వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2026 14వ వారం
| ఆహార పటిష్టత |
|---|
ఆహార పదార్థాలకు పోషకాలను చేర్చడాన్ని పటిష్టీకరణం (ఫోర్టిఫికేషన్) అంటారు. ఆహారాన్ని పటిష్టం చేయడం అంటే ఆహార పదార్థాలకు సూక్ష్మపోషకాలను (ట్రేస్ ఎలిమెంట్స్), విటమిన్లు కలపడం. ఆహారాన్ని సుసంపన్నం చేయడం అంటే ప్రాసెసింగ్ సమయంలో కోల్పోయిన పోషకాలను తిరిగి చేర్చడం, అయితే పటిష్టం చేయడంలో సహజంగా లేని పోషకాలను కలపడం జరుగుతుంది. 1920ల నుండి, పోషక లోపాలను నివారించడానికి ఆహార తయారీదారులు, ప్రభుత్వాలు ఈ పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. ఒక ప్రాంతంలో పోషక లోపాలు తరచుగా నేల పరిస్థితులు లేదా స్థానిక ప్రధాన ఆహారాల పరిమితుల వల్ల ఏర్పడుతాయి. ముఖ్యమైన ఆహారాలు, మసాలా దినుసులకు సూక్ష్మపోషకాలను జోడించడం వల్ల పెద్ద ఎత్తున వచ్చే పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులను నివారించవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ప్రపంచవ్యాప్తంగా పోషక లోపాలను తగ్గించడానికి ఆహార పటిష్టత (Food Fortification) ను కీలకమైన ప్రక్రియగా గుర్తించాయి. ఆహార, వ్యవసాయ సంస్థ ధాన్యాలు, పాల ఉత్పత్తులు, కొవ్వులు, నూనెలు, అనుబంధ ఆహార పదార్థాలు, తేయాకు, ఇతర పానీయాలు, శిశువుల ఆహారంతో సహా అనేక ఆహార పదార్థాలను పటిష్టం చేస్తోంది. పోషకాహార లోపం, ముఖ్యంగా సూక్ష్మపోషకాల లోపాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 3 నుండి 5 మిలియన్ల మంది మరణిస్తున్నారని అంచనా. ఈ ఆహార పటిష్టత ప్రక్రియ పోషక ఆహార లోపం తగ్గించడంలో, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఈ పటిష్టీకరణ అనేది స్వచ్ఛందంగా లేదా చట్టపరంగా జరగవచ్చు. ఏదైనా ఆహార ఉత్పత్తిని బలోపేతం చేయడానికి ముందు, ఆహార సంస్థలు అది ఆరోగ్యానికి మేలు చేస్తుందా, సురక్షితమైనదా, సమర్థవంతమైన పద్ధతిలో పోషకాలను అందిస్తుందా అని నిరూపించాలి. అలాగే, అన్ని ఆహార లేబులింగ్ నిబంధనలను పాటించాలి. ఆహార అభివృద్ధిదారులు ఈ కొత్త ఉత్పతుల కయే ఖర్చులు, అంగడి (మార్కెట్)లో దానికి ఎంత గిరాకీ ఉంటుందో కూడా పరిగణించాలి.
|
