వడ్డాది సీతారామాంజనేయులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వడ్డాది సీతారామాంజనేయులు
జననంవడ్డాది సీతారామాంజనేయులు
జూలై 25, 1900
కశింకోట, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధితెలుగు రచయిత, కవి, అష్టావధాని, స్వాతంత్ర్య సమరయోధుడు

వడ్డాది సీతారామాంజనేయులు కవి, అవధాని, రచయిత. ఇతడు పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రితో కలిసి రచించిన "దండాలు దండాలు భారతమాత" అనే గేయం ఇతడిని స్వరాజ్యకవిగా నిలబెట్టింది.

విశేషాలు

[మార్చు]
పురిపండా అప్పలస్వామి, శ్రీశ్రీ లతో వడ్డాది సీతారామాంజనేయులు (ఎడమ నుండి కుడివైపు మూడవ వ్యక్తి)

ఇతడు విశాఖపట్నం జిల్లా అనకాపల్లి తాలూకా కశింకోటలో 1900, జూలై 25వ తేదీన జన్మించాడు.[1] జాతీయోద్యమంలో పాల్గొని కాంగ్రెస్ కార్యకర్తగా పల్లెపల్లెలకూ తిరిగి ప్రచారం చేశాడు. మారేపల్లి రామచంద్ర శాస్త్రి ప్రభృతులతో కలిసి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. సహాయ నిరాకరణోద్యమంలోనూ, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. శ్రీశ్రీ, పురిపండా అప్పలస్వామిలతో కలిసి కవితా సమితిని స్థాపించాడు. ఇతడు స్వయంగా రచనలు చేయడమే కాకుండా కొల్లూరు సత్యనారాయణ, పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రిలతో కలిసి కొన్ని రచనలు చేశాడు. ఇతనికి బాలకవి, స్వరాజ్యకవి, కవిసార్వభౌమ అనే బిరుదులు ఉన్నాయి.

రచనలు

[మార్చు]
 • శివమహిమ్న స్తోత్రము
 • శ్రీ సీతారామచంద్ర ప్రభు శతకము
 • శ్రీ రామలింగేశ్వర శతకము
 • శ్రీ సుబ్రహ్మణ్యగీతము
 • గజవిహారము
 • ప్రణయతత్వము
 • స్వరాజ్య సమరము
 • రాట్నము
 • త్రైలింగస్వామి

భారతమాత గీతము

[మార్చు]

పూడిపెద్ది కాశీవిశ్వనాథ శాస్త్రితో కలిసి రచించిన భారతమాత గీతము పూర్తిపాఠం[2]:

దండాలు దండాలు - భారతమాత
అవి అందుకుని దీవించు - భారతమాత
గాంధీ మహాత్ముండు - భారతమాత
నీ ముద్దు కొడుకుండంగ - భారతమాత
మాకేమియును భయములేదు - భారతమాత
మాకేమియును కొదువలేదు - భారతమాత
తెల్లోళ్ళుంటుండంగానె - భారతమాత
మాకు చిప్ప చేతికొచ్చింది - భారతమాత
మూడు వందలేండ్ల క్రింద - భారతమాత
అల కుంపినోడు దిగినాడె - భారతమాత
దిగి యూరకున్నాడా - భారతమాత
మా దేశమంతా దోసుకెల్లె - భారతమాత
కుంపిని రాజ్య మంతరింప - భారతమాత
అల సీమరాణి గద్దెక్కె - భారతమాత
శ్రీముఖము నొకటిచ్చె - భారతమాత
గంపెడాశతో చూస్తుంటె - భారతమాత
అది గాలి బుంగయై పోయె - భారతమాత
నిరంకుశాధికారమొచ్చె - భారతమాత
మమ్మేపుకుని తినుచుండె - భారతమాత
నీ పాదాలొక్కటె తప్ప - భారతమాత
మా కిప్పుడింక దిక్కేది - భారతమాత
నీవు రత్నాల తల్లివే - భారతమాత
నీవు పైరుపంటల నిక్షేపంవే - భారతమాత
మా పాలిటి కామధేనూ - భారతమాత
నీవు మా పాలి కల్పవృక్షం - భారతమాత
పాడిపంటల మహాలక్ష్మి - భారతమాత
మా మొరలాలకింపు మమ్మ - భారతమాత
కర్రలైన కొట్టకుండ - భారతమాత
మా కత్తికూడ లాగినాడె - భారతమాత
భూమి దున్ని బ్రతుకబోతె - భారతమాత
ఎంతో పెద్ద పన్ను వేసినాడె - భారతమాత
అది సందరమంత తవ్వినట్టు - భారతమాత
ఉప్పు మీద పన్నంటా - భారతమాత
కన్న బిడ్డలే శత్రులైరి - భారతమాత
నీవు మన్నించి దిద్దుకొమ్మ - భారతమాతా!

మూలాలు

[మార్చు]
 1. రాపాక ఏకాంబరాచార్యులు (1 జూన్ 2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 952.
 2. గురజాడ రాఘవశర్మ. జాతీయ గీతాలు (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. pp. 14–15.

బయటి లింకులు

[మార్చు]