Jump to content

రాయలసీమ ఉపాధ్యాయ కథలు

వికీపీడియా నుండి

రాయలసీమ ఉపాధ్యాయ కథలు (కథా సంకలనం) రాయలసీమ రచయితలు రచించిన ఉపాధ్యాయ కథలను పాఠకులకు పరిచయం చేయడం కోసం డా. ఎం. హరికిషన్ గారి సంపాదకత్వలో ఈ కథా సంకలనం రూపొందించబడింది. 2024 ఫిబ్రవరిలో దీప్తి ప్రచురణలు విజయవాడ వారు ఈ సంకలనాన్ని ప్రచురించారు. ఇందులో మొత్తం 42 కథలు వున్నాయి.

సంపాదకుడు: డా.ఎం. హరికిషన్ - కర్నూలు

[మార్చు]

ప్రధాన వ్యాసం: ఎం. హరికిషన్

ఈ సంకలనంలోని కథలు - కథా రచయితలు

[మార్చు]

ముందుమాట - డా. వేంపల్లె షరీఫ్‌        

1. తాను వెలిగించిన దీపాలు - మధురాంతకం రాజారాం    

2. పిచ్చి దంపతులు -  కె. సభా                

3. తొందరపడి... తొందరపడి... -  ద్వారక        

4. ప్రెగ్నెంట్‌ కాన్వెంట్‌ - బద్వేలి రమేష్‌            

5. చింతచెట్టు  -  డా. వి.ఆర్‌. రాసాని            

6. తిక్క సత్తెక్క  -  సడ్లపల్లె చిదంబరరెడ్డి            

7. మకరముఖం -  సింగమనేని నారాయణ            

8. పద్ధతి -  కేతు విశ్వనాధరెడ్డి                

9. ఒక హెచ్‌. సరస్వతి కథ - బండి నారాయణ స్వామి    

10. పరీక్ష -  డా. కొమ్మిశెట్టి మోహన్‌            

11. లిల్లీ పూవూ - గొంగళి పురుగు - రాప్తాడు గోపాల కృష్ణ    

12. ఊరికొక బడి - కలువకొలను సదానంద            

13. రాలే పువ్వులు - యం.ఆర్‌.అరుణకుమారి        

14. బలి పశువులు - శాంతి నారాయణ            

15. చేదు గురుతులు - డా. కర్నాటి చంద్ర మౌళిని        

16. నేను - మా లెక్కల సారూ! - ఆర్‌.శశికళ        

17. రేపటి చరిత్ర - మధురాంతకం నరేంద్ర        

18. ఎంతెంత దూరం... - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

19. మళ్లీ బడికి - డా. జూటూరు షరీఫ్‌            

20. పిల్లల మనసు - డా. లక్ష్మీ రాఘవ            

21. రెండు రూపాయలు - చిలుకూరి దీవెన            

22. కన్నీటి సాక్షిగా - సురేంద్ర రొడ్డ            

23. కేరింత -  తవ్వా ఓబుల్‌ రెడ్డి                

24. వ్యక్తిత్వం - టి.సురేష్‌ బాబు                

25. పాఠం తప్పిపోయింది  - డా. కె.సుభాషిణి        

26. పొద్దు పుట్టింది - వేంపల్లి గంగాధర్‌            

27. తమ్ముడి మరణం - జిల్లేళ్ళ బాలాజీ            

28. చీమలూ... నన్ను క్షమించండి  - ఎల్‌.ఆర్‌.వెంకట రమణ    

29. ఒక్క  కథ - డా. ఎం. హరి కిషన్‌            

30. రావయ్యా! చందమామా! - స్వరూప్‌ సిన్హా        

31. ఒక నింగీ... ఒక నేల - ఇనాయతుల్లా

32. అ... అంటే చందమామ - అక్కంపేట ఇబ్రహీం    

33. క్విజ్‌ మాస్టర్‌ - జి. ఉమామహేశ్వర            

34. బోగన్‌ విలియా - కళ్యాణదుర్గం స్వర్ణలత        

35. పట్టుదల - కొలుకలూరి మధుజ్యోతి            

36. అచ్చులు హల్లులు - మహమ్మద్‌ రఫీ            

37. థ్యాంక్యూ టీచర్‌! - డా. యం. ప్రగతి    

38. స్ఫూర్తి - తంగిరాల మీరా సుబ్రమణ్యం            

39. గురుదేవోభవ! - ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు

40. కొలబద్ద - పేరూరు బాల సుబ్రమణ్యం            

41. హాయి హాయీ హాయీ ఆపదలుగాయీ - శ్రీనివాస మూర్తి

42. తాతారావు అలియాస్‌ రజనీకాంత్‌ - మారుతి పౌరోహితం

ముందుమాట - డా. వేంపల్లె షరీఫ్‌

[మార్చు]

