Coordinates: 30°32′0″N 79°20′0″E / 30.53333°N 79.33333°E / 30.53333; 79.33333

రుద్రనాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రుద్రనాథ్
Rudranath Temple
రుద్రనాథ్ ఆలయం
రుద్రనాథ్ is located in Uttarakhand
రుద్రనాథ్
ఉత్తరాఖండ్
భౌగోళికం
భౌగోళికాంశాలు30°32′0″N 79°20′0″E / 30.53333°N 79.33333°E / 30.53333; 79.33333
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లాచమోలి
ప్రదేశంరుద్రనాథ్ గ్రామం, గర్వాల్ డివిజన్
ఎత్తు3,600 m (11,811 ft)
సంస్కృతి
దైవంశివుడు
ముఖ్యమైన పర్వాలుమహాశివరాత్రి
వాస్తుశైలి
నిర్మాణ శైలులునార్త్ ఇండియన్ హిమాలయన్ ఆర్కిటెక్చర్
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీతెలియదు
సృష్టికర్తపాండవులు

రుద్రనాథ్ ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉన్న శివుని ఆలయం,[1] ఇది పంచకేదార్ లలో మూడవది. ఇది సముద్ర మట్టానికి 2290 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ  ఆలయం సహజమైన  నీడతో ఉండే రాతి దేవాలయం. నేపాల్ రాజధాని ఖాట్మండులోని పశుపతినాథ్‌ ఆలయంలో శివుడి  శరీరం మొత్తం పూజించబడుతుండగా, రుద్రనాథ్ ఆలయంలో కేవలం శివుడి  ముఖాన్ని మాత్రమే పూజిస్తారు. ఇక్కడ శివుడుని 'నీలకంఠ మహాదేవ' అనే పేరుతో పూజిస్తారు. రుద్రనాథ్ ఆలయం ముందు నుండి మంచుతో కప్పబడిన నందా దేవి, త్రిశూల శిఖరాలు కనిపిస్తాయి. పంచకేదార్ లలో మూడవది అయిన  రుద్రనాథ్ ఆలయాన్ని దర్శించుకోవాలంటే మొదట కేదార్‌నాథ్, తుంగనాథ్ ఆలయాలను దర్శించి ఆ తరువాత గోపేశ్వర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్ గ్రామం నుండి ట్రెక్కింగ్ చేయాలి. ఆ తరువాత గోపేశ్వర్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల్ గ్రామం నుండి మళ్ళి ఇంకొక ట్రెక్ ఉంటుంది. ఇది  అనసూయ దేవి ఆలయం గుండా వెళుతుంది. దాదాపు 24 కి.మీ ట్రెక్కింగ్ మార్గం తరువాత ఈ  ఆలయాన్ని దర్శించుకోవచ్చు.[2]

పురాణం[మార్చు]

రుద్రనాథ్ ఆలయాన్ని పాండవులు నిర్మించారని నమ్ముతారు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు తమ దాయాదులను - కౌరవులను ఓడించి చంపిన తరువాత సోదరహత్య, బ్రాహ్మణహత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం వారు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించి, శివుడి ఆశీర్వాదం కోసం వెళ్తారు. మొదట వారణాసి (కాశీ) కి వెళ్ళి కాశీ విశ్వనాథునిని వేడుకుంటారు. కానీ కురుక్షేత్ర యుద్ధంలో నిజాయితీ లేని కారణంగా శివుడు, పాండవుల ప్రార్థనలను పట్టించుకోలేదు. వారిపై కోపంతో  శివుడు నంది రూపాన్ని ధరించి, హిమాలయాలలోని గర్వాల్ ప్రాంతంలో దాచుకుంటాడు. వారణాసిలో శివుడు కనిపించకపోవడంతో పాండవులు గర్వాల్ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ భీముడు రెండు పర్వతాల వద్ద నిలబడి శివుని కోసం వెతకగా, గుప్తకాశి ("దాచిన కాశీ" - శివుడు దాక్కున్న స్థలం) సమీపంలో ఒక ఎద్దు మేస్తున్నట్లు కనిపిస్తుంది. భీముడు వెంటనే ఆ ఎద్దును శివుడని గుర్తించి, ఎద్దు  తోకని, వెనుక కాళ్ళను పట్టుకుంటాడు కానీ ఎద్దురూపంలో ఉన్న శివుడు భూమిలోకి అదృశ్యమవుతాడు. కేదార్‌నాథ్‌లో మూపురం, తుంగనాథ్‌లో చేతులు, రుద్రనాథ్‌లో ముఖం - నాభి, మధ్యమహేశ్వర్‌లో పొత్తికడుపు, కల్పేశ్వర్ లో వెంట్రుకలు కనిపిస్తాయి. ఐదు వేర్వేరు రూపాల్లో తిరిగి కనిపించడంతో పాండవులు సంతోషించి శివుడిని పూజించడం కోసం ఐదు ప్రదేశాలలో దేవాలయాలను నిర్మించి పాండవులు తమ పాపాల నుండి విముక్తులయ్యారు. పాండవులు మోక్షం కోసం కేదార్‌నాథ్‌లో ధ్యానం, యజ్ఞం చేసి, ఆపై  స్వర్గరోహిణి  అనే స్వర్గ మార్గం ద్వారా  మోక్షాన్ని పొందారు. పంచ కేదార్ దేవాలయాల శివ దర్శనం  పూర్తిచేసిన తర్వాత, బద్రీనాథ్ దేవాలయంలో విష్ణువును సందర్శించడం అనేది అనాదిగా వస్తున్న ఒక ఆచారం. ఇలా చేయడం వలన మోక్షం లభిస్తుందని ఒక నానుడి.[3]

