Jump to content

వరలక్ష్మీ వ్రతం

వికీపీడియా నుండి
(వరలక్ష్మీ వ్రతము నుండి దారిమార్పు చెందింది)
వరలక్ష్మీ వ్రతం
వరలక్ష్మీ వ్రతం
వరలక్ష్మీవ్రతం సందర్భంగా అలంకరించిన విగ్రహం
జరుపుకొనేవారుదక్షిణ భారతదేశంలోని హిందూ మహిళలు
ప్రాముఖ్యతమతపరమైనది
2023 లో జరిగిన తేది25 ఆగస్టు
వేడుకలుపూజ
ఆవృత్తిప్రతీ సంవత్సరం

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం.[1] వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున భారతదేశంలో ఐఛ్చిక సెలవు దినాన్ని ప్రకటిస్తారు.

ప్రార్థన

[మార్చు]

నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

తాత్పర్యం

మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.

పురాణ గాథ

[మార్చు]

స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.

ఎందుకు ఈ వ్రతం

[మార్చు]

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.

వరలక్ష్మి వ్రతం పూజ సామగ్రి

[మార్చు]

పసుపు, కుంకుమ, తమల పాకులు, వక్కలు, అరటి పండ్లు, ఊదు బత్తీలు/దూపం కలికెలు, హారతి కర్పూరము, పసుపు అక్షతలు, పూలు, కొబ్బరి కాయ/కలశం మీదికి, కొబ్బరికాయ అర్చనకు, దీపారాధన కుంది - పెద్దది, దీపారాధన కుంది - చిన్నది, గంధం, గంట, హారతి పళ్లెము, వత్తులు, దీపారాధన నూనె ఆవునెయ్యి, అమ్మవారికి కలశము, అర్చన కలశము, పంచామృతాలు, అమ్మవారికి పీఠము/పీట, ఒక పళ్లెము - దీపారాధన హారతి పళ్లెము ఉంచుటకు, బియ్యముతో ఉన్న చిన్న పళ్లెము పసుపు గణపతికి, ఒక రవికె గుడ్డ, అమ్మవారి అలంకరణ సామగ్రి, వడపప్పు (ఆనవాయితీ ఉంటే), పానకము (ఆనవాయితీ ఉంటే), పతిని పావలా కాసుగా చేసి కుంకుమతో అద్దినవి రెండు వస్త్రాలు, పత్రితో రుద్రాక్షమాలగా చేసి పసుపు/కుంకుమ లతో అలదిన యజ్ఞ ఉపవీతము, అర్చన కలశము ప్రక్కన గిన్నె, ఆచమనమునకు గ్లాసు ప్రక్కన పళ్ళెము, కొద్దిగ ఏలకులు/లవంగాల పొడి, చెంచాలు, కూర్చొను వారికి తగినన్ని పీటలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింప దలచితే ప్రత్హి వస్త్రాలు అక్కరలేదు, మామిడి ఆకులు మందిర అలంకరణకు, చిల్లర రూపాయిలు, పన్నీరు లేక గంధము కలిపిన నీరు, నవ సూత్రములు ఎంత మంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని తొమ్మిది ముడులు వేసి కుంకుమలో అలధినవి. పాటకు జ్యోతులు తొమ్మిది బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి, నానబోసిన శనగలు,

వ్రత విధి విధానం

[మార్చు]

తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి, షోడశోపచార పూజ, తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాంబూలాలని సమర్పించి, కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి, మంగళహారతి ఇచ్చి, తోరగ్రంథి పూజ చేసి, తోరబంధన మంత్రం పఠిస్తూ, ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీగా భావించి వాయనమీయవలెను.

తోరగ్రంథి పూజ

[మార్చు]

తొమ్మిది దారపుపోగులతో తొమ్మిది ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలెను.

  • ఓం కమలాయై నమ ప్రథమ గ్రంథిం పూజయామి.
  • ఓం రమాయై నమ ద్వితియ గ్రంథిం పూజయామి.
  • ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి.

వరలక్ష్మి వ్రత కథ

[మార్చు]

ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంలో పార్వతీ దేవి వినయం గా, "ప్రాణేశ్వరా!

స్త్రీలు సకలైశ్వర్యములు కలిగి ఉండుటకు ఆచరించదగిన వ్రతమేదియో చెప్పమని కోరెను. అంతట పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యము కలుగజేయును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్ల పక్ష శుక్రవారము నాడు చేయవలెను" అనెను. అది విని పార్వతీదేవి, "స్వామీ! ఆ వ్రతం ఎలా ఆచరించాలో తెలుపుమని,  ఆ వ్రతాన్ని మునుపు ఎవరు ఆచరించి తరించారో తెలుపగోరెద" ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ పార్వతీ! ఆ వ్రతకథను చెప్పెదను వినుము" అని కథ చెప్పెను.

పూర్వము మగధ రాజ్యములో కుండిన నగరమ్ అనే పట్టణం గలదు. అది బహు సుందరమయిన పట్టణం. అందు చారుమతి అనే ఒక సాధ్వి ఉంది. ఆమె సద్గుణ సంపన్నురాలు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నములో ప్రత్యక్షమై ఆమెతో, "చారుమతీ! నీ సధ్గుణములకు నేను మెచ్చితిని. నీకు కావలసిన వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద" నని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆ స్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రమైనంతనధిక భక్తితో

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం

శ్రీ రంగథామేశ్వరీం|

దాసీభూత సమస్తదేవ వనితాం

లోకైక దీపాంకురాం|

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః

బ్రహ్మేంద్ర గంగాధరాం|

త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం

వందేముకుందప్రియాం||

అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరములయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధములయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిన దక్షిణ తాంబూలాదులనొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.

మూలాలు

[మార్చు]
  1. కుందిర్తి వేంకటనరసయ్య (1989). హిందూ మతము - మన పండుగలు. కుందుర్తి వేంకటనరసయ్య. Retrieved 2020-08-04.

బయటి లింకులు

[మార్చు]