Jump to content

ఖిలావరంగల్

అక్షాంశ రేఖాంశాలు: 17°57′17″N 79°37′33″E / 17.954834300360996°N 79.62588935528863°E / 17.954834300360996; 79.62588935528863
వికీపీడియా నుండి
(వరంగల్ ఖిల్లా నుండి దారిమార్పు చెందింది)
ఖిలా వరంగల్,
—  రెవెన్యూ గ్రామం  —
ఖిలా వరంగల్, is located in తెలంగాణ
ఖిలా వరంగల్,
ఖిలా వరంగల్,
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°57′17″N 79°37′33″E / 17.954834300360996°N 79.62588935528863°E / 17.954834300360996; 79.62588935528863
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండలం ఖిలా వరంగల్
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఖిలా వరంగల్, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, ఖిలా వరంగల్ మండలానికి చెందిన గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లా లోని వరంగల్ మండలం లో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ పట్టణ జిల్లాలో, కొత్తగా ఏర్పాటు చేసిన ఖిలా వరంగల్ మండలం లోకి చేర్చారు. [2][3] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది. [3]ఇది వరంగల్ దుర్గం/వరంగల్ కోట/ముసునూరి కమ్మ నాయక రాజుల కోటగా కాకతీయుల కోటగా పిలువబడే చారిత్రాత్మక ప్రదేశం. వరంగల్ రైలు స్టేషనుకు 2 కి.మీ. దూరంలోనూ, హనుమకొండ నుండి 12 కి.మీ. దూరంలో ఉంది. ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. కోట శిలాతోరణ స్తంభాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర రాజముద్రగా వాడుకలో ఉన్నాయి.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.

[మార్చు]

ఖిలా వరంగల్ గ్రామం, లోగడ వరంగల్ జిల్లా, వరంగల్ రెవెన్యూ డివిజను, వరంగల్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఖిలా వరంగల్ గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన వరంగల్ (పట్టణ) జిల్లా, వరంగల్ రెవెన్యూ డివిజను పరిధి క్రింద ఖిలా వరంగల్ గ్రామంతో కలుపుకొని (1+10) పదకొండు గ్రామాలతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4] పూర్వపు వరంగల్ పట్టణ జిల్లా, హన్మకొండజిల్లాగా, పూర్వపు వరంగల్ గ్రామీణ జిల్లా, వరంగల్ జిల్లాగా మారినవి. ప్రస్తుతం ఈ మండలం వరంగల్ జిల్లాలో చేరింది.

చరిత్ర, నిర్మాణం

[మార్చు]

ఓరుగల్లు కోట నిర్మాణాన్ని తెలంగాణ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199వ సంవత్సరంలో ప్రారంభించగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేసారు. ఓరుగల్లు కోట అనేక చారిత్రక కట్టడాలు, అద్భుత శిల్పకళా సంపదకు నిలయం. కాకతీయ కీర్తితోరణాలు; స్వయంభూశివాలయం; ఏకశిల గుట్ట, గుండుచెరువు;, ఖుష్ మహల్ తదితర దర్శనీయ ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి. చరిత్ర ప్రకారం ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికి కూడా చూడవచ్చు. మొదటి ప్రాకారం మట్టితో చేసినది దీనిని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ప్రాకారములో ఉన్నది రాతి కోట గ్రానైటు రాళ్ళతో నిర్మితమైనది. రాతి కోటకు పెద్ద పెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిల నిర్మితమైనవి. కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి (పూర్ణ కుంభం వంటివి). ఈ కీర్తి తోరణాలు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ఆధికారిక చిహ్నంగా ఉన్నాయి.కాకతీయుల కాలంలో ఈ కోట దాదాపు 19 చదరపు కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది

శిలాతోరణ స్తంభాలు

[మార్చు]

వరంగల్ కోటలో నాలుగు తోరణాలు సమానదూరాలలో విస్తరించి ఉంటాయి. ఈ తోరణాల మధ్య అప్పటి శిల్పకళాఖండాలు దర్శనమిస్తాయి.

