Jump to content

వల్లభ్‌భాయ్ పటేల్ రాజకీయ జీవితం 1917 - 1928

వికీపీడియా నుండి

వల్లభ్‌భాయ్ పటేల్ 1917లో అహ్మదాబాద్ పురపాలక సంఘం బోర్డు సభ్యునిగా పోటీచేసి గెలవడంతో రాజకీయ జీవితంలోకి ప్రవేశించాడు.

పురపాలక సంఘ సభ్యునిగా

[మార్చు]

అహ్మదాబాద్ పురపాలక సంఘ నేపథ్యం, ఎన్నిక

[మార్చు]

1913లో బారిస్టరుగా తిరిగివచ్చాకా రాజకీయాల్లో అన్న విఠల్‌భాయ్ పటేల్ పనిచేస్తే, న్యాయవాదిగా ప్రాక్టీసు చేసి సంపాదించే బాధ్యత తమ్ముడు వల్లభ్‌భాయ్ పటేల్ వహించేట్టు నిర్ణయించుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు వల్లభ్‌భాయ్ ఆ పద్ధతిలోనే కోర్టులో ప్రాక్టీసు చేస్తూ, ఆటవిడుపు కోసం గుజరాత్ క్లబ్‌లో బ్రిడ్జి ఆడుతూ రాజకీయాల్లో తలదూర్చకుండా కొనసాగాడు.

మరోవైపు, 1914లో బొంబాయి ప్రభుత్వం డిస్ట్రిక్ట్ మునిసిపల్ యాక్ట్ సవరించి పెద్ద నగరాల పురపాలక సంఘాలు అన్నిటికీ కమీషనర్‌గా తప్పనిసరిగా ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసీఎస్) అధికారి ఉండాలని నియమం చేసింది. ఐసీఎస్ స్థాయి అధికారి పురపాలక సంఘ కమీషనర్‌గా వస్తే అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులైన పురపాలక సంఘ కౌన్సిలర్లు కూడా వారు చెప్పినట్టే నడుచుకోవాల్సి వస్తుందన్న సందేహాలు రేకెత్తాయి. దానితో ఈ సవరణను వ్యతిరేకిస్తూ బొంబాయి ప్రెసిడెన్సీ పొలిటిలకల్ కాన్ఫరెన్స్ తీర్మానించినా ప్రభుత్వం ఆ తీర్మానాన్ని తోసిపుచ్చింది. దానికి తోడు, మొదటగా అహ్మదాబాద్‌కి మున్సిపల్ కమీషనర్‌గా నియమితుడైన బ్రిటీష్ అధికారి షిల్లిడీ వ్యవహార శైలి చాలా అహంకారపూరితంగా, మొండిగా ఉండేదన్న పేరు .

ఈ నేపథ్యంలో సమర్థుడైన వ్యక్తిగా, ఉన్నత విద్యావంతుడిగా పేరొందిన వల్లభ్‌భాయ్ పటేల్‌ని పురపాలక సంఘానికి పోటీచేయమనీ, ఆ పనుల వల్ల ప్రాక్టీసు దెబ్బతినదనీ స్నేహితులు ప్రోత్సహించేవారు. దానితో బాగా ఆలోచించి 1917లో జరిగిన ఉప ఎన్నికలో వల్లభ్‌భాయ్ పటేల్ పురపాలక సంఘానికి కౌన్సిలర్‌గా నిలబడి గెలిచాడు. ఆ ఎన్నికను సవాలు చేసి చెల్లదని నిర్ణయించినా మళ్ళీ కొన్ని నెలల్లో జరిగిన రీ ఎలక్షన్‌లో పోటీలేకుండా గెలిచాడు. ఆనాడు అహ్మదాబాద్ పురపాలక సంఘానికి అధ్యక్షునిగా సర్ రమణ్‌భాయ్, మేనేజింగ్ కమిటీ అధ్యక్షునిగా రావుసాహెబ్ హరిలాల్‌భాయ్ ఉండేవారు. వారి పద్ధతులతో, ఆలోచనలతో వల్లభ్‌భాయ్ విభేదించినా, ప్రజలకు మేలు చేకూర్చాలన్న విషయంలో మాత్రం ముగ్గురికీ ఏకీభావం ఉండేదని పటేల్ జీవితచరిత్రకారుడు నరిహరి పారిఖ్ రాశాడు.

