Jump to content

రాయలసీమ వ్యంగ్య కథలు

వికీపీడియా నుండి

రాయలసీమ వ్యంగ్య కథలు (కథా సంకలనం)

[మార్చు]

డా. ఎం. హరికిషన్ గారి సంపాదకత్వంలో  రూపొందించబడింది. 2023 జనవరిలో దీప్తి ప్రచురణలు విజయవాడ వారు ఈ సంకలనాన్ని ప్రచురించారు. ఇందులో రాయలసీమ రచయితలు రాసిన 22 వ్యంగ్య కథలు వుంటాయి.

సంపాదకుడైన డా. ఎం. హరికిషన్ ఈ సంకలనం గురించి వివరిస్తూ రాయలసీమ రచయితల్లో వస్తు వైవిధ్యాన్ని సాహితీ ప్రేమికులకు అందించడం కోసం ఇదివరకే రాయలసీమ రచయిత్రుల కథలు, రాయలసీమ ప్రేమ కథలు, రాయలసీమ కరువు కథలు, రాయలసీమ హాస్య కథలు తీసుకు వచ్చాము. ఆ ప్రయత్నంలో భాగంగా తీసుకువస్తున్న మరో కథల సంకలనమే ఈ రాయలసీమ వ్యంగ్య కథలు.

వ్యంగ్య కథలు రాసే రచయితలు రాయలసీమలోనే కాదు తెలుగు నేల మీదే చాలా తక్కువ, అయినప్పటికీ అప్పుడప్పుడు కొందరు రచయితలు రాసిన మంచి కథల్ని వెతికి పట్టుకొని 22 కథలతో మీ ముందుకు ఈ సంకలనం తెస్తున్నాను. ఈ పుస్తకం సమగ్ర సంకలనం ఏమీ కాదు. వివిధ థల్లో వచ్చిన, నాకు నచ్చిన కొన్ని కథల్ని మాత్రమే ఇందులోకి తీసుకున్నాను. కొన్ని కథలు నా దృష్టికి వచ్చినప్పటికీ రచయితల నుంచి సకాలంలో అందకపోవడం వల్ల ప్రచురించలేకపోయాను. ఇంకా ఏవైనా మంచి కథలు కథాభిమానులు నా దృష్టికి తీసుకువస్తే రెండవ ముద్రణలో పొందుపరుస్తాను అని అంటారు.

సంపాదకుడు: డా.ఎం. హరికిషన్ - కర్నూలు

[మార్చు]

ప్రధాన వ్యాసం: ఎం. హరికిషన్

ఈ సంకలనంలోని కథలు - కథా రచయితలు

[మార్చు]

ముందుమాట - కరువు నేలలో వొలికిన వ్యంగ్య రసం -  పాలగిరి విశ్వప్రసాద్‌ 

1.ఎండమావుల్లో తిమింగలాల వేట - కె సభా    

2.తాత దిగిపోయిన బండి - కలువకొలను సదానంద  

3.పరిశోధన - మధురాంతకం నరేంద్ర    

4.దొంగ అయితే బాగుణ్ణు - చిలుకూరి దేవపుత్ర  

5.మేధావిని కరిచిన కుక్క - రమణజీవి    

6.శంకరం అనే ఆర్‌.ఎస్‌. - జి.ఆర్‌ మహర్షి    

7.వీరమరణం - సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి  

8.సారాజు కథ - నాయుని కృష్ణమూర్తి  

9.గురువింద గింజ - ఎం.వి. రమణారెడ్డి    

10.ఓటు మల్లన్న - శ్రీనివాస మూర్తి    

11.గొర్రె చచ్చింది - జి. ఉమా మహేశ్వర్‌  

12.ఖడ్గాలూ కాటుక పిట్టలు - డా.కేతు విశ్వనాథ రెడ్డి    

13.సంస్కృతి - పి.రామకృష్ణా రెడ్డి  

14.కెరియరిస్ట్‌ - సొదుం జయరాం    

15.కుక్క పరిహాసం - గాయత్రీ దేవి        

16.కాలానికి ఎదురీదుతున్న వాడు - అక్కంపేట ఇబ్రహీం    

17.ఫారం కోళ్లు - డా.ఎం.హరి కిషన్‌    

18.పెయిన్‌ ఫ్లూ - సుంకోజి దేవేంద్రాచారి  

19.ర డ ల ట పే - సడ్లపల్లె చిదంబర రెడ్డి  

20.ఎడిటర్‌ రంగా - హెచ్చార్కే    

21.సచ్చేదిన్‌ ట దిబ్బరాజ్యం - ఎస్వీ ప్రసాద్‌  

22.పులి నెక్కిన గొర్రె -  ముని సురేష్‌ పిళ్లె    

ముందుమాట - పాలగిరి విశ్వప్రసాద్‌

[మార్చు]

డా.ఎం.హరికిషన్ రూపొందించిన ఈ సంకలనానికి 'కరువు నేలలో వొలికిన వ్యంగ్య రసం' అనే పేరుతో ముందుమాట రచించిన పాలగిరి విశ్వప్రసాద్‌ గారు ఏమి చెప్పారో చూద్దాం. రాయలసీమ సాహిత్య చరిత్రను పరిశీలిస్తే వ్యంగ్యం చాలా తక్కువగా కనిపిస్తుంది. వెటకారం, ఎత్తిపొడుపు, దెప్పిపొడుపు, పరుషోక్తి - ఇవి కొంచెం అటుఇటుగా వ్యంగ్యానికి మరో పేరు ్ల(పర్యాయ పదాలు). రాయలసీమ జీవితంలో వెటకారం తక్కువే. ఇక్కడి మనుషులు ఒక పరిమితి వరకు పరాచికాలాడుకుంటారు గానీ ఒకర్నొకరు వెటకరించుకోవడం చాలా తక్కువ. పరాచికాలాడడం, పరిహాసం చేయడంలో విమర్శ వున్నా నొప్పించే గుణం వుండదు. అది కూడా చాలా చనువు, సఖ్యత వున్నవాళ్ళ నడుమా, వరుసైన వాళ్ళ నడుమా వుంటుందే గానీ, ఏమంత చనువు లేని వాళ్ళ నడుమ వుండదు. వ్యంగ్యంలో వున్న విమర్శ అర్థమైతే నొప్పిస్తుంది. అర్థమైతే అనడం ఎందుకంటే వ్యంగ్యంలో నేర్పరితనం (చతురు) ఉంటుంది. ఎవరిని అధిక్షేపిస్తున్నాడో తెలుస్తుంటుంది. అయితే తమనే అధిక్షేపిస్తున్నాడని ఆ మనిషి (లేదా అటువంటి మనుషుల గుంపు) బయటపడలేరు. తేలు కుట్టిన దొంగ మాదిరి నోరు బిగబట్టుకోవాల్సిందే. రాతలో ఈ నేర్పరితనం ఉంటేనే దాన్ని అసలైన వ్యంగ్య రచన అనవచ్చునని నా అభిప్రాయం. ఈ తూనికరాయితో తూకమేస్తే మనం వ్యంగ్య రచన అనుకుంటున్న చాలా రచనలు వ్యంగ్యం కాకుండా పోతాయి. రాయలసీమ జీవితంలో వ్యంగ్యం లేకపోవడానికి కారణం అందులో ఉన్న నొప్పించే తత్వమే. దీనర్థం రాయలసీమలో ఎదుటి మనుషులను నొప్పించాలనే తత్వం లేదని కాదు. ఇక్కడి మనుషుల్లో సహనం తక్కువ. ఉద్రేక స్వభావం ఎక్కువ. ఆ లక్షణాలు ఇక్కడి జీవితాల్లోని అసహనం వల్ల ఏర్పడినవే. అసహనం ఎందుకంటే చాలినంత జీవన భృతులు లేకపోవడం. అంతిమంగా అన్నిటికీ మూలం కరువు. వెటకారం చేసుకుంటే అది చిలికి చిలికి గాలివానై పార్టీలుగా మారిన సందర్భాలు యిక్కడ లెక్కలేనన్ని. అందుకే వ్యంగ్యం యిక్కడి జీవితాల్లోకి రాలేదు. జీవితాల్లో లేని లక్షణం కథల్లోకి రాలేదు. రాయలసీమ నుండి వ్యంగ్య కథలు చాలా తక్కువ రావడానికి యిదొక కారణం.

