాబ్దం నుండి 10వ శతాబ్దం భూర్జ వృక్ష బెరడు పైన, తాళ పత్రాలపైన, కాగితం పైన చిత్రలేఖనాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో పదకొండు నుండి పదమూడవ శతాబ్దం వరకు బౌద్ధ మతం ప్రచారం చేయటం కోసం మఠ గ్రంథాలయాలకు ప్రదానం చేయబడ్డ క్షుణ్ణంగా చిత్రీకరించబడి చెక్కలలో భద్రపరచబడ్డ బౌద్ధ చిత్రలేఖనాలు పాల చిత్రకళ ను సూచిస్తాయి.[2]
జైన చిత్రకళ
[మార్చు]పదకొండవ శతాబ్దంలో పశ్చిమ భారతదేశంలో కాగితం పై కల్పసూత్రాలు, కాళక చర్య కథ వంటి చిత్రలేఖనాలతో జైన చిత్రకళ విలసిల్లింది. చిత్రీకరణకు అనుగుణంగా ఈ గ్రంథములలో పరిమాణాలు మార్చబడ్డాయి. ఎరుపు, నీలం రంగులతో బాటు అక్కడక్కడా స్వర్ణం కూడా ఒక వర్ణంగా వినియోగించబడినది. అటువైపు కన్నును కూడా చిత్రీకరించటం ఈ శైలిలో ప్రత్యేకత. ఈ శైలి పదహారవ శతాబ్దంలో పశ్చిమ భారతీయ చిత్రకళ లో కూడా వాడబడినది. [2]

వ్యుత్పత్తి
[మార్చు]
రాజ పుత్ర అనే పదం నుండి రాజ్ పుత్ అనే పదం ఉద్భవించింది. సైనిక వర్గానికి చెందిన ఈ వంశం వారు ఉత్తర, మధ్య భారతదేశాన్ని పరిపాలించారు. వీరి మూలాలు ఇదమిత్థంగా తెలియకపోయిననూ, ఆరు/ఏడవ శతాబ్దాలలో మధ్య ఆసియా నుండి వలస వచ్చి, స్థానిక సైనిక స్థాయికి అనుకూలంగా మారి, హిందూ సాంఘిక వ్యవస్థలో వారి స్థానాన్ని పదిలపరచుకొన్నారు. తొమిది/పదవ శతాబ్దాల నాటికి రాజకీయ ప్రాముఖ్యత సంపాదించుకొని స్వతంత్ర రాజవంశాలను ఏర్పాటు చేసుకోగలిగారు. [2] ఈ శైలి చిత్రకళకు 1916 లో ప్రముఖ కళా చరిత్రకారుడు ఆనంద కుమారస్వామి రాజ పుత్ చిత్రకళ అని నామకరణం చేశాడు. [4][3]
సంస్కృతి
[మార్చు]రాజపుతానా ఘనమైన, వైవిధ్యభరితమైన చరిత్ర కలది. ప్రత్యేకమైన చిత్రకళా శైలి కలది. గేయాలు, జానపద కథలు సంస్కృతిలో అల్లుకుపోయినది. ఎడారి ప్రాంతం నడిబొడ్డున అద్భుతమైన కోటలు, రాజభవనాలతో నిండినది. ప్రతి రాజపుత్ పాలకుడికి తన సొంత చిత్రకళాశాల ఉండేది.[4]
- రాజపుత్ శైలిలో పశ్చిమ, మధ్య భారత నాయకులు అంశాలు
- ఆల్వారుకు చెందిన భక్తావర్ సింఘ్ యొక్క రాజదర్బారు
- మహారాజు నారు సింఘ్
- మల్హర్ రావు హోల్కర్ - మరాఠా సైన్యాధిపతి
- బిలాస్ పూర్ రాజు దేవీచంద్
- మధ్య ప్రదేశ్ కు చెందిన రాఘవఘఢ్ రాజు ధీరజ్ సింఘ్
- సర్దార్ రాణోజీ సింధియా
చిత్రకళ
[మార్చు]మొఘల్ చిత్రకళ లో శిక్షణ పొందిన కళాకారులు, మొఘల్ దర్బారు నుండి చెల్లాచెదురై స్థానిక చిత్రకళా సాంప్రదాయాల నుండి పౌరాణిక శైలులు స్వీకరించటంతో ఈ శైలి ఏర్పడింది. 16వ శతాబ్దం అంతానికి రాజపుత్ర పాలకులచే పాలించబడే కళా పాఠశాలలు స్థానిక, మొఘల్ చిత్రకళలతో బాటు పర్షియన్, చైనీసు, యూరోపియన్ వంటి వాటి ప్రభావాలను ఐక్యం చేస్తూ స్పష్టమైన శైలులను అభివృద్ది చేశాయి. [4]
