లంక సత్యం
లంక సత్యం | |
జన్మ నామం | లంక సత్యనారాయణ |
జననం | 4-8-1915 |
ఇతర పేర్లు | లంక సత్యం |
భార్య/భర్త | సత్యవతి |
ప్రముఖ పాత్రలు | బారిష్టరు పార్వతీశం (1940) లో బారిష్టరు పార్వతీశం బాలనాగమ్మ(1942) లో చాకలి తిప్పడు గులేబకావళి కథ (1962) రహస్యం (1967) |
లంక సత్యం తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించాడు. ఈయన కొన్ని తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
నేపధ్యము
[మార్చు]లంక సత్యం చిన్ననాటి నుంచి నాటకాల్లో వేషాలు వేసేవారు. ఆడవేషాలూ వేశారు. పాటపాడడం వచ్చును గనుక, హబ్బిన్స్ గ్రామఫోన్ కంపెనీలో చేరారు. తర్వాత, సినిమా మీద ఆసక్తి కలిగింది. 1935లో బొంబాయి వెళ్లి సినిమా ప్రయత్నాలు చేశారు. నిరంజన్‌పాల్ అనే ఆయన దగ్గర దర్శకత్వంలో ఉద్యోగం చేశారు. మూడేళ్లపాటు నిరంజన్‌పాల్ తెలుగు సినిమా అమ్మ (1939) తీస్తే - ఆ సినిమాకి ముఖ్య సహాయకుడిగా సత్యం పనిచేశారు. ఒక విషాద పాత్ర కూడా వేశారు. అప్పుడు యుద్ధం వచ్చింది. ఆ దెబ్బకి సత్యం బొంబాయి నుంచి మద్రాసు వచ్చేశారు. నిరంజన్‌పాల్ ఇచ్చిన ఉత్తరంతో సత్యం ఆర్.ఎస్.ప్రకాష్ దగ్గర సహాయకుడిగా కుదిరారు. అప్పుడే ఆయన బారిష్టర్ పార్వతీశం మొదలెడుతూ, పార్వతీశం పాత్రధారికోసం వెతకడం ఆరంభించారు.
అప్పట్లో వేటూరి పరబ్రహ్మశాస్త్రి , పురాణ చిత్రాల్లో ఎక్కడైనా హాస్యపాత్రల్లాంటివి వస్తే వేసేవారు. ఆయన తప్ప హాస్యనటులు లేరు. ఆయన చేత, పార్వతీశం పాత్ర చేయిద్దామనుకుంటే, ఆయన వయసు పెద్దదని వూరుకున్నారు. నేను మామూలు మాటల్లో ఏదో చెప్పి నవ్వించేవాడిని గాని, హాస్యం రాదు. చివరికి ప్రకాష్‌గారు నన్నే వెయ్యమన్నారు. 'నాకు రాదు చెయ్యలేను మొర్రో ' అని మొత్తుకున్నా ఆయన వినలేదు. బలవంతంచేసి చేయించారు. ప్రకాష్‌గారు ఎలా నటిస్తే అలా నటించాను. ఐతే, పాత్రపరంగా హాస్యం వుంది గనక, అది నాకు సహకరించింది అని చెప్పేవారు సత్యం.
సత్యానికి జెమిని సంస్థలో అవకాశం వచ్చింది. 'జీవన్ముక్తి ' (1942) డైరక్టు చేశారు. అందులోనూ, తమిళ చిత్రం 'మదనకామరాజు ' లోనూ లంక సత్యం నటించారు. మదనకామరాజులో ఓ తెలుగు పాట పెట్టారు. పి. సూరిబాబు, నేనూ ఏం పిల్లో సింకిరి బొంకిరి గున్నావు అన్న పాట పాడుతూ నటించాం అని ఒక విశేషం చెప్పారు సత్యం.
సత్యానికి మంచి గుర్తింపు, పేరూ తెచ్చిన సినిమా బాలనాగమ్మ ఇందులో ఆయన చాకలి తిప్పడు వేషం వేసి, బాగా నవ్వించారు. దాంతో హాస్యపాత్రలు బాగా వచ్చాయి. గూడవల్లి రామబ్రహ్మం మాయలోకం (1945) తీసినప్పుడు సత్యంగారు సహాయ దర్శకుడిగా పనిచేస్తూ కాంభోజరాజు కొడుకుగా వేశారు. ఒక పక్క వేషాలు వేస్తూ చిత్రాలు కూడా దర్శకత్వం వహించారు సత్యం.