ఈ సంకలనానికి 'రాయలసీమ విద్యా పరిస్థితులకు అద్దం పట్టిన కథలు' అనే పేరుతో ముందుమాట రచించిన వేంపల్లె షరీఫ్‌గారు పుస్తకం గురించి ఏమి చెప్పారో చూద్దాం.

ఉపాధ్యాయ కథల సంకలనం అనగానే ఉపాధ్యాయ వృత్తికున్న పవిత్రత, ఒకప్పటి ఉపాధ్యాయులకు ఇప్పటి ఉపాధ్యాయులకు మధ్య ఉన్న విలువల అంతరం, సమాజంలో వచ్చిన మార్పులు, ప్రభుత్వ వ్యవస్థ, విద్యా రంగం, ప్రయివేటు సంస్థలు, వాటి చుట్టూ ఉన్న వ్యాపారం, పాఠశాలలు, పిల్లల ఒత్తిడి, ఒకప్పటి పిల్లలు ఇప్పటి పిల్లల మనస్తత్వంలో తేడా, తల్లిదండ్రుల బాధ్యత, పెంపకం, టెక్నాలజీ, సంస్కరణలు అన్నీ కళ్లముందు కదులుతాయి.

అలాగే రాయలసీమ అనే ఒక ప్రత్యేకతను పెట్టుకోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న కరువు, పేదరికం, నిరక్షరాస్యత, వివక్ష, వెనుకబాటుతనం, బాలకార్మిక వ్యవస్థ, రాజకీయ నిర్లక్ష్యం, భూస్వామ్య విధానం, కులాధిపత్యం అన్నీ గుర్తుకు వచ్చి మనసు భారంగా మారుతుంది.

కథల లిస్టు చూశాక ఈ ప్రాంతంలో ఉపాధ్యాయ వృత్తి చుట్టూ ఇంతమంది ఉపాధ్యాయులు కథలు అల్లారా... అనిపిస్తుంది. నిజానికి ఈ ప్రాంతంలోని ఉపాధ్యాయేతర వృత్తిలో ఉన్న కథకులు కూడా చాలావరకు ఉపాధ్యాయ వృత్తి కథలు రాశారు. అయితే స్వయంగా ఉపాధ్యాయులై ఉండి రాయడం వల్ల వారి జీవితం కథల్లో మరింత దగ్గరగా కనిపించే అవకాశం ఉంది.

ఈ సంకలనంలో నాలుగు తరాల కథకులు ఉన్నారు. ఊరి బడిలో పనిచేసే ఉపాధ్యాయుల దగ్గర్నుంచి విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఆచార్యులు దాకా ఉన్నారు. రాయలసీమ సామాజిక, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇంతకుమించిన మంచి సంకలనం మరొకటి ఉంటుందని నేను అనుకోను.

ఎందుకంటే అది ఊరిబడి అయినా, విశ్వవిద్యాలయం అయినా నిత్యం అనేక వర్గాల, నేపథ్యాల, మనస్తత్వాల పిల్లలను, వారి తల్లిదండ్రులను దగ్గరగా చూసే అవకాశం అధ్యాపకులకు ఉంటుంది. అంతేకాదు అనివార్యంగానైనా ఆయా విద్యాసంస్థల చుట్టూ కొన్ని రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, స్థానిక సమాజం ఉంటాయి. వాటన్నింటినీ పరిశీలించి స్వయంగా ఉపాధ్యాయులైన వారు తమదైన సామాజిక దృష్టితో ఈ కథలను చెప్పడం వల్ల ఈ సంకలనానికి ఒక నిండుదనం, ప్రత్యేకత వచ్చింది.

రాయలసీమలో ఈనాటికీ అక్షరాస్యత శాతం తక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 67.4 (2011) శాతం ఉంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక 66.4 (నేషనల్‌ శాంపిల్‌ సర్వే 2020) శాతంగా ఉంది. దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అయితే అందులో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లాల్లో రాయలసీమకు చెందినవి కూడా ఉన్నాయి.

