వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2026 05వ వారం
| ఎక్రీషన్ |
|---|
ఎక్రీషన్ అంటే పదార్థ కణాలు ఒకదానితో ఒకటి చేరి గురుత్వాకర్షణతో మరిన్ని కణాలను చేర్చుకుంటూ పెద్ద వస్తువుగా తయారయ్యే ప్రక్రియ. ఈ కణాలు సాధారణంగా వాయు పదార్థ కణాలై ఉంటాయి. గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాల వంటి చాలా ఖగోళ వస్తువులు ఎక్రీషన్ ప్రక్రియ ద్వారానే ఏర్పడతాయి. భూమి వంటి రాతి గ్రహాలు ఉల్క పదార్థం నుండి ఎక్రీషన్ ద్వారా ఏర్పడ్డాయనే మోడల్‌ను 1944లో ఒట్టో ష్మిత్ ప్రతిపాదించాడు. ఆ తర్వాత విలియం మెక్‌క్రియా (1960) ప్రోటోప్లానెట్ సిద్ధాంతాన్ని, చివరిగా మైఖేల్ వూల్ఫ్సన్ సంగ్రహ సిద్ధాంతాన్నీ ప్రతిపాదించారు. 1978లో, ఆండ్రూ ప్రెంటిస్ గ్రహాల నిర్మాణం గురించిన ప్రారంభ లాప్లాసియన్ ఆలోచనలను పునరుజ్జీవింపజేసాడు. ఆధునిక లాప్లాసియన్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. ఈ నమూనాలు ఏవీ పూర్తిగా విజయవంతం కాలేదు. అనేక ప్రతిపాదిత సిద్ధాంతాలు వివరణాత్మకమైనవి. ఒట్టో ష్మిత్ 1944 లో చెప్పిన ఎక్రీషన్ మోడల్‌ను 1969లో విక్టర్ సఫ్రోనోవ్ పరిమాణాత్మకంగా అభివృద్ధి చేశాడు. అతను రాతి గ్రహాల నిర్మాణంలో ఉన్న వివిధ దశలను వివరంగా లెక్కించాడు. అప్పటి నుండి, గ్రహాణువుల (ప్లానెటిసిమల్) సంచితాన్ని అధ్యయనం చేయడానికి, ఇంటెన్సివ్ న్యూమరికల్ సిమ్యులేషన్‌లను ఉపయోగించి ఈ మోడల్‌ను మరింత అభివృద్ధి చేసారు. ఇంటర్స్టెల్లార్ గ్యాస్ యొక్క గురుత్వాకర్షణ పతనం ద్వారా నక్షత్రాలు ఏర్పడతాయని ఇప్పుడు అందరూ అంగీకరించిన సంగతే. కూలిపోవడానికి ముందు, ఈ వాయువు ఎక్కువగా ఓరియన్ నెబ్యులా వంటి అణు మేఘాల రూపంలో ఉంటుంది.
|
