వాడుకరి చర్చ:Weshowit

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Weshowit గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Weshowit గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Nrgullapalli (చర్చ) 00:44, 10 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

జోగుళాంబ గద్వాల మాండలిక పదాలు[మార్చు]

గద్వాల, అలంపూరు శాసనసభ నియోజకవర్గాలను కలిపి జోగుళాంబ గద్వాల జిల్లాగా ఏర్పాటు చేశారు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతాన్ని నడిగడ్డ అని పిలుస్తారు. నడిగడ్డకు ఓ యాస ఉంది. స్థానికంగా ఉపయోగించే కొన్ని ప్రత్యేకమైన పదాలు ఉన్నాయి. అయితే సమాచార సాంకేతికత, ప్రపంచీకరణ ప్రభావం వలన ఆ మాండలిక పదాల వాడుక క్రమేపీ తగ్గిపోతుంది. వాటిని వెలుగులోకి తేవడం ద్వారా జోగుళాంబ గద్యాల్ జిల్లా వాసులకు తమ భాషని గుర్తు చేస్తూ, ఇతర ప్రాంతాల్లోని తెలుగువారికి ఆ పదజాలాన్ని పరిచయం చేయాలనేదే ఈ ప్రయత్నం.

ఏ మాండలికం అయినా, ఏ యాస అయినా అంతిమంగా తెలుగు భాష అంతర్భాగాలే. తెలుగువారికి చెందిన ఆస్థులే. మన భాషని ఎంత విస్తరించుకుంటే, ఎంత విశ్వవ్యాప్తం చేసుకుంటే అంత వైభవాన్ని పొందగలుగుతాం. ఏ పదం ఎక్కడ అక్కరకొస్తుందో, ఏ శభ్దం ఎక్కడ చక్కగా ఇమిడిపోతుందో చెప్పలేం. ఈ భాషా విస్తృతి అనేది భావ వ్యక్తీకరణ పరిధిని పెంచడమే కాకుండా సాహితీ సాంస్కృతిక అవసరాలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.


నడిగడ్డ గ్రామ్యాలు


అ ఇ ఉ ఒ

అచ్చిబాటు – కలిసిరావడం; పాల వ్యాపారం అతనికి అచ్చిబాటు రాలేదు.

అడకకి - కిందకు; వాళ్ళు దుప్పటి అడకకి వేసుకుని పడుకున్నారు.

అడ్డపడటం - చిన్న కునుకు; పని లేదని వీరమ్మ కాసేపు అడ్డపడింది.

అగెత్తం - ప్రయోజనం ఆశించి బాధ నటించడం; డబ్బుల కోసం తిమ్మన్న అగెత్తాలు పోతున్నాడు.

అగ్గ - అరె, అయ్యో (ఆశ్చర్యార్థకం); అగ్గ, నువ్వెందుకు వచ్చావ్?

అగ్వ - చౌక; సంతలో టమాటాలు అగ్వకే దొరుకుకుతున్నవి.

అనా – ఇదిగో; అనా, తినడానికి వస్తవా రావా!

అఖండ భజన - గుళ్ళో రాత్రంతా చేసే భజన; శ్రావణమాసం ఆఖరిరోజు మా ఊళ్ళో అఖండ భజన చేస్తరు.

అలకడం - (ఎర్ర)మట్టితో నేలకి రంగేయడం; పనిమనిషి పొద్దున్నే ఇల్లు అలికిపోయింది.

అలాయి - పీర్ల పండగలో మంట చుట్టూ ఆడటం; తెల్లార్లూ అలాయి తొక్కినందుకు శీనుకి నిద్ర లేదు.

అల్లు - భయం; పాముని చూసి ఆ పిల్లోడు అల్లుపోయినాడు.

అల్లించు - నడిపించు, తోలు; అతను ఎద్దులబండిని వేగంగా అల్లిస్తున్నాడు.

అంగుళం - ఇంటిముందుండే ఖాళీ స్థలం; పిల్లలంతా మా అంగుళంలోనే ఆడుకుంటరు.

అల్తిగా - తేలికగా; నరసింహుడు నీళ్ళబిందెని అల్తిగా ఎత్తినాడు.

అలుము - ఒకరకమైన కలుపుమొక్క; బడి వెనకాల మొత్తం అలుము పారింది.

అంబరయింది - అతి అయింది; ఏంటి మీదమీదకు వస్తున్నవు, నీది అంబరయింది!

అంబు - విల్లు, ధనస్సు; భాస్కర్ అంబుతో బాణాలు వేస్తున్నడు.

అమ్మడచెయ్యి - కుడి చేయి; అమ్మడచేత్తోనే తినాలని నాగమ్మ కొడుకుని తిట్టింది.

అముడాల పిల్లలు - కవల పిల్లలు; లక్ష్మికి అముడాల పిల్లలు పుట్టారు.

అంగీ - చొక్కా; సూరిబాబు అంగీ వేసుకోకుండా బయటకు వచ్చాడు.

అంకసిరి - తరువాత; నేను బయటకు పోతున్నా, అంకసిరికి రా!

అంటు - బంక, జిగురు; పిల్లలు అంటుతో కాగితాలు అతికిస్తున్నరు.

అనుపానం - కూర; బిచ్చగాడు అనుపానం తల్లీ అని అడుక్కుంటున్నడు.

అరాజు - వేలం; పాత బండిని అరాజు పాడుతున్నరు.

అరుగులు ఎత్తడం - బాధ నటించడం; ఆ పిల్లోడు బడికి పోకూడదని అరుగులెత్తుతున్నడు.

అప్పట్లు – పంట్లు (ఆటల్లో పిల్లలు చేతులతో చేసే ఓ ప్రక్రియ); పిల్లలు అప్పట్లు వేసుకుని ఆట మొదలుపెట్టారు.

అత్రాసలు - అరిసెలు; అత్రాసలు కమ్మగా ఉంటయి.

అట్టు - ఆమ్లెట్; కూర లేనందుకు మా అమ్మ అట్టు వేసిచ్చింది.

అత్తురు పో - పక్కకి జరుగు; బెంచీ సరిపోదని రాజు శంకర్ ని అత్తురు పొమ్మన్నాడు.

అవుమల్ల - అవునుమరి; అవుమల్ల, నువ్వెందుకు నా పెన్సిల్ తీసుకున్నావ్!

ఆయం - వృత్తి పనుల వాళ్ళకి ఏటా ఇచ్చే ధాన్యం; మేము కమ్మరొళ్ళకి ఈ యేడు ఆయం కొలిచినాం.

ఇచ్చుకపోవడం - చీలిపోవడం / విడిపోవడం; బండి చక్రం కట్టు ఊడి ఇచ్చుకపోయింది.

ఇడిపడడం - తెగించడం; కృష్ణ ఈమధ్య ఇడిపడి మందు తాగుతున్నడు.

ఇదిరియి - విదిలించు, దులుపు; చీమలు ఉన్నాయని హేమ దుప్పటి ఇదిరిచ్చింది.

ఇగం - పొగమంచు; వరిచేను మీద ఇగం పరుచుకుంది.

ఇగ్గు - లాగు; సైకిల్ బురదగుంతలో దిగబడి ఎంత ఇగ్గినా రాలేదు.

ఇల్లారు తీయడం - ఇంటి బూజు దులపడం; దసర పండగ వస్తుందని మా ఇంటికి ఇల్లారు తీపిచ్చినాం.

ఇంద్రం - పురుషుడి వీర్యం;

ఇంగ - ఇంక, ఇక; ఇంగ చెప్పాలంటే చాలా వుంది!

ఇరుకుటం - ఇరుకు; ఆటో ఇరుకుటం అయితుందని రమేశ్ దిగిపోయాడు.

ఇరుమాను - పేలు తీసేందుకు వాడే చెక్క దువ్వెన; లీల తన కూతురికి ఇరుమానుతో దువ్వుతుంది.

ఇస్పెటాకులు - పేకలు; వెంకటేశు రెండుజతల ఇస్పెటాకులు కొనుక్కున్నాడు.

ఇస్పెటాట – పేకాట; ఇస్పెటాట ఆడుతున్నడని సుశీల మొగునితో కొట్లాడింది.

ఉగ్గాని - మురమురాలతో చేసే టిఫిన్; ఉగ్గాని బజ్జీలతో కలిపి తింటే మస్తుంటది.

ఉమాదం - పిచ్చి, తిక్క; శేఖర్ కి ఉమాదం పట్టిందా, అట్ల మాట్లాడుతున్నడు!

ఉట్టి - పై కప్పుకి వేలాడదీసే తాడు బుట్ట; దొంగపిల్లి ఉట్టి మీదకు ఎగిరి పెరుగు తినిపోయింది.

ఉత్త చేయడం - ఖాళీ చేయడం, అయిపోగొట్టడం; పిల్లలు కుడుముల గిన్నెని ఉత్తజేసినారు.

ఉద్ధర - వస్తువులు కొనేచోట పెట్టే అప్పు; లోకయ్య అంగడికి పోతే ఉద్దర ఇవ్వడు.

ఉల్లుల్లక్క - ఉత్తుత్తినే; లాటరీ తగిలిందని జయన్న ఉల్లుల్లక్క చెప్పినాడు.

ఊక – వడ్ల నుండి తీసే పై పొర; పరశురాం మిల్లులో ఊకతో నూనె తీస్తరు.

ఊక, ఊకూక – అనవసరంగా; బుచ్చన్న ఊకూక అబద్ధాలు చెప్తాడు.

ఎకతేకడం - ఆయాసం తో రొప్పడం, బస; చెన్నయ్య రైలు కోసం ఉరికి ఎకతేకుతున్నడు.

ఎంచడం - లెక్కపెట్టడం; ఎల్లమ్మకు పైసలు ఎంచుకున్నీక రాదు.

ఎత్తిపోవడం - నష్టపోవడం; మందుల షాపు నడవక మహేశు ఎత్తిపోయినాడు.

ఎట్టిగా - వృథాగా; శ్రీనాథ్ పనీపాట లేకుండా ఎట్టిగా తిరుగుతాడు.

ఎట్ట తీసుకోవడం - వేసవిలో మూత్రం మంటగా రావడం; కిష్టన్నకి ఎట్ట తీసుకుని చాలా బాధపడుతున్నాడు.

ఎదారు - చింత, ఆందోళన; బిడ్డ పెండ్లి కోసం మోహన్ ఎదారు చేస్తున్నడు.

ఎదురుబదురు – ఎదురెదురు; ఎదురుబదురు కూర్చోని మాట్లాడుకుంటే గొడవలు ఉండవు.

ఎదురుకోళ్లు - పెళ్ళికొడుకుని స్వాగతిస్తూ పెళ్లికూతురోళ్ళు చేసే కార్యక్రమం; శిరీష పెళ్ళిలో ఎదురుకోళ్ళు అయ్యేసరికి అర్ధరాత్రయింది.

ఎడపిల్ల / ఎడపిల్లగాడు - కౌమారదశలో ఉన్న పిల్లలు; ఎడపిల్లలకు ఏదైనా మంచిగానే చెప్పాలి.

ఎడిగాల - వేరుగా, వేరు కాపురం; పెళ్ళయిన మూన్నెళ్ళకే విష్ణు కొడుకు, కోడలు ఎడిగాల పోయినారు.

ఎండ్రకాయ - పీత; శివరాం బావిలో ఈదుతుంటే ఎండ్రకాయ కాలికి పట్టింది.

ఎనపడం - రుబ్బడం; పల్లెటూర్లలో గుత్తితోనే పప్పు ఎనుపుతారు.

ఎర్ర - వానపాము; వాన పడినందుకు మా పొలంలో ఎర్రలు చాలా వచ్చినాయి.

ఎరుకల కొడవలి - పొడవాటి కర్ర గల కొడవలి; ఎరుకల కొడవలితో రంగడు ఈతపళ్ళు కోశాడు.

ఎలగొడ్డు - ఎలుగుబంటి; మా ఉర్లోకి ఎలగొడ్లు ఆడించేవాళ్ళు వచ్చినారు.

ఎల్లదీయడం - వేలుపెట్టి నోటిని శుభ్రం చేయడం; పళ్ళు తోమేటప్పుడు బాగా ఎల్లదీయమని పెద్దలు చెప్తారు.

ఎల్లేపియ్యడం - (బావి) పూడిక తీయడం; ఈ ఎండకాలం మా బావిని ఎల్లేపిస్తం.

