విజయనగర సామ్రాజ్యంలో వస్త్రధారణ
విజయనగర సామ్రాజ్య కాలంలో వస్త్రధారణ పర్షియన్, దక్షిణ భారతీయ వస్త్రధారణ పద్ధతుల సమ్మేళనంగా నిలిచింది. రాజాస్థానంలో సేవకుల నుంచి చక్రవర్తి దాకా పైన బొత్తాలున్న అంగీ, నడుము కింద పంచె, తలపైన కుల్లాయి అనే ఒకరకమైన టోపీ ధరించేవారు. ఇది ఇస్లామీయకరణ అని పిలిచే సాంస్కృతిక ఇస్లాం ప్రభావం కారణంగా వచ్చి చేరిన వస్త్రధారణ. కొలువుకు సంబంధం లేని సందర్భాల్లో, ఆంతరంగిక, పూజా సమయాల్లో మాత్రం ఎంతటివారైనా హైందవ వస్త్రధారణ పద్ధతులను అనుసరించి పంచె, ఉత్తరీయం ధరించేవారు. సామాన్య ప్రజలు మాత్రం ఎప్పుడూ పైభాగం ఆచ్చాదన లేకుండా, కింది భాగంలో పంచె కానీ, గోచి కానీ వారి స్థాయి బట్టి కట్టుకునేవారు.
ఆనాటి దక్కన్ రాజకీయ స్థితిలో విజయనగరానికి పర్షియా, టర్కీ దేశాలతో దౌత్య, వ్యాపార సంబంధాలు ముఖ్యమైనవి. మధ్యప్రాచ్యం కేంద్రంగా ప్రపంచంలోని దూరతీరాలకు మతప్రసక్తి లేకుండా విస్తరిస్తున్న ఇస్లామీయ సంస్కృతిలో విజయనగరం కూడా భాగం పంచుకోవడంలో విజయనగర రాజాస్థాన వస్త్రధారణ తనవంతు సాయం చేసింది. విజయనగర సామ్రాజ్య కాలం నాటికి తీరాంధ్ర, కొచ్చిన్, సిలోన్ వంటి ప్రాంతాల్లో మహారాజు సైతం నడుము పైభాగాన్ని ఉత్తరీయానికి మించి మరే వస్త్రం లేకుండా అనాచ్ఛాదితంగా వదిలేయడమే ఉండేది. రాజాస్థానాల్లో అంగీ ధరించడం అన్నది మధ్యయుగాల నాటి దక్షిణ భారత హిందూ రాజ్యాల్లో ఒక అసాధారణమైన మార్పు.
దుస్తుల శైలి
[మార్చు]చక్రవర్తి, రాజాస్థానీకుల వస్త్రధారణ
[మార్చు]బొత్తాలు ఉన్న అంగీ, తలపైన కుళ్ళాయి (టోపీ లాంటిది), నడుము కింది భాగంలో పంచె అన్నవి విజయనగర సామ్రాజ్యకాలంలో పురుషులు, మరీముఖ్యంగా రాజాస్థాన పురుషుల దుస్తులు. అంగీ చేతులు కొంచెం బిగువుగా ఉండేవి. కొందరి అంగీలు పొడుగ్గా కింద మోకాళ్ళ వరకూ, మరికొందరివి నడుము వరకు మాత్రమే ఉండేది. చరిత్రకారుడు ఫిలిప్ బి. వాగనర్ దీన్ని పరిశీలిస్తూ ఆ పొడుగు, పొట్టి అంగీలు వారి వారి సామాజిక స్థాయిని సూచిస్తూ ఉండవచ్చనీ, పొట్టి అంగీలవారు సేవకులు కావచ్చనీ అభిప్రాయపడ్డాడు. అంగీ మెడ వెడల్పుగా, కప్పడానికి మడతపెట్టిన ఒక పట్టీతో ఉండేది. అంగీ ముందుభాగం తొడుక్కోవడానికి వీలుగా చీలివుండి, బొత్తాలతో ఉండేది. విజయనగర చక్రవర్తి ధరించే