రిషి వ్యాలీ పాఠశాల
రిషి వ్యాలీ పాఠశాల | |
---|---|
స్థానం | |
, | |
సమాచారం | |
రకం | ప్రైవేట్ ఆశ్రమ పాఠశాల |
స్థాపన | 1926 |
స్థాపకులు | జిడ్డు కృష్ణమూర్తి |
పాఠశాల పై పర్యవేక్షణ | అన్నమయ్య జిల్లా |
డైరెక్టర్ | మీనాక్షి తపన్ |
ప్రిన్సిపాల్ | అనంత జ్యోతి |
బోధనా సిబ్బంది | 59 |
తరగతులు | 4–12 |
వయస్సు | 8-17 |
విద్యార్ధుల సంఖ్య | ~365 |
వసతిగృహాలు | 20 |
పరీక్షల బోర్డు | ఐసిఎస్ఇ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ |
రిషి వ్యాలీ పాఠశాల జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన భారతీయ ఆశ్రమ పాఠశాల. ఇది ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా లోని మదనపల్లె సమీపంలో ఉంది. ఇక్కడి విద్యా విధానం కృష్ణమూర్తి బోధనా దృక్కోణం ఆధారపడి ఉంది. సమాజ సేవ, పాఠ్యేతర కార్యకలాపాలు, చర్చలు, సమావేశాలు, ప్రత్యేక ఆసక్తులపై సమావేశాలూ విద్యార్థుల పాఠశాల విద్యలో భాగం. ఈ పాఠశాల బహుళశ్రేణి బోధన పద్ధతిని ఆవిష్కరించింది. ఈ పద్ధతి దేశవ్యాప్తంగా, ప్రపంచంలో చాలా చోట్ల ఆదరణ పొందింది.
ఈ ఆశ్రమ పాఠశాల రిషి లోయలో 375 ఎకరాల విస్తీర్ణంలో, కొండలు, చిన్న గ్రామాల మధ్యలో ఉన్నది. కొండవాలు (ఆంగ్లంలో 'వ్యాలీ') ప్రాంతంలో ఉన్నందున, ఇక్కడ ఋషులు నివసించేవారనే జానపద కథనాలున్నందునా ఈ ప్రాంతానికి "ఋషివ్యాలీ" లేదా రిషి వ్యాలి అనేపేరు వచ్చింది. హార్సిలీ హిల్స్ నుండి, ఈ లోయ ప్రాంతం సుందరంగా కనిపిస్తుంది. ఇది మదనపల్లె పట్టణానికి 16 కి.మీ. దూరంలో, మదనపల్లె - కదిరి మార్గంలో ఉంది. ప్రధాన రహదారి నుండి, 5 కి.మీ. లోతట్టున ఈ పాఠశాల ఉంది. తిరుపతి నుండి రెండు గంటలు, బెంగుళూరు నుండి రెండున్నర గంటలు, చెన్నై నుండి ఐదు గంటల ప్రయాణంతో ఈ పాఠశాలను చేరవచ్చు.
అవలోకనం
[మార్చు]ఈ పాఠశాలలో నాలుగు నుండి పన్నెండవ తరగతి (తొమ్మిది నుండి పద్దెనిమిది సంవత్సరాల వయస్సు) వరకు విద్యార్థులకు ప్రవేశాలుంటాయి. తొమ్మిదవ, పదవ తరగతులకు ఐసిఎస్ఇ బోర్డును, పదకొండవ, పన్నెండవ తరగతులకు ఐఎస్‌సినీ అనుసరిస్తుంది. ప్రాంగణంలో 20 వసతిగృహాలుండగా, ఒక్కో దానిలో 20 మంది విద్యార్థులు ఉంటారు. పాఠశాలను జూనియర్ (నాల్గవ నుండి ఎనిమిదవ తరగతి వరకు), సీనియర్ (తొమ్మిది నుండి పన్నెండవ తరగతి వరకు) అనే రెండు విభాగాలుగా చేసారు. ఈ పాఠశాల కృష్ణమూర్తి బోధనలతో ప్రేరేపితమైనదిగా ప్రసిద్ధి చెందింది. సాంప్రదాయిక విషయాలతో పాటు పర్యావరణం, కళ, సంగీతం, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా ఇక్కడి విద్య ఉంటుంది. ఈ పాఠశాల రిషి వ్యాలీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (రివర్) కార్యక్రమాన్ని, గ్రామీణ విద్యా కేంద్రాన్ని, గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని కూడా నిర్వహిస్తోంది.
360 ఎకరాలు (1.5 కి.మీ2) లలో విస్తరించి ఉన్న పెద్ద ప్రాంగణంలో ఈ పాఠశాల ఉంది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతంలోని ఈ రిషి లోయలో ఉన్న ప్రశాంతమైన వాతావరణం కారణంగా కృష్ణమూర్తి ఈ స్థలాన్ని ఎంపిక చేశాడు. దీని మధ్యలో భారతదేశంలో పురాతనమైన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఈ చెట్టు 2016 లో పడిపోయింది.
