వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/కులాలకు సంబంధించిన అంశాలలో ప్రత్యేక జాగ్రత్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చర్య ఏమీ తీసుకోలేదు

చర్చ కొనసాగనందున ప్రతిపాదనను ఆపేసాం

కింది చర్చ ముగిసింది. ఇక దానిలో మార్పుచేర్పులు చెయ్యకండి. ఇకపై చెయ్యదలచిన వ్యాఖ్యానాలను సముచితమైన చర్చ పేజీలో చెయ్యాలి.

నేపథ్యం[మార్చు]

తటస్థత, మౌలిక పరిశోధనలు నిషిద్ధం, నిర్ధారత్వం వంటి ప్రధానమైన విధానాలు ప్రతీ వికీపీడియా వ్యాసానికి తప్పనిసరిగా వర్తిస్తాయి. భారతీయ చట్టాలు, సామాజిక నేపథ్యం పరిశీలించినప్పుడు కులాలకు సంబంధించిన అంశాల్లో వీటిని మరింత ఖచ్చితంగా, ప్రత్యేక శ్రద్ధతో అమలుచేయాలని తెలుస్తోంది. ఇందుకు గాను తెలుగు వికీపీడియాలో పలు కులాలకు సంబంధించిన వ్యాసాలపైనా, రాజవంశాలకు సంబంధించిన వ్యాసాల్లో కులం అన్న అంశంపైనా ఎడతెగని దాడులు జరుగుతూండడం మరింత గట్టి నేపథ్యాన్ని కల్పిస్తోంది. ఈ అంశంలో సామాజికంగా ఉన్న సమస్యలు, సున్నితత్వాలు, దాడి-ప్రతిదాడులు తెలుగు వికీపీడియా పైనా తమ ప్రతికూల ప్రభావం చూపకుండేలా ఈ పాలసీ ఉపకరిస్తుంది.

అంశాలు[మార్చు]

1. కులాల వ్యాసాల్లో కానీ, కులానికి చెందినవారు, కులస్తులు - వంటి పదాలతో కానీ ఎక్కడైనా మార్పుచేర్పులు జరుగుతున్నట్టైతే ఒక ఎడిట్ థ్రాటిల్ భద్రపరిచేముందు హెచ్చరిక ఇచ్చేలా పెట్టాలి. ఆ హెచ్చరికలో ఈ పాలసీ పేజీకి లంకెతో పాటు తటస్థత, మౌలిక పరిశోధన నిషిద్ధం, నిర్ధారత్వం పాలసీలకు కూడా లింకు వచ్చేలా, ఇదొక ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్న సున్నితమైన అంశం అనీ, ఆ పాలసీలకు భంగం కలిగిస్తే సాధారణం కన్నా తీవ్రమైన చర్యలుంటాయని తెలిసేలా పాఠ్యం ఉండాలి. అప్పటికీ వారు ముందుకువెళ్తే వెళ్ళవచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం వ్యక్తిగతంగా ఘనతలు కల్పించే ఆలంకారిక పదజాలంపై థ్రాటిల్ ఉన్నట్టు. దీనివల్ల వాడుకరులకు హెచ్చరికే కాకుండా నిర్వాహకులు, ఇతర వాడుకరులకు దీన్ని గుర్తించే వీలు ఉంటుంది.

2. ఈ వ్యాసాల్లో నమ్మదగ్గ మూలాలు మూలాలను ప్రస్తావించకుండా మూలాలు లేని వాక్యాలు రాస్తే వాటిని {{fact}} తగిలించి వదలరాదు, తొలగించాలి. నమ్మదగ్గ మూలాలను ప్రస్తావిస్తూ రాస్తేనే ఉంచాలి.

3. కులాల వ్యాసాల రూపకల్పన నేపథ్యంలో కుల చరిత్రలు నమ్మదగ్గ మూలాలు కాదు. వీటి పాక్షికత సందేహాస్పదం. ప్రత్యేకించి వివాదాస్పదమైన అంశాల విషయమై వీటిని స్వీకరించరాదు. ఇతర అంశాల్లో తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఫలానా పుస్తకంలో ఫలానా రచయిత ఇలా ప్రస్తావించాడని పాఠ్యంలో వచ్చేట్టుగా రాయాలి తప్ప కేవలం మూలంగా ఇచ్చి ఊరుకోరాదు. అలా కాకుండా వ్యాసంలో సాధారణాంశంగా రాయవలిసివస్తే తప్పనిసరిగా ఆ రచయిత ఆ సామాజిక శాస్త్ర అంశంపై ప్రామాణిక రచయిత అయివుండాలి, పుస్తకం ప్రామాణిక గ్రంథమని నిరూపణ అయితే మరీ మంచిది.