ఇక్కడి సామాజిక స్థితిగతుల వల్ల, రాయలసీమలో జీవితాన్ని రియలిస్టిక్‌గా చెప్పిన వాళ్లే ఎక్కువ.

ఇతర ప్రాంతాల్లో ఈ వ్యంగ్యరసం పాలు ఎక్కువ. విశ్వనాథ సత్యనారాయణ (విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు), మొక్కపాటి నరసింహ శాస్త్రి (బారిష్టర్‌ పార్వతీశం), పానుగంటి లక్ష్మీనరసింహ రావు (సాక్షి వ్యాసాలు), శ్రీ శ్రీ (సిప్రాలి), కొడవటిగంటి కుటుంబరావు (కేయాస్‌ కథలు), రావిశాస్త్రి, కాకర్లపూడి నరసింహ యోగ పతంజలి (కె.యన్‌.వై.పతంజలి), పురాణం సుబ్రహ్మణ్య శర్మ (ఇల్లాలి ముచ్చట్లు), మద్దాలి వెంకట లక్ష్మీనరసింహారావు (ఎమ్వీయల్‌) వంటి వాళ్లెందరో కనిపిస్తారు ఆ ప్రాంతాన. గురజాడ కన్యాశుల్కం అన్ని రసాలు ఉన్న నాటకంగా ప్రసిద్ధి కెక్కింది.

తెలుగు సాహిత్యంలో వ్యంగ్యానికి, హాస్యానికి తెనాలి రామకృష్ణుడు ఆధ్యుడని అంటుంటారు.

రాయలసీమలో కవి చౌడప్ప గొప్ప వెటకారంతో పద్యాలు రాసిన కవి అని యిప్పటికి నాకున్న అభిప్రాయం. ఆ తర్వాత తారసపడే గజ్జల మల్లారెడ్డి వ్యంగ్యం ఎంత వాదరదేలి వుంటుందో అందరికీ తెలిసిందే.

రాయలసీమలో వ్యంగ్య రచయిత అని పేరు పెట్టి చెప్పేందుకు ఎవరూ కనిపించరు. రాయలసీమలో జీవితాన్ని రియలిస్టిక్‌గా చెప్పిన వాళ్లకు మటుకు కొదవలేదు. ఈ సీరియస్‌ రచయితలే ఒకటి అరా వ్యంగ్య కథలు రాశారు. అటువంటి కథలను యేరి రాయలసీమలో వ్యంగ్య రసము వొలికిందని చెప్పే ప్రయత్నమే ఈ రాయలసీమ వ్యంగ్య కథలు.

రాయలసీమ వ్యంగ్య కథలలో కె.సభా రాసిన 'ఎండమావుల్లో తిమింగలాల వేట' కథ శీర్షికే గొప్ప వ్యంగ్యం. 'ఎండమావుల్లో చేపల వేట' అంటేనే వెటకారం. లేనిదేదో వున్నట్లు భ్రమింప చేస్తున్నారని అర్థమవుతుంది. అటువంటిది రచయిత ఎండమావుల్లో తిమింగలాల వేట అంటే, అది అతి తీవ్ర వెటకారం. సముద్రంలో తప్ప ఉండని తిమింగలాలు ఎండమావుల్లోనా? అదీ వాటిని వేటాడమా? పిచ్చితుగ్లక్‌ను మించిన మన ప్రభుత్వ పెద్దల అవతారం కనిపిస్తుంది కథలోని ముక్కంటి సీమలో.

ముక్కంటి సీమలో పెద్ద కాటకము రావడంతో మండలానికి ఒక మంత్రి వెళ్లి అప్పటికప్పుడే కరువు నివారణ చర్యలు చేపట్టాలని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి తీర్మానించి ఆదేశాలు యిస్తాడు. మత్స్యశాఖా మాత్యులు రాజా సుందర ప్రకాశ గోవర్ధన శతపతిగారు ట్రావెలర్స్‌ బంగ్లాలో ప్రెస్‌మీట్‌ పెట్టి కరువు నివారణకు అనేక కొత్త చర్యలను వెల్లడిస్తారు. కరువును అధిగమించడానికి చేపలను పెంచాలని అనడమే పెద్ద వ్యంగ్యం. దానికోసం అందరికీ వలలు సప్లై చేయాలనుకోవడం - ప్రధానమంత్రికి లేఖ రాయడం - అధికారులతో 'పరిగిగుట్ట'కు పోవడం - విలేఖరుల ప్రశ్నలకు జవాబులు - ప్రజల సందేహాలకు జవాబులు - ఒక రోజులో జరిగిన ఈ కరువు నివారణ తతంగమంతా ఒక ప్రహసనంగా నడుస్తుంది. మంత్రుల అధికారుల తెలివి తక్కువ నిర్ణయాలకు నిలువెత్తు వ్యంగ్యం ఈ కథ.

ఒకానొక జాతీయ దినోత్సవాన, ఆ వూరి ప్రెసిడెంటు ఒక ఒంటెద్దు చెత్తబండిని శుభ్రం చేయించి అందంగా అలంకరింపజేసి గాంధీతాత చిత్రపటాన్ని వూరేగించినపుడు దాని వెనుక గ్రామపెద్దలు, పంతుళ్ళు, పిల్లలు - ఒక జన సముద్రమే వుంటుంది. మరుసటి దినం యధాప్రకారం ఆ బండితో చెత్త తోలేటపుడు ఎవరుంటారు? బలిసిన ఆ యెద్దు, బండి తోలే వాడు తప్ప. కుళ్ళిన చెత్త కంపుకు ముక్కు మూసుకుని జనం దూరం జరిగి పోతారు. గాంధీతాత లేని దేశం యెలా వుందో, మునిసిపాలిటీ కావడానికి సిద్ధంగా వున్న ఒక మేజర్‌ గ్రామ పంచాయతీని ప్రతీకగా తీసుకుని కలువకొలను సదానంద చెప్పిన సునిశిత సున్నిత వెటకార కథ 'తాత దిగిపోయిన బండి'. ఒక జాతీయదినోత్సవం రోజున జరిగిన వేడుకల ఆధారంగా కథను లక్ష్యం వైపు నడిపిస్తారు రచయిత.

