రోకలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దంచడం ద్వారా అవసరమయిన వస్తువులపై ముఖ్యంగా ఆహార పదార్ధాములపై ఒత్తిడి కలిగించి కావలసిన రీతిలోకి మార్పు చేసుకోవడానికి ఉపయోగించే ఉపకరణాన్ని రోకలి అంటారు.

రోలు, రోకలి

రోకలి తయారీకి ఉపయోగించే కర్ర[మార్చు]

రోకలి తయారీకి ముఖ్యంగా ఎర్ర చందనం కర్రను ఉపయోగిస్తారు, తదుపరి స్థానంగా ఎనుమోద్దు, ఏపి కర్రను ఉపయోగిస్తారు, ఇవి దొరకని పక్షంలో ఊటి, చింత కర్రలను ఉపయోగిస్తారు. ఊటి, చింత కర్రలలో తొందరగా చీలికలు ఏర్పడతాయి, అందువలన వీటిని చాలా తక్కువగా ఉపయోగిస్తారు, లేక ఉపయోగించరు."మామిడి కర్రతోనా రోకలి చెయ్యటం?" అనే సామెతకూడాఉంది.

రోకలి తయారీకి కావలసిన పరికరాలు[మార్చు]

గొడ్డలి లేదా రంపంతో నరికి లేదా కోసి తీసుకొచ్చిన చేవ కలిగి చక్కగా పొడవుగా ఉన్న కర్ర మొద్దును కావలసిన రూపం వచ్చేలా బాడిద తో చెక్కి తోపడ తో నున్నగా తోపడ పడతారు. కొన్ని రోకళ్ళకు కింది భాగాన ఇనుముతో చేసిన ఉంగరా న్ని లేదా పన్ను ను అమరుస్తారు.

రోకలి చిత్రం

రోకలి రూపం[మార్చు]

రోకలి నున్నగా, గుండ్రంగా, చక్కగా, పొడవుగా ఉంటుంది. రోకలి కింది వైపు, పై వైపు కన్నా ఎక్కువ లావుగా ఉంటుంది. రోకలిని బలంగా పట్టుకునేందుకు వీలుగా గబ్బిడి లేదా అంతకన్నా కొంచెం తక్కువ లావుగా ఉంటుంది. రోకలి 3 అడుగుల నుంచి 6 అడుగుల పొడవు ఉంటుంది. అయితే ఎక్కువగా రోకళ్లు చిన్నవి 2 మూరలు, పెద్దవి 3 మూరలు ఉంటాయి. బాగా చేవ ఉన్న కర్రను ఉపయోగించే ఈ రోకళ్లు ముదురు ఎరుపు నుంచి నల్లగా ఉంటాయి. ఇవి 2 కిలోల నుంచి 6 కిలోల బరువును కలిగి ఉంటాయి.

చేతి నైపుణ్యం[మార్చు]

రోకలిని ఉపయోగించి దంచడం ఒక కళ అని చెప్పవచ్చు. మనకు అవసరమయిన వస్తువును ఎంత బలంగా దంచితే మనకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందో అంతమేరకు దంచడం ఒక కళ. అలాగే ఒకే రోటిలో ఒకే సమయంలో ఒకరి తరువాత ఒకరు ఒకరి రోకలితో మరొకరి రోకలి తగలకుండా వేగంగా అత్యంత నైపుణ్యంగా ఇద్దరు లేదా ముగ్గురు దంచుతారు.

పొన్ను[మార్చు]

పొన్ను : అనగా లోహంతో చేసిన రింగు: దీన్ని కర్రలకు వేస్తారు. రోకలికి క్రింద పెద్దది, పైన చిన్న పొన్ను వుంటుంది. వయసు మీరిన వారు వాడే చేతి కర్రకు కూడ పొన్ను వుంటుండి. పొన్ను వుండే కర్రను పొన్నుగర్ర అంటారు. కొందరు తమ హోదా కొరకు, అందం కొరకు ఇత్తడి పొన్ను, లేదా బంగారు పొన్ను కూడ తమ చేతి కర్రలకు వాడు తుంటారు. పొన్ను వలన ఉపయోగాలు: కర్ర బలంగా వుండి విరిగి పోకుండా, ఆరిగి పోకుండా వుంటుంది. రోకలి లాంటి వాటికి వుండే పొన్ను వలన దానికి బలం చేకూరడమే గాకుండా... దానితో చేసె పని కూడ తొందరగా అవుతుంది. కత్తులకు, కొడవళ్లకు కూడ పొన్ను వుంటుంది. పొన్ను అనగా పిడికి వున్న చిన్న లోహ కవచం.

శుభకార్యాలు[మార్చు]

కొన్ని శుభకార్యాలకు ప్రారంభ సూచికగా ఉదాహరణకు పెళ్ళి పనులు ప్రారంభించేటప్పుడు రోకళ్లకు రక్షా బంధనం కట్టి బేసి సంఖ్య వచ్చేలా ఐదు నుంచి పదకొండు మంది ముత్తైదువుల చేత పసుపు కొమ్ములను దంచి పసుపు తయారు చేస్తారు.