రిషి లోయ ప్రదేశం, రిషికొండ క్రింద ఉన్న ఒక పురాతన లోయలో ఉంది. జానపద కథల ప్రకారం ఇక్కడ ఋషులు ధ్యానం చేసేవారు. ఇక్కడ వర్షాకాలంలో ప్రవహించే నదిని రిషి నది అంటారు. ఇది చుట్టుపక్కల గల కొండల పైనుండి, పాఠశాల ప్రాంతం గుండా ప్రవహించేది. ఇది చాలా కాలం క్రిందట ఎండిపోయింది. జిడ్డు కృష్ణమూర్తి తన మొదటి పాఠశాల పేరు ఈ నది లోయ పేరు మీదుగానే ప్రారంభించాడు. రిషి లోయ చుట్టూ పురాతన గ్రానైట్ కొండలు ఉన్నాయి.[1]
సోదర పాఠశాలలు
[మార్చు]- రాజ్‌ఘాట్ బెసంట్ స్కూల్, వారణాసి, భారతదేశం
- ది స్కూల్ KFI, చెన్నై, భారతదేశం
- సహ్యాద్రి స్కూల్, సహ్యాద్రి హిల్స్, పూణే, భారతదేశం
- ది వ్యాలీ స్కూల్, బెంగళూరు, భారతదేశం
- పాఠశాల కెఎఫ్‌ఐ, కాంచీపురం జిల్లా, తమిళనాడు, భారతదేశం
- ఓక్ గ్రోవ్ స్కూల్ (ఓహాయి, కాలిఫోర్నియా), అమెరికా సంయుక్తరాష్ట్రాలు
- బ్రోక్వుడ్ పార్క్ స్కూల్, బ్రామ్డియన్, యుకె
చరిత్ర
[మార్చు]మూలాలు
[మార్చు]ఒక ప్రపంచ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని 1925 లో థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షురాలు అనీబిసెంట్ చేసిన ఆలోచనతో రిషీ వ్యాలీ పాఠశాల మొదలైంది. జిడ్డు కృష్ణమూర్తి జన్మస్థలం, మదనపల్లె సమీపంలోని మూడు స్థలాలను పరిశీలించగా, తెట్టు లోయలోని ఒక ప్రదేశంలో ఒక పెద్ద మర్రి చెట్టు అతని దృష్టిని ఆకర్షించింది. ఈ చెట్టు చుట్టూ ఉన్న ప్రదేశంలో అతడు పాఠశాలను నిర్మించాడు.[2]
1926 లో, జిడ్డు కృష్ణమూర్తి సహోద్యోగి సిఎస్ త్రిలోకికర్ ఎద్దుల బండిపై చుట్టు ప్రక్కల కుగ్రామాలలో పర్యటించి, ప్రాంగణం కోసం 300 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఈ ప్రక్రియ 1929 నాటికి చాలావరకు పూర్తయ్యింది. త్రిలోకికర్ ఈ ప్రాంతాన్ని వేల సంవత్సరాల క్రింద ఋషులు నివసించిన ప్రాంతంగా గుర్తించి, దానికి రిషి వ్యాలీ అని పేరుపెట్టాడు. భూసేకరణ పూర్తికాక ముందే అనీబిసెంట్, హోమ్ రూల్ ఉద్యమం లాంటి ఇతర జాతీయ ప్రాధాన్యత గల అంశాల కారణంగా ప్రపంచ విశ్వవిద్యాలయం ఆలోచనను విడిచిపెట్టింది. [3]
పునస్థాపన
[మార్చు]1918 లో మద్రాసులో అనీబిసెంట్, గిండి స్కూల్‌ను ప్రారంభించింది. తొలి ప్రధానోపాధ్యాయుడుగా యువ థియోసాఫిస్ట్ జివి సుబ్బారావు (జివిఎస్) పనిచేశాడు. గిండి పాఠశాల స్థలం పరిమితంగాను, పరిసరాలు రద్దీగాను, రొదలతోటీ ఉండేవి. ప్రతి సంవత్సరం ఈశాన్య రుతుపవనాల వలన కురిసే కుండపోత వర్షాలతో పాఠశాల పూరికప్పు నాశనమయ్యేవి, గుడిసెలు కొట్టుకుపోయేవి.[4] 1930 చివరలో వచ్చిన ఘోర తుఫాను వలన పాఠశాలలో చాలా భాగం నాశనమైంది. జిడ్డు కృష్ణమూర్తి జివిఎస్‌తో మాట్లాడి, గిండి స్కూల్‌ను రిషి లోయకు మార్చాలని నిర్ణయించాడు. [5]
కృష్ణమూర్తి బోధనలకు ఆకర్షితులైన థియోసాఫిస్టులు పాఠశాల భవనాల నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి ఇంజనీర్లు వేతనం లేకుండా పనిచేయడానికి అంగీకరించారు. 1931 సెప్టెంబరు నాటికి నిర్మాణాలు సిద్ధమయ్యాయి. కొంతకాలం తర్వాత సుబ్బారావు, సుమారు తొంభై మంది విద్యార్థులు, వారి ఉపాధ్యాయులతో కొత్త పాఠశాలకు మారాడు. ఈ మార్పు ముగుస్తూ ఉండగానే, మునుపెన్నడు లేనంతగా, 50 అంగుళాల వర్షం పడి, ఎండిపోయి ఉండే రిషి వ్యాలీ జలమయమైంది. పాఠశాల ఇక్కడికి రావడం దేవుని ఆశీర్వాదంగా, తమ అభివృద్ధి పథానికి చిహ్నంగా చుట్టుపక్కల గ్రామాల నివాసులు భావించారు.[6]
