వికీపీడియా చర్చ:రచ్చబండ/పాత చర్చ 12

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


తెవికీలో వ్యాసాలు ఎవరైనా రాయవచ్చు, ఎడిట్ చేయవచ్చు. ఎవరిగురించయినా, దేని గురించయినా తమకు తెలిసిన సమాచారాన్ని చేర్చవచ్చు. తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. చర్చ లో తమ అభిప్రాయాలను ప్రకటించవచ్చు. ఇదీ తెవికీ గురించి నేను అనుకుంటున్నది.

అందుకే పట్రాయని సంగీతరావు అనే పేరుతో పరిచయవ్యాసాలు ఉన్నాయేమోనని వెతికాను. ఏవీలేవు. అలాగే పట్రాయని సీతరామశాస్త్రిగారి గురించి విస్తరించవలసిన వ్యాసంగా ఉండడం చూసాను. అందువలన పట్రాయని సీతారామశాస్త్రిగారి గురించి పొద్దు పత్రికలో నేను రాసిన వ్యాసాన్ని ఆయన పేరు మీద ఉన్న వ్యాసంలో లింక్ గా ఇచ్చి పొందు పరిచాను. ఆతరువాత పట్రాయని వంశంలోని ప్రముఖుల గురించి నా పట్రాయని బ్లాగులో ఉన్న సమాచారం ఆధారంగా సంగీతరావుగారి గురించి మా ఇంట్లో లభించిన అనేక ఆధారాలతోను, మా మామగారే కావడం వలన నాకు ఆయన ద్వారా ప్రత్యక్షంగా సేకరించి , సంపాదించి రూపొందించిన విశేషాలతో రాసిన వ్యాసం, సమగ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో తెవీకీ లో చేర్చాను. తద్వారా తెలుగు ప్రముఖులుగా ఇరవై సంవత్సరాలు సినీరంగానికి, ఆతర్వాత ముప్ఫయి ఐదు సంవత్సరాలపాటు కూచిపూడి ఆర్ట్ ఎకాడమీ ద్వారా కూచిపూడినాట్యానికి, తెలుగు సాంస్కృతిక రంగానికి సేవచేసి 90 సంవత్సరాల వృద్ధాప్యంలో విశ్రాంతి పొందుతున్న సంగీతరావుగారి గురించి తెలుగువారు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని భావించాను. కానీ ఆ వ్యాసం గురించి ”ఈ వ్యాసం ప్రచారంలాగే నాకూ అనిపిస్తోంది. బ్లాగులో ఉన్న సమాచారమే ఇక్కడ చేర్చబడినది. తెవికీ వ్యాసాలలో బ్లాగు మూలాలను చేర్చడం బాగుండదు.” అని ఉండడం చూసినప్పుడు మనసుకి కష్టంగా అనిపించింది. సంగీతరావుగారు ఆ రంగంలో ఎంతో ప్రసిద్ధులు, ఎందరో ప్రముఖులకు సుపరిచితులు. వారిగురించి ప్రచారం చేసుకోవలసిన అవసరం, అగత్యం ఎవరికీలేదు.( కాకపోతే బ్లాగు స్వంతదారునుంచి వివరణకావాలి, అప్పుడే ఈ వ్యాసానికి ప్రామాణికత ఉంటుంది అని అర్థం వచ్చేలా సూచనగా చెప్పవలసింది)

మరొక విషయం - వయసులోను అనుభవంలోను పెద్దవారు, అంతేకాక తమ జీవితకాలంలో ఎంతో ప్రతిభను ప్రదర్శించిన గొప్పవారిని ఏకవచనంలో సంబోధించడం అన్న విషయాన్ని మీరు సమర్థించుకుంటున్న తీరు చాలా అసమంజసంగా ఉంది. దేవుడు గొప్పవాడు మనకన్నా పెద్దవాడు కదా మరి దేవురు అనకుండా దేవుడు అని ఎందుకనాలీ అని చిన్నపిల్లలు తరచు వేసే ప్రశ్నలా ఉంది. మీరు పదిమంది నిర్వాహకులు తీసుకొనే నిర్ణయంలాగా కాకుండా . ఈ విషయాన్ని మరికాస్త విస్తృతంగా చర్చించి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. “మా నాన్నగారి గురించి అగౌరవంగా ఉన్న ఈ వ్యాసం నాకు ఆమోదయోగ్యంకాదు దాన్ని తీసేయండి” అని సంగీతరావుగారి అబ్బాయి గోపాలకృష్ణగారు దానిని తొలగించడానికి ప్రయత్నం చేస్తే ఆయనపై నిరోధం విధించడం చాలా అప్రజాస్వామిక చర్యగా నాకు తోచింది.