- రాజపుత్ శైలిలో హిందూ పురాణాల అంశాలు
- వరాహావతారం
- వరాహావతారం లో యుద్ధం
- రాధాకృష్ణ లీలలు
- పంచవటి లో సీతారామలక్ష్మణులు
అంశాలు
[మార్చు]17వ శతాబ్దానికి ముందు రాజపుత్ చిత్రకళలో రామాయణం, మహాభారతం, మహాభాగవతం, గీత గోవిందం, శివపార్వతులు, వంటి పురాణాల దృశ్యాలు చిత్రీకరించబడినవి. ఇవే కాక పంచతంత్రం రసికప్రియ, కవిప్రియ, బారమాస, రస మంజరి, రాగమాల, వంటి కావ్యాలలోని దృశ్యాలను చిత్రీకరించటం జరిగింది. దైవ-మానవ సంగమాన్ని సూచిస్తూ రాధ-కృష్ణుడు ల ప్రేమ, ఎదురుచూపులు ఋతువులు, తదనుగుణంగా రూపాంతరం చెందే ప్రేమ, శృంగారం, శృంగార భంగిమలు, శృంగార గాథలు, ప్రాచీన గేయాలు, ధీరత్వం, నాయికా-నాయకుల వయసు, రూపురేఖలు, వ్యక్తిత్వాలు, పరిస్థితులు, ప్రకృతి దృశ్యాలు, జంతువులు రాజపుత్ చిత్రకళలో ప్రధానంగా కనిపించే అంశాలు.[5] సభా దృశ్యాలు, ఏనుగులు, గుర్రాలపై పాలకుల ఊరేగింపులు కూడా ఈ శైలిలో మరికొన్ని అంశాలు. 18వ శతాబ్దంలో శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతూ ఉండటంతో సంగీతం, నృత్యం, కవిత్వం, ప్రేమ కోసం చేసే సాహసాలు, మద్యంతో కూడిన వేడుకలు, ఉద్యానవనాలు, సుందరమైన పడుచు స్త్రీలు, వేట, సాధారణ ప్రజల జీవితాలలో ఉండే దైనందిన కార్యకలాపాలు రాజపుత్ చిత్రకళలోకి చేరాయి.[2][4][5]
- రాజపుత్ శైలిలో శృంగార దృశ్యాలు
- స్నానపు గదిలో దాసీలతో ఒక మహారాజు రాసలీలలు
- శృంగార సమయంలో వేట
- ఆరు బయట శృంగారం
వినియోగించబడిన పదార్థాలు
[మార్చు]కొన్ని ఖనిజాలు, మొక్కల మూలాలు, శంఖాలు, విలువైన రాళ్ళ నుండి రంగులను సంగ్రహించటం జరిగింది. బంగారం, వెండి కూడా ఉపయోగించటం జరిగింది. ఉడుత, ఒంటె వంటి జంతువుల వెంట్రుకలతో చేసిన చాలా సన్నని కుంచెలను ఉపయోగించటం జరిగింది. [4]
- రాజపుత్ శైలిలో దైనందిన దృశ్యాలు
- వాయిద్య స్వరాలతో సర్పాలను ఆకర్షిస్తోన్న ఒక మహిళ
- శివుని పూజిస్తున్న ఇరువురు మహిళలు
- రాగమాలో శ్రేణిలో బేలావల రాగం
- మార్కండేయ పురాణం
శైలి