ఎల్లిపాయ - వెల్లుల్లి; జొన్నరొట్టెలో ఎల్లిపాయ కారం తింటే చాలా బాగుంటది.

ఏంచడం - వేయించడం; మా హెడ్మాష్టరు పల్లీలు ఏంచుకుని బెల్లంతో తింటాడు.

ఏతులు పడడం - గొప్పలు పోవడం; పోలీసు అయినందుకు శ్రీరాములు ఏతులు పడుతున్నడు.

ఏట్లు - దెబ్బలు; అల్లరి చేసినందకు చిట్టికి బాగా ఏట్లు పడ్డాయి.

ఒక్కపొద్దు - ఉపవాసం చేయడం; ఏకాదశి రోజు చాలామంది ఒక్కపొద్దు ఉంటరు.

ఒంటదు - పడదు; రాధకు కారు ప్రయాణం ఒంటదు.

ఒంటికి పోవడం - మూత్రానికి పోవడం; క్లాసు మధ్యలో ఒంటికి పోవద్దని సారు పిల్లలను తిట్టాడు.

ఒంటిపూట బడి - హాఫ్ డే స్కూల్; మార్చి రెండో వారం నుండి పిల్లలకు ఒంటిపూట బళ్ళు.

ఒడుకలు - ముక్కలు; కొబ్బరికాయని నేలకేసి కొడితే ఒడుకలయింది.

ఒడుసు - వంపు; ఆమె గిన్నెలో నీళ్ళని మొత్తం ఒడిసింది.

ఒప్పలు - ముక్కలు; పిల్లలు మామిడికాయ ఒప్పల మీద కారం జల్లుకుని తింటారు.

ఒర్లడం - అరవడం; సుధాకర్ మందు తాగితే ఊరికే ఒర్లుతడు.

ఒట్టిగా - పొడిగా; బట్టలు ఒట్టిగా లేకపోతే సుధ వేసుకోదు.

ఓలి - బుద్ధి, లక్షణం; తాగుడు విషయంలో రాజుకి మేనమామ ఓలి పారింది.


క గ చ జ

కడగొమ్ము - అలుగు; వర్షాలు ఎక్కవయి మా చెరువు కడగొమ్ము పారుతుంది.

కడజెయ్ - అయిపోగొట్టు; జనార్ధన్ ఉప్మా మొత్తం కడజేశాడు.

కడ్త - కణత; ఎవరినీ కడ్త మీద కొట్టొద్దని మా అమ్మ చెప్పింది.

కలికుండ - గంజిని నిలువ చేసే కుండ; కలికుండ నిండినందుకు సుజాత గంజిని పారబోసింది.

కల్లుబొట్టు - కల్లు; రైతుకూలీలకు సాయంత్రం కల్లుబొట్టు తాగనిదే నిద్రపట్టదు.

కళ్లకపిడి - గబ్బిలం; ఆ పురాతన గుడిలో చాలా కళ్ళకపిడిలు ఉన్నాయి.

కళ్ళం - పంట కుప్ప నూర్చే ప్రదేశం; సవారన్న మా వడ్ల కళ్ళానికి కాపలా ఉంటాడు.

కమ్మ కొడవలి - పొడువాటి పిడి ఉండే కొడవలి; హుస్సేను కమ్మకొడవలితో చెట్టు కొమ్మలు నరుకుతున్నాడు.

కంపచెట్లు - ముళ్ళ చెట్లు; సేద్యం చేయక మా పొలంలో కంపచెట్లు మొలిచాయి.

కమ్మరొళ్ళు - ఇనుప పనిముట్లని పదును పెట్టేవాళ్ళు; మా ఊర్లో కమ్మరోళ్ళ ఇళ్ళు రెండే ఉన్నాయి.

కమ్ములు కట్టడం - బండి చక్రాలకు ఇనుముతో రింగు కట్టడం; అతను తన ఎద్దులబండికి కమ్ములు కట్టించాడు.

కంచార్తులు - దీపపు సిమ్మెలు; లక్ష్మిందేవి పెళ్ళివాళ్ళ ఇంట్లో కంచార్తులు పట్టింది.

కందులు - కందిపప్పు; సాయి వాళ్ళ పొలంలో ఈసారి కందులు బాగా పండినాయి.

కందెన - బండి చక్రాలకు వాడే నల్లటి లూబ్రికెంట్; కందెన వేయక బండి చక్రాలు చప్పుడు చేస్తున్నాయి.

కన్నెగా - పూర్తిగా; నారాయణ పేకాట ఆడి ఆస్థులు కన్నెగా అమ్మేసిండు.

కంత / కళ్ళ - ముళ్ళకంచె; పశువులు రాకూడదని అంజి పొలం చుట్టూ కంత పెట్టినాడు.

కంతులు - వాయిదాలు; రైతులు వ్యవసాయ ఋణాన్ని కంతుల లెక్కన కడతారు.

కరారు - ఎద్దుల చర్మాన్ని శుభ్రపరిచే ఓ ఇనుప సాధనం; కరారు పెట్టక వాళ్ళ ఎద్దులు మురికి పట్టినాయి.

కరిగేటు - వరి నాటేందుకు బురద పొలాన్ని దున్నడం; తిప్పయ్య కరిగేటు చేయగా బట్టలకు బురద అంటింది.

కర్రెపాకు - కరివేపాకు; మా అమ్మ తిరుగవాతలో కరివేపాకు ఖచ్చితంగా వేస్తుంది.

కర్షికాయలు - కజ్జికాయలు; ఉగాది పండుగకి సునీత వాళ్ళింట్లో కర్షికాయలు చేశారు.

కర్సుకోవడం - అంటుకోవడం, హత్తుకోవడం; జిగురు వల్ల రెండు పుస్తకాలు బాగా కర్సుకున్నాయి.

కరుకుముక్కలు - కాల్చి పారేసిన బీడీ / సిగరెట్ ముక్కలు; పంచాయితీ ఆఫీసు మొత్తం కరుకుముక్కలతో నిండిపోయింది.

కస్తీ - కష్టం, ఒత్తిడి; రాముకి సేద్యం చాలా కస్తీ అనిపిస్తుంది.

కసు - చెత్త; శివమ్మ కసుని ఎత్తి దిబ్బలో పోసింది.

కసుగొట్టు - ఊడ్చు; మాలతి రోజూ రెండుసార్లు కసుగొడుతుంది.

కంసలయ్య - కంసాలి, బంగారం, వెండి ఆభరణాలు చేసేవాడు; దేవమ్మ తన బిడ్డకి కంసలయ్య దగ్గర వెండి పట్టీలు చేపిచ్చింది.

కటికోళ్లు - మాంసం అమ్మేవాళ్ళు; కటికోళ్ళు ప్రతి ఆదివారం రెండు పొట్టేళ్ళు కోస్తారు.

కట్టడం - పశువులు గర్భం దాల్చడం, ఈనవడం; వాళ్ళ ఎర్ర ఆవు ఈ మధ్యనే కట్టింది.

కట్టెల కోలంట్లు - కర్రలతో వేసే కోలాటం; మా ఊర్లో రాత్రిపూట కట్టెల కోలంట్లు వేస్తారు.

కాగబెట్టడం - వేడి చేయడం; మా అవ్వ స్నానానికి నీళ్ళు కాగపెడుతుంది.

కాగు - పెద్ద మట్టి కుండ, దుత్త; కాగులో నీళ్ళు చల్లగా ఉంటాయి.

కాబట్టదు - పట్టించుకోకపోవడం; ఎవరు ఎంత తిట్టినా చక్రికి కాబట్టదు.

కాంట - తూకం; ఈరోజు మా వడ్లని కాంట వేయిస్తం.

కానుగ బడి - కాన్వెంటు, ప్రైవేట్ స్కూల్; కానుగబడిలో చదువు బాగా చెప్తారంట.

కాన్పవడం - పిల్లల్ని కనడం; పెళ్లయిన సంవత్సరానికే రాధిక కాన్పయింది.

కార, కారాలు - నంకీన్, మిక్చర్; యాకూబ్ మందులోకి కార కట్టించుకొని పోయాడు.

కావిలి - కాపలా; నేను మా బొప్పాయి తోటకి రోజూ కావిలి పోతాను.

కాయచక్కర - కొబ్బరికాయతో కూడిన పూజసామాగ్రి; గుడిలో జరిగే భజనకి మేమే కాయచక్కెర ఇచ్చాం.

కాలేకాలే - వేడివేడి; వర్షంలో కాలేకాలే బజ్జీలు తింటే మస్తుంటది.

కాళ్ళజెర్రీ - ఎక్కువ కాళ్ళు ఉండే చిన్న విషపురుగు; వానకాలం కాళ్ళజెర్రులు ఇళ్ళలోకి వచ్చేస్తాయి.

కాన్ కాన్ కితికితి - ప్రత్యర్థి వీపు మీద కూర్చుని ఆడే ఓ గ్రామీణ క్రీడ; సెలవుల్లో మేమంతా రెండు టీంలుగా ఏర్పడి కాన్ కాన్ కితికితి ఆడాము.

కిస్కింత - కొంచెం; కిస్కింత జండూబామ్ ఇమ్మని దేవమ్మ అడిగింది.

కుడుపు - విందు; మేము జాతరని భక్ష్యాల కుడుపుతో చేశాము.

కుడుములు - పూర్ణం నింపి చేసే తీపి పదార్థాలు; దేవుడి నైవేద్యం కోసం అందరూ కుడుములు చేస్తారు.

కుక్కడం - మొట్టికాయ వేయడం; ఉపాధ్యాయుడు విద్యార్థిని నెత్తిమీద కుక్కాడు.

కుంచెడు - ధాన్యాన్ని కొలిచే ఒక పెద్ద ఇనుప కుండ; మా జీతగానికి కుంచెడు వడ్లు ఇచ్చాము.

కుణ్ణిళ్ళు - మృతి చెందిన వారికి ఇష్టమైన తిండిపదార్థాలు సమర్పించే ఆచారం; వాళ్ళ తాత కుణ్ణీళ్ళ కోసం భీమేశ్ ఊరెళ్ళాడు.

కుంటాట - ఒక్క కాలితో కుంటుతూ ఆడే గ్రామీణ క్రీడ; దెబ్బలు తగులుతాయని పెద్దలు కుంటాట ఆడొద్దంటారు.

కుంట్లు – పనోళ్ళు పనిలోకి రాని దినాలు; మా గాసగానికి ఇప్పటికే పద్నాలుగు కుంట్లు పడ్డాయి.

కుమ్మరోళ్ళు - కుండలు చేసేవాళ్ళు; కుమ్మరోళ్ళు ఎండనకా వాననకా కష్టపడతారు.

కుర్సికలి - చిన్న కొడవలి; కలుపు తీయడానికి చంద్రన్న కొత్త కుర్సికలి కొన్నాడు.

కురుపాట్లు - కునికిపాట్లు; రంగన్న మాట్లాడుతూనే కురుపాట్లు పోతాడు.

కుశాలు - ఉల్లాసం; పంటకి మంచి ధర వచ్చిందని నారాయణ కుశాలుగా ఉన్నాడు.

కువాడం - ఆట పట్టించడం, టీజింగ్; ప్రభాకర్ తన బామ్మర్దిని బాగా కువాడం చేస్తాడు.

కూసో - కూర్చో; ఇంటికి వచ్చిన అతిథుల్ని కూసోమనాలి.

కై కట్టడం - బాణీలు కట్టడం; మావూరి భజనపరులు వాళ్ళ పాటలను వాళ్ళే కై కడతారు.

కొనాకు - చివరకు, అంచుకు; వెంకట్ బెంచీ కొనాకున కూర్చున్నాడు.

కొర్రు గొట్టడం - తల కిందకు పెట్టి నీటిలోకి దూకడం; పిల్లలు చాలా ఎత్తు నుండి బావిలోకి కొర్రు గొడతారు.

కొట్టం - గుడిసె; నర్సయ్య తన బావి దగ్గరే కొట్టం వేసుకున్నాడు.

కొండీగ - కుట్టే దోమ; మా ఇంట్లో కొండీగలు ఎక్కువయినాయి.

కొండ్లు - కొక్కేలు; బావిలో బకెట్ పడితే లక్ష్మయ్య కొండ్లతో పైకి తీశాడు.

కొప్పెర - వర్షంలో తడవకుండా తలపై పెట్టుకునే గోనెసంచి. రఘు కొప్పెర వేసుకుని వర్షంలో పరుగెడుతున్నాడు.