మన కళ్ళ ముందు జరుగుతున్న సాధారణ సంఘటనలతోనే, స్వాతంత్య్రానంతరం దేశంలో యెవరెవరు యెట్లా లాభపడుతున్నారో, యెవరెవరు యెట్లా నష్టపోయారో - ఒక గొప్ప సత్యాన్ని సున్నితంగా వ్యంగ్యంగా ఆవిష్కరించారు. సంకలనంలోని మంచి కథల్లో యిదొకటి.

ముఖ్యమంత్రులు, మంత్రులు చేసే శంకుస్థాపనల మీద మంచి వ్యంగ్యబాణం 'పరిశోధన' కథ. మధురాంతకం నరేంద్ర ఆ విషయాన్ని చివరి వరకు చదువరి వూహకు అందకుండా జాగ్రత్తగా మరేదో కథ అనిపిస్తాడు. పరిశోధనా రాక్షసుడు అనే నిక్‌నేమ్‌ పొందిన ప్రొఫెసర్‌ పర్వతాల రామచంద్రరావు పరిశోధనాసక్తితో పడే తిప్పలను కథగా చేశారనే భావనలో నడిపించి, చివర్లో తన వ్యంగ్య బాణాన్ని గురి చూసి వదిలారు. అది కూడా నేరుగా వ్యాఖ్యానం ఏమీ లేదు. రచయిత ఒక్కమాట కూడా చెప్పకనే - 'మంత్రులు వేసే శిలాఫలకాలు పగిలిపోయి మట్టిపాలవుతుంటాయే తప్ప, శిలాఫలకం వుద్దేశించిన నిర్మాణాలు మాత్రం జరగవు' అని కథ చదివిన మనకు స్ఫురింపజేస్తాడు. మధురాంతకం నరేంద్ర చాలా కథల్లో మాదిరే యీ కథ కూడా ఏ అంశం లక్ష్యంగా పోతోందో చివరి వరకూ తోచదు. అంత నర్మగర్భమైన వ్యంగ్యమిది. కంటిరెప్పకు తెలియకుండా గురి చూసి విడిచిన మంచి వ్యంగ్య కథ 'పరిశోధన'.

గాఢాంధకారంలో ఊరి బయట నుండి ఊర్లోకి ఒంటరిగా నడిచి వస్తున్న మనిషి దయ్యాలకు, విషపురుగులకు, దొంగలకు భయపడడం సహజం. 'దొంగ అయితే బాగుణ్ణు' కథలో రామలింగం పోలీసులు యెదురవుతారేమోనని భయపడి చస్తుంటాడు. అర్ధరాత్రి బస్సు దిగి నడిచి రావాల్సిన రామలింగాన్ని ప్రతిక్షణం ఆ భయమే వెంటాడుతుంది. ఆ భయంలో తనకు యెదురై దబాయించిన శాల్తీ పోలీసు కాదని దొంగ అని తెలిసేసరికి అతని ఆనందానికి పట్టపగ్గాలుండవు. చేతిలో ఉన్న సూట్‌కేస్‌ ఇచ్చి, దొంగ అడగక పోయినా వాచీ కూడా తీసియిచ్చి ఆనందపడతాడు.

'దొంగ కాబట్టి సూట్‌ కేస్‌ వాచీతోనే పోయింది, అదే పోలీసు అయితే అంతకుమించి మానం మర్యాద యేవేవో పోగొట్టుకోవాల్సి వచ్చేది' - ఈ మాట రచయిత చెప్పినది కాదు. రచయిత చెప్పకపోయినా చదువరులకు ఆ ఆలోచన కలిగిస్తాడు. చెప్పకుండానే వొక ఆలోచనను పాఠకుల్లో రేకిత్తించడం మంచి రచయితలకే సాధ్యం.  పోలీసు స్థాయిని మరింత చులకన చేసేందుకు రచయిత దొంగను 'దొంగగారు' అని రామలింగంతో సంబోధింపజేస్తారు. పోలీసులు అంటే రామలింగానికి ఎంతో భయం(సామాన్యులందరిలో వున్న భయమే అది). ఆ భయమెందుకో అతని జ్ఞాపకాల్లో మనకు తెలుస్తుంది. ఆ గతించిన సంఘటన మర్యాదస్తుల కెవరికైనా పోలీసుల మీద అంతులేని జుగుప్సను కలుగజేసేదే.

క్లిష్టమైన కథాంశాలను కూడా సరళంగా హాయిగా నడపగల సామర్థ్యం ఉన్న రచయితల్లో చిలుకూరి దేవపుత్ర ఒకరు. ఈ కథ కూడా అంతే హాయిగా చదివిస్తుంది. ఈ కథ పోలీసులు చదివితే చెల్లుమని చెంప వాయించినంత ఉలిక్కిపడే సెటైర్‌.

రమణజీవి రాసిన 'మేధావిని కరిచిన కుక్క' కుక్కలే పాత్రలుగా నడిచిన ఫాంటసీ కథ. పాత్రలు కుక్కలే అయినా, ఆలోచనలు సాధారణ మనుషులకు వచ్చే ఆలోచనలే. మేధావిని కరిచిన కుక్క వొకటి యితర కుక్కలకు భిన్నంగా ఆలోచిస్తుంది. సొంత నిర్ణయాలను వదులుకోలేక, ఆ నిర్ణయాల మీదే నిలబడి సంఘంలో వెలి వేయబడలేక, ఆ సంఘంతో కలవలేక, మరదలు కుక్కతో ఆనందం అనుభవించి - అనుభవించాక ఆ బంధం క్షణికంగా తోచి, అక్కడినుండి ఒంటరిగా సూర్యుడు ఉదయిస్తున్న తూర్పుకు పరుగు తీస్తుంది. ఉదయిస్తున్న తూర్పుకు పరుగుపెట్టడం దేనికి ప్రతీకో చెప్పాల్సిన పని లేదు.

ఆ కుక్క ఒక మేధావిని కరవడం వల్ల దానికీ కుదురులేని ఆలోచనలు రావడం ఎంత వ్యంగ్యం!

'శంకరం అనే ఆర్‌.ఎస్‌.' కథ. ఆ రీసెర్చ్‌ స్కాలర్లను పనివాళ్ల కన్నా అధ్వాన్నంగా చెండుకు తినే ప్రొఫెసర్ల కడుపు చించి చూపిస్తుంది. ఆ ప్రొఫెసర్ల కడుపులో ఉన్న పురుగులను చూసి పాఠకులకు పిచ్చి పడుతుంది. కథలో నిజంగానే పిచ్చి పడుతుంది - శంకరమనే రీసెర్చ్‌ స్కాలర్‌కు. యెన్నాళ్ళున్నా రీసెర్చ్‌కు సబ్జెక్టు ఇవ్వడు అతని ప్రొఫెసర్‌. అతన్ని బానిసను చేసుకుని, తమ ఇంటిల్లిపాదీ ఇంటి పనులు, పిల్లల పనులు అన్నీ చేయించుకుంటాడు. (వాస్తవంగా కొందరు రీసర్చ్‌ స్కాలర్స్‌ ప్రొఫెసర్ల వేధింపులు భరించలేక రీసర్చ్‌ మానుకుని పోయిన ఘటనలున్నాయి).