1934 నాటికి, సీనియర్ పాఠశాల భవనంతో సహా పాఠశాల ప్రాథమిక భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ సీనియర్ పాఠశాల భవనాన్ని నేటికీ ఉపయోగిస్తున్నారు. 1937 వరకు భవనాల్లో వెలుతురు కోసం నూనె, పెట్రోమాక్స్ దీపాలను ఉపయోగించేవారు. ఆ తరువాత రెండు జనరేటర్లుతో పనిచేసే విద్యుత్ దీపాలను వాడారు. ఈ కాలంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాంగణంలో, చుట్టుపక్కల చెట్లను నాటడం కూడా ప్రారంభించారు.[7]
ప్రధానోపాధ్యాయుడిగా జివిఎస్ (1931-1941)
[మార్చు]సుబ్బారావు ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న దశాబ్ద కాలం (1931-1941) ఈ పాఠశాలలో విద్యబోధనకు మార్గదర్శకమైంది. గిండి పాఠశాలలో ప్రారంభించిన కొన్ని బోధనా పద్ధతులు ఇక్కడా కొనసాగాయి. గిండీలో తమిళం బోధనా మాధ్యమంకాగా, రిషి వ్యాలీలో తెలుగును కూడా బోధనా భాషగా చేర్చారు. ధ్యానం, నిశ్శబ్ద జీవితం, భౌతిక సంపదను తృణీకరించడం, ప్రకృతితో సామరస్యాన్ని కలిగి ఉన్న సరళమైన జీవనశైలిని అభ్యసించడం ఇక్క్కడి విద్యకు పునాదులయ్యాయి. అందమైన లోయ 'ప్రకృతి అధ్యయనాలు'- బహిరంగ పాఠాలకు అనుకూలమైంది. క్రీడల పోటీలలో, బహుమతి ఇవ్వటం అనారోగ్య పోటీని కలిగిస్తుందని ఆ వేడుకలను జివిఎస్ అనుమతించలేదు. [8]
కులం, లింగం, మతాల భేదభావాలతో పాటు, విద్యార్థులలో భేద భావాలకు కారణమయ్యేవాటన్నిటినీ తొలగించాలి. లౌకికవాదం, సామాజిక సమానత్వాలే లక్ష్యంగా, చరిత్రలో ఓ కొత్త శకం అంచున నిలబడి ఉన్న దేశానికి ఇది ముఖ్యమైనది.[9]
1941 జూన్ 24 న, పాఠశాలపై పోలీసు దాడి జరిగింది. భారత స్వాతంత్ర్యాన్ని ప్రేరేపించే కమ్యూనిస్టు ఆదర్శాలను వివరించే నిషేధిత పత్రికలు, పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది ఉపాధ్యాయులను గృహ నిర్బంధంలో ఉంచారు. జరిమానా విధించారు లేదా మూడేళ్లపాటు పరిశీలనలో ఉంచారు. విద్యాశాఖ కార్యనిర్వాహకుడు చాలాకాలంగా పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను రాజీనామా చేయమని బలవంతం చేశాడు. [10] పర్యవసానంగా, సుబ్బారావు 'ప్రమాదకర' వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అసంతృప్తి చెందిన ఒక సీనియర్ విద్యార్థి, ప్రాంగణంలో కమ్యూనిస్ట్ సాహిత్యం ఉనికి గురించి పోలీసులకు తెలిపినట్లు ఆ తరువాత బయటపడింది. ఈ సంఘటనతో ప్రిన్సిపాల్‌గా జివిఎస్ పదవీకాలం ముగిసింది. [11]
ఒడిదుడుకుల దశాబ్దం (1941-1950)
[మార్చు]జివిఎస్ రాజీనామా వల్ల ఏర్పడిన పర్యవసానాలతో పాఠశాల నిలిచిపోయింది: ఖర్చుల్లో కోత పెట్టారు, బోధనేతర కార్యకలాపాలను తగ్గించారు. కొంతమంది ఉత్తమ ఉపాధ్యాయులు వెళ్లిపోయారు. వై.కె.శాస్త్రి, కె.ఎ.వెంకటగిరి అయ్యర్, నారాయణ అయ్యర్, కె. శ్రీనివాస రాఘవన్‌లు ప్రిన్సిపాళ్లుగా రావటం, పోవడం జరిగి ఈ కాలం పాఠశాల చరిత్రలో ఒకా పరివర్తన దశ అయింది.
