లోమో ఎల్ సి-ఏ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లోమో ఎల్ సి-ఏ
లోమో ఎల్ సి-ఏ
ఉత్పాదకుడుLomography
రకంటాయ్ కెమెరా
సెన్సార్ రకంఫిలిం
సెన్సార్ పరిమాణం36 ఎంఎం x 24 ఎంఎం
రికార్డింగ్ యానకం135 ఫిల్మ్


లోమో ఎల్ సి-ఏ (ఆంగ్లం: Lomo LC-A) 1984 లో పరిచయం చేయబడిన ఒక స్థిర కటకం, లీఫ్ షట్టర్ గల, 135 ఫిల్మ్ ను వాడే ఒక (కాంపాక్ట్) టాయ్ కెమెరా. సోవియట్ ప్రభుత్వం ఆజ్ఙ మేరకు అప్పట్లో మంచి ఆదరణ గల కోసినా సి ఎక్స్-2 కెమెరా స్ఫూర్తిగా లోమో సంస్థ దీనిని నిర్మించింది. LC-A అనగా Lomo Compact Automat [1] (పేరు లోనే ఇది కాంపాక్ట్, ఆటోమేటిక్ కెమెరా అని స్పష్టమతుంది.)

1994 లో లోమో ఎల్ సి-ఏ ఉత్పత్తి ఆగిపోయింది. 1990వ దశకం లో వియన్నాకు చెందిన కొందరు విద్యార్థులు ఈ కెమెరాతో ఫోటోలు తీసి, వాటికి ముగ్ధులయ్యారు. దీంతో ఉత్పత్తిని పున:ప్రారంభించవలసిందిగా వారు కోరారు. మరల దీని తయారీ 2005 వరకు సాగింది.

2006 నుండి లోమో ఎల్ సి-ఏ+ పరిచయం చేయబడినది. దీని ఉత్పత్తి చైనాకు తరలించడమైనది. 2007 వరకు రష్యాకు చెందిన లోమో పీఎల్ సీ రూపొందించిన కటకాన్నే ఈ కెమెరా వాడగా, దాని తర్వాత ఈ కటకం చైనాలో తయారవుతోంది.

ఒక ప్రత్యేకమైన శైలిలో ఫోటోలను తీయటం, కనుమరుగైపోతోన్న అనలాగ్ ఫోటోగ్రఫీ కి ప్రాణవాయువు ఊదటమే కాక, లోమోగ్రఫీ అనే ప్రత్యేక కళా ఉద్యమాన్ని కూడా సృష్టించటం తో లోమో ఎల్ సి-ఏ కెమెరా అంతర్జాతీయ స్థాయిలో ఎనలేని ప్రాధాన్యం సంపాదించుకొంది.

చరిత్ర[మార్చు]

1981[మార్చు]

లోమో ఎల్ సి-ఏ స్ఫూరి: కోసినా సి ఎక్స్ 2

జపాన్ చే నిర్మించబడ్డ కోసినా సి ఎక్స్-2 విడుదల చేయబడింది [2]

1982[మార్చు]

అప్పటి సోవియట్ యూనియన్ రక్షణ మంత్రి, లోమో ఫ్యాక్టరీ దర్శకుడు కోసినా సి ఎక్స్-2 కెమెరా యొక్క లక్షణాలకు ఆకర్షితుడయ్యాడు. ఈ కెమెరా వలెనే సోవియట్ పౌరులకు ఆనందాన్ని పంచే ఒక సరళమైన కెమెరాను లోమో సంస్థ తయారు చేయాలని ఆజ్ఙ జారీ చేయటం జరిగింది.