కోర - (బావి నుండి) నీళ్లు తోడే బకెట్; బషీర్ కోరతో బావి నుండి మంచినీళ్ళ తోడాడు.

కోలంట్లు - కోలాటం; మా ఊర్లో కోలంట్లు బాగా ఆడుతారు.

కోలు పారడం - బావి నిండిపోయి నీళ్లు పైకి రావడం; వర్షాలు ఎక్కువయి మా బావి కోలు పారుతుంది.

గబ్బు - చెత్త; ఆ బాట గబ్బుగబ్బు ఉంటదని ఎవరూ పోరు.

గచ్చు - ఇంటి నిర్మాణానికి వాడే సుద్ద మిశ్రమం; మురళి తన ఇంటిని గచ్చుతో కాకుండా సిమెంట్ తో కట్టాడు.

గంజి - మార్కెట్ యార్డ్; వేరుశనక్కాయలను గంజికి తీసుకెళ్ళి అమ్ముతారు.

గడస్తంభం - ధ్వజ స్థంభం; జనం గడస్తంభం దగ్గర చేరి ముచ్చట్లు పెడతారు.

గడ్డ - చీముతో కూడిన వాపు; కాలికి గడ్డ అయినందుకు ముని నడవలేకపోయాడు.

గడిచ్చుకో - తెచ్చుకో, తగిలిచ్చుకో; దాసుకి అప్పిచ్చి బుచ్చన్న కష్టాలు గడిచ్చుకున్నాడు.

గడిమాను - తలుపులకి వేసే కర్ర గడియ; దూడ బయటకు పోకుండా శేషిరెడ్డి గడిమాను వేశాడు.

గడ్ నూనె - కిరోసిన్; గడ్.నూనె లేక దీపం ఆరిపోయింది.

గదుము - గద్దించు; అడక్కుండా పూలు తెంచేవాళ్ళని తిరుమల్ గదిమాడు.

గద్య - విసిగించే చర్చ, సోది, నస; ఈశ్వర్ రాజకీయాల గద్య చెప్తుంటే వేణు వెళ్ళిపోయాడు.

గల్లా - లావాదేవీల మొత్తం (టర్నోవర్); కల్లు దుకాణంలో ఈరోజు గల్లా బాగా అయింది.

గల్లా పెట్టె - డబ్బుల పెట్టె; శివన్న తన గల్లాపెట్టెకు తాళం వేసుకున్నాడు.

గళ్ళ - దగ్గినప్పుడు వచ్చే ఉమ్మి; గళ్ళలో రక్తం పడుతుందని అనసూయ డాక్టర్ దగ్గరికెళ్ళింది.

గమ్మతి - తమాషా; రాఘవ గమ్మతి చేసి అందరినీ నవ్విస్తాడు.

గంపజాతర - వర్షం కోసం జనం ఉమ్మడిగా చేసే వనభోజనం; వర్షాలు లేనందున గంపజాతర చేయాలని ఊరి పెద్దలు నిర్ణయించారు.

గండమాల - క్యాన్సర్ కణతి; కరుణాకర్ గొంతుకి గండమాల అయిందని అతని కొడుకు చెప్పాడు.

గంటసాల-సుశీల - ఉగ్గాని, బజ్జీల జంట అల్పాహారం; చిన్నారెడ్డి గద్వాలకి పోతే గంటసాల-సుశీల తింటాడు.

గంటు - ధనం, సంపద, అసలు; కాళీ తల్లిని డబ్బులు అడగ్గా మీ నాన్న గంటు ఉందా నా దగ్గర అని తిట్టింది.

గంటే - గరిటే; అరవిందు గంటేతో చారు వేసుకున్నాడు.

గప్పాలు - బడాయి కబుర్లు; పిల్లలు కాలేజ్ బయట నిల్చుని గప్పాలు కొడుతరు.

గర్జు - అవసరం; తన గర్జు ఉందనే సుధ తగ్గి మాట్లాడింది.

గర్ర - అహం; ఉరుకుందయ్యకి గర్ర బాగా ఎక్కువ.

గట్లనా - అవునా; గట్లనా, ఫీజు కట్టడానికి ఆఖరు తేది రేపా!

గవసేని - పనికిమాలిన; సుమతిని వాళ్ళమ్మ గవసేనిదానా అని తిట్టింది.

గవాసు - ఇంటి పైకప్పుకి ఉండే కిటికీ; వాన వస్తుందని సిద్ధడు గవాసులు మూశాడు.

గ్యాంగోళ్ళు (ఫైలోళ్లు) - రైలు పట్టాల నిర్వహణ చూసే కార్మికులు; రైలుకట్ట మీద గ్యాంగోళ్ళు పని చేస్తున్నరు.

గాజులమ్మ - అధిక కాళ్లతో పాకే పురుగు; వర్షం తరువాత నేల మీద గాజులమ్మలు కనిపిస్తయి.

గాడిపాడు - పశువులని కట్టివేసే ప్రదేశం; పౌలు గాడిపాడులో పాలు పితుకుతున్నాడు.

గాను - చక్రం; ఎద్దులబండికి రెండు గాన్లు ఉంటాయి.

గాసం - వార్షిక లేదా నెల జీతంతో చేసే పని; జమ్మన్న పట్వారీ ఇంట్లో గాసం సాగాడు.

గాసగాడు (జీతగాడు) - వార్షిక జీతంతో ఇంటిపనులు, వ్యవసాయ పనులు చేసేవాడు; గాసగాడు ఒక్కరోజు రాకపోతే ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి.

గిలాస (లోట) - గ్లాసు; చంటిపిల్ల కొత్త గిలాసలో పాలు తాగింది.

గిరిపెట్టడం - కుదువపెట్టడం; వెంకటలక్ష్మి కాలి పట్టీలు గిరిపెట్టి అప్పు కట్టింది.

గిట్టలు గిల్లడం – పుట్టిన దూడల కాళ్ళకింద పొరలు తీసేయడం; ఆవు ఈనగానే కేశన్న దూడకి గిట్టలు గిల్లాడు.

గీరడం – గీకడం, గోకడం; కూలీలు గోడకి ఉన్న పాత సున్నాన్ని రేకుతో గీరుతున్నారు.

గుంటిక - పొలాన్ని చదును చేసే పనిముట్టు; జీతగాడు గుంటికతో పొలాన్ని పాస్తున్నాడు.

గుంట్లు – మట్టికట్టలతో వేరుచేసిన పొలం తాలూకు భాగాలు; మౌలాలి ఒకేరోజు పది గుంట్లకి నీళ్ళు పెట్టాడు.

గుడ్డిదీపం - నూనె లేక తక్కువ వెలుతురు ఇచ్చే దీపం; గోవిందమ్మ గుడ్డిదీపంతోనే వంట చేస్తుంది.

గుక్కి పట్టడం - ఊపిరి స్తంభించిపోవడం; పిల్లోడు పాల కోసం గుక్కిపట్టి ఏడుస్తున్నడు.

గుంజడం - బలహీనమవడం; జ్వరం వచ్చి అనిల్ కొంచెం గుంజినాడు.

గులాయి - రైలుపట్టాల మలుపు; కర్నూల్ రైలు రెండో గులాయి కాడ వస్తుంది.

గుళిగలు - మాత్రలు; కాళ్ళ నొప్పులు తట్టుకోలేక కాంతమ్మ రోజూ గుళిగలు మింగుతది.

గుళ్లించడం - శరీరభాషతో వెక్కిరించడం; ఆ పిచ్చోడు దారిలో పోయేవాళ్ళందరినీ గుళ్ళిస్తడు.

గుమ్మి - ధాన్యాన్ని నిలువ చేసే పెద్ద వెదురు బుట్ట; వరి ధాన్యాన్ని మూడు గుమ్ముల్లో నిల్వ చేశారు.

గుండు - పెద్ద బండరాయి; బ్రహ్మయ్య పొలంలో గుండ్లని బుల్డోజర్ తో తీయించారు.

గుండ్రాయి - కాయలను, దినుసులను దంచే నునుపు రాయి; సుగుణ గుండ్రాయితో అల్లం దంచుతుంది.

గూదెకట్టె - పశువులను అదుపులో పెట్టేందుకు మెడకి కట్టే దుంగ; ఎర్ర ఆవుకి గూదెకట్టె కట్టారు.

గూడు - ఇంటిగోడకి చేసే చతురస్రాకార నిర్మాణం; శ్యామ్ గోళీలను గూట్లో దాచుకున్నాడు.

గూన - పశువులు నీళ్లు తాగేందుకు నిర్మించే తొట్టి; ఎద్దులు గూనలో నీళ్ళు తాగుతున్నాయి.

గూటాలు - వస్తువుల్ని తగిలించేందుకు/పెట్టేందుకు గోడకి అమర్చే జంటకర్రలు; నగేష్ పరుపుని చుట్టి గూటాల మీద పెట్టాడు.

గెబ్బు - చీరు, చీల్చు; దేవయ్య కత్తితో కలబందని గెబ్బి పారేశాడు.

గెట్లు - పొలాల మధ్య హద్దులు; పొరుగు రైతులు తరుచుగా గెట్ల దగ్గర గొడవపడతారు.

గెడెం - వ్యవసాయ పనిముట్లతో కూడిన ఎద్దుల సెటప్; యాకూబ్ రోజూ గెడానికి పోతాడు.

గెన్నడం - వ్యంగ్యాస్త్రాలు వేయడం; అనంత్ అందరినీ గెన్నుతాడు.

గెలుకు - కలుగజేసుకొను; కోపంలో ఉన్నవాళ్ళని గెలికితే కోప్పడతారు.

గెలిగించడం - గేలి చేయడం; పరీక్షల్లో ఫెయిలయినందుకు రాణి తమ్ముడిని గెలిగిచ్చింది.

గేరు - పల్లెటూరు వీధి, చిన్న ప్రాంతం; సుబ్బారెడ్డి కూలీల కోసం కింది గేరుకి వెళ్ళాడు.

గొంగళి - గొర్రెల ఉన్నితో చేసే దుప్పటి, కంబళి; చలికాలంలో గొంగళి కప్పుకుంటే వెచ్చగా ఉంటుంది.

గొల్లి - యోని శీర్షం; (ప్రధానంగా తిట్లలో వాడుతారు).

గొంతుకుసోవడం – నష్టపోయి నిర్లిప్తంగా ఉండడం; అతను వ్యాపారంలో డబ్బులు పొగొట్టి గొంతుకూసున్నాడు.

గోరుచెట్టు - గోరు దగ్గర ఏర్పడే దీర్ఘకాలిక పుండు; ఆమె బొటనవేలి మీద గోరుచెట్టు అయింది.

గొట్టు - కఠినం, కష్టం; పదవ తరగతి లెక్కల పేపర్ చాలా గొట్టు వచ్చింది.

గోడంబి - జీడిపప్పు; లడ్డులో గోడంబి వేస్తారు.

ఘనకార్యం - గొప్ప పని (వ్యంగధోరణిలో); పర్సు పడేసుకుని ఘనకార్యం చేశావని తిరుపతిని అందరూ తిట్టారు.

చక్కెర రావడం - కళ్ళు తిరగడం; వెంకటలక్ష్మి తిండి తినక చక్కెరొచ్చి పడిపోయింది.

చల్లపొద్దు - ఉదయం/సాయంత్రం; ఎండాకాలంలో రైతులు చల్లపొద్దునే పొలానికి పోతారు.

చటాకు - 50 గ్రాములు; చటాకు జిలకర ముప్పైయి రూపాయలయింది.

చావిడి - పల్లెటూరికి ఉండే పవిత్ర ద్వారం; పెళ్ళి ఊరేగింపు చావిట్లో నుండి పోతుంది.

చింతబోటు - బాగా పండిన చింతకాయ; ఎర్రటి చింతబోటుని చూస్తే నోరు నీళ్ళూరుతుంది.

చింతొక్కు - చింతకాయ పచ్చడి; చప్పటి పప్పు, చింతొక్కు కలిపి తింటే చాలా బాగుంటది.

చిన్న ఏటి అవతల - తుంగభద్ర నది అవతల; చిన్నేటి అవతలి వాళ్ళ ఆచారాలు వేరు.

చిట్లం పట్లం - బంతితో కొట్టుకునే గ్రామీణ క్రీడ; చిట్లం పట్లం ఆడినందుకు రంజిత్ వీపు మీద వాతలు పడ్డాయి.

చిట్లపొడి - పుట్నాలతో చేసే కారప్పొడి; చిట్లపొడిలో నూనె వేసుకుని తింటే మహారుచిగా ఉంటుంది.