పురపాలక సంఘ సిబ్బందిపై చర్యలు

[మార్చు]

పురపాలక సంఘ కమీషనర్ షిల్లిడీ పనితీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేకపోవడం, పురపాలక అధికారులకు, సిబ్బందికీ, కౌన్సిలర్లకు మధ్య సమన్వయం లేకపోవడం వంటి సమస్యలను గుర్తించిన వల్లభ్‌భాయ్ పరిస్థితులను జాగ్రత్తగా అధ్యయనం చేసి ఎలా ముందుకువెళ్ళాలో నిర్ణయించుకున్నాడు.[1]

పురపాలక సంఘ కమీషనర్ షిల్లిడి వివిధ వ్యవహారాల్లో చట్టపరిధినీ, బోర్డు ఆదేశాలను కూడా అతిక్రమిస్తున్నాడన్న ఆరోపణలు ఉండేవి. 1914లో పురపాలక సంఘం నిర్వహణలోకి వచ్చిన ఒక చెరువును సవ్యంగా నిర్వహించి దోమలబెడద లేకుండా చూడాలని మున్సిపల్ బోర్డుతో పాటుగా కోర్టులు కూడా తీర్మానించాయి. తన అగ్గిపెట్టెల ఫ్యాక్టరీకి ఆ చెరువును అక్రమంగా ఉపయోగించుకుంటున్న ఫతే మహ్మద్ మున్షీ అనే వ్యాపారస్తుని చేతికి ఆ కొలనును హైకోర్టు ఆదేశాలను కూడా పక్కనపెట్టి మరీ శాశ్వత లీజుకు అప్పగించడానికి షిల్లిడీ నిర్ణయించాడు. దీనికి తోడు బోర్డు తీర్మానంలో కొన్ని వాక్యాలను తొలగించి ప్రభుత్వానికి పంపడం వంటి తీవ్రమైన నేరాలకు కూడా సాక్ష్యాలు దొరికాయి. పక్కా సాక్ష్యాధారాలు సంపాదించి షిల్లిడీని ఉద్యోగ విధుల్లోంచి తొలగించాలంటూ సుదీర్ఘమైన తీర్మానాన్ని మున్సిపల్ బోర్డులో వల్లభ్‌భాయ్ ప్రవేశపెట్టాడు. ఆ తీర్మానం మెజారిటీ ఓటుతో ఆమోదం పొందింది. దానితో షిల్లిడీ అహ్మదాబాద్ మున్సిపల్ కమీషనర్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.[1]

తర్వాత వచ్చిన మున్సిపల్ కమీషనర్ మాస్టర్‌ తనకు వచ్చే జీతాలు, అలవెన్సులు కాకుండా పైన అదనపు అలవెన్సులు ఇవ్వాలని మున్సిపాలిటీ బోర్డుకు ఒక జాబితా పంపి, ఆమోదించకుంటే కొనసాగనన్నాడు. శానిటరీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న పటేల్ ఆ ఫైలు చూసి "ప్రభుత్వం మీ పనికి ఇవ్వాల్సిన జీతం, అలవెన్సులు నిర్ణయించాకే నియమించింది. ఒకవేళ ఆ షరతులు నచ్చకుంటే వెళ్ళిపోవచ్చని" తేల్చాడు. దానితో అతను రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. బొంబాయి ప్రావిన్స్ ఉత్తర డివిజన్‌కు కమీషనర్‌గా పనిచేస్తున్న ప్రాట్ సమర్థులైన భారతీయ ఇంజనీర్లను కాదని అనుభవం లేని ఒక బ్రిటిష్ రైల్వే ఇంజనీరును మున్సిపాలిటీ తీసుకునేలా ప్రభావితం చేశాడు. ఆ వెంటనే నగరంలో వచ్చిన నీటి ఎద్దడిని తగ్గించేలా ఆ ఇంజనీరు చర్యలు తీసుకోలేకపోయాడు. ఆ సందర్భంలో ప్రజల తరఫున నిలబడి వల్లభ్‌భాయ్ కచ్చితంగా వ్యవహరించడంతో అతనూ రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. వాటర్ వర్క్స్ ఇంజనీర్ అయిన వాడియా అనే వ్యక్తి నగరంలో నీరు సక్రమంగా అందడంలో చేసిన నిర్లక్ష్యం వల్ల ఒక అగ్నిప్రమాదంలో నీరు సరిగా అందక పరిస్థితి తీవ్రమైంది. దానికి తోడు అనేక సందర్భాల్లో అతనికి హెచ్చరికలు చేసినా నీటి సరఫరా విషయంలో ఏ శ్రద్ధా తీసుకునేవాడు కాదు. అతనిపై కూడా వల్లభ్‌భాయ్ తక్షణం సస్పెండ్ చేసి, షోకాజ్ నోటీసు ఇవ్వాలన్న తీర్మానం ప్రవేశపెట్టి నెగ్గించాడు. అలా మున్సిపల్ అధికారులు బ్రిటీషర్లైనా, భారతీయులైనా వారు సమర్థంగా, నిజాయితీగా పనిచేయకుంటే పటేల్ సహించేవాడు కాదు.[1]

పురపాలక సంఘ అభివృద్ధి పనులు

[మార్చు]

దీని తర్వాత పురపాలక సంఘ ఆదాయం సక్రమమైన పద్ధతిలో పెంచడంపై వల్లభ్‌భాయ్ దృష్టిపెట్టాడు. నగరంలో చాలామంది ప్రభుత్వాధికారులు, విశ్రాంత ప్రభుత్వాధికారులు, సంస్థల అధిపతులు మొదలైన పెద్దమనుషుల నుంచే సక్రమంగా పురపాలక పన్నులు వసూలు కాకపోవడం అన్న సమస్యపై పనిచేశాడు. పన్ను బకాయిలు ఉన్నవారందరి వివరాలూ, వారి బకాయిలు ప్రజలందరికీ తెలియపరచడం, కేసులు పెడతామని బెదరించడం, అవసరమైతే మన్ననగా చెప్పిచూడడం వంటి పద్ధతులతో పన్ను బకాయిలు చాలావరకూ వసూలు చేయగలిగాడు. అహ్మదాబాద్‌లో సైన్యాధికారులు, ముఖ్యమైన ప్రభుత్వాధికారులు నివసించే కంటోన్మెంట్ ప్రాంతంలో నీటిని మిగిలిన నగరంతో పోలిస్తే తగ్గింపు ధరకు ఇస్తున్నారని తెలిసి, కంటోన్మెంట్ కూడా తగిన ధర చెల్లించాలన్న వాదన తలకెత్తుకున్నాడు. ఇలా రకరకాల పద్ధతుల్లో పురపాలక సంఘ వ్యవహారాలు సరిజేసేందుకు కృషిచేశాడు.[2]

అహ్మదాబాద్ నగరానికి మంచి నీటి ఎద్దడి చాలా తీవ్రమైన సమస్యగా ఉండేది. 1891 నాటి జనాభాకి అప్పట్లో ఏర్పాటుచేసిన మంచినీటి వ్యవస్థే దశాబ్దాలు గడిచినా కొనసాగుతూ వచ్చింది. నీటి ఎద్దడికి తోడు ఉన్న బావుల్లో నీరు కూడా కలుషితం అవుతూ ఉండడం మరింత సమస్యగా ఉండేది. 1919లో వల్లభ్‌భాయ్ ప్రభుత్వాధికారులను, ప్రభుత్వంలో పనిచేయని బయటి నిపుణులను సంప్రదించి రసాయన పద్ధతిలో శుద్ధిచేసే ప్లాంటును నెలకొల్పడానికి ప్రణాళిక వేసి అమలుచేశాడు. దీనితో పాటుగా నగరంలో పెరుగుతున్న రద్దీని నియంత్రించేందుకు కొత్త రిలీఫ్ రోడ్డును పునర్నిర్మించడానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేశాడు.[2]

1920 నాటికి మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో పూర్తిస్థాయిలో వల్లభ్‌భాయ్ పటేల్ పాల్గొని విజయవంతం చేయడానికి కృషి ప్రారంభించాడు. అందులో అహ్మదాబాద్ మున్సిపాలిటీ సభ్యులు పాలుపంచుకోవడానికి పనిచేసేవాడు. అదే సమయంలో, ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక చట్టంతో ఏర్పడిన మున్సిపాలిటీ బోర్డు ప్రభుత్వానికి సహాయం నిరాకరించే ఉద్యమంలో ఏమేరకు పాల్గొనవచ్చన్న విషయంలో అతనికి సందేహం ఉండేది. సాధ్యమైనంత జాగ్రత్తగా మున్సిపల్ పరిపాలన విధులను, సహాయ నిరాకరణ రాజకీయాలను విడిగా ఉంచడానికి ప్రయత్నించేవాడు. అయితే, కౌన్సిలర్ల రాజకీయ కార్యకలాపాలను, మున్సిపల్ పరిపాలనలో వారి చర్యలను విడివిడిగా బ్రిటీష్ అధికారులు చూడలేకపోవడంతో క్రమేపీ మున్సిపాలిటీలో సమస్యలు ఎదురుకాసాగాయి.[2]

గాంధీతో పరిచయం, సాహచర్యం

[మార్చు]

వల్లభ్‌భాయ్ పటేల్, మహాత్మా గాంధీ మొట్టమొదటిసారిగా 1916లో అహ్మదాబాద్‌లోని గుజరాత్ క్లబ్‌లో ఒకరికొకరు ఎదురయ్యారు. ఆ ఏడాదే గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగివచ్చి ఏప్రిల్లో అహ్మదాబాద్ శివారులో ఆశ్రమం ఏర్పాటుచేసుకుని జీవించసాగాడు. 1916 జూలైలో ఒక మధ్యాహ్నం పూట గాంధీ తాను ఏర్పాటుచేయబోయే జాతీయ పాఠశాలకు నిధులు ఇవ్వమని కోరడానికి గుజరాత్ క్లబ్‌కి వెళ్ళి సభ్యులతో మాట్లాడాడు. ఆ సమయంలో నగరంలో సుప్రసిద్ధ బారిస్టరుగా ప్రాక్టీసు చేస్తున్న వల్లభ్‌భాయ్ ఖాళీ సమయాల్లో గుజరాత్ క్లబ్‌లో బ్రిడ్జి ఆట ఆడేవాడు. అలా గాంధీ వచ్చినప్పుడు బ్రిడ్జి ఆట ఆడుతున్న అతను కనీసం ఆట ఆపుజేసి గాంధీ చెప్పేదేమిటో వినడానికి కూడా లేవలేదు. ఇతరులు గాంధీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చారని పటేల్‌తో చెప్పారు కానీ అతనికి గాంధీ గురించి మంచి అభిప్రాయం ఏమీ కలగలేదు.[3][4] పటేల్‌పైనా గాంధీకి సదభిప్రాయం ఏర్పడలేదు.

ఆయన (గాంధీ) సిద్ధాంతాల పట్ల కానీ, హింస, అహింస వంటివాటి పట్ల కానీ నాకేమీ ఆసక్తి లేదు. ఆయన నిజాయితీ కలవాడు అన్నదే నాకు ముఖ్యమైన విషయం. మన దేశాన్ని దాస్యం నుంచి విముక్తి చేయాలన్న ఆశయం కోసం తన జీవితం మొత్తాన్ని, తనకున్న అంతటినీ ధారపోశాడు, ఇందుకోసం తానేం చేస్తున్నాడో తనకు తెలుసు. నాకు ఇంతకన్నా ఏమీ అక్కరలేదు.