1984[మార్చు]

లోమో ఎల్ సి-ఏ కు కుడి ప్రక్కన సూక్షరంధ్రం నియంత్రించే మీట కలదు

లోమో ఎల్ సి-ఏ తయారీ ప్రారంభమైంది. దీని కటకాన్ని రూపొందించిన Tarabukin అనే వ్యక్తి యొక్క పేరే, కటకానికి Minitar అనే పేరు పెట్టేలా చేసింది. [3]

ఔత్సాహిక సోవియట్ ఫోటోగ్రఫర్ల హృదయాలను లోమో ఎల్ సి-ఏ గెలుచుకొంది. వారి జేబులలో చోటు సంపాదించుకొంది. మొదట కేవలం సోవియట్ పౌరుల కోసం ఈ కెమెరా తయారు చేయబడిననూ తర్వాత ఇతర కమ్యూనిస్టు దేశాలైన ఉక్రెయిన్, పోలండ్, చెకొస్లోవేకియా, క్యూబా దేశాలకు ఎగుమతి చేయబడింది.

1991[మార్చు]

వియన్నా కు చెందిన ఒక విద్యార్థి బృందం చెకోస్లోవేకియా రాజధాని ప్రేగ్ లోని ఒక పురాతన కెమెరా దుకాణంలో లోమో ఎల్ సి-ఏ ను చూశారు. ఆసియా ఖండం నుండి దిగుమతి అవుతోన్న కెమెరాల ధాటికి అప్పటికే లోమో ఎల్ సి-ఏ మరుగున పడింది. తమాషాగా వీరు కొన్ని లోమో ఎల్ సి-ఏ లను కొని రకరకాల కోణాల్లో ఫోటోలు తీసారు.

1992[మార్చు]

లిస్బన్ లోని లోమో రాయబార కార్యాలయం

లోమో ఎల్ సి-ఏ తో వియన్నా విద్యార్థి బృందం తీసిన ఫోటోలకు పొగడ్తల వరద వచ్చి పడింది. కెమెరాకు విపరీతమైన డిమాండు ఏర్పడింది. వియన్నా లో Lomographische Gesellschaft స్థాపించబడింది. లోమో ఎల్ సి-ఏ కెమెరాలు వియన్నాకు దిగుమతి చేసుకోబడ్డాయి. కెమెరా యొక్క ఖ్యాతిని కొత్త సంస్థ విశ్వవ్యాప్తం చేసే ప్రయత్నం చేసింది. లోమోగ్రఫీ అధ్యయనానికి ప్రదర్శనశాలలు, కార్యాలయాలు నెలకొల్పబడ్డాయి. అనుకొన్న దానికంటే వేగంగా కళా విప్లవం ప్రాకింది.

కెమెరా తయారీకి కావలసిన ముడిపదార్థాలు తగ్గు ముఖం పట్టాయి. వియన్నా విద్యార్థి బృందం నేరుగా లోమో సంస్థకు ప్రయాణం కట్టారు. లోమోగ్రఫీ ఎంత వేగంగా విస్తరిస్తోందో తెలిపి లోమో కార్మాగారపు అధినేత (అప్పటి సెయింట్ పీటర్స్‌బర్గ్ ఉప మేయర్) అయిన వ్లాదిమిర్ పుతిన్) కు తెలిపి, మంతనాలు జరిపి, ఒప్పించి ఎల్-సి ఏ తయారీ పున:ప్రారంభం అయ్యేట్లు చేశారు.

1994[మార్చు]

లోమో ఎల్ సి-ఏ వ్యూ ఫైండర్

సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తో రష్యా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. కెమెరా కొనుగోళ్ళు తగ్గాయి. అప్పటికే 15,000 వేల మంది లోమో కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. కేవలం ముప్ఫై మంది ఉద్యోగులతో నడుస్తోన్న లోమో సంస్థలో కెమెరా, ఫిలిం తయారీ నిలిచిపోయింది.

1995 - 1997[మార్చు]

నెలకు 1000 కెమెరాల చొప్పున ఆస్ట్రియాకు లోమో ఎల్ సి-ఏ లు దిగుమతి అయ్యేవి. ఆస్ట్రియా కు ఇవి సరిపోయేవి కావు. సోవియట్ విచ్ఛిన్నం వలన తయారీ రంగంలో ధరలు పెరిగాయి. దీని తో లోమో ఎల్ సి-ఏ కెమెరా ధరలు 50% పెరిగాయి. నిరాశ చెందిన లోమోగ్రఫర్లు మరొకమారు చర్చలు జరిపిననూ అవి విఫలం అయ్యాయి. ఆస్ట్రియా రాయబార కార్యాలయం వ్లాదిమిర్ పుటిన్ తో సమావేశం అయ్యింది. తయారీ ధరలను సరి చేయవలసిందిగా పుతిన్ లోమో ను కోరారు. ఎట్ట పరిస్థితులలోను లోమో ఎల్ సి-ఏ తయారీ ఆగటానికి వీలు లేదని సర్వులూ అభిప్రాయపడ్డారు.

