వికీపీడియా:మరణించిన వికీపీడియన్లకు శ్రద్ధాంజలి/Bhaskaranaidu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భాస్కరనాయుడు

వికీపీడియాలో కృషి అంటే, ప్రతిఫలాపేక్ష లేని సేవ. రోజులు నెలలు సంవత్సరాల తరబడి కృషి చేసినా, వాడుకరికి లభించే ధన కనక వస్తు వాహనాలేమీ‌ ఉండవు. అయినా, ఏళ్ళ తరబడి అలాంటి నిస్వార్థమైన కృషి చెయ్యాలంటే తాదాత్మ్యత, దీక్ష వంటివి వంటబట్టించుకుని ఉండాలి.

అలాంటి తపోదీక్షను ఆవహించుకోబట్టే, భాస్కరనాయుడు గారు దాదాపు రెండు లక్షల దిద్దుబాట్లు ఒక్క తెవికీ లోనే చెయ్యగలిగారు. సగటున సంవత్సరానికి దాదాపు 20 వేల దిద్దుబాట్లు చేసారు.

భాస్కరనాయుడు గారు, ప్రభుత్వ ఉద్యోగం నుండి విరమించాక వికీ కృషి మొదలుపెట్టి వికీపీడియా, వికీసోర్స్, విక్షనరీల్లో ప్రశంసనీయమైన కృషి చేసారు. 2012 ఏప్రిల్ 16 న వాడుకరి:Bhaskaranaidu గా తన కృషిని మొదలుపెట్టి, పది సంవత్సరాల పాటు నిర్విరామ కృషి చేసారు. భౌగోళికాంశాలు, తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలు, చరిత్ర వంటి అంశాలపై ఆయన ప్రత్యేకమైన కృషి చేసారు. గ్రామాల పేజీల్లో సమాచారం చేర్చే ప్రాజెక్టులో భాగంగా కొన్ని వేల పేజీల్లో సమాచారం చేర్చారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలపై వ్యాసాలు రాసారు.

కామన్సులో ఆయన ఎక్కించిన వీడియో ఒకటి, మీడియా ఆఫ్ ది డే గా అక్కడ ఎంపికవడం ఆయన వికీ ప్రస్థానంలో ఒక మైలురాయి. అది ఆయన వికీ కిరీటంలో కలికితురాయి. తెలుగు వికీ సహచరులందరికీ అది గర్వకారణం. దీనిపై తెవికీలో ఆయనకు అందిన అభినందనలు చూడండి.

తెవికీలోనైనా, విక్షనరీ, వికీసోర్సులలోనైనా అదే దీక్షతో పని చేసారాయన. ఆయన చూపిన అంకిత భావం, వికీ పురోభివృద్ధికి ఎంతగానో ఉపకరించింది. తోటి వాడుకరులకు స్ఫూర్తి నిచ్చే కృషి ఆయనది. చర్చల ద్వారా వాడుకరుల మధ్య సమన్వయం సాధించేందుకు కృషి చేసారాయన. పంజాబ్ గ్రామాల పేజీల్లో దొర్లుతున్న తప్పులను ఎత్తిచూపి వాటిని సరిదిద్దేందుకు చేసిన చర్చ దానికి ఉదాహరణ. దానికి సంబంధించిన చర్చను పాత రచ్చబండ చర్చల్లో ఇక్కడ, ఇక్కడా చూడవచ్చు.

వికీలో తాను చేసిన కృషికి గానూ, తోటి వాడుకరుల నుండి అనేకమార్లు ప్రశంసలు అందుకున్నారు. గండపెండేరం, 2013 కొలరావి పురస్కారం, 2015 లో ట్రెయిన్ ది ట్రెయినర్ బార్న్‌స్టార్, అవిశ్రాంత కృషీవలుడి పతకం వీటిలో కొన్ని.


వివిధ వికీ ప్రాజెక్టుల్లో భాస్కరనాయుడు గారి స్థూల గణాంకాలు
క్ర.సం ప్రాజెక్టు దిద్దుబాట్ల సంఖ్య
1 తెలుగు వికీపీడియా 2,16,613
2 తెలుగు విక్షనరీ 1,14,882
3 తెలుగు వికీసోర్స్ 38,877
4 వికీమీడియా కామన్స్ 2,838

2022 జూలై 23 న చివరి దిద్దుబాటు చేసిన భాస్కరనాయుడు గారు, 2022 సెప్టెంబరు 10 న మరణించారు. వారి కుమారుడు, గోకుల్ గారి ద్వారా ఈ దుర్వార్త, ప్రణయ్‌రాజ్ గారికి, తద్వారా ఇతర వికీపీడియన్లకు చేరింది. తెలుగు వికీపీడియా సముదాయం వారికి శ్రద్ధాంజలి ఘటిస్తోంది.[1]

శ్రద్ధాంజలి, నివాళి[మార్చు]

  • జీవిత చారమాంకం వరకు కూడా నిరంతరం వెలిగే భాస్కరుడిలాగా ఈ వికీభాస్కరుడు తెవికీకి చేసిన సేవ అపూర్వం.. అమోఘం.. వారికి సద్గతులు కలగాలని శోకాతప్త హృదయంతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.-అభిలాష్ మ్యాడం (చర్చ) 11:19, 11 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • 2012 నుండి ఒక దశాబ్దం పాటు తెవికీ అభివృద్ధికి భాస్కరనాయుడు గారు చేసిన సేవలు అపూర్వమైనవి. దశాబ్ద కాలంపాటు అలుపెరుగక నిరంత కృషితో అనేక వ్యాసాలను చేర్చి తెవికీ ప్రగతికి పాటుపడటమే కాక, తెవికీలో పుస్తకాలు, జానపద కళారూపాల వ్యాసాలతో పాటు పల్లెవాసుల జీవన విధానం వంటి విశేష వ్యాసాలను కూడా చేర్చి తెవికీ అభివృద్ధికి ముఖ్య భూమిక పోషించారు. విక్షనరీలో కూడా విశేషకృషి చేసారు. వికీసోర్సులో విశేష కృషిచేసారు. అతని మరణం తెవికీకి తీరలి లోటు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.➤ కె.వెంకటరమణచర్చ 14:06, 11 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • బాస్కరనాయుడు గారు తెవికీకి పెద్దదిక్కు లాంటి వారు.ఆ లోటు తీర్చలేనిది.వారు తెవికీకి చేసిన సేవలు మరువరానివి.వారికి సద్గతి కలగాలని కోరుతూ, శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 03:53, 12 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • భాస్కరనాయుడు గారు 75 ఏళ్ళ వయసులో దాదాపు 10 సంవత్సరాలపాటు వికీపీడియాకు, విక్షనరీ, వికీసోర్స్ లలో తన విలువైన సేవలు అందించారు. రాష్ట్ర, జాతీయస్థాయి సదస్సులలో తెలుగు వికీపీడియా తరపున పాల్గొని తెవికీ ప్రగతిని ఇతర భాషా వికీపీడియన్లకు తెలియజేశారు. కొత్తవారికి వికీపీడియాలో శిక్షణనందిస్తూ, యువ వికీ రచయితలకు ప్రోత్సాహాన్ని, తెలుగుపై అవగాహన కలిగిస్తుండేవారు. ఆయనతో 9 ఏళ్ళ అనుబంధం నాది. చాలా ఆక్టీవ్ గా ఉండేవారు. 2012 నుండి 2016 వరకు ప్రతినెలా హైదరాబాదు, అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో జరిగిన తెలుగు వికీపీడియా నెలవారి సమావేశాలకు క్రమం తప్పకుండా వచ్చేవారు. వికీలో నాకు స్ఫూర్తినిచ్చినవారిలో భాస్కరనాయుడు గారు ఒకరు. ప్రారంభంలో తెవికీ రచనపై నాకు మార్గనిర్ధేశకం చేశారు. ప్రతిఒక్కరితో సఖ్యతగా నడుచుకునేవారు. తనకన్నా చిన్నవారితో కూడా గౌరవవచనంతోనే మాట్లాడేవారు. ఛండీగడ్, కలకత్తా, బెంగళూరు, తిరుపతి, హైదరాబాదులలో జరిగిన వికీ సదస్సులలో ఆయనతో కలిసి పాల్గొన్నాను. మంచి స్నేహితుడిని, స్పూర్తిని ఇచ్చే వ్యక్తిని కోల్పోయ్యాను. నివాళి సర్.--Pranayraj1985 (చర్చ) 04:45, 12 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • కోట్ల మంది తెలుగు వారు ఉన్నా, వికీలాంటి ప్రాజెక్టులో నిస్వార్థంగా దీర్ఘకాలం పాటు సేవచేసిన కొద్దిమందిలో భాస్కర్ నాయుడు గారు ఒకరు. వారి కృషికి నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. -రవిచంద్ర (చర్చ) 05:17, 12 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • భాస్కరనాయుడు గారు నేను వికీ లో ఖాతా ప్రారంభం చేయగానే స్వాగతం పలికారు. నా వాడుకరి పేజీ కూడా వారు ప్రారంభించారు. వికీ తోలి పరిచయం చేశారు. ఆయా నాపేజీలను నేను ఓపెన్ చేసిన వారి పేరు కనిపిస్తుంది. నా పెదాలా పైన చిరునవ్వు ఇప్పుడు ఓపెన్ చేసిన వారి పేరు కనిపిస్తుంది కానీ వారు లేరు అని ఒక క్షణం మనసు గుర్తు చేస్తూ... వారికి నా