Jump to content

రామ రాయ

వికీపీడియా నుండి
(రామరాయలు నుండి దారిమార్పు చెందింది)


విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు 1336-1356
మొదటి బుక్క రాయలు 1356-1377
రెండవ హరిహర రాయలు 1377-1404
విరూపాక్ష రాయలు 1404-1405
రెండవ బుక్క రాయలు 1405-1406
మొదటి దేవరాయలు 1406-1422
రామచంద్ర రాయలు 1422
వీర విజయ బుక్క రాయలు 1422-1424
రెండవ దేవ రాయలు 1424-1446
మల్లికార్జున రాయలు 1446-1465
రెండవ విరూపాక్ష రాయలు 1465-1485
ప్రౌఢరాయలు 1485
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు 1485-1491
తిమ్మ భూపాలుడు 1491
రెండవ నరసింహ రాయలు 1491-1505
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు 1491-1503
వీరనరసింహ రాయలు 1503-1509
శ్రీ కృష్ణదేవ రాయలు 1509-1529
అచ్యుత దేవ రాయలు 1529-1542
సదాశివ రాయలు 1542-1570
ఆరవీటి వంశము
రామ రాయ 1542-1565
తిరుమల దేవ రాయలు 1565-1572
శ్రీరంగ దేవ రాయలు 1572-1586
వేంకటపతి దేవ రాయలు 1586-1614
శ్రీరంగ రాయలు 1 1614-1614
రామదేవ రాయలు 1617-1632
పెద వేంకట రాయలు 1632-1642
శ్రీరంగ రాయలు 2 1642-1646

ఆరవీటి రామరాయలు (జ.1484[1] - మ.1565) (Rama Raya) శ్రీ కృష్ణదేవ రాయల అల్లుడు, గొప్ప వీరుడు, రాజకీయ చతురుడు, 16వ శతాబ్ది రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించాడు. విజయనగర రాజవంశములలో నాలుగవది, చివరిదీ ఐన ఆరవీటి వంశమునకు ఆద్యుడు. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడైనందున ఈయనను అళియ రామరాయలు (కన్నడములో అళియ అంటే అల్లుడు) అని కూడా వ్యవహరిస్తారు. ప్రముఖ సంస్కృత పండితుడు రామామాత్యుడు రామరాయల ఆస్థానములో ఉండెడివాడు.

తొలిదశ

[మార్చు]

రామరాయలు ఆధునిక కర్నూలు జిల్లా ప్రాంతంలో 1484లో జన్మించాడు. రామరాయల తండ్రి శ్రీరంగరాజు విజయనగర రాజ్యంలో ప్రముఖ సేనాధిపతి. సాళువ నరసింహరాయలు సింహాసనానికి వచ్చేటప్పటికి రామరాయలు ఏడాది బాలుడు. 1505లో ఇరవై ఒక్క యేళ్ల వయసు వచ్చేసరికి విజయనగర సామ్రాజ్యం మూడు వంశాల చేతులు మారటంతోపాటు అధికారం కోసం జరిగే కరుడు రాజకీయాలు అనేకం చూశాడు. ఆ తరువాత ఏడేళ్లకే గోల్కండ సుల్తానుల సేవలో చేరాడు.[1] 1512లో సుల్తాను విజయనగర సామ్రాజ్యపు ఉత్తర భాగంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొన్నప్పుడు రాచకొండ కోటకు దుర్గాధిపతిగా ఆ ప్రాంతాన్ని పాలించడానికి రామరాయలను నియమించాడు. అయితే సుల్తానుల సేవలో రామరామలు అట్టేకాలం లేడు. 1515లో బీజాపూరు సుల్తాను రామరాయల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై దండెత్తినపుడు రామరాయలు కోటవిడచి గోల్కొండకు పారిపోయాడు. ఇది పిరికిపనిగా భావించిన గోల్కొండ సుల్తాను ఆయన్ను సేవలో నుండి తీసేశాడు. రాయరాయలు విజయనగరం తిరిగివచ్చి కృష్ణదేవరాయల సేవలో చేరాడు.

పరిపాలన

[మార్చు]

