వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2025 23వ వారం
సాగర సంగమం |
---|
సాగరసంగమం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 1983 జూన్ 3 న విడుదలైన తెలుగు సినిమా. కమల్ హాసన్, జయప్రద ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాను పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఇందులో గాయని ఎస్.పి.శైలజ, శరత్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను వేటూరి సుందరరామ్మూర్తి రచించాడు. ఇందులో కమల్ హాసన్ ఓ శాస్త్రీయ నృత్యకారుడి పాత్రను పోషించాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. తమిళంలో సలంగై ఒలి (మువ్వల సవ్వడి అని అర్థం) అనే పేరుతో, మలయాళంలో సాగర సంగమం అనే పేరుతో విడుదలైంది. తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళంలో 30 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ, హైదరాబాదు నగరాల్లో సిల్వర్ జూబిలీని పూర్తి చేసుకుంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది. ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలు, ఆరు నంది పురస్కారాలు గెలుచుకుంది. 1984లో ముంబైలో జరిగిన పదవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు ఎంపికైంది. అదే సంవత్సరం రష్యాలో జరిగిన తాష్కెంట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది. స్పానిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ చోటు దక్కించుకుంది. రష్యాలో అత్యధిక ప్రింట్లతో విడుదలై, రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు సినిమాగా కూడా నిలిచింది. నృత్యంలోనే సుఖాన్ని, దుఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఒక నిస్వార్ధ కళాకారుని కథ ఇది.
|