వరికుప్పల యాదగిరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరికుప్పల యాదగిరి
VarikuppalaYadagiri.jpg
సుప్రసిద్ద కళాకారుడు వరికుప్పల యాదగిరి
జననంవరికుప్పల యాదగిరిగౌడ్
(1976-04-14) 1976 ఏప్రిల్ 14 (వయస్సు: 43  సంవత్సరాలు)
సాటాపూర్, రెంజల్ మండలం, నిజామాబాదు జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లువరికుప్పల యాదగిరి
వృత్తికవి,
రచయిత,
గాయకుడు,
, సంగీత దర్శకుడు
ఎత్తు5.11"
బరువు74
మతంహిందూ
భార్య / భర్తరమాదేవి
పిల్లలుఇందుశ్లోక, మిన్నుమయూఖ
తండ్రితిరుపతి
తల్లిఇద్దమ్మతిరుపతి

వరికుప్పల యాదగిరి ఒక తెలుగు సినీ గేయ రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు.[1] ఇతడు జనాదరణ పొందిన పలు పాటలకు సాహిత్యం అందించాడు.

నేపధ్యము[మార్చు]

యాదగిరి తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం, సాటాపూర్ గ్రామంలో జన్మించాడు. ఇతను చిన్నప్పుడు కరువు రావడంతో అతని కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొన్నది. అందుకే ఇంటిని చెడగొట్టడానికే పుట్టాడని వీళ్ళనాన్న తిడుతుండేవారు. ఇతడు పుట్టిన 21రోజులకే అమ్మ అక్కల్ని తీసుకొని కూలి పనులకు వెళ్లేది. దాంతో పాలకు కూడా ఇబ్బందై రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాని ఫలితాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తండ్రితో కలిసి భజనలకు వెళ్ళి వచ్చీ రాని మాటలతో పాటలు పాడేవాడు. రెండవ తరగతిలోనే తన తొలి ప్రదర్శన ఇచ్చాడు. ఆ ప్రదర్శనలో మొదటి బహిమతి గెలుచుకొని తన విజయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇతడి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఇతనిలోని ప్రతిభని గుర్తించి ప్రోత్సహించారు. ఇతడు ఐదో తరగతిలో ఉండగా వీళ్ళ అన్నయ్యకి పెళ్ళి కుదిరింది. దానికోసం కొంతడబ్బుని ఇంట్లో పెట్టెలో పెట్టారు. ఓ రాత్రి కిరోసిన్‌ దీపాన్ని ఆ పెట్టె మీద ఉంచి పడుకున్నారు. కిరోసిన్‌ కారుతున్న విషయాన్ని ఎవరూ గమనించకపోవడంతో మంట అంటుకొని మొత్తం పెట్టె కాలిపోయింది. లోపలున్న డబ్బు బూడిదైంది. రెండోసారి వీరు దివాలా తీసిన పరిస్థితి. దాంతో ఇతడిని బడి మాన్పించేసి ఓ పశువుల కొట్టంలో పనిలో పెట్టారు. ఏడాది తరువాత వీళ్ళ అన్నయ్య తీసుకెళ్లి ఓ కాంట్రాక్టర్‌ దగ్గర పనిలో కుదిర్చాడు. ఆ సమయంలో తోటి పిల్లలంతా స్కూలుకెళ్లడం చూసి ఇతడికి ఏడుపొచ్చేది. ఇంటికెళ్లి తనను స్కూల్లో చేర్పించమని అడిగితే నాన్న తిట్టారు. కానీ ఇతడు మాత్రం బడికెళ్తాననీ, చదివించకపోతే చచ్చిపోతాననీ చెప్పాడు. మూడ్రోజులు మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. దాంతో వీళ్ళ అమ్మకు భయమేసి నాన్నతో గొడవపడి మళ్లీ ఇతడిని స్కూల్లో చేర్పించింది.[2]. తెలుగు సినిమా బాచిలర్స్కి గీత రచన చేయడం ద్వారా మొదటిసారిగా వెలుగులోకి వచ్చాడు[3][4][5]

సినిమాలలో అవకాశాలు[మార్చు]

అలా ఒక్కో తరగతి దాటుకుంటూ ఇంటర్‌ పూర్తిచేశాడు. డిగ్రీ చదివించే స్తోమత ఇంట్లో లేదు. ఇతడికి తెలిసిన ఒకే ఒక పని బాగా పాడటం. స్నేహితులంతా ఇతడి గొంతు బావుంటుందనీ సినిమాల్లో ప్రయత్నించమనీ అనేవాళ్లు. ఆ ఆత్మవిశ్వాసంతో ఇంట్లో వాళ్లకు పాటల పోటీకి వెళ్తున్నానని అబద్దం చెప్పి స్నేహితుడితో కలిసి హైదరాబాద్‌ బయల్దేరాడు. అప్పట్లో నటుడు కృష్ణ గారికీ, బాలుగారికీ ఏవో విభేదాలు వచ్చాయన్న పుకారు విని, ఆయన్ని కలిస్తే తనతో పాడిస్తారన్న అమాయకత్వంతో నేరుగా ఆయన ఇల్లు వెతుక్కుంటూ వెళ్లాడు. తీరా ఆయన బయటికొచ్చే సమయానికి ఓ వందమంది వీళ్ళకంటే ముందు ఆయన దగ్గరికి పరుగెత్తారు. ఇంక అక్కడ పనికాదని అర్థమై నిరాశతో కాస్త ముందుకెళ్లాడు. అక్కడ ఓ ఇంట్లో లేడీబాస్‌ తెలుగు సినిమా చిత్రీకరణ జరుగుతోంది. లోపల్నుంచి బయటికొచ్చిన ఓ పెద్దాయనకి తన గురించి చెప్పాడు. ఓ పాట విని బావుందనిపించి కూర్చోబెట్టారు. కానీ దర్శకుడు ఎంతకీ రాకపోవడంతో, ఇతడికి ఒక చిరునామా ఇచ్చి మరుసటి రోజు అక్కడికి వెళ్లి రాజమౌళి అనే వ్యక్తిని కలవమని చెప్పి పంపించారు.

రాజమౌళి అనే ఆయన వృత్తిరీత్యా వైద్యుడు అయినా, ప్రైవేటు ఆల్బమ్స్‌ చేస్తుంటాడు. ఆయన దగ్గరికెళ్తే కొన్ని పాటలిచ్చి స్వరపర్చమన్నాడు. ఇతడు చేసినవేవీ ఆయనకు నచ్చలేదు. ఇక విసుగొచ్చేసి చెప్పాపెట్టకుండా వీళ్ళ ఊరికి తిరిగి వచ్చేశాడు. ఓ నెలరోజుల తరువాత నా పాటలు తీసుకెళ్లిపోయావు, కేసు పెడతా అని ఆయన ఉత్తరం రాయడంతో కంగారుపడి హైదరాబాద్‌ వచ్చి తను బాణీలు కట్టలేనని చెప్పి ఆయన పాటలు ఇచ్చేశాడు. తిరిగొచ్చి పాఠశాలలు, కళాశాల్లో పాటల కచేరీలు చేయడం మొదలుపెట్టాడు. అలా చాలా రోజులు కష్టపడి పదిహేను వందలు కూడబెట్టాడు. ఆ డబ్బులు తీసుకొని మళ్లీ ఇస్తానని చెప్పిన వీళ్ళ అన్నయ్య, తీరా హైదరాబాద్‌ వెళ్దామనుకున్న సమయానికి డబ్బులు ఖర్చయ్యాయని చేతులెత్తేశాడు. ఇఅడు ఏడ్చి గొడవ చేస్తే నూట యాభై రూపాయలు చేతిలో పెట్టాడు. ఆ డబ్బులు తీసుకొని, కొన్ని అటుకులూ, పిండి వంటలూ బ్యాగులో వేసుకొని గాయకుడిని కావాలన్న ఆశతో హైదరాబాద్‌ బయల్దేరాడు. అక్కడ ఎవరిని కలవాలో తెలీక నాలుగు రోజుల పాటు బస్టాండ్‌లోనే ఉంటూ తెచ్చుకున్నవేవో తింటూ అక్కడే పడుకున్నాడు.