గాంధీని కలసిన తొలి సంవత్సరాల్లో వల్లభ్‌భాయ్ పటేల్ [3]

పటేల్‌కి సదభిప్రాయం కలగకపోవడానికి ముఖ్యమైన కారణం గాంధీ ఆలోచనలన్నీ విడ్డూరమైనవనీ, ఇవన్నీ చెప్పడానికి బావుంటాయి తప్ప ఆచరణ కనిపించవనీ అతను భావించడమే. 1915లో బొంబాయి ప్రావిన్సు రాజకీయ సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు మున్సిపాలిటీలకు ఐసిఎస్ అధికారులను నియమించాలన్న బ్రిటీష్ ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా తీర్మానం చేసినప్పుడు కూడా వల్లభ్‌భాయ్ మౌనంగా ఊరుకున్నాడు. దాని వెనుక కూడా ఇవన్నీ ఊకదంపుడు మాటలే తప్ప చేతల్లో ప్రభావం ఏమీ ఉండదన్న తన ఆలోచన కారణం కావచ్చని నరహరి పారిఖ్ రాశాడు. కానీ, 1917లో చంపారన్ ప్రాంతంలో నీలిమందు రైతుల కోసం పోరాడుతున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి బహిష్కరిస్తూ, వెంటనే వెళ్ళిపొమ్మన్న జిల్లా మేజిస్ట్రేటు ఉత్తర్వులను ధిక్కరిస్తూ కొనసాగడం గుజరాత్ క్లబ్ సభ్యుల్లో చాలామందితో పాటుగా వల్లభ్‌భాయ్‌ని కూడా ఆకట్టుకుంది. ఇతను మాటల మనిషి కాదు, చేతల మనిషి అన్న నమ్మకం పటేల్‌కి కుదిరింది. క్రమేపీ ఇద్దరూ కలసి పనిచేయడం ప్రారంభించారు.[3][5]

గుజరాత్ సభ కార్యదర్శిగా

[మార్చు]

1917లో చంపారన్ సత్యాగ్రహంలో మహాత్మా గాంధీ నాయకత్వం గురించి తెలుసుకున్న గుజరాతీ స్థానిక నాయకులకు అతని పట్ల గౌరవం పెరిగింది. ఈ నేపథ్యంలో గుజరాత్ సభ అన్న సంస్థకు గాంధీని అధ్యక్షత వహించమని కోరారు. ఆ బాధ్యతలు స్వీకరించాకా ప్రతీ ఏడాది గుజరాత్ సభ తరఫున పొలిటికల్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించి, మొదటి సమావేశాన్ని గోధ్రాలో ఏర్పాటుచేశాడు. గుజరాతీ నాయకులతో పాటు ఇతర భాషలకు, ప్రాంతాలకు చెందిన కొందరు ముఖ్యనేతలు హాజరైన ఆ సమావేశం చాలా ప్రత్యేకతలతో సాగింది. కార్యక్రమంలో చేసిన తీర్మానాలను అమలుచేయడానికి, వాటిపై పనిచేయడానికి ఒక కార్యనిర్వహణ కమిటీని ఏర్పాటుచేశారు. దానికి అధ్యక్షునిగా గాంధీ ఉండగా కార్యదర్శిగా బాధ్యతలను వల్లభ్‌భాయ్ పటేల్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా పటేల్ పనితీరు స్వాతంత్ర్యోద్యమ నాయకునిగా అతని భావి వ్యవహారశైలికి ఉదాహరణగా ఉంటుంది.[5]

వెట్టిచాకిరీపై పోరాటం

[మార్చు]

కాన్ఫరెన్స్ ఆమోదించిన తీర్మానాల్లో ముఖ్యమైనది వెట్టిచాకిరీ నిర్మూలన. ఆ తీర్మానం ప్రకారం వెట్టిచాకిరీ నిర్మూలనకు కార్యనిర్వహణ కమిటీ కృషి చేయాలి. ప్రభుత్వాధికారులు ఊరికి వచ్చినప్పుడు ఊళ్ళోని అన్ని వృత్తుల వారూ ఉచితంగా సేవలు, వస్తువులు అందించడాన్ని వెట్టిచాకిరీ అనేవారు. కానీ, ఇలా చేయాలని ఎక్కడా చట్టంలో లేదు. ఉత్తర డివిజన్ కమీషనర్ అయిన ప్రాట్‌కి "తమ ఉద్దేశంలో వెట్టిచాకిరీ చట్టవిరుద్ధమనీ, అయినా రెవెన్యూ అధికారులు దీన్ని స్వప్రయోజనాలకు వాడుతున్నారనీ, ప్రభుత్వం దీనిని నేరుగా కానీ, పరోక్షంగా కానీ ఏ చట్టం ఆధారంగానైనా అనుమతిస్తే మాకు తెలియజేయమని, లేదా చట్ట విరుద్ధమైతే దీనిని నియంత్రించడంలో సాయం చేయమని" వల్లభ్‌భాయ్ రాశాడు.[5]