[మార్చు]17వ శతాబ్దం లో ముఘల్ ప్రభావం పెరగటం తో సహజమైన నెరపు, సున్నితంగా శ్రేణీకరించబడిన రంగులు, లౌకిక విషయ వస్తువుల చిత్రీకరణ ప్రవేశపెట్టబడ్డాయి.[2] రంగును దృశ్య వ్యక్తీకరణలో ప్రధాన అంశంగా ఉపయోగిస్తూ చిత్రీకరించే పద్ధతికి ఒక రూపకల్పన చేయటం ఈ శైలిలో కనబడుతుంది. చర్మం, వేషధారణ, నిర్మాణాలు వంటి వాటిని వివిధ రంగులతో సహజత్వానికి చేరువగా ఉంటూనే, ప్రకృతి, వాతావరణపు ప్రభావం వంటి వాటిని మాత్రం తక్కువ లేదా ఎక్కువ ప్రభావవంతంగా చూపించడం, లేక వాటి సహజ రంగులను పూర్తిగా మార్చివేయబడటం రాజపుత్ శైలి చిత్రకళ ప్రత్యేకం.[3]
- రాజపుత్ శైలిలో మరికొన్ని చిత్రాలు
- దారంతో తిరిగే ఆటబొమ్మతో ఒక మహిళ
- రాగమాల శ్రేణిలో లలిత రాగిణి
- కేశవదాసుని రసికప్రియ లో కృష్ణుని కోసం వేచి చూస్తోన్న రాధ
- పూజలను అందుకొంటున్న శ్రీనాథుడు
లక్షణాలు
[మార్చు]రాజసం ఉట్టి పడటం, గర్వ భావన కలిగి ఉండటం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండటం, ఐతిహాసిక సంబంధం కలిగి ఉండటం ఈ శైలి లక్షణాలు. తమ ఆశయాలను చిత్రీకరించి పాలకులు తమ వారసత్వాన్ని స్థాపించాలని కోరుకోవటం తో ఈ శైలి చిత్రాలు పాలకుల హోదాకు, వారి వారసత్వానికి సూచికగా మిగిలిపోయాయి. [4]
- రాజపుత్ శైలిలో మరికొన్ని చిత్రాలు
- పూజించబడుతోన్న శ్రీనాథుడు
- సప్తస్వరూప పూజ
- భాగవత పురాణం నుండి కుంతితో చర్చలు జరుపబడుతోన్న దృశ్యం
- ఉద్యానవనం లో ఒక జంట
శాఖోపశాఖలు
[మార్చు]రాజపుత్ శైలి చిత్రకళలో పలు శాఖోపశాఖలు కలవు.[4] ఒక్కొక్క శాఖ, ఒక్కొక్క ఉపశాఖ ఇతర శాఖోపశాఖలకు భిన్నంగా ఉంటాయి.[5]
మేవార్ శాఖ
[మార్చు]- చావంద్
- నాథ్ ద్వారా
- దేవఘర్
- ఉదయ్ పూర్
- సవార్
మార్వార్ శాఖ
[మార్చు]- కిషన్ ఘర్
- నాగౌర్
- పాలీ
- ఘనేరావ్
హదోతి
[మార్చు]- కోట
- బుండి
- ఝలావర్
ధుందర్
[మార్చు]- అంబర్
- జైపూర్
- షెఖావతి
- ఉనియారా
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rājput painting | Mughal Influence, Miniature Art & Hindu Mythology | Britannica". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2026-04-15.
- 1 2 3 4 5 6 7 8 9 "Rajput (Western, Central, and Hill) Painting | Encyclopedia.com". www.encyclopedia.com. Retrieved 2026-04-15.
- 1 2 3 4 "Rajput Miniature Paintings: A Classic Art of India". www.exoticindiaart.com (in ఇంగ్లీష్). Retrieved 2026-04-15.
- 1 2 3 4 5 6 7 8 "Royal Rajputana". Google Arts & Culture. Retrieved 2026-04-15.
- 1 2 3 Behrendt, Kurt (2016-10-01). "Poetic Allusions in the Rajput and Pahari Painting of India - The Metropolitan Museum of Art". www.metmuseum.org (in ఇంగ్లీష్). Retrieved 2026-04-15.