చివరకు తమ స్నేహితుడు రాసిన చెత్త పుస్తకాన్ని సబ్జెక్టుగా ఇస్తొడు (ఇక్కడ కథతో ముడిపడిన అంశం ఒకటి - ప్రొఫెసర్లు సరైన రిసర్చ్‌ అంశం యివ్వక, తమకిష్టులైన వారి రచనలను పరిశోధనకు యివ్వడం వల్ల సాహిత్యంలో ఎన్నో ఖాళీలు(గ్యాప్స్‌) మిగిలే వున్నాయి).  కథలో యీ ప్రహసనమంతా చదువరులను నవ్విస్తూ సాగుతుంది. జంధ్యాల మార్కు హాస్యం గుర్తుకు తెస్తుందీ కథ. శంకరం అనే ఆర్‌.ఎస్‌. కథను రెండు గాడిదల సంభాషణలలో మనకు చెప్పి మరింత హాస్యాన్ని అద్దారు మహర్షి. అదే సమయంలో ఈ కథ ప్రొఫెసర్లకు ఒక చర్నాకోల వాత. మా తరం రచయితల్లో రాయలసీమ నుండి వచ్చిన ఒక పదునైన హాస్య వ్యంగ్య కథకుడు జి.ఆర్‌.మహర్షి.

'వీరమరణం' సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రాసిన చిన్న కథ. రాయలసీమ గ్రామపార్టీల నేపథ్యంతో రాసిన కథ. తన గుంపును అవతలి గుంపు మీదికి పంపిన పార్టీ నాయకుడికీ, దొమ్మీలో పాల్గొని తిరిగి వచ్చిన ఒక మనిషికి జరిగిన సంభాషణే యీ కథ. తనదాకా వస్తే మనిషి స్వభావం యెట్లా మారుతుందో సూటిగా చదువరి మెదడుకు ఎక్కించిన కథ. దొమ్మీ నుండి తిరిగొచ్చిన మనిషి, ఆత్రంగా అడుగుతున్న నాయకునికి, రెండు గుంపుల నడుమ జరిగిన భీకర యుద్ధాన్ని పూస గుచ్చినట్లు ఉత్కంఠగా చెబుతుంటాడు. నాయకుడు స్పందిస్తుంటాడు.

ప్రభుత్వాలు తమ బొక్కసాలు నింపుకోవడానికి విచ్చలవిడిగా మద్యం అమ్ముతూ ప్రజలను తాగుబోతులను చేస్తున్న దుర్మార్గంపై విసిరిన వ్యంగ్యం, నాయుని కృష్ణమూర్తి రాసిన 'సారాజు కథ'. కథలో రాజు చేసిన సారాయి అమ్మకాలు, దాని వెంట జరిగిన తతంగాలూ అన్నీ మన వుమ్మడి రాష్ట్రంలో జరిగినవే. 1983లో ఎన్టీఆర్‌ హయాంలో 'వారుణి వాహిని' పేరుతో సారాయిని విచ్చలవిడిగా ప్రవహింప జేసిన విధానం - ఆ తర్వాత జరిగిన సారా వ్యతిరేక మహిళా వుద్యమం - మద్యపాన నిషేధం - దొంగ సారా అమ్మకాలు - వంటి పరిణామాల మీద వ్యంగ్యాస్త్రం ఈ కథ.

ఒక ప్రభుత్వమని కాదు, అన్ని ప్రభుత్వాలూ వ్యూహాత్మకంగానే ప్రజలకు మేలు చేస్తున్నట్లు పథకాలు ప్రవేశపెట్టి, దొడ్డిదారిన ప్రజలను దోచుకునేవే. ప్రభుత్వాల దోపిడీ తీరులో ఒక కోణాన్ని 'సారాజు కథ' మన కళ్ళ ముందు వుంచుతుంది.

డా.ఎం.వి.రమణారెడ్డి రాసిన 'గురువింద గింజ' పదునెక్కిన వ్యంగ్యకథ. గురువింద గింజ అనే పలుకుబడిని శీర్షికగా పెట్టడంలోనే సారాంశం అర్థమవుతుంది. మన సంస్కృతీ సాంప్రదాయాల, ఆచారాలలోని అనైతికతను గుర్తించకుండా ఇతర దేశాలలోని సంస్కృతిని, ఆహారపు అలవాట్లు ఆచారాలను ఎగతాళి చేయడం మీద ఎం.వి.ఆర్‌ విసిరిన శరం ఇది.

వారంలో ఐదు రోజులు పట్నంలో తిరిగి అక్కడ సంపాదించిన బజారుజ్ఞానాన్ని ఊర్లో రచ్చబండ మీద చేరిన యువకులకు బోధిస్తుంటాడు సంజీవరాయుడు. సీమ దొరసానులు చుట్టలు కాల్చడం - ఆడవాళ్లు భర్త చనిపోతూనే మరొకరిని పెళ్లి చేసుకోవడం - భర్త వున్నా వదిలేసి మరో పెళ్లి చేసుకోవడం - ఒకరి తరువాత ఒకరిని ఒక్కొక్కరు పదులలో పెళ్లిళ్లు చేసుకోవడం - చైనాలో పురుగులను ఆహారంగా తినడం - వంటి  విషయజ్ఞానాన్ని మహా వూరింపుతో, ఎగతాళితో బోధిస్తుంటాడు యీ బోధిసత్వుడు.

అవేం చిత్రాలు కావని మన యెరుకకు తెచ్చేందుకు రచయిత, భర్త చనిపోయిన ఆడవాళ్లు మరొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, పుట్టలో పెరిగే ఉసుర్ల పురుగులను తినడం, మన రాష్ట్రంలోనే పక్కనే ఉన్న సోదర ప్రాంతంలో ఆడవాళ్లు చుట్టలు కాల్చడం వంటి ప్రస్తావనలు తీసుకొస్తారు కథలో.

అక్రమ సంబంధాలు చెప్పడానికి సుబ్బలక్ష్మి నాగరాజుల దొంగ కలయిక - అది సంజీవ రాయుడి కంట పడగానే నాగరాజు పారిపోవడం - ఇతగాడు చటుక్కున అదే అదునుగా సుబ్బలక్ష్మి మీదికి చీకట్లో ఎగబ్రాకడం - ఈ దృశ్యాన్ని మన కళ్ళముందు వుంచుతాడు ఎం.వి.ఆర్‌. పరుల మీద నిందాస్తుతులు చేసే సంజీవరాయుడూ, అతని చుట్టూ చేరిన యువకులూ, మన సమాజంలో జరిగే అవే పనులను గుర్తెరగని గురువిందగింజలుగా అనిపిస్తారు. మనలోనూ అటువంటి గురువింద గింజలకు కొదవలేదు. కథ చదివినప్పుడు దొంగల్లా భుజాలు తడుముకుంటాము. ఈ చిన్న కథ శృంగార ఊహలు పుట్టిస్తూ, పదునైన వ్యంగ్యంతో పరుగెత్తింది.

ఏరుదాటక ముందు పడవ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న జన నానుడి అందరికీ తెలిసిందే. శ్రీనివాస మూర్తి రాసిన 'ఓటు మల్లన్న' సైతం చివరకు అదే అవుతాడు.