రామరాయలు శ్రీరంగరాజు, తిరుమలాంబల కొడుకు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో గొప్ప సేనాధిపతిగా, పరిపాలకునిగా, రాజకీయ తంత్రము తెలిసిన వాడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. మామ చనిపోయిన తరువాత రాజకార్యములలో తన ప్రభావము చూపాడు. 1529లో శ్రీకృష్ణదేవరాయల చిన్న తమ్ముడు అచ్యుతరాయలు సింహాసనమెక్కి 1542వరకు పాలించి చనిపోయాడు. పిమ్మట అతని మేనల్లుడు, బాలుడగు సదాశివరాయలు రాజయ్యాడు. రాజ్యాధికారమంతయూ రామరాయల చేతిలోనే ఉంది. సదాశివరాయని తొలగించి తానే రాజయ్యే అవకాశముందని కొలువులోని పెక్కుమందికి అనుమానము. కోశాధికారి, మహాయోధుడగు సలకము తిమ్మరాజు రామరాయలని హత్యచేయుటకు ఏర్పాటు చేసాడు. ఇది తెలిసి రామరాయలు గండికోటకు పారిపోయి అచట విజయనగర రాజ్యానికి విశ్వాసపాత్రుడగు పెమ్మసాని యెర్ర తిమ్మానాయుని ఆశ్రయము పొందాడు. తిమ్మరాజు పెద్ద సైన్యముతో గండికోట వచ్చి రామరాయలను అప్పగించమని తిమ్మానాయుని కోరగా, "మమ్ములను ఆశ్రయించిన వారిని రక్షించుట మా ధర్మము. మీతో పోరునకు మేము సిద్ధము" అని తిమ్మానాయుడు సమాధానమిచ్చాడు. గండికోటకు మూడు క్రోసుల దూరాన గల కోమలి వద్ద తిమ్మరాజుకు, యెర్రతిమ్మానాయునికి మధ్య యుద్ధము జరిగింది. ఈ యుద్ధములో విజయనగర సేన ఓడిపోయింది. తిమ్మానాయుడు, రామరాయలు తిమ్మరాజుని విజయనగరము వరకు తరిమి చంపాడు. ఈ యుద్ధ పర్యవసానంగా రామరాయలు విజయనగర సామ్రాజ్యాధిపతి అయ్యాడు[2].

సుల్తానులతో సంబంధాలు

[మార్చు]

ఇతని కాలమున నలుగురు సుల్తానులు దక్కనును పరిపాలించేవారు

  1. బీజాపూరు సుల్తాను ఇబ్రహీం ఆదిల్షా
  2. అహ్మద్‌నగర్‌ సుల్తాను బురహాన్ నిజాం షా
  3. గోల్కొండ సుల్తాను జంషీద్ కులీ కుతుబ్ షా
  4. బీదరు సుల్తాను అలీ బరీదు

వీరిలో వీరు కలహించుకుంటూ ఉండేవారు. వీరు తమ తగవులు తీర్చుటకు తరచూ రామరాయల మధ్యవర్తిత్వము కోరుతుండేవారు. ఇదే అదనుగా రామరాయలు రాజ్యాన్ని కృష్ణా నదికి ఉత్తరముగా వ్యాపింపచేశాడు. తిరువాన్కూరు, చంద్రగిరి పాలకులను అణచివేశాడు.

  • 1543లో అహ్మద్‌నగర్‌, గోల్కొండ సుల్తానులకు సహకరించి బీజాపూరు సుల్తాను నుండి రాయచూరు అంతర్వేదిని సాధించాడు.
  • 1549లో అహ్మద్‌నగర్‌ సుల్తాన్ కు సహకరించి బిజాపూర్, బీదర్ సుల్తానుల నుండి కళ్యాణి కోటను సాధించి పెట్టాడు.
  • 1557లో బిజాపూర్, బీదర్ సుల్తానుల వైపు న ఉండి అహ్మద్ నగర్, గోలకొండ సుల్తానులతో తలపడ్డాడు.
  • గోల్కొండ నవాబు అయిన జంషీద్ కులీ కుతుబ్ షా చివరి తమ్ముడు అయిన ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి ఏడు సంవత్సరములు ఆశ్రయమిచ్చి తరువాత జాగీరు కూడా ఇచ్చాడు.
  • 1551లో రామరాయలూ, అహ్మద్‌నగర్‌ సుల్తానూ బీజాపూరు పైకి దండయాత్ర చేసి రాయచూరు, ముద్గల్లు, కృష్ణా, తుంగ భద్రా నదుల మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నాడు.
  • 1553లో ఏడు లక్షల ధనమును స్వీకరించి బీజాపూరు సుల్తానును అహ్మద్‌నగర్‌ సుల్తాను అయిన హుసేన్ నిజాం షా నుండి కాపాడినాడు.
  • రామరాయలు తన సైన్యములో పలు ముస్లిమ్ సైనికులను చేర్చుకున్నాడు. వారిలో ముఖ్యులు జిలానీ సోదరులు. వీరే తళ్ళికోట యుద్ధములో రామరాయలకు ద్రోహము చేసి, సుల్తానులకు సహకరించి, యుద్ధ పరిణామములో నిర్ణయాత్మక పాత్ర వహించారు.

