రాయలసీమ రచయిత్రుల కథలు
రాయలసీమ రచయిత్రుల కథలు (కథా సంకలనం) రాయలసీమ రచయిత్రులను పాఠకులకు పరిచయం చేయడం కోసం డా. ఎం. హరికిషన్ గారి సంపాదకత్వలో ఈ కథా సంకలనం రూపొందించబడింది. 2020 జనవరిలో దీప్తి ప్రచురణలు విజయవాడ వారు ఈ సంకలనాన్ని ప్రచురించారు. ఇందులో రచయిత్రులు రాసిన 42 కథలతో పాటు వారి సంక్షిప్త పరిచయాలు కూడా ఉన్నాయి. అలాగే అనుబంధంలో తొలితరానికి చెందిన నలుగురు రచయిత్రుల కథలు ప్రత్యేకంగా ఇచ్చారు.
సంపాదకుడు: డా.ఎం.హరికిషన్ - కర్నూలు
[మార్చు]ఈ సంకలనంలోని కథలు - కథా రచయితలు
[మార్చు]కథల వరుస - రచయిత్రులు
1. చీకట్లో చిరుదీపాలు - కానాల నాగలక్ష్మమ్మ
2. మా బావ - రేవనూరి శమంత
3. జవాబు లేని ప్రశ్న - కోమలాదేవి
4. రెండోవాడు - తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం
5. ఎవరి విలువలు నాన్నా - డా.జె. భాగ్యలక్ష్మి
6. బ్రిడ్జి క్రింద - ఆర్. వసుంధరాదేవి
7.సమ్మె - చెరుకూరి కమలామణి
8. నీ గుండె కార్చిన కన్నీళ్లు - చక్కిలం విజయలక్ష్మి
9. ది మెర్సీ కిల్లింగ్ - కీ.శే. తెనాలి సుశీలా దేవి
10. కాశీయాత్ర - ఎ. జయలక్ష్మి రాజు
11. రెక్కలున్న పిల్ల - ఎస్. జయ
12 స్టేషనుకు రండి - డా.జోలెపాలెం మంగమ్మ
13. వెన్నెల్లో చీకటి మరకలు - పి. శైలజ
14. ఆ గమ్యం ఎక్కడికో - పి.షెహనాజ్ బేగం
15. గాజుకళ్ళు - జి. నిర్మలారాణి
16. తారాబాయి తాజ్ మహల్ - ఆర్. శశికళ
17. జ్ఞాపిక - సి. ఉమాదేవి
18. మన్నులో మన్నునై - ఎం.ఆర్. అరుణకుమారి
19. కుయెట్ రైలు - ఎం. విష్ణుప్రియ
20. సిలుకు జబ్బా - డేగల అనితా సూరి
21. లాటిట్యూడ్ - పసుపులేటి గీత
22. అపురూపం - డా.లక్ష్మీ రాఘవ
23. ఫోను పిలిచింది - కీ.శే . కె. వసంత ప్రకాష్
24. నా - శైలజామిత్ర
25. బాడీ సర్వీసింగ్ - గండికోట వారిజు
26. గడేలమ్మ - నాగమ్మ పూలే
27. తపన - కీ.శే. రాణీ పులోమజా దేవి
28. మచ్చ - కొమ్మద్ది ఆరుణా రమణ
29. రెండు సందర్భాలు - డా.కె.సుభాషిణి
30. వెలుగు పోరాటం - కొలకలూరి మధుజ్యోతి
31. రేపటి కిరణం - చిలుకూరి దీవెన
32. ఎంగిలాకు - మహాసముద్రం కోదండరెడ్డి దేవకి
33. నీళ్లు - మమత కొడిదెల
34. మబ్బులు తొలగిన ఆకాశం - డా.సి.ఎం. అనూరాధ
35. ఒక పక్షి కథ - వరలక్ష్మి
36.జాతస్య మరణం ధ్రువం - పేరం ఇందిరాదేవి
37. తీరని దుఃఖం - డా.కె. చంద్రమౌళిని
38. మరణ వాంగ్మూలం - డా.ఎం. ప్రగతి
39. అనురాగ సంగమం - గంజాం భ్రమరాంబ
40. నల్ల డబ్బు - ఎండపల్లి భారతి
41. చిన్నబోయిన ఆకాశం - కళ్యాణదుర్గం స్వర్ణలత
42. తనదాకా వస్తే - భాస్కర బాలభారతి
అనుబంధం
[మార్చు]భారత కథానిది మాసపత్రికలో దొరికిన రాయలసీమ రచయిత్రుల తొలికథలు - 4
1. సుందరి - మామిడి రుక్మిణమ్మ
2. సీతాబాయి - పూండి చెల్లమ్మ
3. బారాకట్ట - శ్రీమతి అలవేళమ్మ
4. అత్తగారురేదియో తెలిసికొంటిరా - డి. పాపమ్మ - 389
ముందుమాట - రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
[మార్చు]ఈ సంకలనానికి ' మేం వెనుకబడిలేం ' అనే పేరుతో ముందుమాట రచించిన రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు పుస్తకం గురించి ఏమి చెప్పారో చూద్దాం.
