వాస్తవాధీన రేఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చైనా, భారతదేశాల మధ్య వాస్తవాధీన రేఖ (CIA మ్యాప్)
తూర్పు లడఖ్, అక్సాయ్ చిన్ లను వేరుచేసే వాస్తవాధీన రేఖ పశ్చిమ భాగం. దక్షిణ డెమ్‌చోక్ ప్రాంతంలో, రెండు దావా రేఖలు మాత్రమే చూపించబడ్డాయి. ( CIA మ్యాప్)

వాస్తవాధీన రేఖ ("లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్.ఏ.సి)"), చైనీయుల-నియంత్రణలో ఉన్న భూభాగాన్ని, భారత నియంత్రిత భూభాగాన్నీ వేరుపరచే ఊహాత్మక సరిహద్దు రేఖ. [1] దీన్ని వాస్తవ నియంత్రణ రేఖ అని కూడా అంటారు. పేరులో బాగా దగ్గరి పోలిక ఉండి, దీనితో సంబంధం లేని మరొక రేఖ నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్). ఇది భారత పాకిస్తాన్‌ల మధ్య ఉన్న రేఖ. ఈ రెండు రేఖలూ అవిభక్త జమ్మూ కాశ్మీరు రాష్ట్రం లేదా ఒకప్పటి జమ్మూ కాశ్మీరు సంస్థానం గుండానే పోతాయి. "లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్" అనే మాటను 1959 లో జౌఎన్‌లై, జవహర్‌లాల్ నెహ్రూకు రాసిన లేఖలో ఉపయోగించాడని చెబుతారు. [2] 1962 భారత చైనా యుద్ధం తరువాత ఏర్పాటు చేసుకున్న రేఖకు ఈ పేరు పెట్టారు. ఇది భారత చైనా సరిహద్దు వివాదంలో భాగం. [3]

"లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్" అనే పదాన్ని రెండు సందర్భాల్లో వాడతారు. సంకుచితార్థంలో చూస్తే, ఇది భారత కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్కు, చైనీయుల టిబెట్ స్వాధికార ప్రాంతానికీ మధ్య సరిహద్దుగా మాత్రమే సూచిస్తుంది. ఆ అర్థంలో, ఈ వాస్తవాధీన రేఖ, తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న వివాదాస్పద మెక్‌మహాన్ రేఖ, మధ్యలో ఏ వివాదమూ లేని ఒక చిన్న విభాగం -ఈ మూడూ కలిసి రెండు దేశాల మధ్య సరిహద్దును ఏర్పరుస్తాయి. విస్తృతార్థంలో చూస్తే దీన్ని, పశ్చిమ నియంత్రణ రేఖ, తూర్పు నియంత్రణ రేఖ - రెండింటినీ సూచించడానికి ఉపయోగించవచ్చు. ఈ అర్థంలో దీన్ని భారతదేశం, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాల మధ్య సరిహద్దు అని చెప్పుకోవచ్చు.

అవలోకనం[మార్చు]

భారత చైనా సరిహద్దు మొత్తం (పశ్చిమాన ఎల్‌ఎసి, మధ్యలో వివాదమేమీ లేని చిన్న ముక్క, తూర్పున మెక్‌మహాన్ రేఖ లను కలుపుకుని) 4,056 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఐదు భారతీయ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు - లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ సరిహద్దు వెంట ఉన్నాయి. [4] చైనా వైపున ఈ సరిహద్దు, టిబెట్ స్వాధికార ప్రాంతం గుండా వెళుతుంది.

ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనే పదాన్ని 1959 లో జౌఎన్‌లై, జవహర్‌లాల్ నెహ్రూకు రాసిన లేఖలో ఉపయోగించాడని చెబుతారు. [2] 1962 భారత చైనా యుద్ధం తరువాత కాల్పుల విరమణ రేఖగా ఏర్పడిన ఈ రేఖ, 1993 లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందంలో అధికారికంగా వాస్తవాధీన రేఖగా ఆమోదించారు.[5]