'సర్కార్ ఎక్స్‌ప్రెస్ ' (1968) సినిమా లంక సత్యంగారు డైరెక్టు చేసినప్పుడు, అందులో నేను నటించాను. అప్పుడు నేను ఆనాటి విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాను. 'సర్కార్ ఎక్స్‌ప్రెస్ ' నే 'బెంగళూర్ మెయిల్ ' పేరుతో కన్నడంలో తీస్తే అదీ సత్యంగారే డైరెక్టు చేశారు. ఎన్.టి.ఆర్. తీసిన గులేబకావళి కథ, విజయావారి జగదేక వీరునికథ, రహస్యం (1967) మొదలైన చిత్రాల్లో సత్యంగారు హాస్య పాత్రలు చేశారు.
మొదటి రోజుల్లో హాస్యం చేసిన వాళ్ళని 'కామిక్ యాక్టర్స్' అనేవాళ్లు - చులకనగా. తర్వాత నుంచి మంచి హాస్యనటులు రావడంతో, హాస్యానికి ప్రాధాన్యత పెరిగింది. కమేడియన్స్ అని పేరుపొందారు. సినిమాల్లో హాస్యానికి పెద్ద పీట వేశారు. శివరావు, రేలంగి వంటి వాళ్లు వచ్చిన తర్వాత, మంచి హాస్య పాత్రలు వచ్చాయి. తర్వాత ఎందరో హాస్యనటులు వచ్చి, సినిమా హాస్యానికి విలువ పెంచారు అని చెప్పారొక సారి సత్యంగారు.
కొన్నేళ్ల క్రితం కాజీపేట దగ్గర రైలు ప్రమాదం జరిగి, చాలామంది మరణించారు. అప్పట్లో మొదటి తరగతి వుండేది. ఆ క్లాసులో ప్రయాణించిన లంకసత్యం కూడా మరణించినట్లు పత్రికలో పేరు వచ్చింది. కానీ, ఆయన హైదరాబాద్‌లో రైలెక్కి, ఘటకేసర్‌లో మిత్రుల బలవంతంతో దిగిపోయారు. ఈ సంగతి తెలియదు.
పోయిన వాడిని తిరిగి వచ్చేసరికి - బంధువులకీ, మిత్రులకీ కలిగిన ఆనందం - ఎప్పుడూ చూడలేదు. నాకింకా ఈ భూమ్మీద నూకలు చెల్లిపోలేదు కాబోలు - దేవుడు నన్ను బతికించాడూ' అని చెప్పారు సత్యం - ఆ సందర్భంలో.
తెలుగులో మొదటిసారిగా వచ్చిన హాస్యచిత్రం 1940 నాటి బారిష్టరు పార్వతీశం. మొక్కపాటి నరసింహశాస్త్రిగారు రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఏమీ తెలియని ఒక పల్లెటూరి యువకుడు, ఓడలో బయల్దేరి లండన్ వెళ్లడం కథ. దారంతా అతని చేష్టలు నవ్విస్తాయి. ఈ పాత్ర ధరించి నవ్వించినది - లంక సత్యం. మోడ్రన్ యునైటెడ్ ఆర్టిస్ట్స్, కంపెనీ పేరు మీద ఆర్.ఎస్. ప్రకాష్ ఈ సినిమా దర్శకత్వం వహించాడు. తెలుగువారిలో మొదటి మూకీ నిర్మించిన రఘుపతి వెంకయ్యగారి కుమారుడు ప్రకాష్. ఐతే, ఈ సినిమా నిడివి - అంటే, ఆ రోజుల్లో సినిమా మూడుగంటలైనా నడవాలి - చాలనందువల్ల ఇంకో రెండు చిన్న హాస్య సినిమాలు కలిపి విడుదల చేశారు. అవి బొండాం పెళ్ళి, చదువుకున్న భార్య. ఈ సినిమాలకు హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వం వహిస్తే ఎల్.వి.ప్రసాద్ నటించారు. తర్వాత ప్రఖ్యాత నటిగా రాణించిన జి. వరలక్ష్మికికి బారిష్టరు పార్వతీశం తొలి సినిమా.
చిత్రసమాహారం
[మార్చు]నటుడిగా
[మార్చు]- బారిష్టరు పార్వతీశం (1940)
- బాలనాగమ్మ (1942)
- చెంచులక్ష్మి (1943)
- మోహిని (తమిళం:மோகினி) (1948)
- మాయలోకం (1945)
- మాయపిల్ల (1951)
- రోహిణి (తమిళం:ரோகிணி) (1953)
- మరుమలర్చి (తమిళం:மறுமலர்ச்சி) (1956)
- శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
- గులేబకావళి కథ (1962)
- శ్రీ సత్యనారాయణ మహత్మ్యం (1964)
- రహస్యం (1967)
దర్శకుడిగా
[మార్చు]- భక్త తులసీదాస్ (1946)
- చంపకవల్లి (తమిళం:செண்பகவல்லி) (1948)
- మోహిని (తమిళం:மோகினி) (1948)
- మరుమలర్చి (తమిళం:மறுமலர்ச்சி) (1956)