ఈ కాలంలో, కృష్ణమూర్తి అమెరికాలో ఉన్నాడు. భారత స్వాతంత్ర్యం తరువాత, 1947 చివరిలో మాత్రమే భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఈ కాలంలో కృష్ణమూర్తి సహచరుడైన మురియెల్ పేన్ పాఠశాలకు కొత్త దిశను ఇచ్చింది.[12] ఆమె1948 లో ఒక ఐదుగురితో కలిసి పరిస్థితిని అంచనా వేసి, పాఠశాల పునరుజ్జీవానికి ప్రయత్నించింది. అయితే ఈ ప్రయోగం అకస్మాత్తుగా ముగిసి, 1949 జూలైలో రిషి వ్యాలీ సంస్థ మూతపడింది.[13]
పేన్ ప్రయోగం విఫలమైంది కానీ పాఠశాల పట్ల ఆమె ఆసక్తి తగ్గలేదు. ఎఫ్. గోర్డాన్ పియర్స్ అనే ప్రముఖ విద్యావేత్త ఆధ్వర్యంలో పాఠశాలను తిరిగి ప్రారంభించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. కృష్ణమూర్తి, పాఠశాల పట్ల నూతన ఆసక్తిని కనబరచాడు.[13]
1950 జూలై లో, 15 మంది విద్యార్థులతో పాఠశాల తిరిగి మొదలైంది. బడ్జెట్‌పై కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, విస్తృత పరిధి లోని విద్యార్థులను ఆకర్షించడానికి ఫీజులను తక్కువ చేశారు. పాఠశాల సుస్థిరమయ్యేంత వరకు సిబ్బంది తక్కువ జీతానికి పనిచేయడానికి అంగీకరించారు.[14] [15]
పియర్స్ సంవత్సరాలు (1951-1958)
[మార్చు]రెండేళ్లలో పాఠశాలలో 110 ఫీజు చెల్లించే బోర్డర్లున్నారు. అడ్మిషన్ల కోసం వేచివుండే వారి జాబితా కూడా ఉండేది. 80% మంది విద్యార్థులు ఉత్తర, పశ్చిమ, తూర్పు భారతదేశం నుండి, కొంతమంది విదేశాల నుండీ రావడంతో విద్యార్థులలో వైవిధ్యం ఎక్కువైంది. [16] ఈ కాలంలో డేవిడ్ హార్స్‌బర్గ్, సర్దార్ మొహమ్మద్ ఉత్తమ ఉపాధ్యాయులలో చెప్పుకోదగిన వారు. [17]
ఈ కాలంలో ప్రవేశపెట్టిన పద్ధతులు ఇప్పటికీ పాఠశాలలో కొనసాగుతున్నాయి. విద్యార్థులు ఉత్తర భారత, దక్షిణ భారత శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవచ్చు. డేవిడ్ హార్స్‌బర్గ్ స్థానిక జానపద నృత్యాలను ప్రవేశపెట్టాడు. ప్రకృతిలో నడవటం, బస చేయటం వంటి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వీటిలో తరచూ ఉపాధ్యాయులు కూడా పాల్గొనేవారు. రిషి వ్యాలీలో పియర్స్ ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక సంప్రదాయాల్లో ఒకటి అస్తాచల్. ప్రతి సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో పిల్లలు అస్తాచల కొండపై సమావేశమై నిశ్శబ్దంగా కూర్చుంటారు. దీనివలన నిశ్శబ్దంగా అంతర్ముఖులయ్యే అవకాశం పిల్లలకు కలిగేది.[18]
1958 అక్టోబరులో పియర్స్, రిషి వ్యాలీ ట్రస్టు తోటి, కృష్ణమూర్తి తోటీ ఏర్పడిన విభేదాల కారణంగా రాజీనామా చేసి, ఊటీలోని బ్లూ మౌంటైన్ స్కూల్, సందూర్ స్కూల్ లను స్థాపించాడు. సర్దార్ మొహమ్మద్, బ్లూ మౌంటైన్ స్కూల్లో చేరాడు. డేవిడ్ హార్స్‌బర్గ్ బెంగుళూరుకు 100 కి.మీ. దూరంలోని కోలార్ జిల్లాలో తన సొంత పాఠశాల నీల్ బాగ్‌ను ప్రారంభించాడు.
బాలసుందరం కాలం (1958-1977)
[మార్చు]ఎస్. బాలసుందరం 1955 డిసెంబరులో కృష్ణమూర్తి ఫౌండేషన్ ఇండియాలో సభ్యుడయ్యాడు. బెంగళూరు లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో బోధించేటప్పుడే రిషి వ్యాలీ ఎస్టేట్ బాధ్యతలు కూడా స్వీకరించాడు. 1958 అక్టోబరులో పియర్స్ రాజీనామా చేసిన తరువాత బాలసుందరంను పాఠశాలకు కొత్త ప్రిన్సిపాల్‌గా నియమించాలని కృష్ణమూర్తి నిర్ణయించాడు. 1977 మార్చి వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆయన పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసాడు.[19]
ఈ కాలం లోనే రిషి వ్యాలీ అనేక విధాలుగా విస్తరించింది. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయల పరంగా రిషి వ్యాలీని స్వయం సమృద్ధంగా మార్చాలని నిర్ణయించారు. వీటిని పాఠశాలకు అనుబంధంగా ఉన్న పొలాల్లో పండించారు. పశువుల కొట్తంలో ఆవులను పోషించి, పాల ఉత్పత్తి పరంగా స్వయం సమృద్ధం చేశారు. రిషి వ్యాలీ ఇరుగు పొరుగు సమాజాలతో మమేకమవడం కోసం ఒక గ్రామీణ కేంద్రాన్ని[20] ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాలకు గృహనిర్మాణం, ఆరోగ్యం, వయోజన విద్య, వ్యవసాయం, పాడి పెంపకంలో వారికి సహాయం చేశారు. [21] పాఠశాల ఫీజు చెల్లించలేని వారికి ప్రభుత్వ పథకాల సహాయంతో పాఠశాల విద్యను అందించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. [22]
కాలిఫోర్నియాలోని హ్యాపీ వ్యాలీ పాఠశాల ఉపాధ్యాయుడు డేవిడ్ యంగ్ 1963 లో అంతర్జాతీయ జానపద నృత్యాలను రిషి వ్యాలీలో ప్రవేశపెట్టాడు. బాలసుందరం పదవీకాలంలోనే, ప్రతి సంవత్సరం, జె.కృష్ణమూర్తి కోసం, మర్రి చెట్టు క్రింద, సంస్కృతం, తమిళం తెలుగు భాషలలో, పాండనల్లూర్ భరతనాట్య శైలిలో నృత్య నాటకాలు ప్రదర్శించారు. [23]
సంప్రదాయాలు, సంస్కృతి
[మార్చు]రిషి లోయకు ప్రత్యేకమైన సంప్రదాయాలు, సంస్కృతులు ఉన్నాయి. [24] పాఠశాల నిర్వహించే కొన్ని అభ్యాసాలు యాభై సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాయి. ఉదయం సమావేశం, అస్తాచల్, ఉదయ సమావేశం సమయంలో జానపద నృత్యం, వారానికి మూడు సార్లు పాఠశాలలో అందరు పాటలు పాడడం, పిల్లలు సాంప్రదాయిక మంతర్ పఠనం, కబీరు నుండి రవీంద్రనాథ్ ఠాగూర్ వరకు కవుల పాటలను నేర్చుకోవడం వంటివి వీటిలో కొన్ని. మృదంగం వీటికి జతగా ఉంటూ ఉంటుంది. మిగిలిన వారంలో, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సందర్శకులు తమకు ఆసక్తి ఉన్న వివిధ విషయాల గురించి ఉపన్యాసాలు ఇస్తారు.