గాడిదల దొంగతనాలు ఒకదాని వెంట ఒకటి జరుగుతుంటే ఆ విషయం మీద ప్రశ్నించిన విలేఖరికి ఎస్సై రమణబాబు చెప్పిన నిర్లక్ష్యపు సమాధానం వార్తగా వచ్చిన ప్రస్తావనతో కథ మొదలవుతుంది. గాడిదల భద్రతకు ప్రత్యేకమైన చట్టాలు లేనందువల్ల తాను నిస్సహాయున్నని చేతులెత్తేస్తాడు ఎస్సై. ఇదే సమాధానానికి కొంత సొంత జ్ఞానము, పైత్యము కలిపి వార్త రాయడం - దీని ఆధారంగా ప్రతిపక్ష, అధికార పార్టీ అభ్యర్థులు రజకుల ఓట్ల కోసం నడిపే గాడిద రాజకీయం - చివరకు మల్లన్న దొంగ ఓట్లు వేసినాడనే అబద్ధపు ఆరోపణతో పోలీసుల పాలు కావడంతో కథ ముగుస్తుంది. కథంతా ఆసక్తికరమైన వ్యంగ్యంతో నడిపారు రచయిత. చివరకు తమ పార్టీకి దూరంగా వున్నారనే నెపం చూపి అన్యాయంగా మల్లన్నను పోలీసులతో కొట్టించడం, యీ ప్రజాస్వామిక దేశంలో సహజాతి సహజంగా జరుగుతున్న విషాదం.

జి.ఉమామహేశ్వర్‌ రాసిన 'గొర్రె చచ్చింది' హాస్యము, వ్యంగము కలగలిసిన విషాదాత్మక కథ. ఎత్తుగడలోనే 'గొర్రె చచ్చింది' అంటూ హిందీ పంతులు రంగనాథం అనడంతో కథ మొదలవుతుంది.

చెట్టుకు, గొర్రెకు డబ్బు కడితే యిన్నేళ్ళలో యింతవుతుందని స్కీములు పెట్టి అమాయకులను భ్రమల్లో ముంచి దోచుకునే వ్యవహారంపై అల్లిన కథ యిది. 'ఒరేయ్‌ గొర్రె', 'గొర్రె దాటు' 'గొర్రె' 'గొర్రెల మంద' వంటి పలుకుబడులన్నీ మనం విరుద్ధార్థంలోనే వాడుతాం. కానీ గొర్రె స్కీముకు డబ్బు కట్టిన గురప్పకు, ఈ పదాలు ఎవరైనా వాడితే  బాధా కోపం కలుగుతుంటాయి. వేరొక టీచర్‌ ఒక మొద్దుపిల్లాడిని 'ఒరేయ్‌ గొర్రె' అని తిట్టడం గురప్పకు బాధ. చదువు రానివాడూ తెలివిలేనోడూ - వీడికీ గొర్రెకు పోలికేమిటీ? గొర్రె పాలిస్తుంది, మాంసం యిస్తుంది' అని 'గొర్రె' మీద యెక్కడ లేని సానుకూలత అతనికి. అతని ఆలోచనలన్నీ గొర్రెల మందలతో నిండిపోయినందుకు రచయిత చెప్పిన రెండు మూడు సంఘటనలు హాస్యం తెప్పించినా, చివరకు అతను కట్టిన స్కీముల కంపెనీ బోర్డు తిప్పేయడంతో విపరీత క్షోభను భరించాల్సిన పరిస్థితి. మోసపోయిన గురప్ప విషాద స్థితిని 'గొర్రె చచ్చింది' అనుకోవాల్సి రావడం ఒక విషాదం.  

కేతు విశ్వనాథరెడ్డి రాసిన 'ఖడ్గాలు కాటుక పిట్టలు' ఒక లోతైన కథ. బంగారానికి తావి అబ్బినట్లు ఆర్థిక, సామాజిక బలం ఉన్న ప్రొఫెసర్‌ రాయడు. ఈ ప్రొఫెసరూ అతని రీసెర్చ్‌ అసిస్టెంట్లు గఫూర్‌, రాములు ప్రధాన పాత్రలుగా వ్యంగ్య ధోరణిలో నడిచిన కథ. పైకం చెల్లించి చీకటి దుర్గాన్ని కొనుక్కొని పాలెగాడై తన పరగణాలోని గ్రామాల ప్రజలను దోచుకున్న తిరపతి రాయడి ప్రతినిధిగా ప్రొఫెసర్‌ రాయడు కనిపిస్తాడు. చరిత్రను యథాతధంగా పత్రం రాసి ఇచ్చిన గఫూర్‌ రాజుల ఆగ్రహానికి బలైపోయిన నిజమైన చరిత్రకారులకు ప్రతీక. రాజుల మెప్పుకోసం చరిత్రను వక్రీకరించి రాజులను చరిత్ర నిర్మాతలుగా కీర్తించి అందలాలు అందుకున్న బానిస మనస్తత్వ చరిత్రకారులకు ప్రతిరూపం రావు.

ప్రొఫెసర్‌ రాయడు తన పల్లెలో ఉన్న పాత ఇంటిని పడగొట్టేటప్పుడు బయటపడిన నేల మాళిగలో పది ఖడ్గాలు, చేవదేరిన ఎర్రచందనంతో చేసిన నాలుగైదు గదలు, ఒక చిన్న పెట్టెలో ఉంచిన ఒక తాటాకుల కావ్యం బయట పడతాయి. కావ్యంలో ఉన్న ప్రాథమిక సమాచారంతో ప్రొఫెసర్‌కు తమ వంశమేదో తిరపతి రాయడు అనే గొప్ప పాళెగాడి(రాజ) వంశమనీ, దాని చరిత్రను కనుగొని పత్రం తయారు చేసి ఇండియన్‌ నేషనల్‌ హిస్టరీ కాంగ్రెస్‌లో సమర్పించి దేశమంతా తమ వంశచరిత్ర మార్మోగాలని ఉత్సాహపడతాడు. తన రీసర్చ్‌ అసిస్టెంట్లు గఫూర్‌ను చీకటి దుర్గం క్షేత్ర పరిశీలనకు, రావును తాటాకుల కావ్య పరిష్కరణకు వినియోగిస్తాడు.

నిజాయితీగా తిరపతి రాయడు అనే పాలెగాడు ఒక బందిపోటు అని నిజమైన చరిత్రను సమర్పించిన గఫూర్‌ చివరకు ప్రొఫెసర్‌ రాయడి ఆగ్రహానికి గురవుతాడు. రావు మాత్రం తాటాకుల కావ్యంలోని చిల్లులు పడిన చోట తిరపతి రాయడిని కీర్తించడానికి అవసరమైన అక్షరాలను, పదాలను చేర్చి తిరపతి రాయడిని గొప్పగా చిత్రిస్తాడు. తిరపతి రాయడి వంశస్తుడనుకుంటున్న రాయడిని సంతోషపెడతాడు. చరిత్ర వక్రీకరణతో రాయడి ప్రాపకం సంపాదిస్తాడు.

చరిత్రను ఎలా చూడాలో, చరిత్రను సమర్పించి ఎలా అంచనా కట్టాలో, చరిత్రలు ఎలా వక్రీకరింపబడుతున్నాయో, లోతైన చూపుతో చెప్పిన కథ యిది. ఈ సంపుటిలో నిడివి ఎక్కువ ఉన్న కథ. కొత్తగా సాహిత్యంలోకి అడుగిడుతున్న వారు చదవాల్సిన కథ.