అంబర్‌పేట్‌లో తెలిసినవాళ్లెవరో ఉంటే, ఐదో రోజు బస్టాండు నుంచి అక్కడికి బయల్దేరాడు . ఆ వీధుల్లో తిరుగుతుంటే వీళ్ళ వూరినుంచి వచ్చిన ఓ కుర్రాడు తారసపడ్డాడు. ఇతడి కథంతా విని ఓ ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో రాత్రి ఉద్యోగాన్ని ఇప్పించాడు. అక్కడ పనిచేస్తూ త్యాగరాయ గానసభ, రవీంద్ర భారతి లాంటి వేదికల్లో వారాంతాల్లో జరిగే పాటల పోటీల్లో పాల్గొనేవాడు. వాటిని చూసి ఎవరైనా సినిమాల్లో అవకాశం ఇస్తారన్న ఆశపడ్డాడు. కానీ అలా జరగలేదు. కొన్ని రోజులకు తెలిసిన వ్యక్తి సాయంతో ఓ ఫైనాన్స్‌ సంస్థలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఓ రోజు దినపత్రిక చూస్తుంటే దర్శకుడు సానా యాదిరెడ్డి కొత్తవాళ్లతో సినిమా ప్రారంభించినట్లు కనిపించింది. తరువాత ఓ రోజు ఎక్కడో ఆయన ఇంటి అడ్రస్‌ ఉన్న బోర్డు కనిపిస్తే వెతుక్కుంటూ వెళ్లాడు. ఆయన ఇతని పాట విని మెచ్చుకుంటూ మరుసటి రోజు తన కార్యాలయానికి రమ్మన్నాడు. అలా తొలిసారి ఇతడిలో సినిమా ఆశలు చిగురించాయి.

తొలి అవకాశం[మార్చు]

మరుసటి రోజు ఉదయం ఏడున్నరకి ఆఫీసుకి వెళ్తే సాయంత్రం నాలుగున్నరకి లోపలికి పిలిచారు. మొదట్నుంచీ ఇతడికి సొంతంగా సాహిత్యం రాసుకొని, దానికి స్వరకల్పన చేసుకొని పాడటం అలవాటు. అలా రాసుకున్న ఓ ఐదు పాటల్ని యాదిరెడ్డి, ఎల్బీశ్రీరాం లాంటి వాళ్లంతా కూర్చొని ఉంటే వినిపించాడు. వాళ్లందరికీ రెండు పాటలు బాగా నచ్చాయి. వాటిని సినిమాలో వాడుకుంటామని చెప్పారు. అలా తొలిసారి వాళ్ల వల్లే తను బాగా రాస్తానన్న విషయం ఇతడికి తెలిసింది. రెండు మూడు నెలల తరువాత ఆ పాటలు తీసుకున్నందుకు కొన్ని డబ్బులిచ్చారు. అలా ప్రేమ పల్లకి సినిమాతో గాయకుణ్ణి కాబోయి అనుకోకుండా రచయితగా మారాడు. ఆ సినిమాని మయూరి సంస్థ పంపిణీ చేసింది. అందులోని పాటలు రామోజీరావుగారికి బాగా నచ్చాయట. దాంతో ఇతడిని ఫిలింసిటీలో వాళ్లు చేయబోయే 'ఆడియో లైబ్రరీ ' ప్రాజెక్టు కోసం ఉద్యోగంలోకి తీసుకోమని చెప్పారు.

ఫిలింసిటీలో ఉద్యోగం[మార్చు]

ఫిలింసిటీలో పనిచేసే సమయంలో యాదిరెడ్డిగారు మొదలుపెట్టిన బ్యాచిలర్స్‌ సినిమాలో రెండు పాటలు స్వరపరచడంతో పాటు వాటిని పాడే అవకాశమూ వచ్చింది. ఇంకోపక్క ఫిలింసిటీలో ఆడియో లైబ్రరీ ప్రాజెక్టు ఆలస్యమవుతుండటంతో వూరికే డబ్బులు తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది. దాంతో వాళ్లకు ఆ విషయమే చెప్పి రాజీనామా చేశాడు. ఇతడు చెప్పిన కారణం నచ్చి, బయట బతకడానికి ఇబ్బందైతే ఎప్పుడైనా ఉద్యోగంలో చేరొచ్చని భరోసా ఇచ్చారు. అలా బయటికొచ్చాక దర్శక నిర్మాత యాదిరెడ్డి సంపంగిలో అన్ని పాటలూ రాసే అవకాశమిచ్చాడు. అందులో పాడిన అందమైన కుందనాల బొమ్మరా అనే పాట మంచి పేరు తెచ్చింది. కానీ తరువాత రాసిన ప్రేమలో పావని కల్యాణ్‌ పెద్దగా ఆడలేదు. ఆ సమయంలోనే ఇష్టం సినిమాకు ఓ పాట రాసి ట్యూన్‌ చేయమని దర్శకుడు విక్రమ్‌ పిలిచాడు. ఆ సినిమా నిర్మాత రామోజీరావుకి పాట నచ్చడంతో సినిమా కోసం ప్రత్యేకంగా ఏదైనా కంపోజ్‌ చేయమన్నాడు. ఆయన ప్రోత్సాహంతో బల్లలూ, ప్లేట్లూ, గ్లాసులూ, సీసాల్లాంటి వాటి సాయంతో ప్రయోగాత్మకంగా ఓ పాట చేస్తే దాన్ని చిత్ర సంగీతంలో జతచేశాడు.