చిత్రన్నం - పులిహోర; మా ఇంట్లో వారానికి ఒకసారి చిత్రన్నం చేస్తారు.

చీని పండ్లు - బత్తాయిలు; చీనిపండ్లు తింటే ఆరోగ్యానికి మంచిది.

చిన్నతర పెద్దతర - చిన్నంతరం పెద్దంతరం; వాడు చిన్నతర పెద్దతర లేకుండా మాట్లాడుతున్నాడు.

చుట్టకుదురు - బరువులు మోసేందుకు తలపైన అమర్చుకునే బట్ట; శివమ్మ చుట్టకుదురు మీద నీళ్ళబిందె పెట్టుకుని తెస్తుంది.

చెడబాయడం - విత్తనాలు మొలకెత్తని భాగాన్ని దున్ని చేరిపేయడం; పత్తి మొలకలు రానందుకు సాయన్న పొలాన్ని చెడబాశాడు.

చెడుగుపట్టడం - సెప్టిక్ అవడం; ఆశన్న కాలికి దెబ్బ తగిలి చెడుగుపట్టింది.

చెంబటక పోవడం - మరుగుకి పోవడం, రొంటాలకి పోవడం, దొడ్డికి పోవడం; అతను ఎప్పుడుపడితే అప్పుడు చెంబటక పోతాడు.

చెత్తు - కాంక్రీటు కప్పు; వాళ్ళ ఇల్లు చెత్తు పడిపోయింది.

చెప్పాకు - చెప్పకు, చెప్పొద్దు; ఈ కథలన్నీ నాకు చెప్పాకు.

చెవి డిబ్బేసుకోవడం - చెవుల్లోకి నీరు పోయి వినికిడిలో తేడా రావడం; బావిలో ఈత కొట్టినందుకు శ్రీనివాస్ చెవులు డిబ్బేసుకున్నాయి.

చెవులకాయ - గోరుచిక్కుడు కాయ; ఈరోజు నేను చెవులకాయ కూర, జొన్నరొట్టె తిన్నాను.

చెవులగళ్ల - చప్పుళ్ల హోరు; పిల్లలు అరుస్తుంటే చెవులగళ్ళ పడుతుంది.

చేదడం - తోడడం; రామలింగం బావిలో నీళ్ళు చేదాడు.

చేరగిల పడడం - దేనికైనా విశ్రాంతిగా అనుకోవడం. శివయ్య అలసిపోయి గోడకి చేరగిలపడ్డాడు.

చొప్ప - జొన్న పంట తాలూకు పశువుల మేత; మా ఎద్దులు చొప్ప బాగా తింటాయి.

జంఖానం - మందమైన దుప్పటి; పెళ్ళివాళ్ళు జంఖానం వేసుకుని పడుకున్నారు.

జంపు - పొడుగు; ఆమె జడ చాలా జంపుగా ఉంది.

జప్పున - వేగిరమే; శ్రీకాంత్ జప్పున పని చూసుకుని వెళ్ళిపోయాడు.

జవురుకోవడం - లాక్కోవడం; ఆ తాగుబోతు తన భార్య చేతిలోని డబ్బుని జవురుకుపోయాడు.

జల్ల - ముల్లుండే ఒక జాతి చేప; జల్ల చేపలో ముళ్ళు ఎక్కువుంటాయి.

జల్ల - పెద్ద వెదురు గంప; సూరి జల్ల నిండా జొన్న కంకులు తెచ్చాడు.

జలాడి - స్నానానికి ఉపయోగించే కట్టడం; ఇంట్లో జలాడి లేనందున శ్రీధర్ బయటే స్నానం చేస్తాడు.

జానికి - మాటిమాటికీ, సారకి; జానికి ఇంటికి రావద్దని కరణం తలారికి చెప్పాడు.

జాలిగంటే - చిన్న రంధ్రాలున్న గరిటే; నర్సమ్మ జాలిగంటెతో బజ్జీలు దేవుతుంది.

జాడి - గొర్రెల ఉన్నితో చేసే బెడ్ షీట్; పనోళ్ళు జాడి వేసుకుని పడుకున్నారు.

జిల్ల పురుగు - బొద్దింక; బాత్ రూంలో జిల్లపురుగులు ఉన్నాయి.

జియో! - కుక్కల్ని పిలిచేందుకు చేసే ఒక శబ్దం; శారద జియో అని పిలవగానే కుక్క పరుగెత్తుకొచ్చింది.

జిర్రలు - పెద్ద కొమ్ములతో ఒక జాతి ఎద్దులు; వాళ్ళ జిర్రలు గెడెం బాగా పోతాయి.

జిట్ట - ఒకరకమైన ఎగిరే కీటకం; జిట్ట ఎగురుతూ వచ్చి అతడి చొక్కాకి అంటుకుంది.

జివ్వడం - రువ్వడం; అడవి పందులు రాకుండా జనం రాళ్ళు జివ్వారు.

జీవి - ప్రాణం; అతను విషం తాగిన రెండు గంటలకే జీవి వెళ్ళిపోయింది.

జీతగాడు - వార్షిక జీతానికి ఇంటిపనులు, వ్యవసాయ పనులు చేసేవాడు, గాసగాడు; జీతగాడు వచ్చి ఎద్దులకు మేత వేస్తున్నాడు.

జెర్రిపోతు - మగ నాగుపాము; వరిచేనులో నడుస్తుంటే ఒక జెర్రిపోతు కనిపించింది.

జొతికెలు - ఎద్దుల మెడకు బండిని, పనిముట్లని కట్టేందుకు వాడే తోలు సాధనాలు; అతను ఎద్దులకు జొతికెలు కట్టాడు.

జొల్లు కార్చడం - చొంగ కార్చడం; వాడు నిద్రలోనే జొల్లు కారుస్తాడు.

జోము పట్టడం - తిమ్మిర్లు రావడం; కదలకుండా కూర్చున్నందుకు ఆమె కాలు జోము పట్టింది.

జోపానం - సంరక్షణ; అతడు పశువులను మంచిగా జోపానం చేస్తాడు.


త ద న ప

తలువాలు - తలంబ్రాలు (లగ్నం); సరిగ్గా పది గంటలకు హేమలత పెళ్ళిలో తలువాలు పడ్డాయి.

తల్లె - భోజనం తినే పళ్ళెం; అనసూయ అన్నం తిని తల్లె కడుగుతుంది.

తపేళ - వంట పాత్ర; మంజు తపేళలో నీళ్ళు పోసి వేడి చేస్తుంది.

తడువుకో - పెట్టుకో; ప్రవీణ్ కోపిష్టి కాబట్టే అతన్ని ఎవరూ తడువుకోరు.

తలాపున - తల దగ్గర; జగన్ ఫోన్ ని తలాపున పెట్టుకుని పడుకుంటాడు.

తడి కట్టడం - పంటకి నీళ్ళు పెట్టడం; నాగన్న మిరపతోటకి రెండో తడి కట్టాడు.

తలారి - గ్రామ సేవకుడు; ఎమ్మార్వో వచ్చి తలారికి ఏదో పని చెప్పాడు.

తన్.లాడడం - పోరాటం చేయడం; శంకరమ్మ పింఛను కోసం చాలా తన్.లాడుతుంది.

తప్పయిందని చెప్పడం - క్షమాపణ అడగడం; బాలాజీ భార్య దగ్గరకెళ్ళి తప్పయిందని చెప్పాడు.

తప్పెడ - దండోరా; ఊరేగింపులో తప్పెట్లు కొడుతున్నారు.

తస్ - ఛ! ఛీ! (ఆశ్చర్యార్థకం); తస్, ఎవరు చెప్పారు నీకు!

తట్ట - చిన్న గంప; గేదెలకు తట్టలో దాణ పెడతారు.

తాడిపత్రి - ధాన్యం తడవకుండా కప్పే కవరు, తాట్ పారం, టార్పాలిన్, బరకం; వాన చినుకులు వస్తుంటే జొన్న కుప్ప మీద తాడిపత్రి కప్పారు.

తాలు - ఆగు, ఓర్చుకో, గింజలేని ధాన్యం; తాలు, నేనూ వస్తా! ఈసారి వడ్లు చాలా తాలు పోయినాయి.

తాళికం - మన్నిక; ఈ ధోవతి ఎక్కువ రోజులు తాళికం వస్తది.

తాంబాని - ఏటవాలు అంచు గల పెద్ద పళ్లెం; తాంబానిలో పూజా సామాగ్రిని పెడతారు.

తానికి - దగ్గరకు; నీకు పైసలు కావాలంటే నాతానికి రా!

త్యాప - సారి; ఈ త్యాప పంట బాగా వచ్చింది.

తిక్కతిక్క చేయడం - పిచ్చిగా ప్రవర్తించడం; వాడు తిక్కతిక్క చేస్తున్నడు.

తియ్యక - తరుచుగా, ఎప్పటికీ; మేము తియ్యక జొన్నరొట్టెలు చేసుకుంటం.

తిరుగవాత - పోపు; కళావతి పప్పులో తిరుగవాత వేసింది.

తిర్నాల - జాతర; వచ్చె నెలలో మా ఊరి తిర్నాల ఉంది.

తునకలు - మాంసం కూర; మాలపున్నం రోజు తునకలు బాగా తిన్నాం.

తుంట - తుంటరి; రోషన్ చాలా తుంట నాయలు.

తుప్పలు - పొదలు; మా దూడ తుప్పల్లోకి పోయి గడ్డి మేస్తుంది.

తూర్పు పోయడం – ముడి ధాన్యాన్ని గాలివాటంగా ఎత్తిపోయడం; మా వడ్ల కళ్ళంలో నేనే తూర్పు పోశాను.

తెప్ప - చిన్నపాటి పడవ; వాళ్ళు కృష్ణానదిలో తెప్ప వేసుకుని పోతున్నరు.

తెలదు - తెలియదు; ఆయనకి ఎంతమంది పిల్లలో నాకు తెలదు.

తెల్లార్లు - రాత్రంతా; పంటినొప్పితో ఆమె తెల్లార్లు నిద్రపోలేదు.

తేనెబండలు - నల్లటి గ్రానైట్ బండలు; మా ఇంటి అరుగు మీద తేనెబండలు వేశారు.

తేర్పు - తీర్చు; రవి తన బాకీలన్నీ తేర్పేశాడు.

తైబంది - నిర్ణయం; ఈసారి చెరువు నీళ్ళు వాడొద్దని మా ఊర్లో తైబంది చేసినారు.

తొడిబిడి - తికమక; ఈ విషయం వాడికి చెప్తే తొడిబిడి పడుతాడు.

తొక్కు - పచ్చడి; రాజారెడ్డికి తొక్కు లేనిదే ముద్ద దిగదు.

తొలుత - మొదట; మా ఊరి నుండి తొలుత నేనే విమానం ఎక్కాను.

తొండి చేయడం - ఏమార్చడం; భాను ఆటలో బాగా తొండి చేస్తాడు.

తొర్రి - పళ్ళు ఊడిన; ఆ పాప తొర్రిపళ్ళతో నవ్వుతుంది. తొర్రి వాడు.

తొలిచూరు - మొదటి (కాన్పులలో); శ్వేతకి తొలిచూరులో ఆడపిల్ల పుట్టింది.

దంటు - ఎండిపోయిన మొక్కల కాడ; టీచర్ దంటు తీసుకుని పిల్లల్ని బాదింది.

దబాయి - బడాయి; సాయన్న ఊరికే దబాయి చెప్తాడు.

దస్తి - చేతి రుమాలు; అతను దస్తితో ముఖం తుడుచుకున్నాడు.

ధనాలు - ధనియాలు; ఆమె ధనాలను రోట్లో వేసి నూరుతుంది.

దాసంగం - మొక్కులో భాగంగా దేవుడికి జరిపించే సేవ; వాళ్ళు ఆంజనేయ స్వామి గుడిలో దాసంగం పెట్టడానికి వెళ్ళారు.

దాయాదులు - ఒకే వంశానికి చెందిన ఇతరులు; మా దాయాదులతో పొలం దగ్గర గొడవ వచ్చింది.

ధ్యావర - జంతుబలితో గ్రామదేవతలకు చేసే ఉత్సవం; మా ఊరి ధ్యావరలో పోతు రాత్రి పదకొండుకి తెగుతది.

ధ్యావర పోతు - గ్రామదేవతకు బలి ఇచ్చేందుకు పెంచే దున్నపోతు; ధ్యావర పోతుని కొట్టకూడదని పెద్దలు చెబుతారు.