ఇది ఒకనాటితో వచ్చిన వెనుకబాటు కాదు. ఎప్పుడో 1926లోనే రాయలసీమలో విద్యారంగం వెనుకబాటుకు బీజం పడిందని ఇక్కడి పరిశీలకులు చెబుతారు. అనంతపురంలో ఏర్పాటు చేయాల్సిన ఆంధ్రా యూనివర్సిటీని విశాఖకు తరలించడం, తర్వాత ఎప్పుడో 30 ఏళ్లకు తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పెట్టేంతవరకు కూడా ఈ ప్రాంతం మద్రాసు యూనివర్సిటీ పరిధిలోనే ఉండటం ఒక కారణంగా భావించవచ్చు.

ఈ ప్రాంత విద్యారంగ అభివృద్ధి కోసం ఇక్కడి మేధావులు చేయని ప్రయత్నం లేదు. శ్రీభాగ్‌ ఒడంబడికలో మొదటి అంశమే విద్యావకాశాలకు సంబంధించింది కావడం గమనారం. చివరికి చదువుకునే హక్కు కోసం ఇక్కడి వారు పోరాడి భంగపడాల్సిన పరిస్థితి వచ్చింది.

కాలక్రమంలో అనేక యూనివర్సిటీలు ఏర్పడినా వాటికి సరైన ఆలనాపాలనా లేదని చెప్పవచ్చు. చాలా విద్యాసంస్థల్లో పూర్తి వసతులు లేవు. నిధుల లేమి వెంటాడుతోంది. సరిపడా అధ్యాపకులు లేరు. అధ్యాపకులు ఉన్న చోట విద్యార్థులు ఉండటం లేదు. దానికితోడు ఇబ్బడిముబ్బడిగా ప్రయివేటు విద్యాసంస్థలు పుట్టుకొచ్చేస్తున్నాయి.

మధురాంతకం నరేంద్ర రాసిన 'రేపటి చరిత్ర' కథలో ఇలాంటి అంశాలు అనేకం చర్చకు వస్తాయి. చరిత్ర పాఠ్యాంశాల మీద విద్యార్థులకు ఆసక్తి లేకపోవడం, ఈ యువత అభిరుచికి తగ్గట్టు ప్రభుత్వ విద్యాసంస్థలు కొత్త కోర్సులు పెట్టకపోవడం, పెట్టినా వాటిని పేదవాళ్లకు అందకుండా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల కింద మార్చేయడం, పర్యవేక్షణ లేక కొంతమంది ప్రభుత్వ అధ్యాపకులే బయట ప్రయివేటు శక్తులకు దన్నుగా నిలవడం వంటి అనేక అంశాలు ఇందులో ప్రస్తావనకు వస్తాయి.

విద్యారంగంలో ప్రయివేటీకరణ డొల్లతనమంతా కరోనా సమయంలో బయటపడిపోయింది. పెట్టుబడిదారి వ్యవస్థలో యజమానులకు లాభాలు వస్తే కానీ పనిచేసేవారికి జీతం ఉండదని ఇంత కంటే బాగా తెలిసిన సందర్భం మరొకటి ఉండదేమో. ముఖ్యంగా ప్రయివేటు విద్యాసంస్థల్లో టీచర్లు పడుతున్న కష్టమంతా శ్రీనివాసమూర్తి రాసిన 'హాయి హాయి ఆపదలు గాయి' అనే కథలో కనిపిస్తుంది. ప్రయివేటు రంగంలో మానవీయతకు బదులు లాభాలే మాట్లాడుతాయని రచయిత చెప్పిన తీరు అబ్బురమనిస్తుంది.

విద్య కార్పొరేటీకరణ మొదలయ్యాక ర్యాంకుల పందెంలో ముందుండటం కోసం ప్రయివేటు పాఠశాలలు అటు విద్యార్థులు ఇటు ఉద్యోగసిబ్బంది మీద పెట్టే ఒత్తిడిని బాగా చూపించిన మరో కథ కళ్యాణ దుర్గం స్వర్ణలత రాసిన 'బోగన్‌ విలియా'. చివరికి విద్యార్థిని మామయ్య చనిపోయినా... విషయాన్ని ఆమెకు చెప్పకుండా పరీక్షలు రాయించే వైనం కదిలిస్తుంది. క్షణం తీరిక లేని చదువుతో పిల్లలు చివరకు తినడం, తాగడం, నిద్రపోవడం, స్నానం చేయడం వంటి కనీస అవసరాల దగ్గర కూడా సమయాన్ని ఆదా చేయాలని తాపత్రయపడే దైన్యస్థితి డా.కె.సుభాషిణి రాసిన 'పాఠం తప్పి పోయింది'లో కనిపిస్తుంది.