శీతాకాలంలో, రుద్రనాథ్ నుండి గోపేశ్వర్‌లోని గోపీనాథ్ మందిరానికి పూజ కోసం శివుని విగ్రహాన్ని తీసుకువస్తారు. డోలి యాత్ర గోపేశ్వర్ నుండి సాగర్ మీదుగా ప్రారంభమవుతుంది. డోలి యాత్రికులు లియుటి బుగ్యల్, పనార్ దాటి చివరకు పిత్రధర్ చేరుకుంటారు. ఇక్కడ పూర్వీకుల పూజలు జరుగుతాయి. అప్పుడు, ధలాబ్ని మైదాన్ దాటిన తర్వాత, డోలీ యాత్ర  రుద్రనాథ్ చేరుకుంటుంది. ఇక్కడ మొదట వనదేవిని పూజిస్తారు. ఈ ప్రాంతాన్ని వనదేవత కాపాడుతుందని స్థానికుల నమ్మకం. ఈ ఆలయంలో శ్రావణ (జూలై-ఆగస్టు) మాసంలో పౌర్ణమి రోజున వార్షిక జాతరను జరుపుతారు.  రుద్రనాథ్ ఆలయంలో పూజారులుగా గోపేశ్వర్‌లోని భట్‌లు, తివారీలు ఉన్నారు.

పాండవ సెర[మార్చు]

పాండవులు కత్తులు

పాండవ అంటే పాండవులు, సెర అంటే సాగు భూమి అని అర్ధం. దీనిని పాండవ్ సెర, పాండుసెరా అని కూడా పిలుస్తారు, ఇది నందికుండ్ మార్గంలో 4800 మీటర్ల ఎత్తులో ఉన్న లోయ. ఈ లోయ 3-4 కి.మీ వెడల్పు ఉంటుంది. పాండవులు బదిరికా ఆశ్రమంకి వచ్చిన తరువాత కొన్ని రోజులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పాండవులు వ్యవసాయం చేయడం వలన ఈ లోయకి ఆ పేరు వచ్చింది. వారు ఇక్కడ కాలువ తవ్వి, పొలాలను సాగు చేసి, మొత్తం ప్రాంతాన్ని సాగుభూమిగా మార్చారు. ఇప్పటికి ఇక్కడ పాండవుల ఆయుధాలు పాండవ సెరలో పూజింపబడుతున్నాయి. ఇక్కడ పాండవులు సాగు చేసిన వరిపంట దాని అంతట అదే పెరిగి మళ్ళి దాని అంతట అదే భూమిలో కలిసిపోతుంది. పాండవులు నిర్మించిన నీటి పారుదల కాల్వలు ఇంకా ఇప్పటికి పాండవ సెరలో ఉన్నాయి. ఈ కాలువలో నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది.[4][5] రుద్రనాథ్‌కు ట్రెక్కింగ్ మార్గంలో నందకుండ్ (2,439 మీ లేదా 8,002 అడుగులు) వద్ద (మధ్య మహేశ్వర్ మీదుగా వస్తుంటే), యాత్రికులు పాండవ సెరలో ఉన్న పాండవుల కత్తులను పూజిస్తారు.

భౌగోళికం[మార్చు]

ఆలయ సమీపంలో అనేక పవిత్ర జల సరస్సులు (కుండ్) కనిపిస్తాయి. వీటిలో సూర్య-కుండ్, చంద్ర-కుండ్, తారా-కుండ్, మన-కుండ్ మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ నందా దేవి, త్రిశూల్, నందా ఘుంటి వంటి ప్రసిద్ధ పర్వతాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పవిత్రమైన వైతరణి లేదా బైతరణి లేదా రుద్రగంగా నది రుద్రనాథ ఆలయం సమీపంలో ప్రవహిస్తుంది. ఈ నదిని "ముక్తివాహిని" అని కూడా పిలుస్తారు. ఈ నదిని దాటడం ద్వారా చనిపోయిన వారి ఆత్మలు స్వర్గానికి చేరుకుంటాయని, చనిపోయిన వారికీ ఇక్కడ ఒకసారి పిండాలను పెడితే పవిత్ర క్షేత్రమైన గయలో కోటి సార్లు పెట్టిన దానితో సమానం అని భక్తుల నమ్మకం.[6]