“రచనలను ఒక క్రమపద్ధతిలో, చదవడానికి చక్కగా వీలయ్యే విధంగా రాయడానికి అవసరమైన మార్గదర్శకాల సమాహారమే ఈ శైలి మాన్యువల్‌. కింది నియమాలు చివరి మాటేమీ కాదు. ఒక పద్ధతి ఇతర పద్ధతి లాగే బాగుండవచ్చు, కానీ అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తే, వికీపీడియా చదవడానికి సులభంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యను గమనిద్దాం: ఇటువంటి నియమాలు, నియంత్రణలు మరీ మొండిగా అమలు పరచేందుకు కాదు. అవి మన పనులను సులభతరం చేయటానికే. వాటి అమలు విషయంలో కాస్త పట్టూ విడుపూ ఉండాలి. రచన ఎలా అందంగా తీర్చి దిద్దాము అనేదానికంటే, అది ఎంత స్పష్టంగా, సమాచార సహితంగా, పక్షపాత రహితంగా ఉంది అనేది ముఖ్యం. రచయితలు ఈ నియమాలేవీ పాటించవలసిన అవసరం లేదు.”

వికీలో రచనల కోసం అవలంబించవలసిన శైలి గురించి మీరు అక్కడ పేర్కొన్నట్టుగానే ఏకవచన విషయంలో కొంచెం పట్టువిడుపులు పాటిస్తే బావుంటుందని నా అభిప్రాయం. ఇంగ్లీషుభాషలో ఈ ఇబ్బందిలేదు కనుక తెలుగుకు సంబంధించిన చర్చతప్పక జరగాలి. అలాగే తమిళం ఇతర సోదరభాషలకు సంబంధించిన వికిపీడియాలలో ఏవిధమైన విధానాన్ని అనుసరిస్తున్నారో, హిందీ లో ఎలా ఉందో తప్పకుండా మనం తెలుసుకోవాలి. మన పెద్దలను గౌరవించడం అంటే మన సంస్కృతిని గౌరవించడం అనీ, తద్వారా మనని మనం గౌరవించుకోవడం అని నేను నమ్ముతాను.

పై కారణాల వలన నేను పట్రాయని సంగీతరావుగారి గురించి తెవీకీలో ఉంచిన వ్యాసంలో ఏకవచనప్రయోగంతో చేసిన మార్పులను నేను అంగీకరించలేను. దయచేసి ఆ వ్యాసాన్ని తెవికీనుంచి తొలగించండి.