ఒక సాధారణ వ్యక్తి ఇలా రాయడాన్ని ప్రాట్ సహించలేక ఆగ్రహంతో చింపి, చెత్తబుట్టలో పారేశాడు. దానితో వల్లభ్‌భాయ్ ఈ విషయమై వాకబుచేస్తూ మరో ఉత్తరం రాశాడు. దాన్నీ ప్రాట్ చించేశాడు. చివరకు, మూడవ ఉత్తరంలో "నా తొలి రెండు లేఖలకు జవాబు లేదు కనుక పదిరోజుల్లో దీనికీ జవాబులేకుంటే వెట్టిచాకిరీ చట్టవిరుద్ధమని మీ జవాబుగా తీసుకుని ప్రజల్లో ప్రచారం చేస్తామని" రాశాడు. ప్రాట్ దిగివచ్చి, పటేల్‌ని కలవమని కబురు పంపాడు. దానికి జవాబుగా దీనిలో చర్చించేందుకు ఏమీ లేదనీ, వెట్టిచాకిరీకి అనుకూలంగా ఏమైనా చట్టం ఉంటే రాయమనీ, ఒకవేళ అంతగా మాట్లాడానుకుంటే కమీషనర్ వచ్చి తమ కమిటీ కార్యాలయంలో కలవవచ్చనీ రాశాడు. తన స్థాయి అధికారికి ఇలాంటి జవాబు రావడం మింగుడుపడకున్నా మొదటి రెండు ఉత్తరాలూ నిర్లక్ష్యం చేసిన పొరబాటు వల్ల ప్రాట్ ఊరుకున్నాడు. పదిరోజుల తర్వాత గుజరాత్ సభ వెట్టిచాకిరీ నిర్మూలనకు ప్రచారం ప్రారంభించి కొన్నాళ్ళలోనే మంచి పురోగతి సాధించింది.[5]

కరువులు, అంటురోగాల్లో సేవలు

[మార్చు]

1917-19 మధ్యకాలంలో కరువులు, అంటురోగాలు వ్యాపించినప్పుడు వల్లభ్‌భాయ్ పటేల్ గుజరాత్ సభ కార్యదర్శిగానూ, అహ్మదాబాద్ మున్సిపాలిటీ సభ్యునిగానూ ప్రజలకు సేవలు ఎన్నో చేశాడు.[5]

  • 1917లో అహ్మదాబాద్‌లో ప్లేగు మహమ్మారి వ్యాపించడంతో జనం ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోసాగారు. వల్లభ్‌భాయ్ మాత్రం నగరంలోనే ఉంటూ అటు పురపాలక సంఘంలో పారిశుద్ధ్య కమిటీ అధ్యక్షునిగా పారిశుధ్యాన్ని సమర్థంగా పర్యవేక్షిస్తూ పరిస్థితి మెరుగుపడడానికి తనవంతు చేశాడు.
  • 1917-18లో అహ్మదాబాద్ జిల్లాలో కరువు తాండవించింది. దానితో గుజరాత్ సభ తరఫున ప్రజలకు సాయం అందించే కార్యక్రమాలను చేపట్టాడు.
  • 1918లో ఫ్లూ మహమ్మారి అహ్మదాబాద్‌ని దెబ్బతీసింది. ఆ సమయంలో గుజరాత్ సభ తరఫున ప్రత్యేకంగా ఒక ఉచిత ఆసుపత్రి ఏర్పాటుచేసి సేవలందించడమే కాక ఇంటింటికీ ఉచిత మందుల పంపిణీ ఏర్పాట్లు కూడా చేశాడు పటేల్.