ఈ పరుగుల ప్రపంచంలో గెలవడం తప్ప విలువలు నేర్పని వ్యవస్థని జి.ఉమామహేశ్వర్‌ రాసిన 'క్విజ్‌ మాస్టర్‌' కథ నిరసిస్తుంది. తాము గెలవడం కోసం అతి తెలివితో ఎదుటివారి గెలుపు అవకాశాలను దెబ్బతీసిన కుట్ర... కథలో గొప్ప సమయస్ఫూర్తి కింద కీర్తినందుకుంటుంది. అసలు ఈ తరానికి మనం నేర్పుతున్నవి తెలివితేటలేనా... అనే అనుమానం కలుగుతుంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేసే పరిస్థితులు వచ్చాక కాసేపైనా ప్రేమతో మాట్లాడే మనుషులు దొరక్క పిల్లలు ఎలాంటి ఒత్తిడికి గురవుతారో రాప్తాడు గోపాలకృష్ణ కథ 'లిల్లీ పువ్వూ - గొంగళి పురుగు' సమర్థవంతంగా చెబుతుంది. హాష్టల్‌ చదువులు పిల్లలను ప్రేమ రాహిత్యానికి గురి చేస్తాయని స్వరూప్‌ సిన్హా రాసిన 'రావయ్యా చందమామా' కథ చెబుతుంది.

టీవీ యుగంలో పిల్లలు మౌఖిక కథలకు దూరం కావడం, వారిలో మానసిక ఉత్సాహం, మేధో వికాసం కలిగించే వాతావరణం పాఠశాలల్లో సైతం లేకపోవడంపై డా.ఎం.హరికిషన్‌ రాసిన 'ఒక్క కథ' ఆలోచింపజేస్తుంది. పల్లె, పట్నంలో బడిపిల్లల మానసిక స్థితి వేర్వేరుగా ఎలా వుంటుందో ఇనయతుల్లా కథ 'ఒక నింగి... ఒక నేలా ఆకట్టుకునేలా వివరిస్తుంది. పల్లెటూళ్లలో మాతృభాషలో విద్యాబోధన లేకపోవడం వల్ల పిల్లలు ఎదుర్కొనే ఒత్తిడి, దాని పర్యవసనాలన్నీ చిలుకూరి దీవెన రాసిన 'రెండు రూపాయలు' కథలో కనిపిస్తాయి. పిల్లల అభిప్రాయాలను పెద్దలు గౌరవించకపోతే వారిలో మానసిక ఒత్తిడి పెరిగి ఆత్మహత్యల వైపు ఆలోచించేలా చేస్తుందని లక్ష్మీ రాఘవ రాసిన 'పిల్లల మనసూ కథ చెబుతుంది.

ఈ కార్పొరేట్‌ యుగంలో విద్యావ్యవస్థలో ఎన్ని రకాల జాఢ్యాలు ఉన్నాయో అన్నింటినీ రాయలసీమ ఉపాధ్యాయ కథలు పట్టుకోగలిగాయి.

ప్రయివేటు వ్యవస్థలో పేదలు మరింత పేదలు అవుతారు. చదువు ఉన్నవాళ్లకు తప్ప లేనివాళ్లకు దూరమవుతుంది. బడికెళ్లని పిల్లల సంఖ్య, మధ్యలో బడి మానేసే పిల్లల సంఖ్య పెరుగుతుంది. బడి బయట పిల్లలను బడిదాక లాక్కురాలేని ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరుతో అనేక పాఠశాలలను మూసివేస్తుంది. ఇప్పటికే రాయలసీమలో అనేక పాఠశాలలు మూత బడ్డాయి. కారణాలు ఏవైనా ఉర్దూ పాఠశాలలు అనేకం ఉనికిని కోల్పోతున్నాయి.