తళ్ళికోట యుద్ధము

[మార్చు]
రామరాయల శిరచ్ఛేదం

సుల్తానుల మధ్య వైవాహిక సంబంధాలు ఏర్పడినాయి. వారి మధ్య తగవులు తగ్గాయి. 1564 డిసెంబర్ 25 న నలుగురు సుల్తానులూ ఏకమై తళ్ళికోట వద్ద విజయనగరంతో యుద్ధానికి సిద్దమయ్యారు. 1565 జనవరి 23 న జరిగిన తళ్ళికోట యుద్ధములో రామరాయలు శత్రువుల చేతిలో మరణించాడు. దీనితో శతాబ్దాల విజయనగర వైభవం క్షీణించింది. కేవలం యుద్ధ శిబిరాలనుండే కోటింపాతిక ధనమును పొందినారు. విజయనగరము సర్వనాశనము చేయబడింది. నగర విధ్వంసమునకు ఐదు నెలలు పట్టింది. ఆరునెలలు నలుగురు సుల్తానులు విజయనగరంలోనే మకాం వేసి, తరువాత వారిలో వారికి గొడవలు వచ్చి ఎవరి రాజ్యానికి వారు తరలివెళ్ళారు.

అరవీడు వంశము

[మార్చు]

యుద్ధానంతరము రామరాయలు తమ్ముడు తిరుమలరాయలు సదాశివరాయలతో బాటు ధనసంపత్తిని తీసుకొని పెనుగొండకు తరలిపోయాడు. అచటి నుండి రాజ్యాన్ని చక్కదిద్దే ప్రయత్నాలు చేసాడు. చాల సంవత్సరాలు రాజ్యము చేసి, రాజ్యానికి గౌరవప్రపత్తులు సంపాదించిన కారణంగా రామరాయలు, అతని వారసులు చారిత్రికులచే అరవీటి వంశస్థులుగా పరిగణింపబడ్డారు. ఆరవీటి వంశస్థులు నాయకరాజులు.[ఆధారం చూపాలి] గ్రామాధిపతి, రక్షకుడు, మహాతలవరుడు ప్రధాన న్యాయాధికారి అని అర్థములు. (ఖండవల్లి లక్ష్మీనిరంజనం, బాలెందు రాజశేఖరం- ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర). పెనుగొండను పరిపాలించినది నాయకురాజులు [ఆధారం చూపాలి]. వీరు ధైర్యవంతులు, నిజాయతీ పరులు, దేశభక్తి పరాయణులు. (శ్రీ తిరుమల రామచంద్ర-హంపి నుండి హరప్పా దాకా). కాలక్రమంలో విజయనగర ప్రాభవం మసకబారింది. మధుర, మైసూరు, కేలడి నాయకులు స్వతంత్రులయ్యారు. పలుచోట్ల ముస్లిమ్ సేనాధిపతులు చిన్న చిన్న ప్రాంతాలకు అధిపతులై బహమనీలకు, పిదప మొఘలులకు విధేయులుగా వ్యవహరించారు.

యుద్ధానంతర చరిత్ర

[మార్చు]

సుల్తానుల మధ్య తిరిగి భగ్గుమన్న విభేదాలు విజయనగరము దాటి వారి ప్రాభవము వ్యాపింపచేయుటకు నిరోధకమైనవి. వెనువెంటనే ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ రాజ్యములను తన సామ్రాజ్యములో కలుపుకొనుటకు చేసిన ప్రయత్నాలవలన సుల్తానుల సమయము, వనరులు, సేనలు ఆత్మసంరక్షణకు వినియోగింపబడ్డాయి. విజయనగర విధ్వంసము గాంచిన సమర్థ రామదాసు తన శిష్యుడు శివాజీని హిందూ ధర్మ రక్షణకై పురిగొల్పుతాడు. ముసునూరి నాయకుల చరిత్ర, విజయనగర సామ్రాజ్య దీక్షా తత్పరత మరాఠాలకు ప్రేరణ కల్పించాయి. మరాఠాల దాడులతో ముఘల్ సామ్రాజ్యము కూడా బలహీన పడింది. 1707లో ఔరంగజేబు మరణము తరువాత అరాచకము ప్రబలింది. తళ్ళికోట యుద్ధము తరువాత 150 సంవత్సరములకు మరాఠాల బావుటా ఢిల్లీ వరకు ఎగిరింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 A Social History of the Deccan, 1300-1761: Eight Indian Lives, Volume 1 By Richard M. Eaton
  2. కోమలి వద్ద యుద్ధం: http://books.google.co.in/books?id=FqLfdZ0gcoEC&pg=PA184&dq=gandikota&lr=#PPA184,M1
విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశం | సాళువ వంశం | తుళువ వంశం | ఆరవీడు వంశం | వంశ వృక్షం | పరిపాలన కాలం | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధం | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యం


ఇంతకు ముందు ఉన్నవారు:
సదాశివ రాయలు
విజయనగర సామ్రాజ్యము
1542 — 1565
తరువాత వచ్చినవారు:
తిరుమల దేవ రాయలు


"https://te.wikipedia.org/w/index.php?title=రామ_రాయ&oldid=3866650" నుండి వెలికితీశారు