లక్కోజు సంజీవరాయశర్మ
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
లక్కోజు సంజీవరాయశర్మ | |
---|---|
![]() నెల్లూరులో గణితావధానం చేస్తున్న సంజీవరాయశర్మ | |
జననం | నవంబర్ 22, 1907 |
మరణం | డిసెంబరు 2, 1997 హైదరాబాదు |
సురరిచితుడు | గణితావధానం |
జీవిత భాగస్వాములు | ఆదిలక్షమ్మ |
పిల్లలు | ఒక మగ, ఇద్దరు ఆడ సంతానం |
తల్లిదండ్రులు |
|
గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 22, 1907 - డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.
జననం[మార్చు]
సంజీవరాయశర్మ 1907 నవంబర్ 22 న వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు లో జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు. జన్మతః అంధుడు కావడంతో పురుడు పోసిన మహిళ గొంతు నులిమి దిబ్బలో పాతెయ్యమంది. కొందరు బంధువులు నోట్లో వడ్ల గింజ వేశారు. అయినా ఆయన్ని మరణం ఏమీ చేయలేకపోయింది. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. శర్మ అక్క పాఠశాలలో చదివినవి ఇంటిదగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే, అవి విని, గుర్తుపెట్టుకుని, గణితంలో అపార విజ్ఞానం సాధించాడు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో, తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవాడు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతోన్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకొన్నాడు.
గణితావధానం[మార్చు]
సంజీవరాయశర్మ తొలిసారి 1928 లో గణితావధానం నిర్వహించాడు. అప్పటినుంచి 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి, ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదు లలోను పలు ప్రదర్శనలను ఇచ్చాడు. అఖిల భారత కాంగ్రెస్మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినపుడు, ప్రధాన ఆకర్షణ సంజీవరాయశర్మ గణితావధానమే.
ప్రత్యేకతలు[మార్చు]
సాధారణంగా, గణితావధానం లో, పుట్టిన తేదీ ఇస్తే, అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం. కాని, ఈ విషయంలో సంజీవరాయశర్మకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవాడు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడాచెప్పి, కొంతవరకు జాతకం కూడాచెప్పేవాడు. ఈ ప్రత్యేకతను (మానవ గణనయంత్రంగా పేరొందిన శకుంతలాదేవితో సహా) మరెవరూ చూపలేకపోయారు. ఆవిధంగా, ఇది అనితరసాధ్యమైన ప్రత్యేకత.
ఒక చిన్న వైఫల్యం[మార్చు]
సంజీవరాయశర్మ ఏవిధంగా చూసినా గణనంలో గొప్పవాడు. జాత్యంధుడైనా, ఏవిధంగా గణనం చేసేవాడో తెలుసుకొందామనుకున్న వారికి నిరాశే ఎదురయింది. పుట్టు గ్రుడ్డి అయినందున, అంకెల భావనయే కాని, రూపము తెలియదు. మరి ఎలా గణనం చేసేవాడోనని అడుగుతే, తనకు చీకటి, అందులోనే వెలుగు తప్ప మరేమీ తెలియదనీ, అందులోనే సమాధానం తట్టుతుందనీ చెప్పాడు. కనుక, అతనిది దైవదత్తమైన వరమే కాని మరొకటి కాదు. శ్రీనివాస రామానుజన్ కు గోడ చేర్పు లాగ హార్డీ దొరికినట్లు, ఇతనికి కూడా ఎవరైనా దొరికి ఉంటే, ప్రపంచ ప్రఖ్యాతి వచ్చేది.
ఒకసారి, విశాఖపట్నంలో గణితావధానం చేస్తున్నప్పుడు అడిగిన ఒకప్రశ్న:
61 x2+1 = y 2
అనే సమీకరణానికి x, yలు ధన పూర్ణాంకాలు అయేటట్లు సాధన చెప్పండని కోరగా, తనకు సాధన తట్టడం లేదని, కాని ఆ సాధనలో చాలా పెద్ద అంకెలు వస్తాయని చెప్పాడు. సాధన చెప్పలేకపోవడం ఒక చిన్న వైఫల్యంగా తీసుకున్నా, సాధనలో చాలా పెద్ద అంకెలు వస్తాయన్నది నిజం.
సాధన : x = 226153980, y = 1766319049
ఇలాంటి సమీకరణాలను, పెల్ సమీకరణాలు అంటారు. ఇవి డయొఫాంటైన్ సమీకరణాలలో ఒక ప్రత్యేకమైన తరగతి. ఇలాంటి సమీకరణాలకు సాధనలు కనుక్కొనేందుకు చాలా కాలము క్రితమే ప్రముఖ భారతీయ గణితవేత్తలు, బ్రహ్మగుప్తుడు ( క్రీ.శ.628) సమాస పద్ధతిని, భాస్కరాచార్యుడు ( క్రీ.శ.1150) చక్రవాళ పద్ధతిని సూచించారు.
ఆధునిక కాలంలో, ఈ సమీకరణాల సాధనకు, సతత భిన్న వాదమును వాడుతారు.
సత్కారాలు[మార్చు]
- వీరిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 1996 లో గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.
- వీరు 1959 లో డిల్లీలో అప్పటి రాష్ట్రపతి శ్రీ బాబూరాజేంద్రప్రసాద్, ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ లాంటి పెద్దలముందు తన ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు.[1]
కుటుంబము[మార్చు]
ఆయనకు పందొమ్మిదవయేట వివాహమైనది. ఆయన భార్య పేరు ఆది లక్ష్మమ్మ. పెళ్ళినాటికి ఈమె వయస్సు తొమ్మిదేళ్లు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. భార్య ఆదిలక్ష్మమ్మ 1994 జనవరి 5 న శ్రీకాళహస్తిలో చనిపోయింది. ఆ తరువాత ఆయన మకాం హైదరాబాదులో ఉన్న కుమారుని వద్దకు మారింది. ఇతడు 1997 డిసెంబరు 2 న హైదరాబాదులో పరమపదించాడు.
మూలాలు[మార్చు]
- ↑ ఈనాడు కడప 14 సెప్టెంబరు 2013. 15వ పేజీ.
- ఇందులో ప్రస్తావించిన కొన్ని వివరాలకు చూ.ఆంధ్ర జ్యోతి, తే. 12-2-1995.