దుబ్బగా - లావుగా; అతను దుబ్బగా ఉన్నందుకు ఆయాసపడతాడు.

దుడ్లు - డబ్బులు; గౌరమ్మ దగ్గర దుడ్లు లేకనే పిల్లల్ని చదివించలేదు.

దులిపిచ్చుకొని - విడిపించుకొని; మా ఎద్దు తాడు దులిపిచ్చుకొని పోతుంది.

దున్నుకం - దున్నడం; మా ఊర్లో ఉగాదికే దున్నుకాలు మొదలుపెడతారు.

దుసికిపోయింది - తప్పిపోయింది; గాజు గ్లాసు దుసికిపోయి ముక్కలయింది.

దుత్త - మట్టి బిందె; విష్ణుబాబు కూలీవాళ్ళ కోసం దుత్తలో నీళ్ళు తెచ్చాడు.

దేశం పోవడం - వలస పోవడం; వాళ్ళ కుటుంబం బతకడానికి దేశం పోయింది.

దేవడం - తీయడం (ద్రవంలో నుండి); నానబెట్టిన ఉలువలని ఆమె తపేళ లో నుండి దేవుతుంది.

దేవలం - గుడి; దేవలం కాడ సన్నాయి మేళం మోగుతుంది.

దేవుని ఆవు - దేవుడికి భక్తితో సమర్పించే ఆవు; దేవుని ఆవు పోతుంటే అందరూ మొక్కుతారు.

దొడ్డి - పశువుల మేతని నిలువ చేసే ప్రదేశం; మా దొడ్లో రెండు గడ్డి వాములు వున్నాయి.

దొమ్మలు - ఎదలు, ఛాతి భాగం; తాతకి ఆయాసం ఎక్కువయి దొమ్మల మీద రుద్దుకున్నాడు.

దొబ్బడం - తోయడం; చెరుకు బండిని పక్కకి దొబ్బారు.

దోగించడం - తవ్వడం; వాళ్ళ పొలంలో బావి దోగుతున్నారు.

దోక్కపోవడం - దెబ్బ తగిలి చర్మం పోవడం; సరళ కిందపడి మోచేతులు దోక్కపోయాయి.

ధోని - వర్షం నీరు పోయేందుకు పెట్టే మట్టి గొట్టం; పెద్ద వాన పడి ధోన్లు ఎక్కి పారుతున్నాయి.

దోర్నాలు - పొగాకును అరబెట్టేందుకు చేసే తోరణాలు; ఈరోజు మా దోర్నాలని తిప్పుతున్నం (తిప్పి ఆరబెడుతున్నం).

దౌర - దూరం; ఆయన చాలా దౌర పోయినాడు, ఇప్పుడే రాడు.

డకాటి - దుర్బుద్ధి కలవాడు; ఆ డకాటి గాడితో వ్యాపారం చేయొద్దు.

డేకీలు - నుండి; శిల్ప పెళ్ళిలో వంట సామాన్లతో డెకీలు అన్నీ వాళ్ళ నాన్నే కొనిచ్చాడు.

నడిమిల్లు - ఇంటి మధ్యలో ఉండే ప్రదేశం; అతను నడిమింట్లో నిద్రపోతున్నాడు.

నందికోల శావ - అలంకరించిన స్థంబాన్ని భుజాలపై పెట్టుకుని భక్తితో నృత్యం చేయడం; మా ఊళ్ళో రేపు నందికోల శావ ఆడుతారు.

నవ్వ - దురద; గడ్డిలో కూర్చున్నందుకు ఒళ్ళంతా నవ్వ పెడుతుంది.

నంజరకూర - మాంసం కూర, షియ కూర; మా ఇంట్లో ప్రతి ఆదివారం నంజరకూర చేస్తారు.

నవ్వార - మంచానికి అల్లే తాడు, రిబ్బను; వాళ్ళు మంచానికి కొత్త నవ్వార అల్లిచ్చినారు.

నాలుగు డబ్బాలాట - నేలపై నాలుగు చదరాలు గీసి ఆడే గ్రామీణ క్రీడ; మా స్కూల్లో రోజూ నాలుగు డబ్బాలాట ఆడేవాళ్ళం.

నాస్ట - అల్పాహారం / టిఫిన్; తిమ్మగురుడు నాస్ట తిని బావికి పోయినాడు.

నిమోపులు - తీయని చక్కెర గుళికలు; అంగట్లో నిమోపులు కొనుక్కొని మా దోస్తులకు పంచాను.

నీలక్కటి - నీలాంటి; నీలక్కటోనికి చెప్పి టైం వేస్ట్!

నీలుగడం - పొగరుగా ప్రవర్తించడం; అతను డబ్బుందని చాలా నీలుగుతున్నాడు.

నీళ్లు కట్టడం - పొలాన్ని నీటితో తడపడం; మా బుడ్డల చేను ఎండిపోతుంది, నీళ్ళు కట్టాలి.

నీరుకట్ట - నీటిలో ఉండే విషరహిత పాము; ఆ బావిలో చాలా నీరుకట్టలు ఉన్నాయి.

నీయాడ - మందలింపుకి వాడే పదం (ఆశ్చర్యార్థకం); నీయాడ! ఎవరు చెప్పారు నీకు!

నుగ్గులు - పిడకలు; అవ్వ నుగ్గులు మండించి నీళ్ళు కాగపెడుతుంది.

నులక మంచం - నారతో అల్లిన మంచం; అతను నులక మంచం మీద పడుకున్నాడు.

నూకడం - తోయడం; కారు ఆగిపోవడంతో అందరూ నూకుతున్నారు.

నెనారు - మెలకువ; అతను నెనారుతో గడ్డివాము చక్కగా వేశాడు.

నెత్తికి పోసుకోవడం - తల స్నానం చేయడం; ఆవిడ ప్రతి శనివారం నెత్తికి పోసుకుంటుంది.

పచ్చవాయి - పశ్చవాతం; పచ్చవాయి వచ్చి అతని ఎడమ కాలు, ఎడమ చేయి పడిపోయింది.

పల్గడి - ఎద్దులబండి చేసిస్; అతను పల్గడి మీద కూర్చుని ఎద్దులబండి తోలుతున్నాడు.

పల్లగొర్రు - బురద పొలాన్ని చదును చేసే పళ్ళు ఉండే పనిముట్టు; పళ్ళగొర్రు కొట్టాక వరినాటు వేస్తారు.

పదైదు - పదిహేను; మా ఊర్లో ప్లేటు పూరి పదైదు రూపాయలు.

పలకగట్టం - పల్లి బెల్లంతో చేసే చిక్కి; స్కూలు పిల్లలు పలకగట్టాలు కొనుక్కొని తింటారు.

పలకల కోలంట్లు - బిళ్ళల పలకలతో వేసే కోలాటం; భోగి రోజు దేవలం కాడ పలకల కోలంట్లు వేస్తారు.

పంపర్లు - గవదబిళ్ళలు; పంపర్లయి వాడి చెంపలు వాచిపోయాయి.

పందిరి విప్పడం - పెళ్లిపందిరిని తొలగించే సంప్రదాయ కార్యక్రమం; పెళ్ళయిన ఐదో రోజు వాళ్ళు పందిరి విప్పారు.

పందిరి వేయడం - పెళ్లిపందిరి వేసి పెళ్ళిపనులు మొదలెట్టడం; పెళ్ళికి రెండ్రోజుల ముందే పందిరి వేస్తారు.

పనిపాటలోళ్లు - ఇంట్లో / పొలాల్లో తరుచుగా పనిచేసే వాళ్ళు; శుభకార్యం జరిగినప్పుడు పనిపాటలోళ్ళకి బట్టలు పెడతారు.

పరక - ముల్లుండే ఒక జాతి చేప; పరకల పులుసు భలే రుచిగా ఉంటుంది.

పర్రె - పగులు; మా బయటి గోడకి పర్రెలు వచ్చాయి.

పరు - దూరానికి ప్రమాణం; మా ఊరి నుండి గద్వాల నాలుగు పర్లు ఉంటుంది.

పరిపించు - పరుచు; మా ఇంటి అరుగుల మీద తేనెబండలు పరిపిచ్చినాము.

పసికె - పచ్చగడ్డి; పసికెని చూడగానే పశువులు పరుగులు పెడతాయి.

పశులోడు - పశువులను కాచే పిల్లాడు; పశులోడికి దసరా రోజు బట్టలు కుట్టించారు.

పట్లు పట్టడం - కొట్టుకోవడం; తొమ్మిదో తరగతి పిల్లలు పట్లు పడితే టీచర్ వచ్చి మందలించాడు.

పట్టెలు - సున్నంతో, ఎర్రమన్నుతో గోడకి వేసే చారలు / పొలం; వాళ్ళ బయటి గోడలకి ఎర్రమన్ను పట్టెలు పెట్టారు. గుంతకాడి పట్టెలో ఈసారి పత్తి నాటాం.

పాలబండ - తొండలాంటి పాకే జీవి; మా తరగతి గది కిటికిలో పాలబండ పోయింది.

పాలేగాడు - పోటుగాడు (వ్యంగధోరణిలో); అతను పెద్ద పాలెగాని లాగా మాట్లాడుతాడు.

పాల్.మారడం - అలసిపోవడం; అతను ఊరేగింపులో తిరిగి పాల్.మారినాడు.

పాణం బాలేకపోవడం - ఆరోగ్యం బాలేకపోవడం; పాణం బాలేనందుకే హైమావతి స్కూలుకి రాలేదు.

పాన్ బీడా - కిళ్ళీ; మేము ప్రతి పండుగకి పాన్ బీడా తింటాం.

పాపోడు - బాబు (బేబీ బాయ్); ఆ పాపోనికి టీకా వేపిచ్చినారు.

పాటు - చెరువులోకి వర్షం నీరు ప్రవహించే మార్గం; పాటులో వర్షాలు పడక చెరువు నిండుతలేదు.

పాయడం - చదును చేయడం; నాగలితో దున్నాక గుంటికతో పాస్తారు.

ప్యాదూడ - ఆడదూడ; ఆవు ప్యాదూడని ఈనిందని ఎల్లారెడ్డి సంతోషంగా ఉన్నాడు.

పిరం - ఖరీదైన; ఎండాకాలంలో కూరగాయలు పిరమయితయి.

పీర్ల పండగ - మొహర్రం; పీర్ల పండుగ రోజు అలాయి తొక్కుతరు.

పులిజూదం - పులిమేక; రైల్యేస్టేషన్ బండల మీద మేము పులిజూదం ఆడేవాళ్ళం.

పుల్లసీలడం - మిడిసిపడడం; వాళ్ళ నాన్న సర్పంచ్ అని వెంకట్ చాలా పుల్లసీలుతడు.

పుస్తెలు - తాళిబొట్టు; వాళ్ళు గద్వాలకి పోయి పెళ్ళి కోసం పుస్తెలు తెచ్చినారు.

పుర్రచెయ్యి - ఎడమ చేయి; బబ్లు పుర్రచేయితో రాస్తాడు.

పుర్రు - పశువులు ద్రవరూపం లో వేసే పేడ; పశువులు బుడ్డల పొట్టు తింటే పుర్రు పోస్తయి.

పుట్టెడు - నలబై సంచులు; ఈ సంవత్సరం నాలుగు పుట్ల వడ్లు పండినాయి.

పూలుపండ్లు - నిశ్చితార్థం; శైలజకి పెళ్ళి కుదిరి పూలుపండ్లు పెట్టినారు.

పెద్ద ఏటి అవతల - కృష్ణా నది అవతల; మా తమ్మునికి పెద్ద ఏటి అవతల నుండి పెళ్ళి సంబంధం వచ్చింది.

పెండ - పేడ; పశులోడు పెండ ఎత్తి దిబ్బలో పోసినాడు.

పెంటి - నపుంసక, కొజ్జా; యువకులు గొడవపడి ఒకరినొకరు పెంటోడా అని తిట్టుకున్నారు.

పెరకడం - పీకడం; పత్తి చెట్లు పెరకనీక కూలోళ్ళు వచ్చారు.

పేడకాళ్ళు - పేడముద్దలు; గాసగాడు పేడకాళ్ళు తీసేసి ఇంటికి పోయాడు.

పేరపెట్టు - వృథాగా ఉంచు; ఆమె ఉప్పు ప్యాకెట్లను అలాగే పేరపెట్టింది.