3.1 ప్రామాణికతను నిర్ధారించడానికి పాఠ్యపుస్తకాల్లో వారి గ్రంథాలను ఆధార గ్రంథాలుగా తీసుకోవడం, ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు నెలకొల్పిన అవార్డులు ఆ పుస్తకానికి రావడం, విశ్వవిద్యాలయ డాక్టరేట్ కానీ, ఎం.ఫిల్ కానీ అందుకోవడం, ఆ రచనను ఆ అంశంలో ప్రామాణిక పాఠ్య గ్రంథంగా విశ్వవిద్యాలయాలు, బోర్డులు నిర్ణయించడం, సోదర సమీక్ష (peer-review) ఉండే జర్నల్స్ లో ప్రచురితం కావడం వంటి అకడమిక్ ధోరణులు అనుసరించాలి. ఇవి కన్జర్వేటివ్ పద్ధతులు కావచ్చు. కానీ ఈ అంశంపై కన్జర్వేటివ్ అప్రోచ్ తీసుకోవడం తప్పనిసరి.

4. కులాల పేర్ల విషయంలో ప్రభుత్వ గెజిట్లలో, పత్రాలలో, జీవోల్లో వాడుతున్న భాషే వాడాలి. కొన్ని కులాల సాధారణ నామాలను సామాజిక వ్యవస్థలో అవమానకరంగా ఉపయోగించి వాటిని అరగదీయడం వల్ల ఆ పేర్లను వినియోగించడంలో ఉద్దేశించకుండానే తటస్థత భంగమైపోతుందన్న సున్నితమైన సమస్య దీనికి ప్రాతిపదిక.

5. వ్యక్తుల జీవిత చరిత్రల్లో కులాన్ని ప్రత్యేకించి విస్మరించాల్సిన అవసరం లేదు. తగిన మూలం ఉంటే ప్రస్తావించవచ్చు. అయితే కులం వల్లనే ఫలానా ఫలానా జరిగిందన్న అంశాలు రాయాల్సివస్తే తప్పకుండా నమ్మదగ్గ మూలం నుంచి తీసుకుని రాయాలి. అలానే వారి పేర్లను వారు ఎలా రాసుకునేవారన్నదాని ప్రకారం కానీ, అన్నిటికన్నా మెరుగైన పద్ధతి జన వ్యవహారంలో ఎలా ఉందన్నదాని ప్రకారం కానీ రాయాలి తప్ప ఉద్దేశపూర్వకంగా జనప్రయోగంలో లేని కులసూచకాలు తగిలించడం తగదు.

6. కులాల వ్యాసాల్లో ప్రస్తుతం ఉన్న సామెతలు మరీ అసభ్యంగా లేనట్టైతే తొలగించాల్సిన అవసరం లేదు. అయితే ఈ సామెతల విభాగంలో "ప్రతీ కులంపైనా ఉన్నట్టే ఫలానా వారిపైనా సామెతలు ఉన్నాయి. పూర్వం నుంచీ జనం నోళ్ళలో నానుతున్న ఈ సామెతల్లో సాధారణీకరణ కనిపిస్తుంది. క్రమేపీ సమాజంలోని స్థితిగతుల మార్పు వల్ల ఇవి ప్రాసంగికత కోల్పోతున్నాయి. " వంటివి చేర్చాలి. ఇది తటస్థతను దెబ్బతీయకుండానే ఆ అంశంపైన సమగ్రమైన సమాచారాన్ని చేర్చడానికి ఉపకరిస్తుంది.

7. ఉద్దేశపూర్వకంగా ఒక కులానికి సంబంధించి తటస్థతను దెబ్బతీసే పాక్షికమైన సమాచారాన్ని చేరుస్తూ పోయే వాడుకరుల మీద ఒకే ఒక హెచ్చరిక ఇచ్చి నిరోధించవచ్చు. ఈ అంశంపై సాక్ పప్పెట్ల దాడి కూడా మిగతా వ్యాసాలతో పోలిస్తే హెచ్చు మోతాదులో జరుగుతుందన్న సంగతి కూడా ఇక్కడ గమనార్హం.

8. కులాల వ్యాసాలన్నిటినీ నమోదైన వాడుకరులు మాత్రమే దిద్దుబాట్లు చేయగలిగేలా ముందుజాగ్రత్తగా సంరక్షించాలి.

చర్చ[మార్చు]

  • ప్రతిపాదన: కులాల వ్యాసాలను కొన్నాళ్ళ నుంచీ గమనిస్తూ ఉండడం, వాటిలోని మార్పుచేర్పుల మీద పారా కాస్తూండడం వల్ల ఆంగ్లంలోని బయోగ్రఫీస్ ఆఫ్ లివింగ్ పర్సన్స్ తరహాలో ప్రత్యేక పాలసీ రూపొందించుకుని దీన్ని పర్యవేక్షించాల్సి ఉందన్న అభిప్రాయానికి వచ్చాను. బయటి వాతావరణంతో పోలిస్తే ఇంకా ఈ సమస్య పూర్తి రూపం మన తెవికీలో కనిపించడం లేదు. అయినా మనకు ఇదొక సమస్యగా తయారైంది. ఈ సమస్య పూర్తి రూపాన్ని చూపించేలోగానే మనం పాలసీ రూపకల్పన చేసి, చర్యలు చేపట్టడం సమయోచితమైన తెలివిడి అని నమ్ముతూ ఈ పాలసీని ప్రతిపాదిస్తున్నాను. వాడుకరులు, ప్రత్యేకించి నిర్వాహకులు, దీనిపై చర్చించేప్పుడు పాయింటు సంఖ్యను ప్రస్తావిస్తూ తమ సూచనలు తెలియజేయగలరు. ధన్యవాదాలు --పవన్ సంతోష్ (చర్చ) 13:07, 25 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి[మార్చు]

ఈ విషయమై నా అభిప్రాయాలు కింద రాస్తున్నాను. వీటిలో కొన్ని ఛాందసంగా అనిపించవచ్చు. అవి పొలిటికల్లీ కరెక్ట్ కాకపోవచ్చు. కానీ నా అభిప్రాయాలవి.. కాబట్టి చెబుతాను.

  • అభ్యుదయ వాదులకు కులప్రసక్తి నచ్చదు. నాకు కులమే లేదు, ఇతరుల కులాన్ని నేను పట్టించుకోను అని వారు అనవచ్చు. నేను ఆ అభిప్రాయాన్ని మనసా వాచా గౌరవిస్తాను. అయితే నా అభిప్రాయం ఇందుకు భిన్నంగా ఉంది: కులం అనేది ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ -మతం లాగానే. కులం అంటరాని విషయమేమీ కాదు. వికీపీడియా వ్యాసాల్లో మత ప్రసక్తి ఉంటుంది. సమాచారపెట్టెల్లో మతం అనేది ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. కులం అనేది ఇతర దేశాల్లో లేదు కాబట్టి అది సమాచారపెట్టెల్లోకి రాలేదు, లేకపోతే వచ్చి ఉండేదే! కాబట్టి వ్యాసాల్లో కులప్రసక్తి రావడం తప్పేమీ కాదు. అలాగని సమాచారపెట్టెల్లో కులం ఉండాలని నా భావం కాదు. ఆయితే కులప్రసక్తి ఇష్టం లేని వారి గురించిన వ్యాసం రాస్తోంటే, సదరు వ్యాసాల్లో ఆ ప్రసక్తి రాకుండా చూసుకోవాలి. ఉదాహరణకు సి.ఎల్.ఎన్.గాంధి గారు. ఆయన తన కులాన్ని చెప్పుకోలేదు. ఆయన గురించి రాసిన వ్యాసంలో ఆయన కులం పేరు తీసుకురావడం ఆయనకు అవమానకరం. కొందరు కాలక్రమంలో కులాన్ని, దాన్ని సూచించే పేర్లనూ త్యజించారు. ఉదాహరణకు త్రిపురనేని రామస్వామి గారు. ఆయన గురించి రాసిన వ్యాసంలో ఆ విషయాన్ని స్పష్టంగా రాయవచ్చు.
  • అయితే కుల దురభిమానం తప్పు. దాన్ని వికీలో కనబడనీయకూడదు. కృష్ణదేవరాయలు మా కులపోడే, కాకతీయులు మా కులపోళ్ళే,.. లాంటి రాతలను - విశ్వసనీయమైన ఆధారా ల్లేకపోతే - క్షమించకూడదు. నిర్దాక్షిణ్యంగా ఉండాలి ఇలాంటి విషయాల్లో.

ఇక, పైన ప్రతిపాదించిన అంశాల పట్ల (ఈ అంశాన్ని చర్చకు తెచ్చినందుకు పవన్ గారికి ధన్యవాదాలతో) నా అభిప్రాయాలు ఇక్కడ రాస్తున్నాను. (ఆ అంశాల సంఖ్యలను, నంబర్డ్ బులెట్ల నుంచి హార్డ్‌కీయ్డ్ నంబర్లకు మార్చాను, తేలిగ్గా రిఫరు చేసేందుకు)

1. నాకు సమ్మతమే. అలా చెయ్యవచ్చు, చెయ్యాలి. హెచ్చరించాలి, ట్యాగు చెయ్యాలి.

2. రెండు స్థాయిలు ఉండేలా చూద్దాం. ఏ స్థాయి మామూలో, ఏది తీవ్రమైనదో వాడుకరి నిర్ధారించుకోవాలి.