అస్తాచల కొండపై సూర్యాస్తమయ సమయంలో నిశ్శబ్దంగా కూర్చోవడానికి పిల్లలు ప్రతి సాయంత్రం సమావేశమవుతారు. వారు నిశ్శబ్దంగా అంతర్ముఖులవ్వటానికి, ప్రకృతిని పరిశీలించడానికి, పగటి కలలు కనడానికి, తమ ఆలోచనలపై ధ్యానం కేంద్రీకరించేందుకూ ఇది పిల్లలకు వీలు కలిగిస్తుంది.
డేవిడ్ యంగ్ అనే అమెరికన్ ఉపాధ్యాయుడు పాశ్చాత్య జానపద నృత్యాలను పాఠశాలకు పరిచయం చేశాడు. [25] తరువాత, డేవిడ్ హార్స్‌బర్గ్ అనే మరో ఉపాధ్యాయుడు యూరోపియన్, అమెరికన్ జానపద నృత్యాలను పరిచయం చేశాడు. ఈ నృత్యాలు 'జానపద' అనే పేరుతో వారానికి ఒకసారి జరుగుతాయి. పై స్థాయి విద్యార్థులు కింది స్థాయి విద్యార్థులకు నృత్యాలు నేర్పుతారు.
రిషి లోయలో క్రిస్మస్, ఉగాది, శివరాత్రి, మకర సంక్రాంతి వంటి మత, సాంస్కృతిక ఉత్సవాలు జరుపుకుంటారు. మకర సంక్రాంతి సమయంలో, విద్యార్థులందరూ గ్రామస్థులతో పాటు వారి అలంకరించిన ఎద్దులతో కలిసి ఎద్దు నృత్యం చేస్తారు. అటువంటి ప్రత్యేక సందర్భాలలో, విద్యార్థులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తారు.
విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలలో శాస్త్రీయ భారతీయ నృత్యం (భరతనాట్యం), కర్ణాటక సంగీతం, మృదంగం, వయోలిన్, తబలా, పియానోలు ఉంటాయి. ఇక్కడ ఎం. ఎల్. వసంతకుమారి (కర్ణాటక గాత్రం), అమ్జాద్ అలీ ఖాన్ (హిందూస్థానీ గాత్రం), నిఖిల్ బెనర్జీ (సితార్), పాల్ఘాట్ మణి అయ్యర్ (మృదంగం). బాంబే జయశ్రీ (కర్ణాటక గాత్రం) సహా చాలా మంది భారతీయ కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. ప్రఖ్యాత ఒడిస్సీ, భరతనాట్య గురువు, నర్తకి, ఓపాలి ఒపెరాజిత, రిషి వ్యాలీ పూర్వ విద్యార్థిని. అక్కడ ఆమె భరతనాట్యం అధ్యయనం చేసి, రిషి వ్యాలీ నృత్య నాటకాలను మర్రి చెట్టు కింద కృష్ణమూర్తి సమక్షంలో ప్రదర్శించింది.
విద్యార్థులు ఫుట్‌బాల్, క్రికెట్, వ్యాయామక్రీడలు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆటలు ఆడుతారు. చుట్టుపక్కల అరణ్య ప్రాంతం కొండలు ఎక్కేవారికి, ప్రకృతి నడకలకు వెళ్లేవారికి అనువైనది. రిషి వ్యాలీ పాఠశాల జట్టుకు, పొరుగు పాఠశాలల జట్లకూ మధ్య వార్షిక క్రీడల సమావేశం ("స్పోర్ట్స్ డే"), అప్పుడప్పుడు ఫుట్‌బాల్, క్రికెట్, బాస్కెట్‌బాల్ పోటీలూ జరుగుతాయి.
కళలు, చేతిపనులు విభాగంలో విద్యార్థులకు వడ్రంగి పని, కుండలు చేయటం, నేత, బాతిక్, లలిత కళలు నేర్పుతారు.