1953 నాటి ఆంధ్రరాష్ట్రం, 1956 నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 2014 నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం - ఈ మూడు సందర్భాలలో, భౌగోళిక సరిహద్దులు మారినప్పుడల్లా రాయలసీమకు జరిగింది నష్టమేనని, రాయలసీమ ప్రజలకు మిగిలింది కష్టాలు కన్నీళ్ళేనని చరిత్ర రుజువు చేస్తున్నది. రాయలసీమ చరిత్ర అంటే రాయలసీమ ప్రజల జీవితానుభవాలసారమే. గత అయిదున్నర దశాబ్దాలలో తెలుగునేలను పాలించిన వాళ్ళలో రాయలసీమ వాళ్ళే ఎక్కువ. కనీసం 15సార్లు రాయలసీమ నాయకులే, రాయలసీమ గెలిపించిన ఇతర ప్రాంత నాయకులే ముఖ్యమంత్రులయ్యారు. అయినా రాయలసీమ ప్రజల కష్టాలు తగ్గిపోవలసినంతగా తగ్గిపోలేదు. నష్టం అరికట్టబడవలసినంతగా అరి కట్టబడలేదు. భౌగోళికంగా మార్పు వచ్చినప్పుడంతా రాయలసీమ పరిస్థితి పెనం మీదినుంచి పొయ్యిలో పడినటౌతున్నది. వడ్డించేవాడు మనవాడైతే ఏ పంక్తిలో కూర్చున్నా ఒకటే అనే సామెత రాయలసీమ విషయంలో అబద్దమని రుజువౌతున్నది. దీనికి వివరణ, గణాంకాలు అక్కరలేదు. రాయలసీమ ప్రజల జీవనవిషాదాలే నిదర్శనాలు. ఒక ప్రాంతం ఇతర ప్రాంతాలతో కలిసి సహజీవనం చేస్తున్నప్పుడు, తాను సహజంగా వుండవలసిన అభివృద్ధిని పొందలేనప్పుడు, ఆ సహజీవనం ఎందుకు? అనే ప్రశ్న కలగడం సహజం. అన్ని ప్రాంతాలూ సమానాభివృద్ధిని పొందకపోతే, ఆ కలయికకు అర్థముందా? అని సందేహం కలుగుతుంది. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి సాధ్యం కానపుడు, ఏ ప్రాంతానికాప్రాంతం తనను తాను అభివృద్ధి చేసుకుంటే తప్పేమిటని కూడా అనిపిస్తుంది. రాయలసీమ నాలుగు జిల్లాల నుండి ముఖ్యమంత్రులు రూపొందినా, ఈ ప్రాంతం ఇంకా ఎందుకు ఇలా ఉంది అని కూడా అనిపిస్తుంది. ఇది ఇప్పటి రాయలసీమ అస్తిత్వ ప్రశ్న.
ఈ ప్రశ్నను సమాజంలోకి తీసుకుపోవడంలో, ఈ ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించడంలో రాయలసీమ రచయితలు మొదటినుంచీ ఏదో ఒక స్థాయిలో నిమగ్నమౌతూనే ఉన్నారు. అసంఖ్యాకంగా రాయలసీమ రచయితలు తమను తాము నిర్వచించుకుంటున్నారు. రాష్ట్ర అవతరణ నాటి నుంచే చూసుకున్నా విద్వాన్ విశ్వం, పుట్టపర్తి నారాయణాచార్యుల నుండి నేటి యువరచయితలదాకా కవులు, కథకులు, నవలా రచయితలు కొంతవరకు నాటకరచయితలు రాయలసీమ అస్తిత్వ వేదనను చాటుతూనే ఉన్నారు.
