లింగంపల్లి ఎల్లమ్మ జాతర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లింగంపల్లి ఎల్లమ్మ జాతర
అధికారిక పేరుఎల్లమ్మ జాతర
జరుపుకొనేవారునారాయణపేట జిల్లా ప్రజలు
రకంజాతర, ఉత్సవం
ప్రారంభంమాఘమాసం మొదటి మంగళవారం
ముగింపుఐదవ మంగళవారం
జరుపుకొనే రోజుఫిబ్రవరి (సాధారణంగా)
,జనవరి (కొన్ని సార్లు)
ఉత్సవాలు5 వారాలు
రేణుకా ఎల్లమ్మ దేవత

లింగంపల్లి ఎల్లమ్మ జాతరలో రేణుక ఎల్లమ్మ దేవత ప్రధాన దైవంగా పూజలందుకుంటుంది. ప్రతి సంవత్సరం ఈ జాతర మాఘమాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు మొదలై ఐదు వారాల పాటు జరుగుతుంది. కొలిచిన వారికి కొంగు బంగారు దైవంగా లింగంపల్లి ఎల్లమ్మ దేవత ప్రసిద్ధి చెందింది.[1]

జాతర స్థలం[మార్చు]

నారాయణపేట జిల్లా లోని నారాయణపేట మండలానికి చెందిన లింగంపల్లి అనే గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఇది నారాయణపేటకు 18 కిలోమీటర్ల దూరంలో, కొల్లంపల్లికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని కొల్లంపల్లి గ్రామానికి చెందిన భక్తులు నిర్మించారు. ఈ జాతర జరుపుకోడానికి కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి మొదలైన రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు. ఈ గ్రామానికి కొంత దూరంలో ఉన్న జాజాపూర్, నారాయణపేట ప్రాంతాల్లో కూడా ఎల్లమ్మ ఆలయాలు ఉన్నాయి ఆ ప్రదేశాల్లో కూడా ఈ జాతర ఐదు వారాల పాటు జరుపుతారు. అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలు ఈ ఐదు వారాల్లో ఏదో ఒక మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి జాతర స్థలానికి చేరుకొని రోజంతా అక్కడ గడుపుతారు.[2]

ఇక్కడి ఆలయం చాలా సాధారణంగా చుట్టూ ప్రహరీ గోడ ఉండి, మధ్యలో ప్రధాన ఆలయం ఉంటుంది. ఆలయ ప్రధాన మందిరంలో ప్రధాన మూర్తి కొలువై ఉన్న ప్రదేశంలో పైకప్పు ఉండదు. కేవలం పరిసరాల్లో ఉన్న వేపచెట్టు మాత్రమే పైన కనిపిస్తూ ఉంటుంది. ఆలయ ప్రహరీ గోడకు, ప్రధాన ఆలయానికి మధ్య కోపంతో గండ్ర గొడ్డలిని చేతబట్టిన పరుశరాముడి విగ్రహం కూడా ఉంటుంది.

జాతర కాలం[మార్చు]

ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే మొదటి మంగళవారం నాడు ఈ జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఇలా ఐదు వారాలపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం నాడు ప్రత్యేక పూజలు, వేడుకలు జరుపుతారు.

స్థల పురాణం[మార్చు]

భాగవత పురాణం ప్రకారం క్షత్రియుడైన పరుశరాముడు తన తల్లి అయిన రేణుక ఎల్లమ్మ కు తపస్సు చేసుకోడానికి వెళ్లిన తండ్రి జమదగ్ని జాడ తెలుపమని అడుగుతాడు. ఎంత వేడుకున్నా ఎల్లమ్మ తన భర్త జాడ చెప్పకపొవడంతో కోపోధ్రిక్తుడైన పరుశరాముడు తన గండ్ర గొడ్డలితో తన తల్లి ఎల్లమ్మ తలను చేధిస్తాడు. తదనంతరం రేణుక ఎల్లమ్మ తల్లి తల ఈ లింగంపల్లి ప్రాంతంలో వచ్చి పడిందని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది.

బోనాల ప్రత్యేకత[మార్చు]

ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఒకరోజు రేణుక ఎల్లమ్మ భర్త జమదగ్ని మహర్షి జపం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అతనికి ఆకలి వేస్తుంది తద్వారా భార్య ఎల్లమ్మకు బోనాలు చేసుకొని ఆహారం తీసుకొని రమ్మని సమాచారం పంపుతాడు. భర్త మాట విన్న ఎల్లమ్మ ఏడు కుండల్లో ఆహారం నింపుకొని ఒకదానిపై ఒకటి పెట్టి తలపై ఉంచుకొని అడవిలో ప్రయాణిస్తూ ఉండగా, మాయావి కార్తికేయ అనే రాక్షసుడు జమదగ్ని మహర్షి జపాన్ని భగ్నం చేయాలన్న ఉద్దేశ్యంతో, అతనికి బాగా ఆకలి వేయాలన్న ఉద్దేశ్యంతో ఎల్లమ్మ తీసుకొస్తున్న బోనాలను ఎలాగైనా ఆపాలని భిక్షగాడి రూపంలో వచ్చి ఆకలి ఆకలి అంటూ వేడుకుంటాడు. చాలా సేపటికి ఎల్లమ్మ కరుణతో, జాలితో తన భర్త కోసం తీసుకెళ్తున్న బోనాలను మాయవి కార్తికేయునికి ఇచ్చేస్తుంది, తదనంతరం నిజాన్ని తెలుసుకొని బాధపడ్డ ఎల్లమ్మకు తన భక్తులు బోనాలు తెచ్చి ఇచ్చి సహాయం చేశారు. ఈ సంఘటన నేటి వరకూ ఒక ఆచారంగా కొనసాగుతుంది.

ఆచారాలు[మార్చు]

రేణుక ఎల్లమ్మ దేవతకు జాతర సమయంలో బోనాలు, జంతు బలులు చేయడం ఇక్కడి ప్రధాన ఆచారం.

జాతరలో ప్రధాన ఘట్టం మొదటి మంగళవారం పెద్ద బోనంకుండ ఊరేగింపును విశేషంగా నిర్వహించడం ఇక్కడి భక్తుల ఆనవాయితి. ముఖ్యంగా అమ్మవారి భక్తురాలైన సాయమ్మ నోటికి తాళం వేసే ఘట్టం అత్యంత ప్రసిద్ధి చెందింది. గవ్వల దండను సాయమ్మ మెడలో వేసి ముఖానికి బొట్లు పెట్టి నోటికి తాళం వేసి దేవాలయం చుట్టూ ప్రదక్షణ చేయిస్తారు. పెద్ద బోనం కుండ తిరిగే సమయంలోనే చిన్న పిల్లలకు బండారు (పసుపు) వేస్తే మళ్లీ ఏడాది వరకు ఏ విధమైన వ్యాధులు వ్యాపించవనేది భక్తుల నమ్మకం.[3]

మూలాలు[మార్చు]

  1. "కొలిచిన వారికి కొంగు బంగారం లింగంపల్లి ఎల్లమ్మ". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2022-02-07. Retrieved 2022-02-06.
  2. "Lingampally". ONE FIVE NINE explore India. Archived from the original on 2022-02-07.
  3. "ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం". ఈనాడు. Archived from the original on 2022-02-07. Retrieved 2022-02-05.