లోతైన ఆలోచనతో కథలు రాసే పి.రామకృష్ణారెడ్డి రాసిన 'సంస్కృతి' మరో మంచి కథ. మనం సంస్కృతి అనుకునే దానిలో ఉన్న అహేతుకతను, అసంబద్ధతను వ్యంగ్యంగా చెప్పిన కథ. హేతుబద్ధంగా ఆలోచించే నారాయణరావు ప్రశ్నలు, మాటలు, అభిప్రాయాలు ఎప్పుడూ కథకుడిని (నేను పాత్రను) చిరాకు పెడుతుంటాయి. అతను సగటు మనిషి. సమాజంలో మెజారిటీ మనుషులకున్న ఆలోచనలే అతనికీ వుంటాయి. సమాజం మనపై రుద్దిన సంస్కృతి సాంప్రదాయాలే కధకునికీ వుంటాయి. నారాయణ పక్కనున్నప్పుడంతా వాటిని ప్రశ్నిస్తుంటాడు. నారాయణ ప్రశ్నలు తెలియక అడుగుతున్న అమాయకుని ప్రశ్నల మాదిరి వుంటాయి గానీ అతను అన్నీ తెలిసి వ్యంగ్యంగా ఆ ప్రశ్నలను అడుగుతున్నాడని పాఠకునికి అర్థమవుతుంటుంది. ప్రశ్నించేది నారాయణ పాత్రే అయినా, అవన్నీ రచయిత కంఠస్వరాన్ని మనకు పట్టిస్తాయి. చాలామంది రచయితలు ఉత్తమ పురుషలో కథ చెప్పినప్పుడు 'నేను పాత్ర'ను వున్నతీకరించుకొని - లేదా ఆదర్శీకరించుకొని - తక్కిన పాత్రలను సగటు మనుషులను చేస్తాడు. చాలా తక్కువ మంది రచయితలే 'నేను' పాత్రను సగటు మనిషిగానో లేదా ఇంకా ఆధమంగానో చిత్రీకరించుకుని యెదుటి పాత్రలను వున్నతీకరిస్తారు. అటువంటి రచయితల్లో పి.రామకృష్ణారెడ్డి ఒకరు. ఇదీ ఆ కోవలోనే నడిచిన ఆలోచింపజేసే కథ.

సొదుం జయరామ్‌ కథలు రాయడం మానుకొని ఓ 15 ఏళ్ల తర్వాత తిరిగి కథలు రాయడం ప్రారంభించి రాసిన 10-12 కథల్లో యిది ఒకటి.

ఇంక్యూషన్‌(అంతర్దృష్టి), ఇన్వెన్షన్‌(ఆవిష్కరణ), ఇమేజినేషన్‌(ఊహ) లేకుంటేమానే కనీసం సబ్జెక్టుకు సంబంధించి మామూలు విషయ పరిజ్ఞానం కూడా లేని వాళ్ళు రీసెర్చ్‌, పిహెచ్‌.డీ చేస్తున్నారనే ఉపాంశంతో, హోదా రాగానే మనుషులను చులకనగా చూసే అహంకార స్వభావాన్ని ఎత్తి చూపిన కథ కెరియరిస్ట్‌. అంతకుముందు పీహెచ్డీ కోసం అవసరమైన మెటీరియల్‌ అంతా యిచ్చిన రచయిత (నేను పాత్ర) ఆకాశవాణిలో తారసపడితే, అతని సాధారణ పల్లెటూరి రైతు అవతారం చూసి చులకనగా మాట్లాడుతాడు ఒక ప్రొఫెసర్‌. ఆ తరువాత సదరు ప్రొఫెసర్‌కు పూర్వాశ్రమంలో పీహెచ్డీ రాయించిన ఆకాశవాణి ఉద్యోగి అబ్దుల్‌ ఖాదర్‌ రచయితను, ప్రొఫెసర్‌ను విడివిడిగా తన ఇంటికి భోజనానికి పిలుస్తాడు. ఈ రచయిత అక్కడికి వెళ్లేసరికి అక్కడ ఆ ప్రొఫెసర్‌ ఉంటాడు. ఏకే ద్వారా అప్పటికే వివరాలు తెలుసుకున్న ప్రొఫెసర్‌ అతన్ని చూసి అప్రతిభుడవడముతో కథ ముగుస్తుంది.

రచయిత యింటికి పోయి పీహెచ్డీ కోసం మెటీరియల్‌ తీసుకున్న వ్యక్తి ఆకాశవాణిలో రచయితను గుర్తు పట్టలేక పోయాడా అనే సందేహం రావచ్చు కొందరికి. ప్రొఫెసర్‌ అయ్యాక మనుషులను కనీస గౌరవంతో చూడలేని అహంభావికి యెప్పుడో ఒక్కసారి చూసిన రచయిత గుర్తుంటాడా? ఇటువంటి విషయాలను పని గట్టుకుని చెప్పే రచయిత కాదు సొదుం జయరామ్‌. ఒక రచయితపై ఎవరితోనో పీహెచ్‌.డీ.లు రాయించుకొని యూనివర్సిటీలలో ప్రొఫెసర్లయి అదే రచయితలను చులకనగా చూసే వారికి యీ కథ కొరడా దెబ్బ.

'కుక్క పరిహాసం' గాయత్రీ దేవి కథ. అయోధ్యలో రాముడి విగ్రహాలు బయటికి తీసిన తర్వాత మతం పేరుతో వినాశనానికి అంకురార్పణ జరిగిందనుకుంటాడు వెంకటేశ్వరుడు. అయోధ్యకు పోయి ఆ విగ్రహాలను దొంగిలిస్తే దేశంలో మతకలహాలు అంతమవుతాయని భావిస్తాడు. వెంకటేశ్వరుడు భూమి మీదికి రావడం - విగ్రహాలను తీసుకుని పోయే క్రమంలో పోలీసులు పట్టుకోవడం - కోర్టుకు హాజరు పరచడం - అక్కడి నుండి పారిపోవడం - ఆయన పరుగు అవస్థలు చూసి కుక్కపిల్ల నవ్వడం ఈ కథ. హాస్యం విరిసిన కథ. మత కలహాలకు అంకురార్పణ చేసిన అంశ ప్రస్తావనతో ప్రారంభమైన కథ, ఆ సీరియస్‌ అంశాన్ని విడిచిపెట్టి హాస్యమే లక్ష్యంగా మారిన ఫాంటసీ కథ.

'కాలానికి ఎదురీదుతున్నవాడు' - అక్కంపేట ఇబ్రహీం రాసిన ఈ కథ, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ పనికిమాలిన విధానాలను విశదం చేసింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను, ప్రైవేటు కార్పొరేట్‌ శక్తులకు బలి పెట్టడమే ధ్యేయంగా చాప కింద నీరులా ప్రభుత్వం పథకాలు వేస్తున్నదని సమర్ధవంతంగా చెప్పాడు రచయిత. పిల్లలకు పాఠాలు చెప్పడానికి వున్న వుపాధ్యాయులకు ఆ పని మినహా అనేక పనికిమాలిన పనులు అప్పగించి, పిల్లల భవిష్యత్తును కాలరాస్తున్న వైనాలను పదునుగా చెప్పిన కథ. అక్కడక్కడ కథ వ్యంగ్యంగా నడిచి వాస్తవాన్ని నేరుగానే చెప్పిన వర్తమాన కథ.

