వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 03వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతీయ రైల్వేలు భారత ప్రభుత్వ విభాగము. భారత దేశంలో రైల్వేలు మొదటిసారిగా 1853లో ప్రవేశపెట్టబడ్డాయి. 1947 (స్వతంత్రం వచ్చే) నాటికి దేశంలో మొత్తం 42 రైల్వే సంస్థలు నెలకొల్పబడి వున్నాయి. 1951లో ఈ సంస్థలన్నింటినీ కలుపుకొని భారత రైల్వే, ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థలలో ఒకటిగా ఆవిర్బవించింది. భారత రైల్వే దూర ప్రయాణాలకు మరియు నగరాలలో దగ్గరి ప్రయాణాలకు (సబర్బన్ (suburban) అనగా పట్టణపు పొలిమేరల వరకు) అవసరమైన రైళ్ళను నడుపుతోంది.

రైలు మార్గాలు భారతదేశపు నలుమూలలా విస్తరించి వున్నాయి. భారతీయ రైలు మార్గాలపై ప్రభుత్వానికి ఏకఛ్ఛత్రాధిపత్యం ఉంది. భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైలు మార్గాలలో ఒకటి. రైలు మార్గాలు మొత్తం దూరం సుమారుగా 1,14,500 కి.మీ. ఇది సుమారు 65,000 కి.మీ రూటుపై వుంది మరియు 7,500 స్టేషన్లు వున్నాయి. 2011 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వాగన్లు 69,000 కోచ్‌లు, 9,000 ఇంజిన్లు వున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను కలిగి వున్న సంస్థలలొ భారతీయ రైల్వేది (సుమారు పదనాలుగు లక్షలు) ద్వితీయ స్థానము.

భారతీయ రైల్వే కంప్యూటరీకరణలో అన్నిటిలో ప్రథమ స్థానంలో వుంది. ముందస్తుగా ప్రయాణం ఖరారు చేసుకునేందుకు మరియు మార్పులు చేసుకునేందుకు సౌకర్యం అందిస్తోంది. ఈ విభాగాన్ని భారతీయ రైల్వే ఆహార నిర్వహణ మరియు పర్యాటక సంస్థ నిర్వహిస్తుంది. ఇది భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ కింద పని చేస్తూ భారత రైల్వే రవాణా వ్యవస్థను నిర్వహిస్తూ ఉంటుంది. రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర రైల్వే మంత్రి (కేబినెట్ హోదా) నిర్వహణలో ఉండే రైల్వే విభాగం, రైల్వే బోర్డు కింద పని చేస్తుంది. దీనిని పరిపాలనా సౌలభ్యం కోసం 17 జోన్లుగా విభజించారు. ఇంకా…