వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 39వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సితార (సినిమా)
సితార, పూర్ణోదయా మూవీస్ పతాకంపై వంశీ దర్శకత్వంలో, సుమన్, భానుప్రియ, శరత్ బాబు, శుభలేఖ సుధాకర్ ప్రధానపాత్రల్లో నటించిన 1984 నాటి తెలుగు చలనచిత్రం. ఒకప్పుడు గొప్పగా వెలిగి ఆరిపోయిన రాజాస్థానాలలో ఒక ఆస్థాన యజమాని చెల్లెలు సితార (భానుప్రియ). ఆమెను గొప్ప జమీందారుకు ఇచ్చి పెళ్ళి చేయాలని అనుకుంటాడు ఆమె అన్న. ఆ సంస్థానానికి పగటి వేషగాళ్ళుగా వచ్చిన వారిలో ఒక వ్యక్తిని (సుమన్) ప్రేమిస్తుంది సితార. కాని అతడితో పెళ్ళి మాత్రం సాధ్యపడదు. తదనంతర కాలంలో ఆమె గొప్ప నటి అవుతుంది. ఆఖరున ఆమెను అతడు కలవడంతో కథ సుఖాంతమవుతుంది. మంచు పల్లకి సినిమా ద్వారా తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమైన వంశీ రెండో సినిమా ఇది. భానుప్రియ ఈ సినిమా ద్వారానే నాయికగా పరిచయమైంది. వంశీ తాను రాసుకున్న మహల్లో కోకిల అనే నవలను కొద్దిపాటి మార్పులతో రూపొందించిన సితార ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకుంది. వెన్నెల్లో గోదారి అందం పాటకు గాను ఎస్. జానకికి ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం లభించింది. ఈ సినిమా విజయం వంశీ కెరీర్ ని కూడా నిలబెట్టింది. పాటలు గొప్పగా తీస్తాడన్న పేరు వచ్చింది. ఇళయరాజాతో వంశీ పనిచేసిన తొలిచిత్రం ఇది. ఈ సినిమాతో వారిద్దరి అనుబంధం బలపడి ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించారు. వంశీ-ఇళయరాజా కాంబినేషన్లో అన్వేషణ, లేడీస్ టైలర్, ఏప్రిల్ 1 విడుదల మొదలైన 11 సినిమాలు వచ్చాయి. ఎన్నో పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. గోదావరి పట్ల వంశీకి ఉన్నమక్కువ టైటిల్స్ నుంచి చాలా చోట్ల కనిపిస్తుంది. అలాగే పాటల చిత్రీకరణలో వంశీ మార్కును చూడవచ్చు.
(ఇంకా…)