అక్కంపేట ఇబ్రహీం 'కాలానికి ఎదురీదుతున్న వాడు' అంకం ముగిశాక, మొదలయ్యే అంకం 'ఫారం కోళ్ళు'. ఎం.హరికిషన్‌ రాసిన 'ఫారం కోళ్ళు' ప్రైవేటు స్కూళ్ళ దోపిడీని పొట్ట చించి చూపిన కథ. కాన్సెప్ట్‌ స్కూల్స్‌ పేరుతో పుట్టగొడుగుల్లా పెరుగుతున్న ప్రైవేటు స్కూళ్ళను కోళ్లఫారంతో పోల్చడమే ఈ కథలోని తొలి వ్యంగ్యం. కాన్సెప్ట్‌ స్కూళ్లలో జరిగే రకరకాల దోపిడీని ఈ కథలో ఒక స్కూల్‌ కరస్పాండెంట్‌తో సూటిగానే చెప్పించాడు కథకుడు. పట్టణంలో యెటువంటి కాలనీల్లో పెట్టాలో, ఏ స్థాయిలో ప్రచారం చేసుకోవాలో, యితర స్కూల్‌ నుండి మంచి టీచర్లను యెట్లా లాగాలో, క్రమశిక్షణ పేరుతో పిల్లలను యెలా వేధించాలో, ఫీజులు ఆలశ్యంగా కట్టినా, పుస్తకాలు తమ స్కూల్లో కొనకపోయినా యేదో ఒక సాకుతో పిల్లలను యెలా మానసిక హింస పెట్టాలో పూస గుచ్చినట్లు, స్కూల్‌ పెట్టాలనుకున్న తన మిత్రునికి సూటిగానే చెబుతాడు.

ప్రైవేటు స్కూళ్ళలో దోపిడీ వుందని అందరికీ తెలిసినా, ఆ దోపిడీ రూపం ఈ కథ చదివాక తెలుస్తుంది. ఆ దోపిడీ రూపానికి యే ముసుగు కప్పుతున్నారో తెలుస్తుంది. కాన్సెప్ట్‌ స్కూల్లో దోపిడీ భాగోతం నగ్నంగా కనిపిస్తుంది.

సుంకోజీ దేవేంద్రాచారి 'పెయిన్‌ ఫ్లూ' కథంతా హాస్యస్ఫోరకంగా సాగుతుంది. న్యూస్‌ పేపర్లు చదవడం అందులో వచ్చిన కొత్త వార్తలను హావభావాలతో అందరికీ చెప్పడం ఒక పిచ్చిగా మారిన వ్యక్తి సుబ్బారావు. ఒకరోజు స్వైన్‌ ఫ్లూ వార్త చదివి వూర్లో వాళ్ళందరికీ దాని గురించి అభినయంతో చెప్పేందుకు ప్రయత్నించిన దగ్గర అసలు కథ మొదలవుతుంది. స్వైన్‌ ఫ్లూ సోకితే వూపిరి అందక చనిపోతారని అభినయంతో చూపించిన సుబ్బారావు నిజంగానే చచ్చిపోయాడని అనుకుంటారు. అతను లేవగానే దయ్యమై లేచినాడని మొదట్లో బెంబేలెత్తిన జనానికి, కొన్ని రోజులకు వార్తా ప్రసారాల ద్వారా స్వైన్‌ ఫ్లూపై అవగాహన వస్తుంది. ఊర్లో ఇద్దరికి సాధారణ జలుబు రాగానే అతి జాగ్రత్తపరుడైన సుబ్బారావు మాస్క్‌ పెట్టుకోవడం - మాస్క్‌తో అతన్ని చూసి జనం దూరంగా పరిగెత్తడం వంటి హాస్య సన్నివేశాలతో కథ నడుస్తుంది. తనకు స్వైన్‌ ఫ్లూ వచ్చిందేమోననే అనుమానం సుబ్బారావుకే వచ్చేంతగా జనం అతన్ని దూరం పెడతారు. డాక్టర్‌ దగ్గరికి పోయిన సుబ్బారావు జేబు చిలుము వదిలించుకుని, న్యూస్‌ పేపర్‌ చదివిన జ్ఞానంతో ఏమి చేయకూడదనే జ్ఞానోదయమై తిరిగి వస్తాడు. కథ హాస్యంగా నడుస్తుంది.

అమాయక జనాన్ని మూర్ఖులను చేసే మోసగాళ్ళ గుంపు కథ సడ్లపల్లె చిదంబరరెడ్డి రాసిన 'రడలటపే'. మనం చెప్పే మాటలను కూడా విని అర్థం చేసుకోలేని ఒక 15 యేళ్ళ తిక్కలోడు కాలక్రమంలో ఒక బిత్తలసామిగా రూపాంతరం చెందడానికి వెనుక వున్న మోసాల క్రమమే 'రడలటపే' కథాంశం. చిదంబరరెడ్డ్డి రాసిన ఈ కథ ప్రతిరూపాలు దాదాపు అన్ని జిల్లాల్లో వున్నవే. మనం ఒక వాక్యం పలికితే ఆ వాక్యం మొత్తాన్ని తిరిగి పలకలేని, మెదడు ఎదగని మందమతులు దాదాపు వూరూరా కనిపిస్తుంటారు. మనం పలికిన వాక్యంలో అతని గ్రహింపుకు వచ్చిన ఒక్క పదాన్ని మాత్రమే పదేపదే పలుకుతుంటారు. మరొక పదం అతని బుర్రలోకి ఎక్కినప్పుడు మొదటి పదం పోయి, రెండవ పదం నోట్లోకొస్తుంది. అటువంటి తిక్కలోని నోటి నుండి వస్తున్న పదాలకు, కాకతాళీయంగా జరిగిన సంఘటనలను ముడిపెట్టడంతోనే మోసాలక్రమం మొదలవుతుంది. ఆ తిక్కలోనికి దైవత్వం ఆపాదించే మోసగాళ్లలో పెద్ద చదువులు చదువుకున్నవారూ, డబ్బున్నవారే వుంటారు. సాముల అవతారసృష్టి జరిగాక యీ తిక్కలోడు జాతీయ అంతర్జాతీయ స్వామీజీ అయి, మన అమాయకపు మూర్ఖపుజాతి నెత్తిన కూర్చుంటాడు. ఈ కథలో ఒక ఉపకథ వుంది. అది తిక్కలోడి వూరి పేరుకున్న చరిత్రను చెప్పేది. రాళ్లపాడు అనే వూరు పూర్వం రాయపేటగా వుంటే, మందబలం ఉన్న కొంతమంది అక్కడి రాళ్ల సంపదను వ్యాపారంగా మార్చుకొని అసలు మూలవాసులము తామేననీ, ఆ వూరి పేరు రాళ్లపాడు అనీ వివాదం లేవనెత్తుతారు. కర్ణాటక నుండి మరో గుంపు వచ్చి, కొందరు పాలెగాళ్లతో ఆ వూరి నుండి తరిమి వేయబడిన జనం తామేననీ, మూలవాసులం తామేనని అంటారు. అట్లా తరిమి వేయబడి దురాక్రమణ చేయడం వల్లే ఆ వూరికి 'రడలటపే' అనే పేరు వుందంటారు. తుళు వంశ భాషలో రడలటపే అంటే మోసగాళ్ల గుంపు అని అర్థమని రచయిత చెబుతారు. తిక్కలోన్ని స్వామిగా మార్చిన మోసగాళ్లకు గుంపు వున్న ఆ వూరిని రడలటపే అనడమే సరైనదనిపిస్తుంది చదువరికి.