ఈ ప్రాంతంలో కరువు పిలిస్తే పలుకుతుంది. చాలామంది రైతులకు ఇప్పటికీ వర్షాధార పంటలే దిక్కు. వేల అడుగులు బోర్లు వేసినా నీళ్లు పడవు. కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి ఇతర దేశాలకు (గల్ఫ్‌) ప్రయాణాలు. మొత్తం జనాభాలో 13 శాతం మంది మైనార్టీలు ఉన్నారు. వీరిలో చాలామంది చిన్నా చితక పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. పేదజనమంతా తమ పిల్లల్ని ఇటు ప్రయివేటు పాఠశాలలకు పంపలేక, అటు మూత పడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగించలేక నానా యాతన పడుతున్నారు.

ఈ గందరగోళ వాతావరణం అక్కంపేట ఇబ్రహీం రాసిన 'అ అంటే చందమామ' కథలో కనిపిస్తుంది. దగ్గర్లో ఉన్న ఊరిబడి మూతపడి పోరంబోకులకు ఆలవాలంగా మారితే, తన తాహతు కాకపోయినా తప్పనిసరి స్థితిలో పిల్లాడిని ప్రయివేటు స్కూల్లో చేర్పించి నాలుగు రోజులకే ఫీజు కట్టలేక చేతులెత్తేసే తండ్రి కథ ఇది. ఈ ప్రాంతంలో ఒక్కో పేద డ్రాపవుట్‌ పిల్లాడిది ఒక్కో దీనగాథ.

వీరందరినీ నయానో బయానో బడిదాక తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో కష్టపడే టీచర్ల కథలూ ఇందులో ఉన్నాయి. ఎల్‌ ఆర్‌ వెంకటరమణ రాసిన 'చీమలూ నన్ను క్షమించండి', డా.జూటూరు షరీఫ్‌ రాసిన 'మళ్లీ బడికి', మీరాబాయి రాసిన 'స్ఫూర్తి' కథలు ఇలాంటివే. టీచర్లే అన్ని పనులూ వదిలేసి డ్రాపవుట్‌ పిల్లాడి ఇంట్లోని కష్టాలన్నింటినీ నెత్తినేసుకుని తీర్చి అతణ్ని స్కూలు దాక తీసుకురావడం అన్నివేళలా సాధ్యమయ్యే పని కాదు. అయితే పిల్లల సమస్యలపట్ల ఉపాధ్యాయులు స్పందించే తీరు, చూపించే మమకారం ఈ కథల్లో ఆదర్శనీయం.

ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేయించుకోవాల్సి ఉన్నా పిల్లల పరీక్షల దృష్ట్యా వాయిదా వేసుకునే టీచర్‌ ని ఆర్‌.సి కృష్ణ స్వామి రాజు 'గురుదేవో భవ' కథలో చూడొచ్చు. టీచర్‌ ఉద్యోగం చేస్తూ చనిపోయిన తమ్ముడు, పిల్లలకోసం చేసిన త్యాగాన్ని జిల్లేళ్ల బాలాజీ రాసిన 'తమ్ముని ఉత్తరం' కథలో చదవొచ్చు. టీచర్‌ తరపున ఇంటి ముందుకెళ్లి పిల్లాడిని స్కూలుకు పంపమని అడిగి నానా తిట్లు తినే శిష్యుడిని సడ్లపల్లె చిదంబర రెడ్డి కథ 'తిక్క సత్తెక్క'లో చూడొచ్చు. ప్రేమించానని వెంటబడ్డ స్టూడెంట్‌ కి సున్నితంగా బుద్ధి చెప్పే ప్రొఫెసర్ని టి. సురేశ్‌ బాబు రాసిన 'వ్యక్తిత్వం' కథలో చూడొచ్చు.

తురకోడికి తెలుగు రాదన్నాడని కష్టపడి చదివి తెలుగు టీచర్‌ అయిన శిష్యుడు చివరికి బడాయి చెప్పుకోవడానికి వెళ్తే నవ్వుకుని ఆదరించి అసలు విషయం చెప్పే ఆదర్శ ఉపాధ్యాయుడిని మహమ్మద్‌ రఫీ రాసిన 'అచ్చులూ హల్లులు' కథలో చూడొచ్చు. పాఠశాలల్లో మైనార్టీ పిల్లల పట్ల ఉన్న భాషాపరమైన వివక్షను కొంతమేర ఈ కథ చర్చించేందుకు ప్రయత్నించింది. కానీ అంతిమంగా ఇది ఒక ఆదర్శ ఉపాధ్యాయుడి కథే అయింది.

