వికీపీడియా:ఏకవచన ప్రయోగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సహాయం పేజీలు | స్వాగతం  ·   తెలుగులో రచనలు చెయ్యడం  ·   5 నిమిషాల్లో వికీ  ·   పాఠం  ·   గైడు  ·   పదకోశం  ·   సహాయం  ·   సహాయ కేంద్రం  ·   ప్రశ్నలు  ·   వీడియో పాఠాలు

తెలుగు వికీపీడియాలో ఏకవచన ప్రయోగం ఏ విధంగా సమర్థనీయమో ఈ వ్యాసం తెలియజేస్తుంది. ఈ వ్యాసం సహాయం పేజీలలో భాగం.

వికీపీడియాలో శ్రీ, గారు, వచ్చారు, వెళ్ళారు, చెప్పారు, అన్నారు వంటి గౌరవ వాచకాలు వాడరాదు. విజ్ఞాన సర్వస్వం శైలికి ఏకవచన ప్రయోగమే తగినది. దానికి కారణాలేంటో పరిశీలిద్దాం.

ఏకవచనం ఎందుకు?[మార్చు]

  • సాధారణంగా వ్యవహారాలలో, వార్తాపత్రికలలో సమకాలీన వ్యక్తులను ఉద్దేశించేటపుడు గారు, విచ్చేశారు, ఆవిడ గారు వచ్చేశారు వంటి గౌరవార్ధక బహువచనం ప్రయోగించడం చూస్తూ ఉంటాం. కానీ వెనుకటి తరాలవారి గురించి రాసేటపుడు మాత్రం ఏకవచన ప్రయోగమే జరుగుతూ ఉంటుంది. రాము'డు' రావణుని చంపి సీతను తెచ్చా'డు' . పోతన భాగవతం రాశాడు అని వ్యహరిస్తారు గాని, రాముడు గారు రావణుని చంపి సీత గారిని తెచ్చారు అని, పోతన గారు భాగవతం రాశారు అనే ప్రయోగాలు కనిపించవు.
  • నిన్నటి వారైన శ్రీశ్రీ, చలం, ఆరుద్ర, ఎన్టీ రామారావు వంటి వారిని కూడా ఏకపచన ప్రయోగంతోనే ఉదహరిస్తాం.
  • కేవలం జీవించి ఉన్న వ్యక్తులకే ఈ గౌరవ వాచకాలను ప్రయోగిస్తున్నట్టు గమనించగలం.
  • సజీవ వ్యక్తుల గురించి రాసేటప్పుడు బహువచన ప్రయోగం చేయాలని కొందరు సూచించారు. ఉదాహరణకు ఒక ప్రముఖ వ్యక్తి గురించి నేడు వ్యాసంలో బహువచన ప్రయోగం ఉపయోగించి రాస్తాం. ఆ తరువాత వారానికి ఆ వ్యక్తి గతించాడనుకుంటే అప్పుడు వ్యాసంలోని బహువచన ప్రయోగాలను ఏకవచనాలుగా మార్చాలా? మార్చితే ఎంతకాలం తర్వాత మార్చాలి. ఇలా కొన్ని వ్యాసాలలో బహువచన ప్రయోగం, కొన్ని వ్యాసాల్లో ఏకవచన ప్రయోగం విజ్ఞాన సర్వస్వం యొక్క ప్రామాణికతను దెబ్బతీస్తుంది.
  • విజ్ఞాన సర్వస్వాలు కాలాతీతాలు. శైలికి సంబంధించినంత వరకు వీటికి ప్రాచీన, ఆధునిక, మధ్య యుగ భేదాలు లేవు. కాబట్టి వికీపీడియాలో బహువచన ప్రయోగం తగదు.
  • తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వాన్ని సంకలనం చేసిన కొమర్రాజు లక్ష్మణరావు అందులో ఏకవచన ప్రయోగాన్నే వాడాడు. [1]ఆ పుస్తకంలోని ఒక పేజీని కింద చూడండి.
ఇది కొమర్రాజు వెంకట లక్ష్మణరావు సంపాదకత్వం వహించిన తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వం, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వంలో గురజాడ అప్పారావు పై కొంపెల్ల జనార్ధనరావు రాసిన వ్యాసం నుండి ఒక పేరా. దీనిని మీరే స్వయంగా ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని నిర్ధారించుకోవచ్చు [1]

మరి వార్తాపత్రికలలో బహువచన ప్రయోగం చేస్తారు కదా[మార్చు]

  • వార్తాపత్రికలలో చాలావరకు ప్రామాణిక భాషను ఉపయోగించినప్పటికీ అవి కాలాతీతాలు కావు కాబట్టి వార్తాపత్రికలు పైన ఉదహరించిన సమస్యల నెదుర్కొనవు. వార్తాపత్రికలలోనూ గతించిన కాలానికి చెందిన వ్యక్తులను ఏకవచన ప్రయోగంతో ఉదహరిస్తారు.

ఏకవచన ప్రయోగం అగౌరవం కాదా?[మార్చు]

  • మహాపురుషునిగా గౌరవించే రామునికి, యేసుకు ఏకవచనం ప్రయోగిస్తే అగౌరవం కానిది, సమకాలీన వ్యక్తులకు ప్రయోగిస్తే మాత్రం ఎందుకౌతుంది, కాదు.

స్త్రీలను ఏకవచనంలో ఉదహరిస్తే అమర్యాదగా ధ్వనిస్తుంది కదా[మార్చు]

వికీపీడియా వ్యాసాల్లో ఒక సారూప్యత ఉండాలి. ఏకవచనం పురుషులకెంత మర్యాదగా ఉంటుందో స్త్రీలకూ అంతే మర్యాదగా ఉంటుంది.ఉదాహరణకు కింది వాక్యాలు చూడండి.

  • ..సీత తన భర్తవెంట అయోధ్యకు వచ్చింది.
  • ..ప్రముఖ నటి సావిత్రి 1937 డిసెంబర్ 6 న కొమ్మారెడ్డి గురవయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించింది.

వీటిలో అమర్యాద ధ్వనించిందని అనలేము. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన విజ్ఞాన సర్వస్వం ఐదవ భాగంలో ఒక పేజీని కింద చూడండి.


సమకాలీన నోబెల్ బహుమతి గ్రహీత్రి అయిన టోనీ మారిసన్ పై తెలుగు విశ్వవిద్యాలయము ప్రచురించిన విజ్ఞానసర్వస్వం ఐదవ భాగమైన విశ్వసాహితి నుండి గ్రహించినది

మూలాలు[మార్చు]

  1. "ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం రెండవ భాగంలో గురజాడ అప్పారావు పై కొంపెల్ల జనార్ధనరావు రాసిన వ్యాసంలో చివరిపేజీ". కాశీనాధుని నాగేశ్వరరావు. 1938. Retrieved 2021-12-31.