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

పంచ కేదార్ యాత్రలో రుద్రనాథ్ అధిరోహణ మార్గం అత్యంత కఠినమైనదిగా పరిగణించబడుతుంది. రుద్రనాథ్ కి సమీప విమానాశ్రయం జాలీ గ్రాంట్, డెహ్రాడూన్ (258 కి.మీ లేదా 160 మైళ్ళు), సమీప రైల్వే స్టేషన్ రిషికేశ్ (241 కి.మీ లేదా 150 మైళ్ళు). రుద్రనాథ్ కు ట్రెక్కింగ్ మార్గాలు చాలా వరకు గోపేశ్వర్ లేదా సమీప ప్రాంతాల నుండి ఉన్నాయి. గోపేశ్వర్ నుండి 5 కి.మీ (3 మైళ్ళు) దూరంలో, సాగర్ గ్రామం నుండి 5 కిమీ (3 మైళ్ళు) ఎత్తులో ఉంది, యాత్రికుల వసతి కోసం ఇక్కడ రుద్ర హోటల్ ఉంది. ఈ మార్గం పొడవైన గడ్డి భూములు, ఓక్ , రోడోడెండ్రాన్ అడవుల గుండా వెళుతుంది. ఈ దారి జారుడుగా ఉంటుంది.[7] రుద్రనాథ్‌కు వెళ్లే ఇతర మార్గాలలో గంగోల్‌గావ్ నుండి 17 కి.మీ (11 మైళ్ళు) దూరం [3 కి.మీ (2 మైళ్ళు) గోపేశ్వర్ నుండి], అడవి గుండా పనార్, నైలా ప్రాంతాలకు చెందిన  గొర్రెల కాపర్ల నివాసాల గుండా వెళ్లాలి. మరొక ట్రెక్కింగ్ మార్గం మండల్ గ్రామం నుండి (గోపేశ్వర్ నుండి 13 కి.మీ లేదా 8 మైళ్ళు) వెళుతుంది, ఇది 6 కి.మీ (4 మైళ్ళు) దూరంలో ఉన్న అనసూయ దేవి ఆలయం మీదుగా వెళ్తుంది, ఆపై రుద్రనాథ్‌కు అదనంగా 20 కి.మీ (12 మైళ్ళు) ఉంటుంది. ఈ అనసూయ దేవి ఆలయంలో, అనసూయ దేవి కష్టాల్లో ఉన్న యాత్రికులకు సహాయం చేస్తుందని నమ్ముతారు. జోషిమఠ్ నుండి హెలాంగ్ మీదుగా మరో 45 కి.మీ (28 మైళ్ళు) పొడవైన మార్గం అందుబాటులో ఉంది (ఈ మార్గం కూడా కష్టంగా పరిగణించబడుతుంది). అదనంగా, కల్పేశ్వర్ నుండి రుద్రనాథ్ వరకు ట్రెక్కింగ్ మార్గం ఉంది, ఇది దుమాక్, కలంగోట్, కిమనా, పల్లా గుండా వెళుతుంది. ఈ రహదారి ఉర్గాం గ్రామానికి కొద్ది దూరంలో కల్పేశ్వర్ వెళ్లే రహదారిలో కలుస్తుంది.

గ్యాలరీ[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Rudranath Temple | Chamoli District Website | India". Retrieved 2023-05-05.
  2. Bisht, Harshwanti (1994). Tourism in Garhwal Himalaya: With Special Reference to Mountaineering and Trekking in Uttarkashi and Chamoli Districts. Indus Publishing. ISBN 978-81-7387-006-4.
  3. "Rudranath Temple, Uttarakhand - Info, Timings, Photos, History". TemplePurohit - Your Spiritual Destination | Bhakti, Shraddha Aur Ashirwad. Retrieved 2023-05-05.
  4. "पांडव सेरा में आज भी अपने आप उगती है धान की फसल ये है पौराणिक कथा". ETV Bharat News. Retrieved 2023-05-05.
  5. "Pandav Sera Trekking Guide - Pandusera Camping, Trek Route, Pandavsera Travel Tips". www.euttaranchal.com. Retrieved 2023-05-05.
  6. "Rudranath temple". www.pilgrimaide.com. Retrieved 2023-05-05.
  7. Bradnock, Robert; Bradnock, Roma (2000). Indian Himalaya Handbook: The Travel Guide. Footprint Handbooks. ISBN 978-1-900949-79-8.

వెలుపలి లింకులు[మార్చు]