పర్యావరణ పరిరక్షణ
[మార్చు]చిత్తూరు జిల్లాలోని కరువు పీడిత ప్రాంతంలో రిషి వ్యాలీ ఉంది. ఈ ప్రాంతంలో వర్షపాతం నిలకడగా ఉండదు. అందువలన వ్యవసాయం కష్టంగా ఉండేది. లోయ అంతటా గ్రానైట్ శిలలు పుష్కలంగా ఉన్నాయి. ఇది సముద్ర మట్టానికి 800 మీటర్ల ఎత్తున ఉన్నందున ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు 10°C - 38°C ( 50°F - 100.4°F) మధ్య ఉంటాయి.
ఇక్కడ నేల నల్ల రేగడి, ఎరుపు లాటరైట్ నేలలతో కూడివుంది. మట్టిలో తేమ తక్కువగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతం, చిత్తడి నేలలు, ఆకురాల్చే అడవులు, పొడిగా ఉండి చిట్టడవులతో ఉంటుంది. పాఠశాల ఏర్పాటు చేసినప్పుడు, బావులు మాత్రమే నీటి వనరుగా ఉండేవి. 1960 ల నాటికి, హార్సిలీ హిల్స్ నుండి రిషి వ్యాలీ వరకు పైపులైన్లు వేసారు. విస్తృతమైన వ్యవసాయం, కాలవల ద్వారా సాగునీటి సరఫరా కారణంగా నాలుగు సంవత్సరాల పాటు (1981-1985) బావులు ఎండిపోయాయి. బావులు ఎండిపోయిన వెంటనే, పాఠశాల నీటి అవసరాలను తీర్చడానికి బోరుబావులు వేసారు. బోరుబావుల కారణంగా భూగర్భజలాలు క్షీణించాయి. బోరుబావులను ప్రవేశపెట్టడంతో రైతులు తమ పాత వ్యవసాయ విధానాలను మార్చుకుని, మెట్ట పంటలను ఆపేసి నీరు బాగా అవసరమయ్యే పంటలకు మారారు. దీనివల్ల భూగర్భజలం మరింత క్షీణించింది.
అడవుల అభివృద్ధి
[మార్చు]1980 లో, పక్కనే ఉన్న కొండప్రాంతంలోని 150 ఎకరాలను రిషి వ్యాలీ పాఠశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడవుల అభివృద్ధి కోసం కౌలుకు ఇచ్చింది. కొండలపై సమృద్ధిగా చెట్లను పెంచడం దీని లక్ష్యం. మొదటి దశగా, మేత గొర్రెలు, పశువులను నియంత్రించడానికి చుట్టూ కంచె నిర్మించారు. కొండల నుండి పశుగ్రాసం కోసుకెళ్ళడానికి చుట్టుపక్కల గ్రామాల వారితో ఏర్పాట్లు జరిగాయి. [26] దాదాపు 20,000 చెట్లు, పొదలు, వేలాది మొలకలను పాఠశాల విద్యార్థులు నాటారు. అయితే 1980 లలో ఈ ప్రాంతంలో సుదీర్ఘ కరువుల కారణంగా వారి ప్రయత్నాలు కొంతవరకు విఫలమయ్యాయి. 1988 లో, పాఠశాల ప్రాంగణంలో 20 ఎకరాల లోతట్టు భూమిలో ఒక పెద్దచెరువు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసింది. చుట్టుపక్కల కొండల నుండి చెరువులోకి చేరుకున్న వర్షపు నీరు, భూగర్భ మార్గాల ద్వారా లోయ అంతటా భూగర్భ నీటి మట్టం పెంపుకు ఉపయోగపడుతుంది.
పక్షులు
[మార్చు]1990 లో లోయలో పక్షి జాతులను గుర్తించి, జాబితా చేసే పని ప్రారంభమైంది. 1973-77 నుండి రిషి వ్యాలీ స్కూల్ బర్సర్, రిషి వ్యాలీ బర్డ్ ప్రిజర్వ్ గౌరవ చీఫ్ వార్డెన్, పక్షి ప్రేమికుడూ ఐన రంగస్వామి, విద్యార్థులలో పక్షుల పట్ల ఆసక్తిని పెంచాడు. 1990 లో, మొదటిగా లోయలో పక్షుల జాతులపై ప్రాథమిక సర్వే నిర్వహించినప్పుడు, పక్షి జాతుల సంఖ్య గణనీయంగా పెరిగిందని గుర్తించారు. 1993 మార్చి నాటికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన మొత్తం పక్షి జాతులలో సుమారు 40% అనగా 170 జాతులు, రిషి లోయలో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అరుదైన, స్థానిక పసుపు గొంతు పికిలిపిట్ట (పైక్నోనోటస్ శాంతోలోమస్) కూడా ఉంది.
పసుపు గొంతు పికిలిపిట్ట అద్భుతమైన పునఃప్రవేశం బహుశా 1990 ల ప్రారంభంలో జరిగినా, ఆ తరువాత ఈ పక్షి ప్రాంగణంలో గానీ, సమీప ప్రాంతంలో గానీ కనబడలేదు. అయితే ఈ పక్షులు లోయ పశ్చిమ చివరలో కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హార్స్లీ హిల్స్ పర్వత ప్రాంతంలో క్రమం తప్పకుండా కనబడేవి. ఈ సంఘటన అంతర్జాతీయ పక్షుల పరిరక్షణ మండలి (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ బర్డ్ ప్రిజర్వేషన్ (ఐసిబిపి)) కు నివేదించారు. ఫలితంగా రిషి వ్యాలీని ఇంగ్లండు, కేంబ్రిడ్జ్ లోని ప్రధాన కార్యాలయంలో సంస్థ నిర్వహించే జీవవైవిధ్య మ్యాప్ లోను, కంప్యూటరీకరించిన డేటాబేసు లోనూ చేర్చారు.