కుంగుబాటు[మార్చు]

సినిమాల్లో ఇతడు రాసిన, స్వరపరిచిన పాటలకు మంచి పేరే వస్తున్నా అవకాశాలు పెద్దగా రాలేదు. సానా యాదిరెడ్డి దగ్గర సంగీత దర్శకుడిగా ఓ సినిమా మొదలుపెడితే, అది మధ్యలోనే ఆగింది. తరువాత 'అభిమాని ' అనే సినిమా పూర్తయినా విడుదల కాలేదు. అదే సమయంలో వీళ్ళ అమ్మ చనిపోవడంతో కుంగిపోయాడు. ఓ రెండు మూడేళ్లు ఎవరైనా అడిగితే పాట రాసిస్తూ, ఆ డబ్బులని ఖర్చుపెట్టుకుంటూ గడిపేశాడు. చివరికి ఓ రోజు ఈవీవీ సత్యనారాయణ ఫోన్‌ చేసి ఇతడిని పిలిచి క్లాస్‌ తీసుకున్నారు. ఆయన సినిమా తొట్టిగ్యాంగ్‌లో రెండు పాటలు రాయించారు. జీవితం అలా ఒడుదొడుకులతో సాగుతున్న సమయంలో ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు. పదికి పైగా సంబంధాలు చూసినా ఏవీ కుదర్లేదు. చివరికి ఓ సంబంధం ఇతడికి నచ్చినా, అప్పుడే పెళ్ళి వద్దనీ, పైచదువులు చదవాలనుందనీ ఆ అమ్మాయి చెప్పింది. ఆమెకోసం ఎన్ని రోజులైనా ఎదురుచూస్తానని చెప్పాడు. అలా ఇతడి భార్య రమాదేవి ఇతడి జీవితంలో అడుగుపెట్టింది. తరువాత ఇతడితో పాటు ఆమెకీ కష్టాలు మొదలయ్యాయి. ఒకటి రెండు చిన్న సినిమాలకు సంగీతం చేసినా పరిస్థితి కుదుటపడలేదు. అప్పటికే ఓ పాప పుట్టింది. ఆపైన ఓ తమిళ సినిమాకు సంగీతం చేసే సమయంలో చిన్నపాప కాన్పు కోసం వీళ్ళ ఆవిడ ఆసుపత్రిలో చేరింది. అప్పుడు ఇతడి చేతిలో యాభై రూపాయలున్నాయి. తెలిసిన వాళ్లకీ, తెలియని వాళ్లకీ కలిపి దాదాపు నాలుగు వందలమందికి ఫోన్లు చేస్తే అరవై వేల రూపాయల అప్పు పుట్టింది. అలా తన భార్య కాన్పు అయ్యాక వాళ్లని వూరికి పంపించేశాడు. ఇక చిన్న సినిమాలు చేస్తే లాభం లేదనీ పెద్ద అవకాశాల కోసం ప్రయత్నిద్దామనీ దర్శకులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. కొంతమంది ఫోనెత్తలేదు. కొందరు తిట్టి పెట్టేశారు. చివరికి దర్శకుడు సురేందర్‌ రెడ్డి తన కార్యాలయానికి పిలిపించాడు. ఇతడి పనితీరు తెలుసుకోవడానికి ఓ రెండు మూడు సినిమాలకు తనతో కలిసుండమన్నాడు.

పునరాగమనం[మార్చు]