స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం

[మార్చు]

ఓరుగల్లు కోటలోని మహత్తర కట్టడాలలో స్వయంభూదేవాలయం ఒకటి. సా.శ. 1162లో గణపతిదేవ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించారు. భూభాగం నుంచి పుష్పాకారం, పైకప్పు నక్షత్ర ఆకారం పోలినట్లు రాతితో నిర్మించబడింది ఈ ఆలయం. గర్భగుడిలోని శివలింగం ఇతర దేవాలయాల్లోని శివలింగాల కన్న భిన్నంగా ఉంటుంది. ఖండములై పడివున్న చతుర్ముఖలింగము ఈ ఆలయములో మూలవిరాట్. ఇది భూమికి అతితక్కువ ఎత్తులో ఉండి పాణమట్టం గుడ్రంగా ఉంటుంది.దక్షణ ద్వారం వద్ద గల వీరభద్రస్వామి విగ్రహం ఆకర్షణగా నిలుస్తుంది. ఆలయంలో ఓ పక్క శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ స్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఏటా శివరాత్రి మహోత్సవం సందర్భంగా నగరం నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా తరలివచ్చి ప్రత్యేక పూజులు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం రుద్రాభిషేకం, అర్చనలు, కర్పూరహరతులు జరుగుతాయి. శ్రీ రామనవమి రోజు సీతారాముల కల్యాణం కూడా అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతుంది.

ఖుష్ మహల్

[మార్చు]

ఈ కట్టడం తోరణాలకు అతి దగ్గరనే ఉంది. ముసునూరి కమ్మ నాయక రాజులు సా.శ. 1340 ప్రాంతంలో ఈ సౌధాన్ని కట్టించారు. ఈ దర్బారు పొడవు సుమారు 90 అడుగులుండగా, వెడల్పు-ఎత్తులు వరుసగా 45, 30 అడుగులుంటాయి. దర్బారు పైకప్పును కొనదేలిన ఆర్చిలు మోస్తున్నట్లుగా ఉన్నాయి, ఆర్చిల మధ్యన కర్ర దూలాలున్నాయి. నిజానికి పైకప్పును మోస్తున్నది ఈ దూలాలే. పెద్ద పెద్ద ప్రమాణాల్లో కనిపిస్తున్న ఈ ఆర్చీలు కేవలం అందాన్ని అతిశయింపజేయడానికే. ఆర్చీల ముందు దర్వాజా లాంటి ఆర్చి, దానిపైన అందమైన అల్లికలతో కూడిన కిటికీలు దర్బార్ శోభను మరింత పెంచాయి.దర్బారులోకి ప్రవేశించే ప్రాంగణం మరింత అందమైంది. నిజానికిది రెండంతస్తుల్లో ఉంది. ఇందులోని రెండు వరుసల్లో ఉన్న స్తంభాలు మూడు పొడవాటి హాల్‌లను ఏర్పరుస్తున్నాయి. ఈ కింద, పైనున్న గదులు రాచ కుటుంబీకులకు చల్లని, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు వీలుగా నిర్మించబడ్డాయి.ఈ మహల్ గోడలు చాలా వెడల్పుండి బలిష్టమైనవి. అవి సుమారు 77 డిగ్రీల వాలుతో ఉండి వేలాడుతున్నట్లుగా కన్పిస్తాయి. ఎత్తైన ఈ భవనం పై భాగానికి ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి. కీర్తి తోరణాల మధ్య దొరికిన స్వయంభు దేవాలయ శిథిల శిల్పాలను సైతం ప్రస్తుతం ఈ ఖుష్ మహల్‌లో భద్రపరిచారు. దర్బారు మధ్యలో అందమైన నీటి కుండం ఉంది. ఇది ఆనాడు రాచవర్గ ప్రజలకు ఎంత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేదో! కాబట్టే, ఈ మహల్‌కు ‘ఖుష్ మహల్’ అని పేరొచ్చింది.

ఒంటికొండ, గుండు చెరువు

[మార్చు]

ఈ గుట్ట ఒకే ఒక పెద్ద బండరాయి వలె ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దీన్ని ఒంటికొండ అని కూడా పిలుస్తారు. ఇది ఓరుగల్లు కోటలోని ఏకశిలా పార్కు పక్కన ఉండే ఎత్తైన కొండ. మెట్ల ద్వారా ఈ గుట్ట మీదికి సులభంగా ఎక్కవచ్చు. ఈ గుట్టమీద శిథిలావస్థకు చేరుకున్న ఓ శివాలయం ఉంది. అంతేకాకుండా ప్రహారా చేసే భవనం ఉంది. లోపల నుండి ఉన్న మెట్లద్వారా ఈ భవనం పై భాగానికి వెళ్లవచ్చు. గుట్ట కింద పార్కు పక్కనే ఓ అందమైన చెరువు కూడా ఉంది. దాన్ని గుండు చెరువు అని పిలుస్తారు.