1997 లో, రిషి వ్యాలీ లో పక్షులు, ప్రకృతి చరిత్ర అధ్యయన సంస్థను (ఇన్‌స్టిట్యూట్ ఫర్ బర్డ్ స్టడీస్ అండ్ నేచురల్ హిస్టరీ) స్థాపించారు. ఇది సమీపంలో పక్షుల సంఖ్యను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం పక్షుల అధ్యయనం (ఆర్నిథాలజీలో) లో ఇంటి నుండే చదువుకొనే కోర్సును నిర్వహిస్తోంది
విద్యా పరిశోధనలు
[మార్చు]రిషీ వ్యాలీకి చెందిన గ్రామీణ విద్యాకేంద్రం[20] పిల్లల్ని వార్షిక తరగతులుగా విభజించకుండా వారి సామర్థ్యాలను ఎప్పటికప్పుడు మార్చగలిగే గ్రేడులగా విభజించి ఆ గ్రేడులకు బోధించడం విధానాన్ని ఆవిష్కరించింది. దీనిని బహుళశ్రేణి బోధన (Multi grade teaching), పెట్టెలో బడి (School in a box) అని కూడా అంటారు. ఈ విధానాన్ని పద్మనాభరావు, రమ అనే ఉపాధ్యాయ దంపతులు తయారు చేశారు.
ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఒకే తరగతి గదిలో జరిగే విద్యాబోధన దీనికి ఒక ఉదాహరణ. ఒకటి రెండు తరగతుల పాఠ్యాంశాల్ని వివిధ కృత్యపత్రాలు (Activity chart) గా రూపాందిస్తారు. ప్రతి కృత్యపత్రానికి కనీస సామర్థ్య స్థాయిని నిర్ణయించారు. అలా కొన్ని కృత్యపత్రాలు, ఒక విద్యార్ధి సాధించవలసిన సామర్థ్యాన్ని సూచిస్తాయి. దీనిని ఒక స్థానిక పక్షి లేదా జంతువు బొమ్మ చిహ్నంగా ఉంటుంది. ప్రతి కృత్యపత్రంలో ఈ చిహ్నంతో పాటు సంఖ్య ఉంటుంది. తెలుగు, గణితం, సంభాషణా కౌశల్యం, కథలు చెప్పడం లాంటి వివిధ విషయాల్లో నిర్దుష్ట సామర్థ్యాలకు ఈ విధంగా కృత్యపత్రాల సోపానం ఉంటుంది. పిల్లలు ఆ కృత్యపత్రాన్ని నేర్చుకున్నప్పుడల్లా ఆ సోపానంలో మెట్లు ఎక్కుతూ ఉంటారు. దీనివలన ప్రతి ఒక్క పిల్లవాని సామర్థ్యాన్ని విడిగా తెలుసుకోవచ్చు. పై స్థాయి సామర్థ్యాలు గల పిల్లలు, క్రింద స్థాయి పిల్లలకు నేర్పటం వీలవుతుంది. పిల్లలు తక్కువగా ఉండే గిరిజన ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఇది చాలా ఉపయోగం. ఈ పద్ధతిలో రిషీ వ్యాలీ సమీపంలో గ్రామాల పాఠశాలల పిల్లల సామర్థ్యాలు గణనీయంగా పెరిగాయని, రిషీవ్యాలీ పాఠశాలని కాక, ఈ పాఠశాలలను చూడడానికి వచ్చే సందర్శకులు పెరిగారని, రిషీ వ్యాలి పాఠశాల డెరెక్టరు గా పనిచేసిన రాధికా హెర్జ్ బెర్గర్ అన్నారు. ఈ పద్ధతిని ఆంధ్రప్రదేశ్ గిరిజన పాఠశాలలో వాడారు.[27] తరువాత పలు రాష్ట్రాల లోనూ అమలు చేసారు.[20]
గుర్తింపు పొందిన పూర్వ విద్యార్థులు
[మార్చు]- నీలం సంజీవ రెడ్డి, భారత ఆరవ రాష్ట్రపతి
- అదితి రావు హైదరి, నటి [28]
- మిట్టు చండిల్య, వ్యాపారవేత్త [29]
- వరుణ్ గాంధీ, రాజకీయవేత్త, లోక్సభ సభ్యుడు [30]
- శ్రీనివాసన్ జైన్, జర్నలిస్టు, టీవీ యాంకర్
- నచికేత్ మోర్, బ్యాంకరు, సామాజిక వ్యవస్థాపకుడు
- ఓపాలి ఒపెరాజిత, క్లాసికల్ ఇండియన్ డాన్సరు, కొరియోగ్రాఫర్; విశిష్ట ఫెలో, కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం [31]
- కృష్ణారెడ్డి, ప్రింట్ మేకరు, శిల్పి [32]
- సునీల్ షాన్‌బాగ్, థియేటర్ డైరెక్టర్ [33]
- షియావాక్స్ జల్ వజీఫ్దార్, ప్రధాన న్యాయమూర్తి, పంజాబ్, హర్యానా హైకోర్టు [34]
- గోపాల్ విట్టల్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్
- అబీజీత్ దుద్దాలా, నటుడు
చిత్రమాలిక
[మార్చు]-
రిషి వ్యాలీ పాఠశాల ప్రవేశానికి గేటు
-
2019 నవంబరు 17 న KFI సమావేశం రిషి వ్యాలీలో
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Dalal 2007, p. 7.