రేసుగుర్రం సినిమాకి సంగీత దర్శకుడిగా ఎస్. ఎస్. తమన్‌ పేరు ప్రకటించినప్పుడు ఇంక తనకు అవకాశాలు రావని నిశ్చయించుకున్నాడు. దాంతో పరిశ్రమను వదిలేసి వూరెళ్లి వ్యవసాయం చేసుకుందామనుకున్నాడు. ఆ విషయమే యాదిరెడ్డిగారికి చెప్పడానికి వెళ్లినప్పుడు సురేందర్‌ రెడ్డి నుంచి ఫోనొచ్చింది. కొన్ని పాటలకు సాహిత్యం రాసి, స్వరాలు సిద్దంచేసి తీసుకురమన్నాడు. ఇతడు రాసిన నాలుగు పాటలూ నచ్చడంతో వాటిని బ్యాంకాక్‌లో సిట్టింగ్స్‌కి తీసుకెళ్తానని చెప్పాడు. తిరిగొచ్చాక ఆ పాటల సంగతి మరచిపోయి, సినిమాలో ప్రకాష్‌రాజ్‌ని అల్లు అర్జున్ ముప్పతిప్పలు పెట్టే సందర్భం చెప్పి పాట రాయమన్నాడు. దీనితో యాదగిరికి పట్టుదల పెరిగి ఆ పాటతో చావో రేవో తేల్చుకోవాలనుకున్నాడు. ఒకట్రెండు రోజుల్లో రాసి వినిపిస్తే సురేందర్‌ రెడ్డి సూపర్‌ అన్నాడు. అదే సినిమా చూపిస్త మామా అంటూ తెలుగు వాళ్లని వూపేసిన పాట. యూట్యూబ్లో కోటీ తొంభై లక్షలమందికిపైగా వీక్షించిన ఒకేఒక్క తెలుగు పాట అదే. ఆ సినిమాకే రాసిన స్వీటీ , రేసుగుర్రం చిత్ర గీతాలు కూడా యూట్యూబ్‌లో కోటిన్నరమందికి పైగా చూశారు. దాంతో ఇతడి కెరీర్‌ మళ్లీ కొత్తగా మొదలైంది.

రేసుగుర్రం తరువాత రవితేజ సినిమా పవర్‌, డిక్టేటర్‌, కరెంటు తీగ, శౌర్య, చుట్టాలబ్బాయి, కృష్ణాష్టమి, కిక్‌ 2 లాంటి సినిమాల్లో పాటలకు మంచి గుర్తింపొచ్చింది. ఒకప్పుడు ఆఫీసులకు వెళ్తే కసిరి బయటకు పంపేవారు. ఇతడి పేరు మార్చుకుంటే అదృష్టం కలిసొస్తుందని కొందరు సూచించారు. ఆ ఛీత్కారాలకు బాధపడకుండా, మూఢ నమ్మకాలకు విలువివ్వకుండా ముందుకొచ్చాడు. ఆలస్యమైనా ప్రస్తుతం ఇతడి కెరీర్‌ అనుకున్నట్లే సాగుతోంది. అందుకే ఇన్నాళ్ల కష్టాల్ని మరచిపోయి ఇప్పుడొచ్చిన పేరుని కాపాడుకుంటూ భవిష్యత్తుని అందంగా మార్చుకోవడమే ప్రస్తుతం తన ముందున్న ఏకైక లక్ష్యం అని తన మనోగతాన్ని తెలిపాడు.

జనాదరణ పొందిన కొన్ని పాటలు[మార్చు]

పాట చిత్రం విడుదలైన సంవత్సరం
సినిమా సూపిస్త మావ ... నీకు సినిమా సూపిస్త మావ రేసుగుర్రం 2014
అడగక్కర్లేదు నా బావ ఎక్కడని .... ప్రేమలో పావని కళ్యాణ్ 2002

సినీరంగ ప్రస్థానము[మార్చు]

గీత రచయితగా[మార్చు]

నేపధ్య గాయకుడిగా[మార్చు]

 • Bachelors in 2000.
 • Rave Naa Cheliya in 2001.
 • Sampangi in 2001.
 • June July in 2002.
 • Mandharam in 2002.
 • Bhageerathudu in 2010
 • Broker in 2010.
 • Oka Ammayi Oka Abbayi in 2011.
 • abhimani
 • repallelo radha
 • mahatma (old)
 • power

సంగీత దర్శకుడిగా[7][మార్చు]

 • భగీరధుడు (2010).
 • ఒక అమ్మాయి ఒక అబ్బాయి (2011).
 • అభిమాని[8][9]

మూలాలు[మార్చు]

 1. "'రేసుగుర్రం' రాత మార్చింది". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. మూలం నుండి 4 December 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 4 December 2016.
 2. https://www.youtube.com/watch?v=YwiQTg1VqjE
 3. http://poochandi.com/singer/vaarikuppala-yadagiri
 4. http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=a0000587
 5. http://www.musicglitz.com/albumPage.do?langId=3&Id=2368&name=Bachelors
 6. http://www.chekodi.com/2014/08/power-movie-audio-launch.html
 7. http://www.dishant.com/album/bhageerathudu.html
 8. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2013-08-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-10-24. Cite web requires |website= (help)
 9. http://www.cinemelody.com/Labels/2004/Abhimani-Telugu-Movie-Songs-Download.htm

బయటి లంకెలు[మార్చు]