పతనం

[మార్చు]

సా. శ. 1296లో దేవగిరి స్వాధీనము తరువాత తుగ్లక్ సుల్తానుల కన్ను ఆంధ్రదేశముపై బడింది. సంపదతో తులతూగుతున్న ఓరుగల్లు వారి అసూయాద్వేషాలకు కారణమయింది.

మొదటి ముట్టడి

[మార్చు]

సా. శ. 1310లో మాలిక్ కాఫుర్ నెలల తరబడి కోటను ముట్టడి చేసి మట్టిగోడను ధ్వంసం చేశాడు. లోపలి రాతిగోడను ఛేదించలేక కోట బయటి గ్రామాలను నాశనము చేసి అమాయక ప్రజలను వధించుట మొదలుపెట్టగా ప్రతాపరుద్రుడు సంధిచేసుకొని ఎనలేని సంపదను, 20,000 గుర్రాలు, 100 ఏనుగులు, కోహినూరు వజ్రము అప్పగించాడు[5].

రెండవ ముట్టడి

[మార్చు]

1321లో ఘియాసుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుఘ్ ఖాన్ (మహమ్మద్ బీన్ తుగ్లక్) ను ఓరుగంటిపై దాడికి పంపుతాడు. వీరోచితంగా పోరాడిన ప్రతాపరుద్రుని సైన్యం ధాటికి తట్టుకోలేక, ఆ సమయములో వ్యాపించిన మహమ్మారి వల్లనూ, ఆరు నెలల ముట్టడి తర్వాత ఉలుఘ్ ఖాన్ వెనుతిరుగుతాడు.

మూడవ ముట్టడి

[మార్చు]

ఉలుఘ్ ఖాన్ రెట్టించిన ఉత్సాహముతో, బలీయమైన సైన్యముతో 1323లో మరలా దాడికి వచ్చాడు. ఇది ఊహించని ప్రతాపరుద్రుడు ధైర్యముగా సుల్తాను సేనలనెదుర్కొంటాడు. తుర్క్ సేనలుపయోగించిన ఆధునిక పద్ధతులవల్ల, బలీయమైన అశ్వికదళము వల్ల, తెలుగు నాయకుల అనైక్యత వల్లనూ, పరాజయము తప్పలేదు. ప్రతాపరుద్రుడు, కటక పాలుడు గన్నమ నాయక బందీలవుతారు. వారిని ఢిల్లీ తరలిస్తుండగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో మునిగి ఆత్మార్పణం చేసుకుంటాడు. ఢిల్లీలో గన్నమ నాయక (మాలిక్ మక్బూల్) ఇస్లాము మతములోనికి మార్చబడ్డాడు. ఉలుఘ్ ఖాను ఓరుగల్లును దౌలతాబాదు అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీను ఆధీనములో ఉంచి ఢిల్లీకి మరలుతాడు.

సుల్తానుల పాలన

[మార్చు]

ఓరుగంటి పేరు సుల్తాన్ పూర్ అని మార్చబడింది. స్వయంభూశివాలయం పూర్తిగా ధ్వంసం చేయబడింది. ప్రాకారం, గర్భగుడి, అస్థాన మండపం నేలమట్టం చేయబడ్డాయి.

ముసునూరి కమ్మ నాయక రాజుల పాలన

[మార్చు]

ముసునూరి కమ్మ నాయక రాజులు ఢిల్లీ సుల్తానులను ఓడించి ఓరుగల్లు కోటను జేయించి మొత్తం తెలుగు ప్రాంతాన్ని తిరిగి చేజిక్కించుకున్నారు. ఎన్నో నిర్మాణాలు కోటలో చేపట్టారు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-11-18. Retrieved 2018-01-23.
  2. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. 3.0 3.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-22. Retrieved 2018-01-23.
  5. India Before Europe, C.E.B. Asher and C. Talbot, Cambridge University Press, 2006, ISBN 0521809045, p. 40

బయటి లింకులు

[మార్చు]