1997[మార్చు]

ఫిలిం స్పీడ్ సూచిక. ముందున్న చక్రాన్ని త్రిప్పటం ద్వారా ఫిలిం స్పీడ్ ను ఎంచుకొనవచ్చును

ధరల పెరుగుదల నేపథ్యంలో లోమో కెమెరాను తక్కువ ధరకే ఎలా తయారు చేయాలో తర్జన భర్జనలు జరిగాయి. లోమో ఉన్నతాధికారులు వర్గం, ఉత్పత్తిని వ్యతిరేకించారు. అయినా ప్రపంచవ్యాప్తంగా లోమోగ్రఫీకి పెరుగుతోన్న డిమాండును దృష్టిలో ఉంచుకొని యాజమన్యం తయారీ కొనసాగించటానికి పచ్చ జెండా ఊపింది. తయారీ కొనసాగింది.

2005[మార్చు]

ఒక కార్మాగారం మొత్తం కేవలం ఒకే చవక కెమెరా ఉత్పత్తికే అంకితమైపోవటం వలన లోమో ఫ్యాక్టరీ మనలేకపోయింది. మొదట లోమోగ్రఫర్లు ఈ వార్తతో నీరుగారిపోయిననూ, దీనినే ఒక అవకాశంగా మలచుకొన్నారు. లోమో అత్యంత ప్రీతిపాత్రమైన లక్షణాలను అలాగే ఉంచి, మరిన్ని క్రొత్త లక్షణాలను అందులో ఇమిడ్చే ఆలోచన చేశారు.

2006 - 2007[మార్చు]

లోమో ఎల్ సి-ఏ+ అవతరించింది. ద్విబహిర్గతం కోసం ప్రత్యేకంగా ఒక మీట అమర్చబడింది. ఫిలిం వేగం శ్రేణి విస్తరించబడింది. లోమోగ్రఫీ సంస్థ దీనిని చమత్కారంగా Copy of the copy of the copy గా వ్యవహరించింది (కోసినా సి ఎక్స్ 2 యొక్క కాపీ లోమో ఎల్ సి-ఏ అయితే, లోమో ఎల్ సి-ఏ యొక్క కాపీ లోమో ఎల్ సి-ఏ+ కనుక). తయారీ ధరలు తగ్గించటానికి తయారీ రంగం చైనా కు తరలించటం జరిగింది. 2007 నుండి సరిక్రొత్త లోమో ఎల్ సి-ఏ+ లోమోగ్రఫర్లకు లభ్యం అయ్యింది.

2009[మార్చు]

25 ఏళ్ళ చరిత్ర గల లోమో సంబరాలు జరుపుకొంది.

2011[మార్చు]

లోమో ఎల్ సి- వైడ్ విడుదల అయ్యింది. ఫుల్ ఫ్రేం, హాఫ్ ఫ్రేం, స్క్వేర్ ఫార్మాట్ లలో ఈ కెమెరా ఫోటోలు తీస్తుంది.

పని చేయు విధానం[మార్చు]

కేవలం బహిర్గతం మాత్రమే ఎల్ సి-ఏ లో స్వయంచాలితం. ఫిలిం ను లోడ్ చేయటం, ముందుకు పంపటం, రీవైండ్ చేయటం, ఫోకస్ అన్నీ మానవీయమే.

ఇందులో బహిర్గతం పూర్తిగా స్వయంచాలితం. " A " ను సూచించే ఆటోమేటిక్ ఎక్స్పోజర్ లో షట్టరు వేగం 2 నిముషాల నుండి 1/500 సెకనుల వరకు ఉంటుంది. సూక్ష్మరంధ్ర శ్రేణి f/2.8 నుండి f/16 వరకూ కలదు.