ఇలాంటిదే మరో భిన్నమైన కథగా మారుతీ పౌరోహితం రాసిన 'తాతారావు అలియాస్‌ రజనీకాంత్‌'ని చెప్పుకోవచ్చు. నాన్‌ లోకల్‌ కేటగిరి కింద రాయలసీమకు వచ్చి పాఠాలు చెప్పి, ఎలాంటి ప్రాంతీయ భేదం లేకుండా ఇక్కడి కరువు పరిస్థితులపై సహానుభూతిని ప్రకటించే ఒక కోనసీమ టీచర్‌ కథ ఇది. ఒకరకంగా రాయలసీమ అస్తిత్వ గొంతును ఆ ప్రాంత రచనల్లో ఏ మేరకు ఏయే పద్ధతుల్లో వినిపించాలో కొంత చర్చకు దారి తీసేందుకు ఆస్కారం ఉన్నదిగా నేను భావిస్తాను. ఏదేమైనా ఈ సంకలనంలో ఈ కథ కూడా అంతిమంగా ఒక ఆదర్శ ఉపాధ్యాయుడి గురించే చెబుతుంది.

జీవితాంతం బడిని, బడిలో పిల్లలను ప్రేమించి చివరిరోజుల్లో పుట్టెడు ఆర్థిక కష్టాలతో సహాయం కోసం తిరిగి అదే బడికి వచ్చి అర్థించే బతకలేని బడిపంతులుని తొలితరం కథకుడు మధురాంతకం రాజారాం రాసిన 'తాను వెలిగించిన దీపాలు' కథలో చూడొచ్చు. టీచర్లు కాకపోయినా అంతకన్నా ఎక్కువగా చదువు కోసం తపించి సొంత ఆస్తులు అమ్మి మరీ ఊళ్లో బడి కట్టిన గొప్ప ఆదర్శజంటను మరో తొలితరం కథకుడు కే. సభా రాసిన 'పిచ్చి దంపతులు'లో చూడొచ్చు.

అయితే చదువుకునే పిల్లలందరి సమస్యలూ ఒకటి కావు కదా. ముఖ్యంగా ఆడపిల్లల సమస్యలు భిన్నంగా ఉంటాయి. పాఠశాలల్లో సెపరేటుగా మరుగుదొడ్లు లేకపోవడం, నెలసరి సమస్యల పట్ల అవగాహన లేమి, సమాజంలో వివక్ష, ఆంక్షలు వంటివన్నీ ఆడపిల్లల్లో డ్రాపవుట్స్‌ పెరగడానికి కారణమని రిపోర్టులు చెబుతున్నాయి. ఆ కోణంలో కూడా ఆడపిల్లల పట్ల సహానుభూతితో ప్రవర్తించిన ఉపాధ్యాయ పాత్రలు ఇందులో ఉండటం ఆహ్వానించదగ్గ విషయం.

నెలసరి సమస్య మీద అవగాహన లేని విద్యార్థినిని కూర్చోబెట్టి ధైర్యం చెప్పే ఉపాధ్యాయురాలి పాత్రని డా. ప్రగతి 'థాంక్యూ టీచర్‌' కథలో సృష్టిస్తే, సున్తీ పేరుతో గిరిజన ఆడపిల్లను వేధించే సంప్రదాయం నుంచి తప్పించిన తెలివైన ఉపాధ్యాయురాలి పాత్రను యం.ఆర్‌. అరుణకుమారి 'రాలిన పువ్వులు' అనే కథలో సృష్టించారు. సమస్యలెన్నొచ్చినా ఆడపిల్లలు చదువు మానేయకూడదని ధైర్యం చెప్పి విద్యార్థినికి అండగా నిలబడ్డ మరో ఆదర్శ ఉపాధ్యాయ పాత్రని కొలకలూరి మధుజ్యోతి తన 'పట్టుదల' కథలో చూపించారు.