రాయలసీమ సాహిత్య విమర్శకులు తమ ప్రాంత సాహిత్యంలో ప్రతిబింబించే సీమ అస్తిత్వ వేదనను వివేచిస్తూనే ఉన్నారు. రాళ్ళపల్లి, జానమద్ది, రారా వంటి వాళ్ళ కాలం నుండి నేటి యువవిమర్శకుల దాకా ఈ పనిలో నిమగ్నమౌతున్నారు. ఈ కృషిలో మహిళల పాత్ర తక్కువది కాదు. సృజనాత్మక సాహిత్య సృష్టిలోనూ, దాని వివేచనలోనూ రాయలసీమ మహిళలు తమ వంతు కర్తవ్యం నిర్వహిస్తున్నారు.
మిత్రుడు డా.పం. హరికిషన్ ఇప్పుడు సంకలనం చేసిన “రాయలసీమ రచయిత్రుల కథలు" ఇందుకు ఒక తాజా ఉదాహరణ. రాయలసీమ పరిధిగా, లేదా ఒక జిల్లా పరిధిగా ఇప్పటికే అనేక కవిత్వ సంకలనాలు, కథా సంకలనాలు వచ్చాయి. విమర్శగ్రంథాలు కూడా వచ్చాయి. విమర్శ వ్యాసాలు సరేసరి. సీమ కథలు, సీమ కవిత, వాలిన మబ్బులు, కర్నూలు కథ, కడప కథ, చిత్తూరు కథ, అనంత కవిత, కర్నూలు కవిత, ఇనపగజ్జల తల్లి వంటి అనేక సంకలనాలు వచ్చాయి. కల్లూరు అహోబలరావు, అవ్వాది నారాయణ మొదలు కిన్నెర శ్రీదేవి, అప్పిరెడ్డి హరినాథరెడ్డి, తవ్వా వెంకటయ్య, పొదిలి నాగరాజు మొదలైన వాళ్ళ దాకా సాహిత్య విమర్శకులు, పరిశోధకులు రాయలసీమ సాహిత్య చరిత్రను వివేచిస్తూనే ఉన్నారు.
డా.ఎం.హరికిషన్ స్వయంగా కథా రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు, బాలసాహిత్యకారుడు, పైగా అధ్యాపకుడు. ఈయన మాయమ్మ రాచ్చసి, నయాఫత్వా, నేను మాయమ్మ, కందనవోలు కథలు మొదలైన కథాసంపుటాలు ప్రచురించారు. కర్నూలు కథకు సంపాదకత్వం వహించారు. 'కేతు విశ్వనాథరెడ్డి కథలు - సామాజిక దర్శనం" అనే అంశం మీద పరిశోధించారు. కర్నూలు జిల్లా చరిత్ర, కొండారెడ్డి బురుజు, కర్నూలు జిల్లా మహనీయులు వంటి చరిత్ర గ్రంథాలు రచించారు. ఈయన ఇప్పుడు ఈ రాయలసీమ రచయిత్రుల కథలు సంకలనం చేసి ప్రచురించారు. ఈ గొప్ప పని చేసినందుకు హరికిషను మనసారా అభినందిస్తున్నాను.
ఈ సంకలనంలో నలభై ఆరుమంది రాయలసీమ మహిళలు రాసిన నలభైఆరు కథలున్నాయి. నాలుగు కథలు తవ్వా వెంకటయ్య “భారతకథానిధి" పత్రిక నుండి వెలికితీసినవి. అవి 1926-28 మధ్య కాలానివి. వీటిని హరికిషన్ అనుబంధంలో పెట్టారు. 42 కథలను ప్రధాన భాగంగా పెట్టారు. ఈ సంకలనం చూడగానే రాయలసీమ నుండి ఇంతమంది కథానికా రచయిత్రులు వచ్చారా అని అనిపిస్తుంది. ఇంతమంది కథారచయిత్రులు ఉండడం నిజం గనక సంతోషం కలుగుతుంది. "మనం వెనకబడిలేం" అని ఆత్మ సైర్యమూ కలుగుతుంది. ఈ కథారచయిత్రులలో కొందరు ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో, మరికొందరు స్వాతంత్ర్యానికి ముందు, ఇంకొందరు స్వాతంత్ర్యానంతరం పుట్టినవాళ్ళు. అలా ఇందులో మూడు తరాలవాళ్ళు ఉన్నారు. అనుబంధంలోని నాలుగు కథలు తప్ప, ప్రధానభాగంలోని 42 కథలూ, బహుశా స్వాతంత్ర్యానంతర కాలంలోనే రాయబడి ఉంటాయి. అందువల్ల ఈ కథలన్నీ స్వాతంత్ర్యానంతరం మన సమాజ పరిణామాలను ప్రతిబింబిస్తున్నాయి.