1959 నవంబరు 7 నాటి ఒక లేఖలో జౌ నెహ్రూకు రాస్తూ, LAC అంటే "తూర్పున మెక్ మహోన్ రేఖ, పశ్చిమాన ఇరు పక్షాలూ ఎక్కడి వరకైతే నియంత్రణలో ఉంచుకున్నాయో ఆ రేఖ" అని అన్నాడు. భారత చైనా యుద్ధ (1962) సమయంలో, వాస్తవాధీన రేఖను గుర్తించడానికి నెహ్రూ నిరాకరించాడు: "'వాస్తవాధీన రేఖ' అని వాళ్ళు పిలుస్తున్న దాని నుండి ఇరవై కిలోమీటర్లు ఉపసంహరించుకోవాలన్న చైనా ప్రతిపాదనలో ఎటువంటి తెలివీ లేదు, అర్ధమూ లేదు. అసలీ 'నియంత్రణ రేఖ' అంటే ఏమిటి? సెప్టెంబరు మొదట్లో మొదలెట్టిన ఆక్రమణ ద్వారా వారు సృష్టించిన రేఖ ఇదేనా? సైనిక దురాక్రమణ ద్వారా నలభై అరవై కిలోమీటర్లు నిస్సిగ్గుగా ముందుకు సాగడం, ఆ తరువాత ఇరవై కిలోమీటర్లు వెనక్కి తగ్గుతామనడం, పైగా ఆ పని ఇరువైపులా చెయ్యాలని అనడం -ఇదంతా ఎవరినీ మభ్యపెట్టలేని మోసపూరిత వ్యవహారం." అని అన్నాడు. [6]

"1959 నవంబరు 7 న ఉన్న రేఖయే ప్రాథమికంగా ఇప్పటికీ చైనా భారతదేశాల మధ్య ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ. ఒక్కమాటలో చెప్పాలంటే, తూర్పు రంగంలో ఇది ప్రధానంగా మెక్ మహాన్ రేఖ అని పిలుస్తారు. పశ్చిమ, మధ్య రంగాలలో ఇది ప్రధానంగా సాంప్రదాయికంగా ఉన్న రేఖతో కలుస్తుంది. చైనా ఎప్పుడూ దీన్నే సూచిస్తూంటుంది." అని జౌ స్పందించాడు.[7]

1993, 1996 లలో సంతకం చేసిన భారత చైనా ఒప్పందాలలో "ఎల్‌ఎసి" అనే పదానికి చట్టపరమైన గుర్తింపు లభించింది. 1996 ఒప్పందం ప్రకారం, "ఇరువైపుల చేపట్టే కార్యకలాపాలు ఏవైనా సరే, వాస్తవ నియంత్రణ రేఖను ఉల్లంఘించకూడదు" అయితే, భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతాలలో వాస్తవ నియంత్రణ రేఖ వెంట శాంతి, ప్రశాంతత నిర్వహణ గురించి 1993 ఒప్పందంలోని 6 వ నిబంధన ఇలా పేర్కొంది: "ఈ ఒప్పందంలో వాస్తవ నియంత్రణ రేఖకు సంబంధించిన ఉల్లేఖనలు, సరిహద్దు అంశం పట్ల ఇరుపక్షాల అభిప్రాయాన్ని ప్రతిబింబించేవి కావు". [8]

పశ్చిమ రంగంలో చైనా వారి 1956, 1960 ల నాటి దావా రేఖలు, CIA మ్యాప్

చైనా దళాలు ఏటా వందల సార్లు చట్టవిరుద్ధంగా ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తూంటాయని భారత ప్రభుత్వం చెబుతుంది. [9] 2013 లో, భారత, చైనా దళాల మధ్య దౌలత్ బేగ్ ఓల్డీకి ఆగ్నేయంగా 30 కి.మీ. దూరాన మూడు వారాల ప్రతిష్ఠంభన (2013 దౌలత్ బేగ్ ఓల్డీ సంఘటన ) జరిగింది. 250 కి.మీ. దూరాన చూమార్ వద్ద భారతదేశం స్థాపించిన కొన్ని సైనిక నిర్మాణాలను కూల్చేయాలన్న చైనా డిమాండుకు భారత్ అంగీకరించడంతో చైనా వెనక్కు తగ్గింది. వివాదం పరిష్కారమైంది. [10] అదే సంవత్సరంలో, మునుపటి ఆగస్టు నుండి ఆ ఏడు ఫిబ్రవరి మధ్య సరిహద్దు ప్రాంతంలోని ఒక సరస్సుపై 329 గుర్తు తెలియని వస్తువులను భారత దళాలు చూసినట్లు తెలిసింది. వారు అలాంటి 155 చొరబాట్లను నమోదు చేశారు. తరువాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏస్ట్రోఫిజిక్స్ వారు ఆ వస్తువుల్లో కొన్ని శుక్ర, బృహస్పతి గ్రహాలని, ఎత్తు ప్రదేశాల వద్ద ఉండే విభిన్న వాతావరణం ఫలితంగా అవి ప్రకాశవంతంగా కనిపించాయనీ గుర్తించారు. నిఘా డ్రోన్ల వాడకం కారణంగా ఏర్పడిన గందరగోళం కూడా దీనికి కారణం. [11] 2013 అక్టోబరులో భారతదేశం, చైనాలు సరిహద్దు రక్షణ సహకార ఒప్పందంపై సంతకం చేశాయి. [12]