శ్రద్ధాంజలి. ప్రభాకర్ గౌడ్చర్చ 05:26, 12 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • తెవికీలో విశేషమైన కృషిచేసిన భాస్కరనాయుడు గారికి నా శ్రద్ధాంజలి. __చదువరి (చర్చరచనలు) 06:00, 12 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేను బహుశా 2011లేదా అంతకు ముందు వీకి లో రచనలు ప్రారంభించాను,2011లో హైద్రాబాద్ తెవికి సమావేశం లో మొదటి సారి కలిసాను. చాలా కలుపుగోలు మనిషి. చాలా రచనలు చేసాడు. అతని మరణం తెవికి తీరని లోటు. వారికి నా శ్రద్ధాంజలి...... పాలగిరి
  • భాస్కరనాయుడు గారు తెలుగు వికీపీడియాలో సుదీర్ఘకాలం పాటు కృషిచేసిన వాడుకరుల్లో ఒకరు. ఆయన ఏ పని తీసుకున్నా పట్టుదలతో పూర్తిచేయడానికే చూసేవారు. వికీపీడియాలోనే కాకుండా సోదర ప్రాజెక్టులన్నిటా పనిచేసేవారు. ఆయనకు నా నివాళి. --పవన్ సంతోష్ (చర్చ) 07:17, 12 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేను తెలుగు వికీపీడియా ముఖ్యంగా విక్షనరీ పరిచయం చేసేటప్పుడు ఒక వ్యకి తలచుకొంటే ఎంత కృషి చేయగలరో ఉదాహరణ గా భాస్కరనాయుడు గారి కృషిని వివరిస్తాను, మంచి స్నేహితుడిని, స్పూర్తి ని ఇచ్చే వ్యక్తి ని కోల్పోయ్యాను.నివాళి సర్: Kasyap (చర్చ) 10:23, 12 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
    • భాస్కరనాయుడు గార్ని కోల్పోవడం చాలా బాధాకరం. వీరు వికీపీడియాలో మొదలుకొని, విక్షనరీ, వికీసోర్సు మరియు కామన్స్ లో విశేషమైన కృషిచేశారు. వికీపీడియా వ్యాసాలలో ముఖ్యంగా గ్రామాల వ్యాసాలలో భారతీయత కనిపించాలని తపించేవారు. భారతీయ గ్రామజీవనం మీద ఒక పెద్ద వ్యాసాన్ని విశేషంగా బొమ్మలతో రచించారు. తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాల గురించిన వ్యాసాలలో స్వంతంగా కెమెరాతో బొమ్మలను తీసి చేర్చేవారు. విక్షనరీ ప్రాధాన్యతను గుర్తించి, ఒక పూర్తి నిఘంటువు లోని ఆని పదాలకు తెలుగు-ఇంగ్లీషు అర్ధాలతో బాటు ఆరు నెలను శ్రమించి పూర్తిచేశారు. పంజాబ్ ఎడిటథాన్ లో పాల్గొని తెలుగు వికిపీడియా జాతీయస్థాయిలో మొదటి బహుమతి పొందడంలో కృషిచేశారు. కామన్స్ లో కొన్ని వందల బొమ్మలను స్వయంగా తీసి అప్లోడ్ చేశారు. పోటీలలలో కూడా చురుకుగా పాల్గొన్నారు. తెలుగు మరియు ఆంగ్ల వికీసోర్సులో కొన్ని పుస్తకాలను ఒక్కచేతితో పూర్తిచేశారు. హంపీ విజయనగరం గురించి ఫ్రెంచి అనువాదాన్ని తెలుగులోకి రచించిన దేశాభిమాని. ఇది వికీబుక్స్ లో అందుబాటులో ఉనంది. కోవిడ్ కాలంలో తనకు సరిగా కనిపించకపోయినా, తను చెప్పెది ఇతరులకు అర్ధం కాకపోయినా వికీలో పనిచేసిన (స్వార్ధరహితంగా) మహోన్నతమైన వ్యక్తి... వారి జ్ఞపకార్ధం ఒక కార్యక్రమం చేయడం మన కనీస బాధ్యత. ఈ కార్యక్రమం ఒక్క వికీపీడియాలోనే కాకుండా విక్షనరీ, వికీసోర్సు, కామన్స్ లలో కూడా చేస్తే బాగుంటుంది. వారి కుటుంబానికి, ముఖ్యంగా సతీమణికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వికీ నిబంధనల ఉల్లంఘన జరిగినా వీరి గురించి ఒక వ్యాసం తెలుగు వికిపీడియాలో ఉంటే బాగుంటుంది. అందులో వీరి కృషిని సమగ్రంగా చేర్చే అవకాశం వుంటుంది. Rajasekhar1961 (చర్చ) 11:45, 22 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

లింకులు[మార్చు]

  1. ఈనాడు, హైదరాబాదు. "తెలుగు వికీపీడియన్‌ ఎల్లంకి భాస్కరనాయుడి కన్నుమూత". EENADU. Archived from the original on 2022-09-12. Retrieved 2022-09-12.