ఈ రచయిత్రులందరూ రాయలసీమ వాళ్ళే అయినా, వీళ్ళు మూడు రకాలుగా ఉన్నారు.
1.రాయలసీమలో పుట్టి రాయలసీమలోనే బతుకుతున్నవారు. 2. రాయలసీమలో పుట్టి ఉద్యోగం వల్లనో, వివాహం వల్లనో, మరో కారణం చేతనో ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నవారు. 3. ఇతర ప్రాంతాలలో పుట్టి, వివాహ, ఉద్యోగ, ఇతరేతర కారణాలవల్ల రాయలసీమలో నివసిస్తున్న వాళ్ళు. వీరి సంఖ్య రెండుకి మించి లేదనుకుంటా. వీళ్ళందరూ రాయలసీమవారే..
ఈ సంకలనంలోని కథలు అన్నీ రాయలసీమ నిర్దిష్ట జీవితానికే పరిమితమైనవి కావు, రాయలసీమ ప్రజల కడగండ్లను చిత్రించినవీ ఉన్నాయి. ఇతర రకాల, ఇతర
ప్రాంతాల జీవితాలను చిత్రించినవీ ఉన్నాయి. ఈ కథలు భారతదేశంలో అనేక ప్రాంతాలలో అనేక స్థలాలలో నడిచాయి. రచయిత్రులు తమ సామాజిక పరిశీలనా ఫలితాలను ఈ కథలుగా మలిచారు. అందువల్ల ఈ రాయలసీమ కథా రచయిత్రుల కథలలో రాయలసీమతో పాటు, విస్తృత భారతీయ సమాజం కూడా ప్రతిఫలిస్తున్నది.
మొత్తం తెలుగు కథయిత్రుల సంఖ్యలో రాయలసీమ కథయిత్రుల సంఖ్య పరిమితమే అయినా, వస్తువైవిధ్య నిర్వహణలో వీళ్ళు వెనకబడి లేరు. వర్తమాన సమాజవాస్తవికతను అనేక ముఖాలుగల సమాజ ప్రతిమను ప్రదర్శించారు. కొన్ని మధ్యతరగతి కథలు, ఇంకొన్ని క్రింది తరగతి కథలు. రచయిత్రులలోను కొందరిది మధ్యతరగతి దృష్టి, ఇంకొందరిది శ్రామికవర్గ దృష్టి. ఈ కథలలో వైవిధ్యభరితమైన స్త్రీపురుష సంబంధాలు ఎక్కువగా ఆవిష్కృతమయ్యాయి. కాశీయాత్ర, మా బావ, ది మెర్సీ కిల్లింగ్, రెక్కలున్న పిల్ల వంటి కథలు ఇందుకుదాహరణలు.
రాయలసీమ ప్రాదేశిక వాస్తవాలను, కరవు కక్షలు, వాటి దుష్పరిణామాలు, రాయలసీమ నీటి పోరాటాలు ఈ సంకలనంలో ప్రధాన స్థానమాక్రమించాయి. గాజు కళ్ళు, తారాబాయి తాజ్ మహల్, కుయెట్ రైలు, రెండు సందర్భాలు, బ్రిడ్జి కింద, మచ్చ, నీళ్ళు మొదలైన కథలు ఈ దృష్టితో వచ్చినవే. వర్తమాన విద్యావ్యవస్థ, దాని ఫలితాలను చిత్రించే చీకట్లో చిరుదీపాలు, రేపటి కిరణం వంటి కథలు ఇందులో ఉన్నాయి. సామాజిక వ్యవస్థల స్వరూపస్వభావాలను కథయిత్రులు ఎంత స్పష్టమైన వైఖరితో అర్థం చేసుకోగలరో, దానిని ప్రతీకాత్మకంగా వ్యక్తం చేయగలరో ఈ సంకలనంలోని 'ఒక పక్షికథ' వంటి కథలు రుజువు చేస్తున్నాయి. పేదరికం మీద ఇప్పటిదాకా ఎన్ని కథలు వచ్చి ఉంటాయో లెక్కగట్టలేం. సీమకథయిత్రులు ఈ విషయంలో వెనకబడిలేరు. కష్ట జీవుల పక్షం వహించడంలో వీరు 'తీరని దుఃఖం' వంటి కథల ద్వారా రుజువు చేసుకుంటున్నారు. అలాగే ప్రపంచీకరణ ప్రభావాన్ని ఆవిష్కరించడంలో సీమకథయిత్రులు 'ఆ గమ్యం ఎక్కడికో, లాటిట్యూడ్ వంటి కథల ద్వారా ప్రయత్నించారు.