వాస్తవాధీన రేఖ పరిణామం[మార్చు]

1956, 1960 ల నాటి దావా రేఖలు[మార్చు]

1962 సెప్టెంబరి 8 కి ముందు దళాలను వేరుచేసే రేఖ[మార్చు]

1962 యుద్ధం ముగింపులో, చైనీయులు 1962 సెప్టెంబరు 8 నాటి తమ స్థానాలకు వెళ్ళాలని భారతదేశం డిమాండు చేసింది. [13]

1959 నవంబరు 7 నాటి LAC[మార్చు]

పశ్చిమ (అక్సాయ్ చిన్) ప్రాంతంలో సరిహద్దుపై భారతీయ, చైనా వాదనలు, మాకార్ట్నీ-మెక్‌డొనాల్డ్ రేఖను, ఫారిన్ ఆఫీస్ రేఖను, 1962 యుద్ధంలో చైనా దళాల పురోగతినీ ఈ మ్యాప్ చూపిస్తుంది.

చైనా ప్రధాన మంత్రి జౌ ఎన్-లై "వాస్తవ నియంత్రణ రేఖ" అనే భావనను సూచించి, 1959 నవంబరు 7 అనే తేదీకి చైనా రికార్డుల్లో ఒక పవిత్రతను ఆపాదించాడు.

భారత చైనా సరిహద్దు పశ్చిమ రంగం గురించి చైనా చూపించే పటాల్లో ఈ రేఖను కాలక్రమంలో ముందుకు జరుపుకుంటూ పోయారని మార్గరెట్ ఫిషర్ పేర్కొంది. ఈ మ్యాపుల్లో చూపించే రేఖను ప్రతీదానిలోనూ "1959 నవంబరు 7 నాటి వాస్తవ నియంత్రణ రేఖ" గానే చెబుతూంటారు.

1962 అక్టోబరు 24 న, భారత చైనా యుద్ధంలో చైనా దళాల ప్రారంభ ఒత్తిడి తరువాత, చైనా ప్రధాన మంత్రి జౌ ఎన్-లై పది ఆఫ్రో-ఆసియా దేశాల అధిపతులకు శాంతి కోసం తన ప్రతిపాదనలను వివరించాడు. అతడి ప్రాథమిక సిద్ధాంతం "వాస్తవ నియంత్రణ రేఖ" ను దాటకుండా రెండు వైపులా చర్యలు చేపట్టాలి. [14] ఈ లేఖతో పాటు కొన్ని పటాలు ఉన్నాయి. ఇవి కూడా "1959 నవంబరు 7 నాటికి వాస్తవ నియంత్రణ రేఖ"ను చూపించాయి. ఫిషర్ దీనిని 1962 నవంబరులో ప్రచురించబడిన "1959 నవంబరు 7 నాటి వాస్తవ నియంత్రణ రేఖ" అని పేర్కొంది. [15] స్కాలర్ స్టీఫెన్ హాఫ్మన్ ఈ రేఖను 1959 నవంబరు 7 న చైనీయులు ఉన్న స్థానాన్ని చూపించడం లేదనీ, 1962 అక్టోబర్ 20 న జరిగిన భారీ దాడికి ముందు, ఆ తరువాతా చైనా సైన్యం సాధించిన పురోగతిని మాత్రమే చూపిస్తోందనీ చెప్పాడు. కొన్ని చోట్ల అయితే, ఇది చైనా సైన్యం చేరుకున్న భూభాగాన్ని కూడా దాటిపోయింది. [16]

1959 నాటి రేఖపై భారతదేశానికి ఉన్న అవగాహన ప్రకారం ఈ రేఖ, హాజీ లాంగర్, షమల్ లుంగ్పా, కొంగ్కా లా (మ్యాప్‌లో చూపిన ఎరుపు గీత) ల గుండా పోతుంది. [17]