అలా అని ఇందులో అన్నీ ఆదర్శ ఉపాధ్యాయ పాత్రలే ఉన్నాయని అనుకోవడానికి లేదు. ఇప్పటి చాలామంది ఉపాధ్యాయుల్లో కనిపించే స్వార్థం, మోసం, నిర్లక్ష్యం వంటి లక్షణాలను కూడా ఈ కథలు చూపించాయి. పిల్లల భవిష్యత్తును నిర్దేశించే పరీక్షపేపర్లను దిద్దడంలో మనం భరించలేనంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించే ఉపాధ్యాయులను శాంతినారాయణ రాసిన 'బలి పశువులు', ద్వారక రాసిన 'తొందర పడి... తొందరపడి' కథలు పట్టిస్తాయి. తప్పుడు మార్గాల వ్యవస్థలో తన పిల్లాడు నిజాయితీగా ఉండి ఎక్కడ వెనుకబడిపోతాడో అని టీచరే స్వయంగా తన కొడుక్కి కాపీలు అందించడానికి ప్రయత్నించి భంగపడ్డ అంశం కొమ్మిశెట్టి మోహన్‌ రాసిన 'పరీక్ష' కథలో ఆలోచింపజేస్తుంది. డౌట్లు అడిగిన పిల్లాడిని బండ బూతులు తిట్టి తీవ్రంగా భయపెట్టే ఉపాధ్యాయుడి ధోరణి ఆర్‌. శశికళ రాసిన 'నేనూ మా లెక్కల మాష్టారు' కథలో మనకూ కోపం తెప్పిస్తుంది.

బాల్యంలో కూడా రాయలసీమ స్థానీయతను హృద్యంగా చెప్పి మెప్పించిన కథలు కొన్ని ఈ సంకలనంలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ ప్రాంతంలో మూగ జీవాల పట్ల రైతులకు, ప్రజలకు మమకారం ఎక్కువ. పశువులు, మనుషులు కలిసి బతికే సంస్కారం ఉన్న ఈ ప్రాంతంలో పిల్లలు పరిసరాల నుంచి కూడా చాలా నేర్చుకుంటారని చాలా బలంగా చెబుతాడు 'కేరింత' కథలో రచయిత తవ్వా ఓబుల్‌ రెడ్డి. దేశ భవిష్యత్తు తరగతి గదుల మధ్య నిర్మితమవుతుందని కొఠారి కమిషన్‌ అంటే ఓబుల్‌ రెడ్డి మాత్రం ఒక్క తరగతి గదులే కాదు ప్రకృతి, పరిసరాలు, చెట్లు, చేమలు, మూగ జీవాలు కూడా మనిషి జీవన శైలిని ప్రభావితం చేస్తాయని తన కథ ద్వారా నిరూపిస్తాడు.

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన 'ఎంతెంత దూరం' కథ కూడా ఇలాంటిదే. బడికిరాని పిల్లలను కాళ్లూ చేతులు కట్టేసి ఎత్తుకొస్తే ఉపయోగం ఉండదు. వారిని బడివైపు ఆకర్షించాలి. అచ్చం ఆ ఊళ్లోని మేకల కాపరిలాగ పాట పాడాలి.. పాఠశాల అంటే ఆటశాల.. పాటశాల. ఇదీ ఈ కథలోని మర్మం. ఉపాధ్యాయుడు తన పని తాను బాగా చేసి ఊళ్లో, పిల్లల్లో పలుకుబడి పెంచుకుంటే ఏ రాజకీయనాయకుడికి భయపడాల్సిన పని లేదనే సత్యం కూడా కథలో కనిపిస్తుంది.

నాలుగు రోజులకొకసారి బడికి రాకుండా ఎగ్గొట్టి కష్టపడే తత్వం లేని ఉపాధ్యాయులు ఊళ్లో రాజకీయాలకు సులభంగానే లొంగిపోతారు. పై అధికారులు చెప్పిందల్లా చేసి పిల్లలకు నాలుగు ముక్కలు కూడా నేర్పకుండానే ఆదర్శఉపాధ్యాయులు అనిపించుకుంటారు. వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని డా. కర్నాటి చంద్రమౌళిని రాసిన 'చేదు గురుతులు' కథ పట్టిస్తుంది. మధ్యాహ్న భోజనంలో డబ్బులు మిగిలించుకోవడం కోసం నిత్యం పేదపిల్లల పొట్ట కొట్టే ప్రిన్సిపాల్‌ ని అతికష్టమ్మీద సస్పెండ్‌ చేయిస్తే వారం తిరక్కుండానే ఆవిడ మళ్లీ ఆ సీటులో దర్శనమిస్తుంది. కలవకొలను సదానంద రాసిన 'ఊరికొక బడి' కథలో మొన్నకు మొన్న కట్టిన స్కూలు బిల్డింగు వానలకు కూలిపోతే కాంట్రాక్టు కూతురు పెళ్లి ఆ నెల్లోనే ఘనంగా జరుగుతుంది. డా. వి.ఆర్‌. రాసాని రాసిన 'చింత చెట్టు' కథలో బడిని పశువుల షెడ్డులాగ మార్చి పిల్లల్ని చెట్టుకిందకు తోలేస్తాడు ప్రెసిడెంటు.

