లాలా అమర్నాథ్
లాలా అమర్ నాథ్ (1911 - 2000) 1933 నుంచి 1952 వరకు 19 సంవత్సరాలు భారతదేశం తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన కుడిచేతివాటం గల బ్యాట్స్మెన్.
జీవితం[మార్చు]
సెప్టెంబర్ 11, 1911 న పంజాబ్ లోని కపుర్తాలాలో లాలా అమర్నాథ్ జన్మించాడు. దేశ విభజన తరువాత భారత దేశానికి నాయకత్వం వహించిన తొలి కెప్టెన్ కూడా ఇతనే. అతని కుమారులు సురీందర్ అమర్నాథ్, మోహిందర్ అమర్నాథ్. మొహీందర్ అమరనాధ్ కూడా టెస్ట్ క్రికెట్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇతను 2000లో మరణించాడు.
ప్రస్థానం[మార్చు]
1933 డిసెంబర్ 15 న తొలి టెస్ట్ ఆడుతూ సెంచరీ సాధించాడు. అది టెస్ట్ క్రికెట్ లో భారతీయుడు సాధించిన తొలి శతకం. తొలి టెస్ట్ లోనే శతకం సాధించిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ గా కూడా రికార్డు సృష్టించాడు. 1952 డిసెంబర్ వరకు టెస్ట్ క్రికెట్ ఆడిన లాలా అమర్నాథ్ మొత్తం 24 టెస్టులు ఆడి 878 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, 4 అర్థ శతకాలున్నాయి. టెస్ట్ క్రికెట్ లో బౌలింగ్ చేసి 45 వికెట్లు కూడా పడగొట్టాడు. డొనాల్డ్ బ్రాడ్మెన్ను హిట్ వికెట్ ద్వారా ఔట్ చేసి అతనిని ఆ విధంగా ఔట్ చేసిన ఏకైక బౌలర్ గా నిల్చాడు. అతను రెండు పర్యాయాలు టెస్ట్ సీరీస్ లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. పటౌడీ సీనియర్ తర్వాత ఒకసారి, విజయ్ హజారే తర్వాత మరోసారి నాయకత్వ పగ్గాలు చేపట్టాడు. తొలిసారిగా పాకిస్తాన్ను టెస్ట్ సీరీస్ లో అతని నాయకత్వం లోనే భారత్ విజయం సాధించింది.