సామాజిక వాస్తవికతను వస్తువుగా తీసుకోవడమే గాకుండా దానిని వాస్తవిక రీతిలోనే కథనం చేయడానికి రాయలసీమ కథయిత్రులు ప్రయత్నించారు. ఈ కథలలో పాఠక అనుకూల దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది. పనిగట్టుకొని పాఠకులను దూరం చేసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అనేక సామాజిక శ్రేణుల, బృందాల జీవితాలను కథలుగా మలచడంలో కొందరు సాధారణ భాషను, మరికొందరు ప్రాదేశిక భాషను ఉపయోగించారు. రాయలసీమ మట్టివాసన వంటి భాషను కొందరు అద్భుతంగా తమ కథనానికి ఉపయోగించుకున్నారు. కొన్ని కథలు చాలా సీరియస్ గానూ, మరికొన్ని కథలు సున్నిత హాస్యభరితంగానూ ఉన్నాయి. కడుపు నిండిన కథలు కనిపించవు. కడుపు కాలిన కథలే చాలావరకు. రాయలసీమ కథయిత్రులలో ఒక స్పష్టమైన వైఖరి ఏర్పరచుకున్న వాళ్ళు కొందరు కాగా, దానిని ఏర్పరచుకుంటున్న క్రమంలో కొందరున్నారు. మధ్యతరగతికి చెందిన కథయిత్రులు శ్రామికవర్గం వైపు మొగ్గడం ప్రత్యేకంగా గమనించవచ్చు.
రాయలసీమ కథాకాశంలో సగం స్థానాన్ని దక్కించుకునే దిశగా కథయిత్రులు ప్రయాణిస్తున్నారు. అలా జరిగినప్పుడే సాహిత్య రంగంలో సమతుల్యత సిద్ధిస్తుంది. ఈ సంకలనం ఈ వాస్తవాన్ని చాటుతున్నది. సీమకథలు' తర్వాత, హరికిషన్ తెచ్చిన ఈ సంకలనం రాయలసీమ సాంస్కృతిక రంగంలో మిగతా ప్రాంతాలతో కలిసి నడుస్తున్న తీరుకు నిదర్శనం. 1882 నుండి రాయలసీమ నుండి వస్తున్న కథానికా సమూహంతో కథా రచయిత్రులు నిర్వహించిన పాత్రకు సాక్ష్యం ఈ సంకలనం. ఈ మంచి పనిచేసిన హరికిషను రాయలసీమ రచయితల తరపున, పాఠకుల తరపున, రాయలసీమ ఉద్యమకారుల తరపున మరోసారి అభినందనలు.
ఈ సంకలనం రాయలసీమ పరిధిగా మరిన్ని కథాసంకలనాలు రావడానికి ప్రేరణనిస్తుంది. రాయలసీమ సేద్యం కథలు, రాయలసీమ వృత్తుల కథలు, రాయలసీమ దళిత కథలు, రాయలసీమ ఉమ్యమ కథలు వంటివి రావలసి ఉంది. వాటిల్లోనూ కథయిత్రుల పాత్రను గుర్తించవలసి ఉంది.
మూలాలు
[మార్చు]- [https://aksharajalam.files.wordpress.com/2020/05/book-rayalaseema-rachayitrulu.jpg?w=671 - పుస్తకం లభించు వివరాలు]
- [https://m.eenadu.net/sundaymagazine/article/320000641 - ఈనాడు పత్రికలో వచ్చిన పుస్తక వివరాలు]