Coordinates: 18°52′00″N 84°28′00″E / 18.8667°N 84.4667°E / 18.8667; 84.4667

వాసుదేవ ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాసుదేవ ఆలయం, మందస
మందసలోని శ్రీ వాసుదేవుని దివ్యసన్నిధి.
మందసలోని శ్రీ వాసుదేవుని దివ్యసన్నిధి.
వాసుదేవ ఆలయం, మందస is located in Andhra Pradesh
వాసుదేవ ఆలయం, మందస
వాసుదేవ ఆలయం, మందస
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం
భౌగోళికాంశాలు :18°52′00″N 84°28′00″E / 18.8667°N 84.4667°E / 18.8667; 84.4667
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:శ్రీకాకుళం
ప్రదేశం:మందస
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వాసుదేవుడు

శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని ప్రాచీన దేవాలయం.

సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమయినదిగా భావిస్తున్న ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభ్యం కానప్పటికీ సుమారు 266 సంవత్సరాలక్రితం ఇది పునర్నిర్మితమయినట్టు ఇక్కడ లభించిన ఆధారాలబట్టి తెలియవచ్చింది. ఎర్రని ఇసుక రాయితో కళింగ శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయ అపూర్వ శిల్పసంపద వర్ణనాతీతం. ఆలయంలో నెలకొని ఉన్న నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలివుండి చూపరులను కట్టిపడేస్తుంది. గత శతాబ్దము చివర వరకు ఇది మంచి వేదాధ్యయన కేంద్రముగా విలసిల్లినట్లు కూడా తగిన ఆధారాలు లభించినాయి.

వాసుదేవాలయం-చరిత్ర[మార్చు]

మందసలోని వాసుదేవ పెరుమాళ్ దేవాలయం.

ఆ కాలంలో మందసా రామానుజులను ప్రసిద్ధ వేదవిద్వాంసులు ఈ ఆలయ ప్రాంగణంలోనే వేదవిద్యను నేర్పుతూ కాశీ వరకు కూడా పర్యటించి పలువురు వేద విధ్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి పలు సన్మాన పత్రములను పొంది ఉన్నారట. మందసా రామానుజుల కీర్తిని గురించి తెలుసుకున్నచిన్నజీయరు స్వామివారి గురువు పెద్ద జీయరు స్వామి వారు, వారి మిత్రులు గోపాలాచార్యస్వామివారితో కలసి నేటి రాజమండ్రి నుంచి శ్రీభాష్యం అధ్యయనం చేయడానికి కాలినడకన మందసకు వేంచేయడం జరిగింది. వారిని ఆదరించిన మందసా రామానుజులు వారిచే శ్రీభాష్యం అధ్యయనం చేయించడానికి అంగీకరించారు. నాటి రాత్రి ఆలయప్రాంగణంలో నిద్రించిన శిష్యులిద్దరికీ వారు రాజమండ్రి వద్ద దాటి వచ్చిన గోదావరి వంతెన విరిగి వరదలో కొట్టుకుపోయినట్లు కల వచ్చింది. అది అపశకునంగా భావించిన శిష్యులిద్దరు తమ విద్యాభ్యాసానికి ఆటంకము కలుగుతుందేమోనని భయపడుతూ గురువు గారివద్దకు వెళ్ళి కల సంగతి చెప్పారు. గురువుగారు వారిని ఊరడించి ఆలయంలో వేంచేసియున్నశ్రీ వాసుదేవ పెరుమాళ్ వద్దకు వారిని తీసుకుని వెళ్ళి స్వామికి సాష్టాంగ నమస్కారము చేయించి, వారు కూడా చేసినారట. ఆ సమయంలో వాసుదేవుని విగ్రహం నుండి ఓ దివ్యమయిన కాంతి ప్రసరించినదట. వాసుదేవుని అనుగ్రహం వల్ల శిష్యులిద్దరు సుమారు 2 సంవత్సరాలలో పూర్తికావలసిన శ్రీభాష్యం అధ్యయనాన్ని కేవలం 6 నెలలలోనే పూర్తి చేసుకుని తిరుగుప్రయాణం అయ్యారట. అందుకని ఇక్కడి దేవుని జ్ఞానప్రదాతగా, అభయప్రదాతగా భక్తులు కొలుస్తారు.

కాలాంతరంలో దివ్యమైన ఈ ఆలయం పాలకుల నిరాదరణకు గురి అయ్యి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆలయానికి చెందిన అపూర్వ శిల్పసంపద చాలావరకు ఆకతాయి చేష్టలకు నాశనం కాబడింది.సుమారు 1683 ఎకరాలు మాన్యం ఉన్నప్పటికీ ఈ ఆలయం మనిషి స్వార్థానికి ప్రతీకగా శిథిలమయ్యింది. ప్రస్తుతం కేవలం 3 ఎకరాల భూమి మాత్రమే రెవెన్యూ రికార్డుల ప్రకారం అందుబాటులో ఉంది. ఆలయ గోడలమీద పిచ్చిమొక్కలు పెరిగి విషజంతువుల సంచారంతో సుమారు 50 సంవత్సరాల కాలం ఈ అపురూప ఆలయం జనబాహుళ్యానికి దూరంగా ఉండిపోయింది.

చినజీయరు ఆగమనం-పునర్వైభవం[మార్చు]

1988 లో ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్న చిన్నజీయరు స్వామి వారు ఆలయసందర్శనార్ధం మందసకు వేంచేసి, ఖర్చుకు వెరవకుండా ఆలయ ప్రాచీనతకు భంగం కలుగకుండా పునర్నిర్మించాలని సంకల్పించారు. అన్ని ప్రభుత్వ లాంచనాలు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారినుండి ఆలయాన్ని స్వాధీనం చేసుకుని, ఒడిషా నుంచి శిల్పులను రప్పించి యదాతధంగా ఆలయాన్నిపునర్నిర్మింపచేసారు. గురువు పెద్దజీయరు స్వామివారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయరు స్వామివారు 2009 ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమయిన ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రస్తుతం గుడి మాన్యం తిరిగి దేవునికే చెందేలా చర్యలు తీసుకోబడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలు అరసవెల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం మొదలగు వాటికి సమానంగా ఈ ఆలయం కూడా క్రమేపి ప్రాధాన్యత పొందుతున్నది. జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచే కాకుండా ఇతర జిల్లాలు, ఒడిషా నుండి కూడా అనేకమంది భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అనగా ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ఈ ఆలయం తప్పక సందర్శించతగినది.

చేరుకునే మార్గం[మార్చు]

మందసకు దగ్గరలో ఉన్న స్టేషను పలాస (18 కి.మీ). మద్రాసు-కలకత్తా జాతీయ రహదారి 5 నుండి కేవలం 5 కి.మీ. దూరం. శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుండి 100 కి.మీ. విశాఖపట్నం నుండి 200 కి.మీ.