'ఎడిటర్‌ రంగా' చదువుతున్నంత సేపూ నాకైతే ఇది ఒక 'కాలమ్‌' అనిపించింది. ఇది ఒక ఎడిటర్‌ మీద రాసిన వ్యంగ్యాస్త్రం. చెత్త కథలను అవి తయారయ్యే చోటనే నరికేయాలనుకునే ఎడిటర్‌ ఆయన. ఒక సుప్రసిద్ధ దినపత్రికలో భూత సంపాదకీయాలు, ఘోస్ట్‌ ఎడిటోరియల్స్‌ రాసిన ఎడిటర్‌ ఆయన. ఆ ఎడిటర్‌ భావాల మీదా, థియరీల మీదా వ్యంగ్యంగా రాసిన రచన.

కథలను నిర్వచించే విమర్శకులను హెచ్‌.ఆర్‌.కే వ్యంగ్యంగా ఆక్షేపిస్తారు. రచయిత లక్ష్యంగా పెట్టుకున్న యిద్దరు ముగ్గురు ఎడిటర్లనూ విమర్శకులనూ కలిపి, ఎడిటర్‌ రంగా రూపుకట్టి అధిక్షేపించిన రచన. ఇది భావాల గొలుసుకట్టు. ఆసక్తికరంగా నడుస్తుంది. పదాల వాక్యాల  పట్టుతో నడిచిన మంచి అధిక్షేపణ 'ఎడిటర్‌ రంగా'.

పేరులోనే వెటకారం పలికిన మరో కథ ఎస్వీ ప్రసాద్‌  'సచ్చేదిన్‌ ట  దిబ్బరాజ్యం'. దేశం ఆర్థికంగా క్రమశిక్షణ తప్పి దిగజారితే దానికి కారణం ప్రభుత్వ పాలనా తీరే అని అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వ పెద్దలు అట్లా అనుకోరు. 'దేశ ప్రజలు ఆర్థిక క్రమశిక్షణ తప్పారు వాళ్లను గాడిలో పెట్టా'లనుకుంటారు. ప్రతిదీ సామాన్యుల మీద తోసే పైనున్న పాలకుల ఆదేశంతో, బ్యాంకులు అమలు చేసిన పథకాలు ప్రజలకు కంటకప్రాయమై వాళ్ల బతుకులను దుర్భరం చేయడం ఈ కథ. బ్యాంకర్ల పనితీరును వెటకార ధ్వనితో చెబుతుంది. సామాన్యులను పీడించి అప్పులు ఇచ్చి, తిరిగి వసూలుకు దౌర్జన్యం చేస్తారు. సామాన్యులను దోచుకుని 'జంగ్‌ ఫిషర్‌' కంపెనీ యజమానుల్లాంటి కార్పొరేట్లకు అప్పులు ఇచ్చి, వాళ్ళు ఎగ్గొడితే 'రైట్‌ ఆఫ్‌' చేస్తారు. కార్పొరేట్లకు అప్పులిచ్చి వాళ్ళను బలిసేలా చేయడం వల్లనే దేశ ఆర్థికస్థితి బలోపేతం అవుతుందని దొంగమాటలు చెప్పే పాలనా పెద్దలకు ఇది చెంపపెట్టు.

పులి స్వారీ అన్నది పాత మాట. దాన్ని మరింత తీవ్రం చేసి కే.ఏ.ముని సురేష్‌ పిళ్ళె 'పులినెక్కిన గొర్రె' అంటున్నాడు. పులినెక్కిన గొర్రె ఎప్పుడో ఒకసారి దిగక తప్పదు. దిగక తప్పని పరిస్థితి పులి కల్పిస్తుంది. గొర్రె దిగగానే పులి నోట కరుచుకుంటుంది. డబ్బుతోనే రాజకీయం చేయొచ్చు అనుకునే గొర్రెలకు చివరకు రాజకీయమే పులిగా మారి మింగుతుందని చెప్పడమే యీ కథ. ఆ పులికి అందరూ కాకపోయినా కొందరైనా ఆహారమవుతారు. ఆహారమయిన వాడు గొర్రె. ఈ కథలో నేను పాత్ర. కోట్లు సంపాదించిన ఒక ఎన్నారైకి రాంబాబు అనే స్నేహితుడు రాజకీయం పిచ్చి ఎక్కిస్తే, అతను సొంత రాష్ట్రానికి వచ్చి, సొంత నియోజకవర్గంలో చేసిన పనులూ, పార్టీ అధినేతలతో పడిన పాట్లూ ఈ కథలో వ్యంగ్యంగా చెప్పుకుంటూ పోతాడు రచయిత. ఆత్మహత్య చేసుకోవడానికి నాలుగు మార్గాలను ముందుపెట్టుకున్న దృశ్యంతో కథ మొదలవుతుంది.

'యుద్ధంలో విజేతలు పరాజితులే కాకుండా, నాలాంటి నేనులు వేనవేలు, నేను పులినెక్కిన గొర్రెను' అనే ముక్తాయింపుతో కథ ముగుస్తుంది. రాజకీయం వంటి డ్రై సబ్జెక్టును మంచి శిల్పంతో ఆసక్తికరంగా రాశాడు సురేష్‌ పిళ్ళె.

చివరగా హరికిషన్‌ గారిని అభినందించాలి. రాయలసీమ రచయితలు ఎంతసేపూ కరువు కథలు, ఏడుపుగొట్టు కథలు రాస్తారనే అపప్రథను హరికిషన్‌ కూకటి వేళ్ళతో పెళ్ళగిస్తున్నారు. ఇక్కడ కరువు, ఫ్యాక్షన్‌ కథలే కాకుండా అన్ని రసాలు వొలికిన అద్భుతమైన కథలు జాలువారాయని నిరూపణ చేస్తున్నారు. శ్రమకోర్చి కథలను సంపాదించి రాయలసీమ ప్రేమ కథలు, రాయలసీమ హాస్య కథలు, రాయలసీమ కరువు కథలు, రాయలసీమ రచయిత్రుల కథలు సేకరించి తన సంపాదకత్వంలో వెలువరించారు. ఇప్పుడు రాయలసీమ వ్యంగ్య కథలు వెలువరిస్తున్నారు. ఈ శ్రమకు ఒక్క అభినందన చాలదు. రాయలసీమ సాహిత్యానికి హరికిషన్‌ చేస్తున్న సేవ రాయలసీమ రచయితలందరూ గుర్తుంచుకోవాల్సినది. రాయలసీమ అస్తిత్వ పోరాటానికి సాహిత్యం ఒక వుత్ప్రేరకం. ఇక్కడి నలుగురు కలిసి నవ్వే వేళ, మాటలాడుకొను వేళ డా.ఎం.హరికిషన్ తప్పక మాటల్లోకి వచ్చి పోతారు.