    • మామూలు స్థాయి: కులప్రసక్తి గమనింపు కోసం వేరే మూస తయారు చేసుకుందాం. ఆ మూసను ట్రాన్స్‌క్లూడు చేసిన వ్యాసాన్ని "తగిన మూలాలు లేని కులప్రసక్తి కలిగిన వ్యాసాలు" అనో మరోటో.. వర్గం లోకి చేరుద్దాం.
    • తీవ్ర స్థాయి: సదరు వాక్యాలను తక్షణమే తొలగించాలి. తొలగించిన వాక్యాలను చర్చా పేజీలోకి చేర్చాలి.

3. నాకు సమ్మతమే.

3.1 నాకు సమ్మతమే

4. ఫలానా కులానికి సంబంధించిన వ్యాసంలో "ఈ కులాన్ని గతంలో "మరో ఫలానా" అని పిలిచేవారు. అయితే ఇది ప్రస్తుతం వాడుకలో లేదు. ఈ కులాన్ని ఈ పదంతో వ్యవహరించడం ప్రస్తుతం అవమానకరంగా భావించబడుతోంది." అని రాయవచ్చు అని నా ఉద్దేశం.

5. బలమైన సమ్మతి తెలియజేస్తున్నాను.

6. నాకు సమ్మతమే. అలాంటి సూచనను తెలియజేసే మూస ఒకదాన్ని తయారుచేసుకుందాం. అ మూస వాడితే సరిపోతుంది.

7. ఒకసారి ఈ చర్చ తరువాత నియమాలను తయారు చేసుకున్న తరువాత, ఆయా నియమాలను ఒక హెచ్చరిక తరువాత రెండోసారి అతిక్రమించే వారిపై చర్య తీసుకోవచ్చు. హెచ్చరికకు కూడా ఒక మూస తయారు చేసుకుని దాని ద్వారానే హెచ్చరించాలి.

8. నాకు సమ్మతమే.

పవన్ సంతోష్[మార్చు]

పై అంశాలు ప్రతిపాదిస్తున్నప్పుడు మరచిపోయి వదిలిపెట్టిన మరో అంశాన్ని ఇప్పుడు చర్చకు పెడుతున్నాను:

9. కులాలకు చెందిన ప్రముఖుల జాబితాలు ఉన్నాయి. వీటిలో ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా తోచిన పేర్లు రాసుకుంటూ పోవడం కనిపిస్తుంది. తోచిన పేర్లు రాసుకుంటూ పోతే కొందరు బాగా ముఖ్యులైన వారి పేర్ల మధ్య అంతగా ముఖ్యులు కానివారి పేర్లు చేరతాయి. చివరికి తటస్థత దెబ్బతింటుంది. కాబట్టి వీటికి అంటూ ప్రాతిపదికలు ఉండాలి. ఉదాహరణకు బ్రాహ్మణుల జాబితాలో రచయితలు మరియు కవులు అన్న విభాగంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం, చాణక్యుడు, డి.ఆర్.బెంద్రే, మాస్తి వేంకటేశ అయ్యంగార్, రవీంద్రనాథ్ టాగూర్ పేర్లున్నాయి. వీటికి మధ్య సామాన్యమైన ప్రాతిపదిక ఏమీ లేదు. జ్ఞానపీఠ్ పురస్కారం, నోబెల్ బహుమతి, తెలుగులో సాహిత్య అకాడమీ పురస్కారం, ఆపైన సాహిత్యోద్యమ నాయకత్వం వంటివి ప్రాతిపదికగా తీసుకుంటే మంచి జాబితా ఏర్పడుతుంది.

ఈ అంశంపైనా తోటి సభ్యులు సూచించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 16:50, 27 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చాపేజీకి తరలింపు గురించి[మార్చు]

అంశాలు మాత్రమే ఈ ప్రాజెక్టు పేజీలో ఉంచి సభ్యుల అభిప్రాయాలను చర్చాపేజీకి తరలించి చర్చ / అభిప్రాయాలు అక్కడే కొనసాగిస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:54, 27 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పైన వ్రాసేటప్పుడు అంతగా గమనించలేను. ఇది ప్రాజెక్టు పేజీ అయిననూ రచ్చబండకు ఉపపేజీగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా చర్చ కొనసాగించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:02, 27 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:C.Chandra Kanth Rao గారూ, కొత్త పద్ధతిలో ప్రయత్నిస్తున్నానండీ. ఇది ఇక ఒక ఆర్కైవుగా ఇక్కడే ఉండిపోతుంది ఏ నిర్ణయం జరిగినా. పాలసీ ఆమోదం పొందితే పై భాగాన్ని పాలసీ పేజీలోనూ, కింది చర్చా భాగాన్ని ఆ పాలసీ చర్చలోనూ కూడా చేరుస్తాం. --పవన్ సంతోష్ (చర్చ) 03:30, 28 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.