వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2011 04వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Kuppam assembly constituency.svg

చిత్తూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణాదిగా ఉన్న నియోజకవర్గం. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులు కలిగిన కుప్పం నియోజకవర్గం రెండు సార్లు ముఖ్యమంత్రి అభ్యర్థిని గెలిపించి ప్రత్యేకతను చాటుకుంది. ఈ నియోజకవర్గానికి ఉన్న మరో ప్రత్యేకత రాష్ట్రంలోనే చిట్టచివరి శాసనసభ నియోజకవర్గపు సంఖ్యను కలిగి ఉండటం. 294 నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రంలో ఈ నియోజకవర్గపు సంఖ్య 294. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ శాసనసభ నియోజకవర్గం మరో 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 1955లో ఏర్పడిన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ (ఐ) పార్టీలు కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచాయి. గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడైన డి.రామబ్రహ్మం కుప్పం తొలి శాసనసభా సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1962లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సి.పి.ఎంకు చెందిన వజ్రవేలు చెట్టి ఎన్నికయ్యాడు. 1967 ఎన్నికలలో కుప్పం ప్రజలు రాజకీయాలలోకి కొత్తగా ప్రవేశించిన ఒక స్వతంత్ర అభ్యర్ధి అయిన డి.వెంకటేశంను గెలిపించారు. రాజకీయ అతిరథులైన డి.రామబ్రహ్మం మరియు వజ్రవేలు చెట్టి వంటి వారిని ఓడించి ఈయన సాధించిన అనూహ్య విజయం అందరినీ ఆశ్చర్యపరచింది. డి.వెంకటేశం 1972లో తిరిగి కుప్పం నుండి రెండవ పర్యాయము శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తరువాత ఎన్నికలలో దేశమంతటా జనతా పార్టీ ప్రభంజనం వచ్చినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఇందిరాగాంధీ పక్షాన నిలచింది. కుప్పం కూడా అందుకు అతీతం కాక ఇందిరా కాంగ్రేసుకు చెందిన బి.ఆర్.దొరస్వామి నాయున్ని శాసనసభకు ఎన్నుకున్నది. అయితే 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనతో కుప్పంలో కాంగ్రేసు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి