Jump to content

వానమామలై జగన్నాథాచార్యులు

వికీపీడియా నుండి
వానమామలై జగన్నాథాచార్యులు
జననంవానమామలై జగన్నాథాచార్యులు
(1908-12-19)1908 డిసెంబరు 19
India మడికొండ గ్రామం, వరంగల్ జిల్లా, తెలంగాణా రాష్ట్రం
మరణం1995 జూన్ 28
ప్రసిద్ధిపండితుడు, రచయిత
మతంహిందూ (శ్రీవైష్ణవ)
భార్య / భర్తఆండాలమ్మ
తండ్రిబక్కయ్య శాస్త్రి
తల్లిసీతమ్మ

వానమామలై జగన్నాథాచార్యులు (డిసెంబరు 19, 1908 - జూన్ 28, 1995) తెలంగాణ రాష్రానికి చెందిన పండితుడు, రచయిత. ‘రైతు రామాయణం’ పేరుతో రైతు శ్రమను,దేశానికి రైతు వల్ల ఉన్న లాభాలను తెల్పుతూ 3000 పద్యాలతో మహాకావ్యాన్ని రాశాడు.[1]

జననం

[మార్చు]

ఈయన వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో డిసెంబరు 19, 1908న జన్మించాడు. తండ్రి బక్కయ్య శాస్త్రి తెలుగు సంస్కృతం భాషలలో ఉద్ధండ పండితుడు. తల్లి పేరు సీతమ్మ. వైష్ణవ మతావలంబి.

విద్యాభ్యాసం - వివాహం

[మార్చు]

చిన్నవయసులోనే పురాణ గ్రంథాలను చదువుతూ హరికథలను గానంచేస్తూ తన తండ్రి దగ్గర ‘శబ్దమంజరి’ని నేర్చుకునేవాడు. నైజాం పాఠశాలలో 4 వ తరగతి నుండి 7 వ తరగతిదాకా చదివాడు. 19 ఏళ్ళప్పుడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ తాలుకా వాస్తవ్యులైన సముద్రాల జగన్నాథాచార్య పెంపుడు కూతురైన ఆండాలమ్మతో జగన్నాథాచార్య వివాహం జరిగింది. వీరికి 11 మంది సంతానం.

ఇతర వివరాలు

[మార్చు]

ఉపధ్యాయునిగా ఆదిలాబాద్ జిల్లాలోని మొదట్లో భీమారం గ్రామంలో రెండు సంవత్సరాలు, రామారం గ్రామంలో మరో రెండు సంవత్సరాలు పని చేశాడు. అటు తరువాత కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలుకాలోని కాల్వ శ్రీరాంపురం గ్రామంలోని విద్యా కమిటి కోరికతో బాలికోన్నత పాఠశాలలో సుమారు ఎనమిది సంవత్సరాలు, ఆ తరువాత కల్లేపల్లిలో ఎనమిది సంవత్సరాలు, నిడుకొండలో మూడు సంవత్సరాలు పనిచేశాడు. అటుపిమ్మట కరీంనగర్ లోని ఎస్.వి.టి.సి. ట్యూటోరియల్ కళాశాలలో ఎనమిది సంవత్సరాలు తెలుగు పండితునిగా పనిచేశాడు.

రచనా ప్రస్థానం

[మార్చు]

వెయ్యికి పైగా హరికథలను గానం చేసిన జగన్నాథాచార్యులు యాదాద్రి - భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా హరికథాగానం చేయడానికి వెళ్లి, అక్కడ హిందీ వారు ఎక్కువగా ఉండడంతో తెలుగు హరికథలను అప్పటికప్పుడే హిందీలోకి అనువదించుకుని గానం చేశాడు. ‘ధనుర్దాసు’ కథలోని వైష్ణవభక్తి తత్త్వంతో కొన్ని తేటగీతి పద్యాలు, ‘కార్పాసలక్ష్మి’ అనే పేరుతో ఒక వైష్ణవ భక్తురాలి కథను నాటకంగా రాశాడు. ఈయన రాసిన అభ్యుదయ గేయాలు 1952 – 53 సం.లో శ్రీ జువ్వాడి గౌతమరావు ఆధ్వర్యంలో ముద్రించాడు. 1968 సం.లో హుజూరాబాద్ తాలుకాలోని ఇల్లంద కుంటలోని శ్రీ సీతారామచంద్రస్వామిపై సంస్కృతంలో ‘శ్రీ ఇల్లిందకుంట రఘురాట్ తవ సుప్రభాతమ్’ రాశాడు.

1971 లో శ్రీ జువ్వాడి ప్రభాకరరావు ఆర్థిక సహాయంతో గోదాదేవి తమిళంలో రాసిన ‘తిరుప్పావై’ ను తెలుగులోకి ’శ్రీవ్రతగీతి’ అనే పేరిట గేయాలుగా రాశాడు. కాల్వ శ్రీరాంపురం పక్కనవున్న ’కమాన్ పురం’ ఆది వరాహస్వామిపై ‘ఆది వరాహ అష్టోత్తరశతి’ పంచపాదిగా మొత్తం ఉత్పలమాలావృత్తంలో రాశాడు. తులసీ రామాయణం (హరికథ), తెలుగుబిడ్డ (శతకం) రాశాడు.

రైతు శ్రమను, దేశానికి రైతు వల్ల ఉన్న లాభాలను తెల్పుతూ 3000 పద్యాలతో ‘రైతు రామాయణం’ అనే మహాకావ్యాన్ని రాశాడు. రామాయణంను తలపించేలా గ్రామీణ ప్రాంతంలోని రైతు జీవిత గాథను రామాయణంగా శిశు, శిక్షణ, కల్యాణ, కృషి, నిర్బంధ, విజయ కాండలుగా కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ నారాయణరావు, పల్లా దుర్గయ్య, డా. సి. నారాయణరెడ్డి, గోవిందవరం మురహరిశర్మ మొదలైనవారు పీఠికలు రాయగా, విశ్వనాథ సత్యనారాయణ ఈ కావ్యాన్ని ప్రశంసించారు.

సన్మానాలు - పురస్కారాలు

[మార్చు]

మరణం

[మార్చు]

ఈయన 1995, జూన్ 28న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. మన తెలంగాణ, కలం (19 November 2018). "రైతు వాల్మీకి జగన్నాథాచార్యులు". తిరునగరి శరత్ చంద్ర. Archived from the original on 19 నవంబరు 2018. Retrieved 19 November 2018.