1920లో నాగపూర్ కాంగ్రెస్‌లో కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తిరగరాసినప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. ఆ క్రమంలో గుజరాత్ సభ సంస్థను గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీగా మార్చారు. దాని తొలి అధ్యక్ష/నిగా వల్లభ్‌భాయ్ పటేల్ ఎన్నికయ్యాడు.[5]

ఖేడా సత్యాగ్రహం

[మార్చు]

అతివృష్టి, ప్రభుత్వం దాష్టీకం

[మార్చు]

1917 వర్షాకాలంలో ఖేడా జిల్లాలో విపరీతమైన గాలివానలు, తుఫానుల వల్ల పంట నాశనమైంది. కొంత ఆగి విత్తడానికి కూడా వీలులేకుండా వానలు కొనసాగుతూనే పోయాయి. ఇక రబీ సీజన్‌లో పంటలను ఎలుకలు, చీడపీడలు చెలరేగి నాశనం చేశాయి. దానితో ఆ ఏడాది అతివృష్టి వల్ల కరువు వచ్చింది. సామాన్యంగా వానలు పడక అనావృష్టివల్ల కరువు కాటకాలు వస్తే ప్రభుత్వం, సమాజంలో సంపన్నులు కూడా సహాయకార్యక్రమాలు, పన్నురద్దు వంటివి చేపడతారు. అయితే, అతివృష్టి కరువును ఆయా వర్గాలు కనీసం గుర్తించలేదు. పంట దిగుబడిని అంచనా వేసి పన్ను వాయిదా కానీ, మినహాయింపు కానీ ఇవ్వడం రివాజు. 1917లో ఖేడా జిల్లా కరువు విషయంలో ప్రభుత్వాధికారులు పన్ను వాయిదాకు ఏ అవకాశం ఇవ్వలేదు. దీనిని కతాలాల్ గ్రామానికి చెందిన మోహన్‌లాల్ పాండ్యా దీనిని ప్రశ్నించగా, అతనికి గాంధీ, పటేల్ మద్దతునిచ్చారు.[6] పాండ్యాతో పాటుగా అదే గ్రామానికి చెందిన శంకర్‌లాల్ పారీఖ్ తోడయ్యాడు.[7]

1917 నవంబరులో పన్నుల వసూలును ఏడాది పాటు వాయిదా వేయమని కోరుతూ 22 వేలమంది రైతుల సంతకాలతో కూడిన దరఖాస్తును పాండ్యా - పారీఖ్‌ల ప్రోద్బలం, సహకారంతో రైతులు బొంబాయి ప్రభుత్వానికి సమర్పించారు. కలెక్టరే ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయించగలరని ప్రభుత్వం తెలియజేసింది. ఆమోదించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక నష్టం లేకపోయినా రైతుల్లో జాతీయోద్యమ నేతల పలుకుబడి పెరిగి, ప్రభుత్వం పట్ల చులకన ఏర్పడుతుందన్న ఆలోచనతో అధికారులు మొండితనం అవలంబించారని నరహరి పారిఖ్ విశ్లేషించాడు. మొత్తానికి కలెక్టర్ కేవలం పన్ను వసూలును తాత్కాలికంగా అంచనా పూర్తయ్యేవరకే వాయిదా వేశాడు.[6]

వసూలు కావాల్సిన 23 లక్షల రూపాయల పన్నులో కేవలం 7.4 శాతమైన 1.75 లక్షల రూపాయలు మాత్రమే ఏడాదిపాటు వాయిదా వేస్తూ మిగిలిన పన్ను వసూళ్ళు కొనసాగేట్టు డిసెంబరు 22న కలెక్టర్ నిర్ణయించాడు. రెవెన్యూ ఉద్యోగులు గ్రామాల్లో రైతులను పన్ను వసూళ్ళ కోసం కలెక్టర్ ఉత్తర్వుల ఆధారంగా తీవ్రంగా పీడించసాగారు. గుజరాత్ సభ తన కార్యదర్శులూ, సభ్యుల నివేదిక ఆధారంగా బొంబాయి ప్రభుత్వాన్ని పన్ను వాయిదా కోరుతూ లేఖ రాసింది.[6]

పూర్తిస్థాయి రాజకీయాల్లోకి పటేల్

[మార్చు]