పేర్లపెట్టు - వ్యాఖ్యలు చేయు, విమర్శించు; మనం ఎంత బాగా పనిచేసినా కొందరు పేర్లపెడతారు.

పై - శరీరం; అల్లరి చేస్తే పై పగులుతుందని మాష్టారు పిల్లలని హెచ్చరించాడు.

పైలోకి రావడం - పూనకం రావడం; ధ్యావర రోజు భారతమ్మకి పైలోకి వచ్చింది.

పై బరువు అవడం - ఒళ్ళు బద్ధకించడం; వాడికి పై బరువయి పనిలోకి రాలేదు.

పైకి పోసుకోవడం - స్నానం చేయడం; రాజేందర్ పైకి పోసుకున్నాకే నాస్ట తింటాడు.

పై మబ్బెక్కడం - సోమరితనం; అతనికి పై మబ్బెక్కి సేద్యం మానేశాడు.

పైత్యం లేవడం - అలర్జీ రావడం; ఆమెకి పైత్యం లేచి ఒళ్ళంతా దద్దర్లు వచ్చాయి.

పై వెచ్చజేయడం - జ్వరం రావడం; పాపకి పై వెచ్చజేసిందని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు.

పైటాల - మధ్యాహ్నానికి సాయంత్రానికి మధ్య ఉండే సమయం; పైటాల పూట చెట్టు కింద బాగా నిద్ర వస్తది.

పొద్దుమూకులు - రోజంతా; రాజమ్మ పొద్దుమూకులు కూరగాయలు అమ్ముతూనే ఉంటుంది.

పొగసట్టం - వంటగదిలో పెట్టే పొగ గొట్టం; మా వంటగదిలో పొగసట్టం పెట్టించాం.

పొకురు - పొగరు; అడిగేవాళ్ళు లేక వాడు బాగా పొకురు పట్టినాడు.

పొంత - నీళ్లు వేడి చేయడానికి వాడే మట్టి పాత్ర; పొంతలో వేడినీళ్ళతో వాసు స్నానం చేశాడు.

పొటుకు - వర్షాలకు ఇల్లు కారడం; ఈసారి వర్షాలు ఎక్కువయి మా ఇల్లు పొటుకు పెట్టింది.

పొట్టమీద ఉండడం - వరి చేనులో గింజ వృద్ధిచెందే దశ; మా వరిచేను ఇప్పుడు పొట్టమీద ఉంది.

పొయ్యిల్లు - వంటిల్లు; పొయ్యింట్లో అమ్మ సజ్జ రొట్టెలు కొడుతుంది.

పోకళ్ళు - పంటలో విత్తనాలు మొలవని చోట మళ్ళీ నాటడం; నిన్నటి వర్షానికి మిరపనార పోకళ్ళు నాటాము.

పొక్కిళ్ళు - మట్టిగోడ పై అక్కడక్కడ పొర ఊడిపోవడం; పిల్లలు ఆడుకుని గోడలు పొక్కిళ్ళు లేచినాయి.


బ మ య ర

బడదల్ - బలహీన, బడదలొళ్ళు; మా బడదలొల్లకి ఓట్లు ఎవరేస్తరు అని పార్వతమ్మ వాపోయింది.

భక్ష్యాలు - బొబ్బట్లు; మా ఊర్లో ప్రతి పండగకి భక్ష్యాలు చేసుకొని తింటాం.

బల్లి పోరువ - ఇంటి స్తంభాలపై బల్లి తన గుడ్లతో పెట్టే పల్చని తెల్లటి పొర; పిల్లలు బల్లి పోరవతో సన్నాయి బొమ్మలు చేసుకుని ఊదుతారు.

బండి అరకవడం - ఎద్దులబండి ముందువైపున బరువు ఎక్కువవడం; బండి అరకయినందుకు రాజేష్ కొన్ని సంచులను వెనక్కి జరిపాడు.

బంధాలు - పొలాన్ని విభజించే మట్టికట్టలు, గెనాలు; వానలకి బంధాల మీద గడ్డి బాగా పెరిగింది.

బంగినార - పొట్టేలు, మేక వృషణాలతో చేసే తిండిపదార్థం; బంగినారని పెద్దలు మాత్రమే తింటారు.

బంతి తిప్పడం - పంట నుండి ధాన్యాన్ని తీసేందుకు పశువులతో తొక్కించడం; రాత్రి వడ్ల బంతి కోసం వాళ్ళు ఎనిమిది జతల ఎద్దులను తోలుకుపోయారు.

బరకం - ఎరువుల సంచులతో చేసే పెద్ద కవర్; వానకి తడవకుండా సజ్జ కుప్ప మీద బరకం కప్పారు.

బరిశె - బళ్లెం; అతను బరిశెతో అడవిపందులను వేటాడుతున్నాడు.

బర్రె - బెత్తం; లెక్కలు తప్పు చేసినందుకు టీచర్ బర్రెతో కొట్టాడు.

బర్రెబత్తల / ఉత్తబత్తల – నగ్నంగా; ఆ పిల్లోడు బర్రెబత్తల తిరుగుతున్నాడు.

బరుకు = బాదు; మాట విననందుకు హరి తన కొడుకుని బెత్తంతో బరికాడు.

బాపనమ్మ = వర్షాకాలంలో కనిపించే ఎర్రటి పురుగు; వర్షం పడగానే మా స్కూల్ గ్రౌండ్ లో బాపనమ్మలు కనిపిస్తాయి.

బారకట్ట = అష్టాచెమ్మ; ఆడపిల్లలు పందెం వేసుకుని బారకట్ట ఆడేవాళ్ళు.

బాలే = వేయించేందుకు వాడే బాండీ; బాలేలో పూరీలు పొంగుతున్నాయి.

బ్యాళ్ళు – పప్పు; ఆమె అంగడికెళ్ళి రెండు కేజీల కందిబ్యాళ్ళు తెచ్చింది.

బాటపోర్త - దారెమ్మట; బాటపోర్త పోయే పేదోళ్ళకి కిష్టయ్య అన్నం పెడతాడు.

బిచ్చలు - విత్తనాలు; పిల్లలు చింత బిచ్చలతో ఆడుతారు.

బిజ్జు - పిసినారి; జగదీష్ చాలా బిజ్జోడు, పండగలన్నీ అత్తగారింట్లో చేస్తడు.

బిలక రాళ్లు - నున్నటి సన్న రాళ్ళు; ఇంటి పునాదుల్లో బిలకరాళ్ళు పోశారు.

బింగులు - గుంజీలు; తప్పు చేసిన పిల్లలని హెడ్మాష్టరు బింగులు తీయిస్తున్నాడు.

బిర్రుగా - టైట్ గా; ఎక్కువ తిన్నందుకు పొట్ట బిర్రుగా ఉంది.

బీరప్ప డోలు - డ్రమ్ము లాంటి పెద్ద డోలు; జాతరలో బీరప్ప డోలు వాయిస్తారు.

బుడ్డగా - పొట్టిగా; రామకృష్ణ వాళ్ళ తమ్ముని కంటే బుడ్డగా ఉన్నాడు.

బుడ్డలు - వేరుశనగలు; వాళ్ళు బుడ్డలు కాల్చుకుని బెల్లంతో తిన్నారు.

బుడ్డి - కిరోసిన్ దీపం; కరెంట్ పోగానే ఊళ్ళో అందరూ బుడ్లు వెలిగించారు.

బుగ్యాలు - బజ్జీలు; అతను అన్నంలో బుగ్యాలు నంజుకుని తిన్నాడు.

బుక్క - ముద్ద (తినేది); ఆ పాప తినేటప్పుడు ప్రతి బుక్కకి నీళ్ళు తాగుతది.

బునకడం - వెతకడం, బుడకడం; ఆమె పడిపోయిన ఉంగరాన్ని బునుకుతుంది.

బుంగ - (వర్షం వల్ల) మట్టి మిద్దెకి పడే రంధ్రం; వర్షానికి బుంగలు పడి ఇల్లంతా నీళ్ళు నిండాయి.

బురదమట్ట - కొర్రమట్ట, కొర్రమీను; చెరువులో బురదమట్టలు చాలా పెద్దగా ఉన్నాయి.

బుర్లోక - ఒకరకమైన పిట్ట; బుర్లోక పొద్దుతిరుగుడు పువ్వు మీద వాలి తింటుంది.

బుస్కోట్ - ఒక రకమైన చొక్కా; సత్తెన్న కొత్త బుస్కోట్ వేసుకుని పెళ్ళికి వచ్చాడు.

బువ్వ - భోజనం; అవ్వ బువ్వ తింటుంది.

బూంచడం - పాతిపెట్టడం; కుక్కని గుంత తీసి బూంచారు.

బెనకడు - వినాయకుడు; బెనకని పండగ దగ్గరికొచ్చింది.

బెందు - మచ్చ (గాయం, టీకా తాలూకు గుర్తు); వాడి చేతుల మీద చాలా బెందులు ఉన్నాయి.

బెరీనా - తొందరగా; అతను పని ఉందని బెరీనా పోయాడు.

బెరికి - పిరికి; రాధకృష్ణ చాలా బెరికోడు.

బెట్టపోయింది - సారం పోయింది; పొలం బెట్టపోయి మిర్చి బాగా పండలేదు.

బేదులు - విరోచనాలు; బయటి తిన్నందుకు వాడికి బేదులు పెట్టాయి.

బేస్తవారం - గురువారం; ప్రతి బేస్తవారం మేము కబడ్డీ ఆడుతాము.

బేకని - కావాలని; అతను బేకని రోడ్డు మీద చెత్త వేశాడు.

బేరగాళ్ళు - బేరమాడే వాళ్ళు, వర్తకులు; మా మిరపకాయ కొనడానికి బేరగాళ్ళు వచ్చారు.

బొడ్రాయి - బాట మధ్యలో పాతిన పవిత్రమైన రాయి; నూతన వధూవరులు బొడ్రాయిని మొక్కుతారు.

బొరుగుముద్ద - మురమురాలు బెల్లం తో చేసే లడ్డు; పిల్లలు ఇంటర్వెల్ లో బొరుగుముద్దలు కొని తింటారు.

బొట్టె - వేలిముద్ర; నీలమ్మ దరఖాస్తు మీద బొట్టెలు ఒత్తింది.

బోగాని - పెద్ద వంటపాత్ర; అనసూయ బోగాని నిండా బగారన్నం చేసింది.

బోకులు - పగిలిన మట్టిపాత్రల ముక్కలు; ఎవరిదో కుండ పగిలి బాటలో బోకులు పడ్డాయి.

బోనాలు - టపాకాయలు; పెళ్ళి ఊరేగింపులో బోనాలు కాల్చారు.

మచ్చు - పశువుల మేతని ఉంచే అటక; జీతగాడు మచ్చు ఎక్కి ఆవుకి మేత వేశాడు.

మడతమాను - పచ్చళ్ళు నిలువ ఉంచే జాడి; అమ్మ రెండు మడతమాన్ల నిండా మామిడికాయ చట్ని పెట్టింది.

మడవ - పంట కాలువలో నీటిని మళ్లించే అడ్డుకట్ట; అతను వేరే గుంటికి మడవ తిప్పాడు.

మడ్డి - మద్యం, మత్తుమందు; జనం మడ్డి తాగి మత్తులో తూలుతారు.

మడికట్లు - గుంట్లు (చేనులోని చిన్న భాగాలు); ఈరోజు అన్ని మడికట్లు దున్నాం.

మద్రంగం - ఇంటి ద్వారం తరువాత ఉండే ఎత్తయిన ప్రదేశం; నాన్న మద్రంగంలో కూర్చుని రేడియో వింటున్నాడు.

మళ్ల - మరి, మళ్ళీ; మళ్ళ, అతను నామీద చాడీలు ఎందుకు చెప్పాడు!

మండె - కుప్ప; అతను పొగాకు మండె మీద కూర్చున్నాడు.

మందమతికి - మతిమరుపు గల; వెంకటకృష్ణ మందమతికోడు, అన్నీ మరిచిపోతాడు.

మంటికి పోవడం - ఖననానికి హాజరు కావడం; మా దోస్త్ వాళ్ళ తాత చనిపోతే మంటికి వెళ్ళొచ్చా.

మనుకు = జిడ్డు; వాడి నెత్తికి నూనె మనుకు అంటింది.

మనుము ఇవ్వడం - పెళ్ళి చేసి పంపడం; పరంధామ్ బిడ్డని ఆత్మకూర్ కి మనుము ఇచ్చినారు.

మర్లించడం - మరిగించడం; ఆమె పాలని మర్లించి రవ్వతో స్వీట్ చేసింది.