- ↑ Dalal 2007, p. 3.
- ↑ Dalal 2007, p. 4.
- ↑ Dalal 2007, p. 6.
- ↑ Balasundaram 2012, p. 10.
- ↑ Dalal 2007, p. 9.
- ↑ Dalal 2007, p. 12.
- ↑ Dalal 2007, p. 18.
- ↑ Dalal 2007, p. 14.
- ↑ Dalal 2007, p. 19.
- ↑ Dalal 2007.
- ↑ Dalal 2007, p. 21.
- ↑ 13.0 13.1 Dalal 2007, p. 22.
- ↑ Dalal 2007, p. 23.
- ↑ Dalal 2007, p. 24.
- ↑ Dalal 2007, p. 25.
- ↑ Dalal 2007, p. 26.
- ↑ Dalal 2007, p. 28.
- ↑ Balasundaram 2012, p. 27-29.
- ↑ 20.0 20.1 20.2 "Rural Education Centre (REC)". Rishi Valley. Retrieved 2021-03-01.
- ↑ Balasundaram 2012, p. 41.
- ↑ Balasundaram 2012, p. 43.
- ↑ Balasundaram 2012, p. 77.
- ↑ Thapan 2006, p. 58.
- ↑ Dalal 2007, p. 40.
- ↑ Rangaswami, S.; Sridhar, S. (1993). Birds of Rishi Valley and Renewal of Their Habitats (1st ed.). Andhra Pradesh, India: Rishi Valley Education Centre. p. 51. ISBN 9788186042014.
- ↑ వాడ్రేవు చినవీరభద్రుడు (2005). కొన్ని కలలు.. కొన్ని మెలకువలు(సార్వత్రిక విద్యతో నా అనుభవాలు). ఎమెస్కో. pp. 307–308.
- ↑ Mukherjee, Treena (12 October 2014). "Making the right moves". Telegraph India (in ఇంగ్లీష్). Archived from the original on 12 జూన్ 2018. Retrieved 25 January 2018.
- ↑ Reddy, T. Krithika (15 August 2013). "Buzz in the air". The Hindu (in Indian English). Retrieved 25 January 2018.
- ↑ Sen, Upala; Kohli, Namita (27 March 2009). "Strange Gandhi". Hindustan Times (in ఇంగ్లీష్). Retrieved 25 January 2018.
- ↑ "Dance as Fluid Sculpture: The Example of Odissi". The New York Public Library. 4 November 2006. Retrieved 24 March 2018.
- ↑ https://www.nytimes.com/2018/08/31/obituaries/krishna-reddy-dead.html
- ↑ "Breaking new ground". The Telegraph. 27 July 2008. Retrieved 29 March 2018.
- ↑ "Vazifdar sworn-in as Chief Justice of Punjab & Haryana High". Business Standard India. Press Trust of India. 6 August 2016. Retrieved 24 March 2018.
మరింత చదవడానికి
[మార్చు]- Balasundaram, S. (2012). Non-Guru Guru (1st ed.). 57 Taormina Lane, Ojai, California: Edwin House Publishing, Inc. ISBN 978-0-9760006-3-1.
{{cite book}}
: CS1 maint: location (link) - Dalal, Roshen (2007). Herzberger, Hans; Herzberger, Radhika (eds.). Rishi Valley School: The First Forty Years (2nd ed.). Rishi Valley: Krishnamurti Foundation India.
- Thapan, Meenakshi (2006). Life at School: An Ethnographic Study (2nd ed.). New Delhi: Oxford University Press. ISBN 978-0-19-567964-9. Retrieved 24 September 2013.
- Rangaswami, S.; Sridhar, S. (1993). Birds of Rishi Valley and Renewal of Their Habitats. Rishi Valley Education Centre, Krishnamurti Foundation India. ISBN 9788186042014. Retrieved 5 October 2013.
- Patel, Gieve (2007). Poetry with Young People. New Delhi: Sahitya Akademi. ISBN 978-8126024292. Retrieved 26 September 2013.
- Remembering G. V. Subba Rao: A Life of Dedication to Education (1st ed.). Madras: G. V. Subba Rao Trust. 1980.
- Jayakar, Pupul (1986). J. Krishnamurti: A Biography. New Delhi: Penguin Books India. ISBN 0140103430. Retrieved 26 September 2013.
- Natu, Raghunath (Ravi) (2008). Delightful Days at Rishi Valley. Pune: Utkarsh Prakashan.
బయటి లింకులు
[మార్చు]- "విజ్ఞాన శాస్త్రం పుస్తకం, కృత్యపుస్తకం 6,7 తరగతులకు". Rishi Valley. Retrieved 2021-03-01.
- CS1 Indian English-language sources (en-in)
- క్లుప్త వివరణ ఉన్న articles
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- Pages using infobox school with a linked country
- Commons category link is on Wikidata
- మదనపల్లె
- ఆశ్రమ పాఠశాలలు
- చిత్తూరు జిల్లా
- ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థలు
- అన్నమయ్య జిల్లా
- Pages using the Kartographer extension