రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు
జననంతమిళదేశమున తిరునెల్వేలి మండలం భారతదేశం.
వృత్తిజమీందారు
మతంహిందూ

బ్రిటిష్ వారి పాలనలో రావెళ్ళ వేంకటరంగ అప్పస్వామి నాయుడు బహుప్రశంసలు పొందిన జమీందారు. 1854 నుండి 1869 వరకు ప్రజారంజకముగా పాలించిన నాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి. తమిళదేశమున తిరునెల్వేలి మండలంలో ఇలైయరసనందాల్ జమీందారీ రావెళ్ళవారిది[1].

వంశము

[మార్చు]

రావెళ్ళ వారు తొలుత కాకతీయ చక్రవర్తులకడ పిమ్మట ముసునూరి వారికడ ప్రసిద్ధిగాంచిన శూరులు. కాపానీడి మరణానంతరము వీరందరు విజయనగరము తరలిపోయిరి. విజయనగరమునకు వలస పోయిన పిమ్మట రావెళ్ళ వంశీకులు సాళువ, తుళువ, అరవీటి రాజులకడ సేనానులుగా, సామంతరాజులుగా సేవచేసి యశః కీర్తులు పొందిరి. ముఖ్యముగా అరవీటి రాజులకాలములో శ్రీశైలమును, దూపాటిసీమను 1364 నుండి పరిపాలింఛిరి.

పూర్వీకులు

[మార్చు]

గోడచాటు కమ్మవంశమునకు చెందిన వీరమల్లప్ప నాయుడు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు సామంతుడు. తిరువాన్కూరు, కళ్ళికోట మధ్య ప్రాంతమును పాలించాడు. 6,000 కాల్బలము. 400 అశ్విక దళమునకు అధిపతి. అదోని దుర్గమును సాధించి రాయలవారి అభిమానమునకు పాత్రుడయ్యాడు. పలు యుద్ధములలో ముస్లిం సేనలను ఓడించి సోరంగిపురమును జాగీరుగా పొందాడు. తళ్ళికోట యుద్ధానంతరము తురుష్కులకు తలొంచని రావెళ్ళ వారు తిరుచినాపల్లి చేరి నాయక రాజుల కొలువులో సర్దారులుగా చేరారు. రావెళ్ళవారి ప్రవర్తనకు, స్వాభిమానానికి ముగ్ధులైన మధుర నాయకుడు తంజావూరు నాయకునితో కలిగిన మనస్పర్ధలు తొలగించుటకు వారిని పంపాడు. కార్యసాధకులైన రావెళ్ళ వారికి మధుర నాయకుడు తిరుకొట్టుపల్లి జాగీరు, కొవిల్ వాడి కోట, చుట్టుపక్క గ్రామాలు వ్రాసిచ్చాడు. కొంతకాలానికి మధుర, తంజావూరు నాయకులులకు తిరిగి భేదాలు తలెత్తాయి.రావెళ్ళ వారు రంగములోనికి దిగి తగవు పరిష్కారము చేశారు కాని ప్రాణనష్టము జరిగింది. వారి శూరత్వానికి, విశ్వాసమునకు సంతసించిన నాయకుడు తిరునెల్వేలి మండలంలోని ఇలైయరసనందాల్, 18 గ్రామాలు జాగీరుగా ఇచ్చాడు.

జమీందారులు

[మార్చు]

మధుర నేలిన చందా సాహెబ్ రావెళ్ళ వారి జాగీరును జమీందారీగా మార్చాడు. వీరమల్లప్ప నాయుని తొమ్మిదవ తరములో లక్ష్మీ అమ్మాళ్ తన భర్త యుద్ధములలో చేసిన రక్తపాతానికి పరిహారముగా రెండు వేల ఎకరములు బ్రాహ్మణులకు అగ్రహారముగా ఇచ్చింది. అదే ఇప్పటి లక్ష్మీ అమ్మాళ్ పురం. బ్రిటిష్ వారు వచ్చేసమయానికి జమీందారీ పెరియ కస్తూరి రంగప్పస్వామి నాయుడు ఆధీనములో ఉన్నది (1792-1810). తరువాత కస్తూరి రంగప్పస్వామి నాయుడు-1 (1810-1822) కాలములో జమీందారీ రెండుగా విభజింపబడింది. అప్పస్వామి నాయుడు (1822-1854) పలు సేవలు చేశాడు. సత్రములు కట్టించాడు. చెరువులు, బావులు తవ్వించాడు. ఈతని కాలములో జమీందారీ సుభిక్షముగా ఉంది. లక్ష్మీ విలాస్ కు పలు హంగులు సమకూర్చాడు. వేంకటరంగ అప్పస్వామి నాయుడు-1 (1854-1869) కళ్యాణ మహల్, సుబ్రహ్మణ్యస్వామి గుడి కట్టించాడు. కస్తూరి రంగ అప్పస్వామి నాయుడు-2 (1869-1900) బహుభాషావేత్త. సంస్కృతము, తెలుగు, తమిళము, హిందూస్తానీ భాషలలో ప్రావీణ్యత గలదు. డేశమంతటా పర్యటించాడు. యూరోపియనులతో మంచి సాన్నిహిత్యము గలదు. జిల్లా అధికారులతో, పాలకులతో మంచి సంబంధాలుండేవి. మిగతా జమీందార్లు నాయుని చాలా గౌరవముతో చూసేవారు. ఎన్నో దానాలు చేశాడు. 1876లో వచ్చిన పెద్ద కరవు సమయములో పేదవారిని ఆదుకున్నందుకు బ్రిటిష్ ప్రభుత్వము ప్రశంసాపత్రము ఇచ్చింది.

వేంకటరంగ అప్పస్వామి నాయుడు -2 1877లో జన్మించాడు. స్ఫురద్రూపి. అందగాడు. తిరునెల్వేలి హిందూ కళాశాలలో చదివాడు. తెలుగు, తమిళము, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యుడు. ఆంగ్లములో పద్యరచన చేసేవాడు. వీణ వాయించడములో దిట్ట. 23 సంవత్సరముల వయసులో తండ్రి మరణించాడు. ఆస్థానము ప్రజారంజకముగా నడిపాడు. దానధర్మాలకు ప్రసిద్ధుడు. జమీందారీలో 32,000 ఎకరములు ఉన్నాయి. ప్రభుత్వానికి 15,000 రూపాయలు పేష్కష్ కట్టేవాడు.

మూలాలు

[మార్చు]
  1. The Aristocracy of Southern India, A. Vadivelu, Vest publication, Madras, 1903; p. 159