రాయలసీమలోని కొన్ని పల్లెల్లో ఈనాటికీ కొనసాగుతున్న భూస్వామ్య భావజాలాన్ని, కులవివక్షని ఈ కథలు గొప్పగానే పట్టుకున్నాయి. వేంపల్లి గంగాధర్‌, సింగమనేని నారాయణ, బండి నారాయణ స్వామి, కేతు విశ్వనాథ రెడ్డి రాసిన కథలు కులవివక్షకు సంబంధించినవి. ఉళ్లో బడి చుట్టూ కమ్ముకునే అనేక రాజకీయాలను వివరించి చెబుతూనే మరోవైపు కులవివక్షని, అగ్రవర్ణాల ద్వంద్వ వైఖరిని గంగాధర్‌ కథ 'పొద్దు పుట్టింది' పట్టుకుంది.

కేతు విశ్వనాథ రెడ్డి రాసిన 'పద్ధతి' కథలో ఉన్న కాలేజి రాజకీయాలు ఈనాటి రాష్ట్ర రాజకీయాలకు ఏమాత్రం తీసిపోవు. ఎన్నికలప్పుడు అధికారం కోసం గుడ్డలు చిరిగేలా కొట్టుకునే రెండు ప్రధాన సామాజిక వర్గాలు ఆ తర్వాత ఓ కాంట్రాక్టు విషయంలో మాత్రం ఏకమై అది మూడోవాడైన కింది కులపోడికి రాకుండా చేస్తారు. ఇంత అన్యాయమైన సామాజిక పరిస్థితిని ఎప్పుడో 1977లోనే ఈయన కథగా రాయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన ఒక ఎస్సీ కుర్రాడు విధుల్లో చేరడానికి వెళ్తుంటే పల్లెలో ఎదురయ్యే ఘోరమైన అనుభవాలు సింగమనేని 'మకర ముఖం' కథలో మనల్ని కలవరపెడతాయి. బండి నారాయణస్వామి రాసిన 'ఒక హెచ్‌ సరస్వతి' కథ ఒక సామాజిక పాఠంలా సాగి ఆకట్టుకుంటుంది. కుల వివక్ష ఒక రాయలసీమలోనే కాదు ఈ దేశంలోనే ఎలా పనిచేస్తుందో, దేన్ని ఏ మేరకు అర్థం చేసుకోవాలో చక్కగా సంయమనంతో వివరించిన కథ ఇది.

మొత్తమ్మీద మనం ముందు చెప్పుకున్నట్టుగా రాయలసీమ సామాజిక, ఆర్థిక, రాజకీయ, వర్తమాన, చారిత్రక పరిస్థితులను ఈ కథలు కళ్లకు కడతాయి. వీటిల్లో ప్రస్తావించిన విద్యా సమస్యల నుంచి రాయలసీమ విముక్తి కావాలి. అప్పుడే ఆ ప్రాంతానికి మంచి భవిష్యత్తు ఉంటుంది.

ఒకవైపు ఉపాధ్యాయులుగా ఉంటూ మరోవైపు సృజనకారులుగా ఇందులోని రచయితలు చేసిన కృషి గొప్పది. వారి ప్రతి మాట విలువైంది, లోతైంది, ఆచరణయోగ్యమైంది. ఏ సమాజమైనా తనను తాను చైతన్యం చేసుకోవడం ద్వారా అనేక ప్రశ్నలకు సమాధానాలు కనుగొంటుంది. తమలోని లోపాలను సవరించుకుని హక్కులను తెలుసుకుని వాటి కోసం తపించే ప్రయత్నం ఇక్కడి యువత చేయాలి. వారిని ఆ దిశగా ఈ కథలు తప్పక కార్యోన్ముఖులను చేస్తాయి.

స్వయంగా ఉపాధ్యాయుడు, కథకుడైన డా.ఎం.హరికిషన్‌ ఈ పుస్తకానికి సంకలన కర్త కాబట్టే దీనికి ఇంతటి సమగ్రత అబ్బిందని నమ్ముతూ ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

మూలాలు

- THE FEDARAL లో - కెపి ఆశోక్ కుమార్ గారి పుస్తక పరిచయం

- పుస్తకం దొరికే చోటు