పెద్ద పండుగ[మార్చు]

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు దాదాపు ఆంధ్రప్రదేశ్‍లోని ప్రతి ఇంటిలో రోకలి చప్పుడు వినిపిస్తుంది. ముఖ్యంగా హిందువులు తమ పెద్ద పండగ అయిన సంక్రాంతికి రోకలితో బియ్యాన్ని దంచి అరిసెలు లేక అప్పచ్చులను తయారు చేస్తారు.

రుచి[మార్చు]

రోకలితో దంచి తయారు చేసిన ఆహార పదార్థములు చాలా రుచిగా ఉంటాయి.

వడ్లు దంచుట[మార్చు]

ఎక్కువ మొత్తంలో రోటిలో వడ్లు పోసి దంచుట వలన వడ్లు పిండి కాకుండా బియ్యం, పొట్టు గా విడిపోతుంది.

పచ్చళ్ళు[మార్చు]

కూరలకు సంబంధించిన కూరగాయలను రోటిలో వేసి రోకలితో పచ్చడి పచ్చడిగా దంచి లేదా నూరి తయారు చేసిన వంట కాన్ని పచ్చడి అంటారు.

పిండి, పొడులు[మార్చు]

బియ్యం, గోధుమ, రాగి వంటి ధాన్యములను, శెనగ పప్పు, మొక్కజొన్నలు, మినపప్పు వంటి పప్పులను రోకలితో దంచి పిండిని తయారు చేస్తారు. పసుపు కొమ్ములను దంచి పసుపు పొడిని, మిరపకాయలను దంచి మిరప పొడిని తయారు చేస్తారు.

దీర్ఘకాలం పని చేయడానికి[మార్చు]

రోకలి సుదీర్ఘకాలం పనిచేయడానికి మంచి చేవ కలిగిన పగుళ్లు లేని కొయ్యను ఎన్నుకోవాలి. రోకలికి చెదలు పట్టకుండా మంచి ప్రదేశంలో ఉంచుతూ ప్రతిరోజు లేదా అప్పుడప్పుడు ఉపయోగిస్తుండాలి, వాడిన తరువాత శుభ్రపరచి భద్రపరచుకోవాలి.

ఆరోగ్యం[మార్చు]

రోకలితో దంచడం వలన బహుళ ప్రయోజనాలున్నాయి, వాటిలో ఒకటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం. రోకలితో ఒక క్రమ పద్ధతి ప్రకారం దంచడం, నూరటం, రుబ్బటం వలన వ్యాయామం చేసిన ప్రయోజనంతో పాటు ఎర్ర చందనం వంటి ఔషధ లక్షణాలున్న చెక్కను రోకలిగా ఉపయోగించడం వలన మరింత ప్రయోజనం చేకూరుతుంది.

విద్యుత్ ఆదా[మార్చు]

రోకలి ఉపయోగించి ఆహార పదార్థములను తయారు చేసుకోవటం వలన రుచిగా ఉండటమే కాకుండా విద్యుత్ ఆదా అవుతుంది. నేటి విద్యుత్ కొరత దృష్ట్యా కోతలతో పని లేకుండా ఏ సమయంలో నైనా ఆహార పదార్థములను తయారు చేసుకోవచ్చు.

ముగ్గు పిండి[మార్చు]

ముగ్గు పిండి కోసం సుద్ద(తెల్ల) రాళ్లను దంచి పిండి తయారు చేస్తారు. అయితే ఇక్కడ మామూలుగా వాడే రోకలి కాకుండా రోకలి వంటి ఇనుప వస్తువును లేదా గడ్డపార ను ఉపయోగిస్తారు.

సామెతలు[మార్చు]

 • గోరు చుట్టు మీద రోకలి పోటు
 • మామిడి కర్రతోనా రోకలి చెయ్యటం?
 • పరువుకు రోకలిమింగితే పన్నొచ్చి ముడ్డిన ఇరుక్కుందట
 • రోకలి పోటు-దాసరి పాట
 • రోకలి తూలితే చుట్టాలొస్తారు
 • రోకలి చిగురు పెట్టినట్లు
 • రోకట చిగుళ్లు కోసినట్లు
 • రోళ్ళు పాడినట్టా, రోకళ్ళు పాడినట్టా
 • రోటిలో తలదూర్చి, రోకటి పోటుకు వెరచినట్లు
 • రోటి పాట రోకటి పాట
 • పిచ్చి కుదిరింది, రోకలిని తలకు చుట్టమన్నాడట
 • రోహిణిలో రోళ్లు పగులుతాయి

ఇవి కూడా చూడండి[మార్చు]

 • రోకలిబండ (సహస్రపాదులు) - వెయ్యికాళ్ళ జీవులు - ఇవి రోకలి వలె పొడవుగా, గుండ్రంగా ఉండుట వలన వీటికి రోకలిబండ అనే పేరు వచ్చింది.
 • రోలు

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రోకలి&oldid=3889253" నుండి వెలికితీశారు