చైనా-వాదిస్తున్న రేఖ భారతదేశానికి ఆమోదయోగ్యం కానప్పటికీ, [13] 20 కిలోమీటర్లు ఉపసంహరించుకోవటానికి చైనీయులు ఈ రేఖను పరిగణించడం ఆమోదనీయంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. చైనా ప్రతిపాదనలను భారతదేశం అంగీకరించనప్పటికీ, చైనీయులు ఈ రేఖ నుండి 20 కిలోమీటర్ల దూరం ఉపసంహరించుకున్నారు. ఇక అప్పటి నుండి దీనిని "1959 నాటి వాస్తవ నియంత్రణ రేఖ" గా చిత్రీకరించడం మొదలుపెట్టారు. [16]

1962 డిసెంబరులో, ఆరు ఆఫ్రో-ఆసియా దేశాల ప్రతినిధులు కొలంబోలో సమావేశమై భారతదేశం, చైనా ల మధ్య శాంతి కోసం కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనల్లో 20 కిలోమీటర్ల ఉపసంహరణ చెయ్యాలన్న చైనా ప్రతిజ్ఞను లాంఛనం చేశారు. వాళ్ళు కూడా ఈ రేఖను "చైనా దళాలు 20 కిలోమీటర్లు వెనక్కి ఉపసంహరించుకునే రేఖ"గా వర్ణించారు. [16] [18]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Sushant Singh, Line of Actual Control (LAC): Where it is located, and where India and China differ, The Indian Express, 1 June 2020.
 2. 2.0 2.1 Hoffman, Steven A. (1990). India and the China Crisis. Berkeley: University of California Press. p. 80. ISBN 9780520301726.
 3. "Line Of Actual Control: China And India Again Squabbling Over Disputed Himalayan Border". International Business Times. 3 May 2013. Archived from the original on 30 September 2018. Retrieved 26 February 2019.
 4. Another Chinese intrusion in Sikkim Archived 28 సెప్టెంబరు 2011 at the Wayback Machine, OneIndia, Thursday, 19 June 2008. Retrieved 19 June 2008.
 5. "Line Of Actual Control: China And India Again Squabbling Over Disputed Himalayan Border". International Business Times. 3 May 2013. Archived from the original on 30 September 2018. Retrieved 26 February 2019.
 6. Maxwell, Neville (1999). "India's China War". Archived from the original on 22 August 2008. Retrieved 21 October 2008.
 7. "Chou's Latest Proposals". Archived from the original on 17 July 2011.
 8. "Agreement on the Maintenance of Peace and Tranquility along the Line of Actual Control in the India-China Border Areas". United Nations. 7 September 1993. Archived from the original on 10 జూన్ 2017. Retrieved 27 June 2017.
 9. "Chinese Troops Had Dismantled Bunkers on Indian Side of LoAC in August 2011"Archived 30 ఏప్రిల్ 2013 at the Wayback Machine. India Today. 25 April 2013. Retrieved 11 May 2013.
 10. Defense News. "India Destroyed Bunkers in Chumar to Resolve Ladakh Row" Archived 24 జూలై 2013 at the Wayback Machine. Defense News. 8 May 2013. Retrieved 11 May 2013.
 11. "India: Army 'mistook planets for spy drones'". BBC. 25 July 2013. Archived from the original on 28 July 2013. Retrieved 27 July 2013.
 12. Reuters. China, India sign deal aimed at soothing Himalayan tension Archived 24 సెప్టెంబరు 2015 at the Wayback Machine
 13. 13.0 13.1 Inder Malhotra, The Colombo ‘compromise’, The Indian Express, 17 October 2011. "Nehru also rejected emphatically China's definition of the LAC as it existed on November 7, 1959."
 14. Whiting, Chinese calculus of deterrence (1975).
 15. Karackattu, Joe Thomas (2020). "The Corrosive Compromise of the Sino-Indian Border Management Framework: From Doklam to Galwan". Asian Affairs. 51 (3): 590–604. doi:10.1080/03068374.2020.1804726. ISSN 0306-8374. See Fig. 1, p. 592
 16. 16.0 16.1 16.2 Hoffmann, India and the China Crisis (1990).
 17. Chinese Aggression in Maps: Ten maps, with an introduction and explanatory notes, Publications Division, Government of India, 1963. Map 2.
 18. ILLUSTRATION DES PROPOSITIONS DE LA CONFERENCE DE COLOMBO - SECTEUR OCCIDENTAL, claudearpi.net, retrieved 1 October 2020. "Ligne au dela de la quelle les forces Chinoises se retirent de 20 km. selon les propositions de la Conférence de Colombo (Line beyond which the Chinese forces will withdraw 20 km. according to the proposals of the Colombo Conference)"

బాహ్య లంకెలు[మార్చు]