తెవికీలో ఎవరైననూ ఎవరిగురించి అయిననూ, దేని గురించి అయిననూ సభ్యులకు తెలిసిన సమాచారం చేర్చవచ్చు ఇది నిజమే. కాని సభ్యుల అభిప్రాయాలు మాత్రం వ్యాసంలో చెప్పరాదు. చర్చలో మాత్రం అభిప్రాయం చెప్పవచ్చు ఇదీ నిజమే. మీరు పట్రాయని సంగీతరావుగారి, పట్రాయని సీతారామశాస్త్రిగారి వ్యాసాలను తెవికీలో చేర్చడం సంతోషదాయకమే. చర్చాపేజీలలో లేవనెత్తిన "ప్రచారం" అనే పదం వ్యాసానికి ఉద్దేశించినది కాదు అది బ్లాగుకు ఉద్దేశించినది. విజ్ఞానసర్వస్వానికి బ్లాగు మూలం చేర్చడం బాగుండదు అనడంలో పొరపాటులేదు. అసలు బ్లాగులే ప్రామాణికం కానప్పుడు బ్లాగు స్వంతదారుల నుంచి కూడా వివరణ అవసరం లేదు. మూలం చేర్చాలంటే ప్రామాణిక గ్రంథాలకు కొదువలేదు. పేరుపొందిన వ్యక్తి వ్యాసానికి ఎలాంటి ప్రామాణిక గ్రంథాలను కాకుండా కేవలం ఒక బ్లాగు మూలం చేర్చడం న్యాయం కాదు. అది ఆ వ్యక్తికి సంబంధించినదైనా, కుటుంబ సభ్యులకు సంబంధించినదైనా సరే. ఒక వ్యాసానికి ఎన్ని ప్రామాణిక గ్రంథాల మూలాలు ఉంటే ఆ వ్యాసం అంత ప్రామాణికమైనదిగా భావించబడుతుంది. తెవికీ ఉన్నదే వ్యాసాలు వ్రాయడానికి అలాంటప్పుడు వ్యాసాలు వ్రాస్తే ప్రచారం కిందికి వస్తుందని ఎవరూ చెప్పరు, అలా అర్థం చేసుకోవడమే శోచనీయం. అందుకేగా సమాచారం తొలిగించిననూ మళ్ళీ యధాతథం చేశాము.
ఇక ఏకవచనం సంబోధించడం అన్నది తెవికీ నియమం (వ్యాసాలలో మాత్రమే చర్చా పేజీలలో కాదు). తెవికీలో తెవికీ నియమాన్ని సమర్థించుకోకుండా ఎలా ఉంటాము. ఇన్నేళ్ళ తెవికీలో దేశాధినేతలు, వివిధ రంగాలలో పేరుపొందిన అధినేతలు, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన జాతీయ నాయకులు, పరిశోధకులు, శాస్తవేత్తలు ఇలా ఎందరెండరో ప్రముఖుల వ్యాసాలు ఏకవచనంతో ఉన్నప్పుడు మీకు సంబంధించిన వ్యక్తుల వ్యాసాలలో కూడా అదే పాలసీ ఉపయోగించడం మాత్రమే మీకు నచ్చడం లేదు. ఇక్కడ ఎవరినీ కించపర్చడం లేదు కాని ఏకవచనాన్ని అంతగా అసహజమని అనుకోవడం బాగుండదు. పెద్దవారైనా, చిన్నవారైనా, గొప్పవారైనా, మామూలు వారైనా తెవికీలో అంతా సమానమే.
ఇక్కడ కొత్త సభ్యుడైనా, అనుభవమున్న సభ్యుడైనా రచనలన్నీ తెవికీ నియమాల ప్రకారమే చేయాల్సి ఉంటుంది. అలా కానిచో వెంటనే నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఏమైనా అభ్యతరం ఉంటే చర్చా పేజీలలో తెలియజేయాలి. ఎలాంటి కారణం తెలుపనిదే వ్యాసాలలోని సమాచారం పూర్తిగా తొలిగించినందున గోపాలకృష్ణ గారిపై రాజశేఖర్ గారు వారం రోజులు నిరోధం విధించారు. మీరన్నట్లు గోపాలకృష్ణ "తొలిగించడానికి ప్రయత్నం" చేయలేరు. ఏకంగా పేజీలోని మొత్తం సమాచారమే తొలిగించారు. ఎలాంటి ముందస్తు చర్చ లేకుండా వ్యాస సమాచారాన్ని తొలిగించడం వాండలిజం కిందికి వస్తుంది. అంతేకాకుండా గోపాలకృష్ణ గారు ఎవరన్నది నిర్వాహకులకు ఎలా తెలుసు. తెవికీలో రోజూ ఎందరో కొత్త సభ్యులు, లాగిన్ కాకుండా మార్పులు చేసే అజ్ఞాతసభ్యులు ఉన్నవ్యాసాలను మార్పు చేయడం, సమాచారం తొలిగించడం, అసభ్యకరమైన సమాచారం చేర్చడం, తప్పుడు సమాచారం చేర్చడం, వారి సొంత విషయాలు వ్రాసుకోవడం తదితరాలు చేస్తుంటారు. నిర్వహణలో భాగంగా సభ్యులపై చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సందేశం లేకుండా పేజీలోని మొత్తం సమాచారం తొలిగించిననూ ఎలాంటి చర్య తీసుకోకుండా ఉంటేనే ప్రజాస్వామ్యమని వారిపై ఎలాంటి చర్య తీసుకోరాదని అనుకుంటే ఇదివరకు తెవికీ మొత్తం చెత్తతో నిండిపోయేది.
తెవికీలో ఎవరూ ఏది చేర్చిననూ లైసెన్సు ఒప్పుకొన్నట్లు అంగీకరించి మాత్రమే సమాచారం చేర్చాలి (పుటను భద్రపరుచు కిందనే ఈ విషయం ఉంటుంది). అట్టి సమాచారం నిబంధనలు ఉల్లంఘించనంతవరకు ఎవరు ఏ విధమైననూ మార్పు చేర్పులు చేయవచ్చు. అంతేకాని సమాచారం చేర్చిన తర్వాత ఆ వ్యాసాన్ని తొలిగించాలని అనడం బాగుండదు. ఇక్కడ ఏదేని సమాచారం చేర్చిన వెంటనే సార్వజనీనం అయిపోతుంది. అలాంటప్పుడు రచయితలకు వ్యాసంపై, తాము చేర్చిన సమాచారంపై ఎలాంటి హక్కు ఉండదు. అంతేకాకుండా తెవికీ నిబంధనలకు విరుద్ధంగా ఉండే రచయితల ప్రత్యేక శైలి వ్యాసంలో అంగీకరించబడదు. అంతేకాకుండా మీరు హిందీ, తమిళ వికీలతో పోలుస్తున్నారు. తెవికీ నిబంధనలకు ఇతర వికీ నిబంధలకు పోలిక లేదు. వ్యాసాలలో ఏకవచనం వదిలితేనే పెద్దవాళ్ళకు గౌరవం ఇచ్చినట్లు చెప్పడం సమంజసం కాదు. (మీరు ఇలాంటి చర్చను సరాసరిగా రచ్చబండలో వ్రాయవచ్చు, దీనికి రచ్చబండ చర్చాపేజీ అవసరం లేదు) సి. చంద్ర కాంత రావు- చర్చ 20:41, 24 అక్టోబర్ 2011 (UTC)