మర్లుపెండ్లి - రిసెప్షన్; పెళ్ళికి హాజరు కానివాళ్ళు మర్లుపెండ్లికి వెళ్తారు.

మరుధ్యాస - పరధ్యానం; అతను మరుధ్యాస పడినాడు, పిలిచినా పలకడు.

మతికి ఉందా - గుర్తుందా; అప్పుడు నీకు వెయ్యి రూపాయలిచ్చా, మతికి ఉందా!

మతికి చేసుకో - గుర్తు తెచ్చుకో; బ్యాగు ఎవరికిచ్చావో మతికి చేసుకో!

మతికి లేదు - జ్ఞాపకం లేదు; ఆ డేట్ నాకు మతికి లేదు!

మాయి - పశువులు ఈనినప్పుడు దూడతో పాటు బయటికొచ్చే జీవసంబంధ పదార్థం; ఆవు మాయి పడగానే పనివాడు దాన్ని తీసుకెళ్ళి మట్టిలో పూడ్చాడు.

మారుపేరు - మరో పేరు (ఆట పట్టించేందుకు వాడేది); పిల్లలు ఒకరినొకరు మారుపేర్లతో వెక్కిరించుకుంటారు.

మ్యారకు - అంచుకు, కొసన; సత్యం అరుగు మీద మ్యారకు కూర్చున్నాడు.

మాప్సీరి - సాయంత్రం; సుదర్శన్ మాప్సీరి పోన్ చేస్తానన్నాడు.

మిడిమేళం - అతి, పట్టవశం కాని; అతను మిడిమేళం మనిషి, ఎవరూ ఒప్పించలేరు!

మిడుకు - చేసి చూపు (వ్యంగ్య ధోరణిలో); మమ్మల్ని తప్పుబట్టడం కాదు, నువ్వు మిడికి చూపించు!

మిటికిళ్ళు - ఒక ధాన్యం; మిటికిళ్ళను వేయించి ఉప్పు వేసుకుని తింటారు.

ముచ్చు - ఎక్కువుగా మాట్లాడని, అంతర్ముఖులు; ఆ పిల్ల ముచ్చుది, ఎవరితో మాట్లాడదు.

ముడ్లు పట్టుకోవడం - నడుము పట్టడం; వరినాటు వేశాక అందరికీ ముడ్లు పట్టుకుపోయినాయి.

ముగుసడం - ముందుకు రావడం (ఏదైనా చేయడానికి); సర్పంచ్ పోటీకి ఎవరైనా ముగిస్తే నేను మద్ధతిస్తా!

ముఖి అవడం - హామీగా ఉండడం; గణేష్ తీసుకున్న అప్పుకి రవి ముఖి అయ్యాడు.

ముక్క వాసన - తిండిపదార్థాలను ఎక్కువగా నిలువ చేస్తే వచ్చే వాసన; మురుకులు ముక్క వాసన కొడుతున్నయి.

ముల్లునీళ్లు - పాదంలో ముల్లు గుచ్చుకుంటే పొసే మంత్రించిన నీళ్లు; రోజాకి ముల్లు గుచ్చుకుంటే పౌలన్న దగ్గర ముల్లునీళ్ళు పోయించారు.

మునం - పంట చేనులో ఒక వరుసలోని మొక్కలు; కలుపు తీయడానికి వచ్చిన కూలీలు ఎవరి మునం వాళ్ళు పట్టుకున్నారు.

ముంగారు - రబీ; ముంగారు పంటల మీద రైతులు ఆశలు పెట్టుకున్నారు.

మునిమాపు - రాత్రి; అశోక్ వచ్చేసరికి మునిమాపు అయ్యింది.

మునుగాల కూర్చోవడం - మోకాళ్ళు మడిచి పాదాలపై కూర్చోవడం; ఆమె మునగాల కూర్చుని టీవి చూస్తుంది.

ముట్టించడం - వెలిగించడం; అతను సిగరెట్ ముట్టించాడు.

ముట్టు అవడం - స్త్రీలు బహిష్టు అవడం, బైటవడం; అమె ముట్టయినందుకు వ్రతానికి రాలేదు.

ముయ్ లు - చదివింపులు; విజయ పెళ్ళికి చాలా ముయ్ లు వచ్చాయి.

మూచూడు - వాసన చూడు; అజయ్ సున్నండలను మూచ్చూసి పక్కనపెట్టాడు.

మూగబడి - గుమిగూడి; టీవిలో ఎన్నికల ఫలితాలను అందరూ మూగబడి చూస్తున్నరు.

మెత్తడం - గోడ మట్టి రాలిన చోట మళ్ళీ మట్టితో నింపడం; ఉగాది వస్తున్నందుకు అందరూ గోడలని మెత్తిస్తున్నారు.

మెర్నె - పెళ్ళిలో జరిగే ఊరేగింపు; మెర్నెలో యువకులు నృత్యం చేస్తున్నారు.

మేడితోక - నాగలిని అదుపు చేసేందుకు వాడే పనిముట్టు; అతను పొలం దున్నుతుంటే మేడితోక ఊడిపోయింది.

మొరుసు - మొరం, ఎర్రమట్టి; వాళ్ళ ఇంటి ముందర మొరుసు కొట్టించారు.

మొండేలుగాడు - మట్టి పైకప్పులో జీవించే విషరహిత పాము; పక్కింటి వాట్లలో మొండేలుగాళ్ళు తిరుగుతున్నయి.

మోడం - ఆకాశంలో కమ్మే మబ్బులు; బాగా మోడం అయింది, వర్షం వస్తదేమో!

మోపుదల - అధికం; కూలీవాళ్లు బీడీలు మోపుదల తెచ్చుకున్నారు.

మోరి - చిన్న రైలు వంతెన, మురికినీళ్ళు పోయే దారి; చిన్న మోరి దాటగానే మా జామతోట కనిపిస్తుంది.

మోట - ఎద్దులతో బావిలో నుండి నీళ్లు తోడే సాధనం; అతను రోజంతా మోట కొడితే ఒక ఎకరాకి నీళ్ళు పారింది.

మొట్టె - మొరటు, మోటు; వాడు మొట్టె నాయాలు, పద్ధతి లేకుండా మాట్లాడుతాడు.

మైలపొలు పోయడం - పెళ్లికుమారుణ్ణి, పెళ్లికూతురిని చేసేటప్పుడు చేసే కార్యక్రమం; ఆడవాళ్ళు పెళ్ళికొడుకుకి మైలపోళ్ళు పోస్తున్నారు.

మైతాబు - అగ్గిపుల్లని గీసేందుకు అగ్గిపెట్టెపై ఉండే పొర; మైతాబు చిరిగినందుకు అగ్గిపుల్ల వెలగట్లేదు.

యాడికి - ఎక్కడికి; మా నాయన యాడికి పోయినాడో నాకు తెలియదు!

యాగజామున - తెల్లవారుజామున; శేషమ్మ యాగజామునే లేచి ఇల్లు ఊడుస్తది.

యాకటి - గర్భధారణ; అతని పెళ్ళాం యాకటయిందంట!

యాలెలే - లేదులే; యాలెలే, అది చేసింది నేను!

యారాలు - తోటికోడలు; రాధ వాళ్ళ యారాలు అలిగి పుట్టింటికి పోయింది.

యాష్ట - అలసట, విసుగు; మొగుడికి తాగొద్దని చెప్పిచెప్పి జయమ్మకి యాష్టకి వచ్చింది.

యాసిరిక - హైరానా; పెళ్ళిపనులు చూసుకోలేక ఆమె యాసిరిక పడుతుంది.

యాస్క - యాసంగి, ఖరీఫ్; మేము యాస్కకి శనగలు వేస్తం.

యాట - పొట్టేలు / మేక / గొర్రె; మాల పున్నానికి మా ఊర్లో ఇరవై యాటలు తెగినాయి!

యాటకుడుపు - పొట్టేలు / మేక ని కోసి మాంసంతో ఇచ్చే విందు; అతను యాటకుడుపుతో కొడుకు మర్లుపెండ్లి చేశాడు.

రక్తమాశమ్మ - వర్షం కోసం జీవులను బలి ఇస్తూ చేసే కార్యం; వానలు లేక ఎర్రపల్లెలో రక్తమాశమ్మని చేసారు.

రయిక - రవిక (బ్లౌజ్); ఆమె రోజుకి ఎనిమిది రయికలు కుడుతుంది.

రిల్ల - సొమ్మసిల్లి పడిపోవడం; ఆ ముసలామె ఎండకి రిల్ల వచ్చి పడింది.

రిమ్మ - పొగరు / బలుపు; వాడికి రిమ్మ ఎక్కువయి అతిగా మాట్లాడుతున్నాడు.

రుబ్బుగుండు - రాళ్ళ ని నల్చి ముగ్గుని చేసే పెద్ద బండ; రామిరెడ్డి వాళ్ళింట్లో రుబ్బుగుండు ఉంది.

రుమాల - తలపాగా; అతను రుమాల కట్టుకుని దుక్కి దున్నుతున్నడు.

రేణిపళ్లు - రేగుపళ్ళు; చలికాలం వస్తే పిల్లలు రేణిపళ్ళ కోసం ఎగపడతరు.

రైలుకట్ట - రైలు మార్గం; పిల్లలు రైలుకట్ట పక్కన నడుస్తూ స్కూలుకి పోతరు.

రొచ్చుగుంత - పశువుల ద్రవ వ్యర్థాలను సేకరించే గుంత; రొచ్చుగుంత ఎక్కి పారినందుకు ఆమె పశులోన్ని తిట్టింది.


ల వ శ స

లంగాపైట - లంగాఓణీ; గణేష్ మండపానికి ఆడపిల్లలు లంగాపైట వేసుకుని వచ్చారు.

లాడీసు - రైలు పట్టాలపై వెళ్లే చిన్న వాహనం; లాడీసు మీద నలుగురు మనుషులు పోతున్నరు.

ల్యాంపు - లాంతరు; గాలివానకి కరెంటు పోగా ల్యాంపు ముట్టించారు.

లావోళ్ళు - పెద్దవాళ్లు, ధనికులు; లావోళ్ళతో పోటీపడలేమని దామోదర్ అన్నాడు.

లింగబచ్చ - స్నానపు నీళ్ళు పోయేందుకు తవ్వే గుంత; పక్కింటివాళ్ళు లింగబచ్చ తవ్వించారు.

లేవకి అవడం - ఎద్దులబండి వెనుకవైపున బరువు ఎక్కువవడం; బండి లేవకి అయిందని అతను పిల్లల్ని దిగపొమ్మన్నాడు.

లేవిడి - దివాళా తీయడం; రాజశేఖర్ పేకాట ఆడి లేవిడి అయినాడు.

లొడపడం - కదపడం, చెయ్యి పెట్టి కలియతిప్పడం; వాళ్ళు పానకాన్ని బాగా లొడిపారు.

లొడుగు - వదులుగా, లూజుగా; ఆ పిల్లోడి అంగీ బాగా లొడుగయింది.

లొడ్డచేయి - ఎడమ చేయి, పుర్ర చేయి; అతను లొడ్డచేయితో మైకు పట్టుకున్నాడు.

వడ్డెగిల పడుకోవడం - పక్కకి తిరిగి పడుకోవడం; ధర్మన్న వడ్డెగిల పడుకొని గురక పెడుతున్నడు.

వడ్లోళ్లు - వడ్రంగులు; అతను వడ్లోళ్ళతోన కొత్త నాగలి చేయించాడు.

వడినించడం - నిశ్చితార్థం, పూలుపండ్లు; భీమయ్య బిడ్డకి నిన్న వడినించారు.

వడిశాల - గురితో రాయిని కొట్టే సాధనం; వాడు వడిశాలతో రాళ్ళు కొట్టి పిట్టలని తోలుతున్నాడు.

వదినమరదలు - భర్త చెల్లెలు / అత్త లేదా మామ కూతురు (స్త్రీ సంబంధ); ఉమ వాళ్ళ వదినమరదలు అమరచింతలో ఇల్లు కట్టింది.

వడిబియ్యం పోయడం - సారె పెట్టడం; శృతికి వడిబియ్యం పోశారు.

వడిబియ్యం వండడం - వడిబియ్యంతో వంట చేసి అందరికీ భోజనాలు పెట్టడం; వాళ్ళు వడిబియ్యం వండినందుకు భోజనాలకి పిలిచారు.

వలిపిరి కొట్టడం - వర్షం ఒకవైపు ఏటవాలుగా పడడం; వాన వలిపిరి కొట్టి మంచం తడిసిపోయింది.

వల్లేబట్ట - టవల్; ఎండాకాలం వల్లెబట్ట నెత్తిమీద వేసుకుంటే మంచిది.

వరాలు - మట్టి మిద్దెపైన వాననీటి కోసం నిర్మించే మట్టికట్టలు; కాంతరెడ్డి వాళ్ళు కొత్త వరాలు కట్టిస్తున్నరు.

వరకోయడం - వర్షంనీటి వల్ల నేల కోతకి గురవడం; నేల వరకోసి మా పెసర పంట మునిగిపోయింది.

వర్తన - రోజువారీ సరఫరా ఒప్పందం; భీమయ్య వాళ్ళకి రోజూ లీటరు పాలు పోసేందుకు వర్తన పట్టుకున్నాం.

వాకర - °అయిష్టం, విసుగు; కుడుములు తిని తిని అతనికి వాకరొచ్చింది.

వానిగాళ్ళు - వాడు కి బహువచనం; వానిగాళ్ళు వచ్చి ఇంటిముందు గొడవ చేస్తున్నారు.

వాపని మనిషి - గర్భిణి; రాజయ్య లేచి వాపన మనిషికి బస్సులో సీటిచ్చాడు.

వారసుంచు - నీడ కోసం ఇంటి ముందుభాగంలో ఈతాకులతో వేసే కప్పు; వాళ్ళింటికి వారసుంచు లేక బాగా ఎండ కొడుతుంది.

వాట్లు - ఇంటి పైకప్పులో వాడే పొందికైన దుంగలు; వాళ్ళింట్లో వాట్లు విరిగి కప్పు కూలింది.

వాటుపడడం - ఎద్దులబండి అదుపు తప్పి కింద పడడం; వాళ్ళ బండి మలుపు తిరుగుతూ వాటుపడింది.

వాటంగా - చక్కగా; బండి చక్రాలు చాలా వాటంగా ఉన్నయి.

వాయి - మూర్చరోగం; అతనికి వాయి లేచి కాళ్ళుచేతులు కొట్టుకున్నాడు.

వీనిగాళ్ళు - వీడు కి బహువచనం; వీనిగాళ్ళు వరినాటుకి పోయినారు.

వెలిసె - ఆగిపోయే; గంట తరువాత వాన వెలిసింది.

వొలిపి కొట్టడం - తిప్పి కొట్టడం; పదిమంది దాడి చేయగా ప్రకాష్ ఒక్కడే వాళ్ళందరినీ వొలిపి కొట్టాడు.

శాన - చాలా; ఆ బొమ్మ శాన బాగుంది.

శాస్త్రం - సామెత; ఏదో శాస్త్రం చెప్పినట్టు, అమ్మకి అన్నం పెట్టలేనోడు చిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తా అన్నాడంట!

శేరు - ధాన్యాల కొలత పాత్ర; ఆమె అన్నానికి రెండు శేర్ల బియ్యం పోసింది.

షియకూర - మాంసం, నంజరకూర; మేము ఈరోజు షియకూర, చపాతీ తిన్నాం.

సరిపించడం - లోహ పనిముట్లను పదును చేయడం; అతను కొలిమికి పోయి కర్రులు సరిపించాడు.

సర్ది - జలుబు; సర్ది చేసినందుకు బాబు స్కూలుకి రాలేదు.

సురుకు - కోపం / ఇరిటేషన్; శీను మాటలకు వాడికి బాగా సురుకు తగిలింది.

సత్యంగా - నిజంగా, ఒట్టు; సత్యంగా, నీ డబ్బులు రేపే ఇచ్చేస్తా!

సంత - వారానికి ఒకసారి జరిగే మార్కెట్; చంద్రన్న గద్వాల సంతకి పోయి కోళ్ళు అమ్మాడు.

సందరాయి - బరువుల ఎత్తేందుకు వాడే పెద్ద బండరాయి; సంక్రాతికి మా ఊర్లో సందరాళ్ళ పోటీ ఉంటది.

సడ్డకుడు - తోడల్లుడు; కుమార్ వాళ్ళ సడ్డకుడు సర్పంచ్ అయినాడు.

సద్ధిపెట్టె - పొలానికి తీసుకెళ్లే తిండిపెట్టె; అతను సద్దిపెట్టె తీసుకుని చేనుకి పోయాడు.

సడుగులు - నడుము; బండి మీద నుండి పడి అతని సడుగులు విరిగాయంట.

సకముకాలు - బాసింపట్టు; పిల్లలు సకముకాలు వేసుకుని తింటున్నారు.

సలాకి - రొట్టెలని కాల్చేందుకు వాడే సాధనం; సలాకీతో వాత పెడతా అని ఆమె కొడుకుని హెచ్చరించింది.

సలికె - పార; వాళ్ళు సలికెతో మట్టి ఎత్తి పోస్తున్నారు.

సముర్తవడం - పుష్పవతి కావడం; శ్రీదేవి సముర్తయిందని వాళ్ళమ్మ చెప్పింది.

సంచకారం - ముందస్తు పైకం, అడ్వాన్స్; వర్తకులు మా పత్తిని చూసి సంచకారం ఇచ్చారు.

సంగని – చాలా, శాన; వాళ్ళు వచ్చి సంగనిసేపు అయింది.

సబ్జ ఆట - దాగుడుమూతలు, డివండల్; నేను సబ్జ ఆట ఆడుతూ గడ్డివాములో దాక్కున్నాను.

సాగర్లపడి - సాగిలపడి; వాడు సాగర్లపడి గోళీలు ఆడుతున్నాడు.

సానిక చల్లడం - పేడనీటితో కళ్ళాపి చల్లడం; మా ఇంటిముందు ప్రతి శనివారం సానిక జల్లుతాం.

సాపు చేయడం - చదును చేయడం; ఆముదాలు ఆరబోయడానికి నేల సాపు చేశారు.

సాడు - యోని ద్రవాలు; (ప్రధానంగా తిట్లలో వాడుతారు).

సారకి - మాటిమాటికి, అస్తమాను; సారకి వచ్చి ఎందుకు అరుస్తున్నవ్!

సాటువ - పోలిక; ధరల విషయంలో మాగాణికి మెట్ట పొలానికి సాటువ పెట్టలేము.

సిదారం - పిచ్చి మొక్కలతో కూడిన పొదలు; ఇంటి వెనకాల సిదారం ఉందని ఆమె పిల్లల్ని వెళ్ళనివ్వదు.

సిక్కెం - పశువులు పంటని తినకుండా వాటి మూతికి కట్టే కప్పు; ఆవుకి సిక్కెం కట్టి పొలం లోకి వదిలారు.

సిల్లపల్లం - చెల్లాచెదురు; పేకలు కలుపుతుంటే జారి సిల్లపల్లం అయ్యాయి.

సిల్లి - తలకి తగిలిన గాయం; దోస్త్ రాయి విసరగా ఆ పిల్లాడి తలకి సిల్లి పడింది.

సిలుకు - ఇతరత్రా; సిలుకు పనులు తప్ప ఇల్లు మొత్తం తయారయిందని వెంకటేశ్ చెప్పాడు.

సిమార్లు - కష్టాలు; పల్లెటూర్లో సిమార్లు పడలేకే వాళ్ళు పట్నానికి పోయారు.

సించుకోవడం - చింపుకోవడం, భరించలేకపోవడం (వ్యంగ ధోరణిలో); నేను వాన్ని తిడితే నువ్వెందుకు సించుకుంటున్నవ్!

సిన్నాయన - బాబాయ్; మా సిన్నాయన ఆ కాలంలోనే డాక్టర్ చదివాడు.

సిన్నమ్మ - పిన్ని; మా సిన్నమ్మకి ఇద్దరు బిడ్డలు, ఓ కొడుకు.

సీకడం - చీకడం; ఆ పిల్లోడు మామిడి టెంకెను సీకుతున్నాడు.

సీల - మేకు; అతను గోడకి సీల కొట్టి పటం తగిలించాడు.

సీమచింతకాయ - చింతకాయ ఆకారంలో ఉండే మృదువైన కాయలు; సీమచింతకాయలు తెంపడానికి మాణిక్యం చెట్టు ఎక్కాడు.

స్పీలా! - పిల్లుల్ని పిలిచేందుకు చేసే ఒక శబ్దం; వైష్ణవి స్పీలా అనగానే పిల్లి వచ్చి పాలు తాగింది.

సుద్దులు - ముచ్చట్లు; ఆడోళ్ళు ఏవేవో సుద్దులు చెప్పుకుంటున్నరు.

సుగ్గి లేపడం - ఎక్కువ తీసుకోవడం, వాడడం; జయరాం మందుని సుగ్గి లేపినాడు.

సుకురం - జోలికి; పిచ్చోళ్ళ సుకురం ఎవరూ పోరు.

సుట్టుముట్టు - చుట్టుపక్కల; మా ఇంటి సుట్టుముట్టు ఒక్క ఇల్లు లేదు.

సూది ఏపిచ్చుకోవడం - ఇంజెక్షన్ చేయించుకోవడం; ఆమె డాక్టర్ దగ్గరకొచ్చి సూది ఏపిచ్చుకుంది.

సెలకాల - చర్నాకోల; వాడు సెలకాలతో ఎద్దులను కొడుతూ ఉరికిస్తున్నడు.

సెలగడం - కర్రని ట్రిమ్ చేయడం; అతను ముళ్ళ కట్టెని సెలిగి చేతికర్ర చేశాడు.

సెల్ల - తువ్వాలు / టవల్; అతను సెల్లతో ముఖాన్ని తుడుచుకున్నాడు.

సెల్లాటకం - కోడేగిత్తలు (హుషారు ఎక్కువయి) అదుపు తప్పడం; ఎద్దులు సెల్లాటకం పెట్టి వీధుల్లో పరుగెడుతున్నాయి.

సెంఠం - మర్మాంగ వెంట్రుక; (ప్రధానంగా తిట్లలో వాడుతారు)

సెరిక - పర్రె, పగులు; నాగలి రాయికి తగిలి సెరిక వచ్చింది.

సేడం - చేతబడి; అతను సేడం చేస్తాడని ఊరు నుండి వెళ్ళగొట్టారు.

సేపడం - దూడ చేత చన్ను చీకించి ఆవు/గేదె పాలు ఇచ్చేలా చేయడం; ఆవు సేపగానే దూడని స్తంభానికి కట్టి పాలు పితికారు.

సైలుగా - సన్నగా చక్కగా; హారిక సైలుగా ఉంటది కాబట్టి మంచి సంబంధం వచ్చింది.

సొంగలు - పైపులా ఉండే వడియాలు; అతను పెరుగన్నంలో సొంగలు నంజుకుని తింటున్నాడు.

సొరగడం - తూలడం; అతనికి మందు ఎక్కువయి సొరుగుతున్నాడు.

సౌధ - సరుకులు; అందరూ పండగ సౌధని గద్వాల నుండి తెచ్చుకుంటారు.

చెల్లని దారిమార్పులు[మార్చు]

Weshowit గారూ, మీరు ఈ పేజీని రెండు సార్లు చెల్లని గమ్యస్థానాలకు దారిమార్పు చేసారు. ఒకసారి "చర్చ:" పేరుబరి లోకి, మరోసారి "వికీపీడియా చర్చ:" పేరుబరిలోకీ దారిమార్పు చేసారు. ఆ విధంగా ఒక పేరుబరి నుండి మరో చోటికి దారిమార్పులు చెయ్యరాదు. నేను రెండు సార్లూ దాన్ని వ్ర్నక్కి తిప్పాను. ఇకపై అలా చెయ్యకండి.

మరొక ముఖ్య విషయం.. మీరు ఇక్కడ చేర్చిన ఈ కంటెంటును అసలు వికీపీడియాలో పెట్టే వీలు లేదు. గద్వాల జిల్లా మాండలికం "గురించి" రాయండి. అలా రాసే సందర్భంలో కొన్ని ఉదాహరణలను ఇవ్వండి. అంతే తప్ప, మొత్తం పదాల జాబితాను పెట్టే స్థలం వికీపీడియా కాదు -గమనించండి. ధన్యవాదాలు. __ చదువరి (చర్చరచనలు) 14:02, 21 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]

Pashuvuni adhupulo pette thadu[మార్చు]

pashuvuni adhupulo pette thadu 2409:40F0:101C:682E:8000:0:0:0 06:03, 13 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]