వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 27వ వారం
సుమేరు నాగరికత |
---|
సుమేరు నాగరికత తామ్ర శిలా యుగం, మొదటి కంచు యుగ కాలాల్లో, సుమారు క్రీ.పూ. 5–6 సహస్రాబ్దుల్లో, దక్షిణ మిసొపొటేమ్యా (ఆధునిక దక్షిణ-మధ్య ఇరాక్) ప్రాంతములో మొదలైంది. ఇది మెసొపొటేమియాలోని నాగరికతల్లో మొదటిది. సింధూ నాగరికత, ప్రాచీన ఈజిప్టు, ఈలము, ప్రాచీన చైనా, కారలు నాగరికత, ఒల్మెక్ నాగరికతలతో పాటు ప్రపంచంలోని మొట్టమొదటి నాగరికతలలో ఇది కూడా ఒకటి. టైగ్రిసూ, యూఫ్రెటీసు లోయలలో నివసించిన సుమేరు రైతులు ధాన్యం, ఇతర పంటలను విస్తారంగా సాగుచేసారు. ఆ పంట మిగులు వారు పట్టణావాసాలు ఏర్పరిచేందుకు దోహదపడింది. క్రీ.పూ 3000 నాటికీ ఆదిలేఖన పద్ధతులు ఈ నాగరికతలో కనిపిస్తాయి. ఈ నాగరికత యొక్క అత్యంత పురాతన రచనలు ఉరుక్, జెమ్డెట్ నస్ఱ్ నగరాలలో లభించాయి. ఇవీ క్రీ.పూ 3500–3000 నాటివి. సుమేరు అనే పదాన్ని ఆంగ్లములో సూమర్ అని పలకబడుతుండగా, భారతీయ ఆంగ్ల ఉచ్చారణలో సుమేరుగా పలుకబడుతోంది. ఐతే ఉత్తర ఆఫ్రికాలోని అలనాటి పచ్చటి సహారాలో నివసించిన వారే మధ్యప్రాచ్యములోని సుమేరుకు వలస వచ్చి అక్కడ వ్యవసాయాన్ని వ్యాపింపజేసారని మరికొందరి పరిశోధకుల వాదన. కానీ వ్యవసాయము మొదట ఫెర్టైల్ క్రిసెంట్‌లోమొదలైందని బలమైన ఆధారాలున్నందున ఈ పరికల్పనకు పెద్దగా మద్దతు లభించలేదు. ప్రత్యేకించి సుమేరులను గూర్చి చెప్పనప్పటికీ, 2016లో లజరిడిస్ బృందము మధ్యప్రాచ్యములోని సెమిట సంస్కృతి మొదలవ్వడానికి ముందు నివసించిన వారిలో, ముఖ్యంగా నటూఫుల్లో, కొంత ఉత్తర ఆఫ్రికా సంతతి ఉందని ప్రతాపాదించారు.
|