లోమో ఎల్ సి-ఏ+ లో సూక్ష్మరంధ్రాన్ని కెమెరా దానంతట అదే ఎంచుకొనేటట్లు స్వయంచాలితం చేశారు.

లక్షణాలు[మార్చు]

 • జీవకళతో, వర్ణ వైరుధ్యం (Color Contrast) అధిక పాళ్ళలో ఉండి విగ్నెటింగ్ కు లోనయ్యే ఛాయాచిత్రాలు [4]

లోమో ఎల్ సి-ఏ+ అదనపు లక్షణాలు[మార్చు]

 • బహుళ బహిర్గతానికి ప్రత్యేక మీట
 • పెంపొందించబడిన ఫిలిం వేగం శ్రేణి
 • సుదీర్ఘ బహిర్గతాలు
 • మరిన్ని ఇతర సృజనాత్మక ప్రయోగాలకు అనువుగా ఉండే డిజైన్

ఫిలిం ఫోటోగ్రఫీకి పునర్జన్మను ప్రసాదించిన లోమో ఎల్ సి-ఏ[మార్చు]

లోమో ఎల్ సి-ఏ తనకు తానే పునర్జన్మను ఇచ్చుకోవటంటో బాటు అనలాగ్ ఫోటోగ్రఫీ కి కూడా పునర్జన్మను ఇచ్చినట్లు ప్రముఖ ప్రసార మాధ్యమం అయిన BBC news ఒక వ్యాసంలో పేర్కొంది. [5]

చిత్రమాలిక[మార్చు]

లోమో ఎల్ సి-ఏ తో చిత్రీకరించిన ఫోటోలు[మార్చు]

లోమో ఎల్ సి-ఏ+ తో చిత్రీకరించిన ఫోటోలు[మార్చు]

Non-Lomography[మార్చు]

రెడ్ స్కేల్ ఫిలిం ను వాడటం, ఫిలిం వేగం అమరికను కావాలని తప్పుగా వాడటం, గడువు తీరిన (expired) ఫిలిం ను వాడటం, ఫిలిం సంవర్థనలో క్రాస్ ప్రాసెస్ వాడటం, ఫోటో తీసేముందు అసలు ఆలోచించికపోవటం వంటివి లోమోగ్రఫీ లో కొన్ని నియమాలు. అయితే (లోమోగ్రఫీ నియమాల తో సహా) ఏ నియమం పాటించకపోవటం కూడా లోమోగ్రఫీ లో ఒక నియమమే. లోమోగ్రఫీ నియమాలకు విరుద్ధంగా మంచి తాజా ఫిలిం, సరియైన ఫిలిం వేగం అమరిక, సరియైన ఫిలిం సంవర్థన ప్రక్రియ నే వాడటం, ఫోటో తీసే ముందు కూర్పు పై తగినంత సమాలోచన చేసిననూ లోమో ఎల్ సి-ఏ/ఎల్ సి-ఏ+ కెమెరా తో చూడముచ్చటైన ఫోటోలు తీయవచ్చును. దీనినే నాన్ లోమోగ్రఫీ (Non-Lomography) అంటారు. [6]

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. LC-A ను నిర్వచించిన కాస్మో ఫోటో.కాం
 2. లోమోగ్రఫీ వెబ్ సైటు పై ఎల్ సి ఏ చరిత్ర
 3. లోమో ఎల్ సి-ఏ చరిత్రను తెలిపే మరొక లోమోగ్రఫీ వెబ్ సైటు
 4. లోమోగ్రఫీ వెబ్ సైటు పై లోమో ఎల్ సి-ఏ+ లక్షణాలు
 5. ఫిలిం ఫోటోగ్రఫీకి పునర్జన్మను ప్రసాదించిన లోమో ఎల్ సి-ఏ (బి బి సి న్యూస్)
 6. నాన్ లోమోగ్రఫీ గురించి లోమోగ్రఫీ వెబ్-సైటు