1918 జనవరి మొదట్లో వల్లభ్‌భాయ్ పటేల్ ఇంట్లో గుజరాత్ సభ ఖేడా రైతుల సమస్య విషయమై పన్నుల చెల్లింపు నిరాకరిస్తూ ఉద్యమం చేయాలన్న అంశం చర్చించడానికి సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొనకున్నా వివరాలను మాత్రం గాంధీ ఎప్పటికప్పుడు తెలుసుకోసాగాడు. తాను నాయకత్వం వహించి రైతులను ఇందులోకి దింపాలంటే శాసనోల్లంఘన ప్రతిపాదనను కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించాలనీ, గుజరాత్ సభకు చెందిన వ్యక్తి ఒకరు కనీసం పూర్తికాలం దీనికే కేటాయించాలనీ రెండు షరతులు పెట్టాడు.[8][9]

పూర్తికాలం ఉద్యమానికే కేటాయిస్తూ మిగిలిన వ్యాపార, వ్యవహారాలన్నీ వదులుకోవాలన్న షరతు పెట్టినప్పుడు గాంధీ మనసులో ఉన్న వ్యక్తి వల్లభ్‌భాయ్‌యేనని అతని జీవితచరిత్రకారుడు రాజ్‌మోహన్ గాంధీ అభిప్రాయపడ్డాడు. గాంధీ క్రమేపీ వల్లభ్‌భాయ్‌ని తనవైపు, తన కార్యకలాపాల వైపు ఆకర్షిస్తూ వచ్చాడనీ రాజ్‌మోహన్ రాశాడు. అంతకన్నా ముందే ఖేడా జిల్లా రైతుల ఆత్మగౌరవాన్ని బ్రిటిష్ వారితో సరైన విధంగా పోరాడి నిలబెట్టే అవకాశం కూడా పటేల్‌కి ఉత్సాహాన్ని కలిగించింది. అప్పటికే శాసనోల్లంఘన చేయాలన్న గాంధీ ప్రతిపాదన పట్ల తన మనసు నాట్యం చేయసాగిందనీ, కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించాలని పట్టుపట్టవద్దనీ, మెజారిటీ చాలని ఒప్పుకోవాలసిందిగా కోరానని పటేల్ తర్వాతికాలంలో స్వయంగా చెప్పుకున్నాడు.[8][9]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 వల్లభ్‌భాయ్ పటేల్ - 1, నరహరి పారిఖ్ 1950, pp. 26–36చాప్టర్ VI
  2. 1 2 3 వల్లభ్‌భాయ్ పటేల్ - 1, నరహరి పారిఖ్ 1950, pp. 36–40చాప్టర్ VII
  3. 1 2 3 Aspirant, Civil (2020-07-10). "230. When Sardar Patel met Gandhi for the first time". Civil Aspirant (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-12-08. Retrieved 2025-02-20.
  4. ఘోష్, సోహిణీ (2023-07-18). "Know Your City: Gujarat Club, where Sardar Patel frequented to play bridge and met Gandhi for first time". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 2023-10-01. Retrieved 2025-02-20.
  5. 1 2 3 4 5 6 వల్లభ్‌భాయ్ పటేల్ - 1, నరహరి పారిఖ్ 1950, pp. 40–47చాప్టర్ VIII
  6. 1 2 3 వల్లభ్‌భాయ్ పటేల్ - 1, నరహరి పారిఖ్ 1950, pp. 48–69చాప్టర్ IX
  7. వల్లభ్‌భాయ్ పటేల్, రాజ్ మోహన్ గాంధీ 2015, p. 60
  8. 1 2 వల్లభ్‌భాయ్ పటేల్, రాజ్ మోహన్ గాంధీ 2015, p. 62
  9. 1 2 వల్లభ్‌భాయ్ పటేల్, రాజ్ మోహన్ గాంధీ 2015, p. 63

నోట్స్

[మార్చు]

ఆధార గ్రంథాలు

[మార్చు]
  • పారిఖ్, నరహరి (1950). సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ (in ఇంగ్లీష్). Vol. 1. ISBN 978-8172291563. {{cite book}}: ISBN / Date incompatibility (help)
  • గాంధీ, రాజ్‌మోహన్ (2015). వల్లభ్‌భాయ్ పటేల్ జీవితకథ. Translated by టంకశాల, అశోక్. ISBN 978-93-83652-75-4.