అంగీ పల్చగా ఉండేది. దాన్ని నూలు, పట్టు, జరీ ముడిగుడ్డలుగా వినియోగించి పనితనంతో నేసినదిగా విదేశీ యాత్రికులు గుర్తించారు. రాజు ధరించే అంగీ మేలైన రకం పట్టుతో ఉండడమే కాక జరీలో బంగారాన్ని విస్తారంగా వాడి వివిధ రూపాలను చిత్రించేవారని న్యూనిజ్ పేర్కొన్నాడు. ఇక మిగిలిన ఆస్థానీకులు, సాధారణ సేవకులు ధరించే అంగీలు వారి వారి స్థాయిలను బట్టి వివిధ నాణ్యతలు కలిగిన బట్టతో కుట్టేవారు.[1]
తలపై కిరీటాలు కాక అందరూ కుళ్ళాయి అని పిలిచే గుడ్డ టోపీ ధరించేవారు. వారి వారి స్థాయిని బట్టి దానికి జరీ పని ఉండేది. కింది స్థాయి ఆస్థానీకులు, సేవకులు తదితరులు ఏ జరీ లేని సామాన్యమైన కుళ్ళాయి ధరించేవారు.[1] శ్రీ కృష్ణదేవ రాయలు కుళ్ళాయి రెండు అడుగుల పొడవు ఉండేదనీ, రాణివాసాల్లో మసిలే మహిళలు ముత్యాలతో చేసిన దండలు అలంకరించిన కుళ్ళాయిలు ధరించేవారనీ విదేశీయాత్రికులు పేర్కొన్నారు.[2] పన్నుల సేకరణ, లెక్కలు రాసే కరణాలు బోడ కుల్లాలు (చిన్న కుల్లాయిలు), చింపి కుప్పసములు (కుప్పసములంటే అంగీలు) ధరించేవారని పరమయోగి విలాసమనే ద్విపద కావ్యంలో రాసివుంది.[3]
ఇలాంటి వస్త్రధారణ కేవలం కొలువుకు సంబంధించిన సందర్భాల్లోనే వాడేవారు. ఇంటిపట్టున ఉన్నప్పుడు, ఆంతరంగిక సందర్భాల్లోనూ మాత్రం అదే రాజపురుషులు పైపంచ తప్ప పైన ఏ ఆచ్ఛాదనా లేకుండా, నడుము కింద పంచెతో హైందవ సంప్రదాయాల్లో ఉండేవారు. దైవదర్శనార్థం ఆలయాలకు వెళ్ళినప్పుడు పైపంచ తీసి నడుముకు చుట్టుకుని, నడుము కింద పట్టుపంచె ధరించేవారు. దీనికి నిదర్శనగా తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో తన భార్యలతో ఉన్న కృష్ణదేవరాయల విగ్రహం కనిపిస్తుంది. అదే కృష్ణదేవరాయలు కొలువుదీరినప్పుడు అంగీ, పట్టుదట్టి, కుల్లాయి, పంచెలతో ఉండేవాడని హంపిలోని పలు విగ్రహాలు, విదేశీయుల రచనలు సాక్ష్యమిస్తున్నాయి.
సైనికుల దుస్తులు
[మార్చు]సైనికులు నానావిధాలైనవి, అత్యంత విలువ కలిగినవీ ఐన రంగురంగుల బట్టలు కడుతూ ఉండేవారు. ఐతే పట్టుచిక్కుండా ఉండే వ్యూహంతో కాల్బలం వాళ్ళు మాత్రం యుద్ధ సమయంలో శరీరానికి నూనెరాసుకుని కేవలం, చెడ్డీ తప్ప మరే దుస్తులూ లేకుండా ఉండేవారు.[3]
ఇతరుల వస్త్రధారణ
[మార్చు]పైన కబాయి లేక అంగీ ధరించడం, మొలధట్టి కట్టుకోవడం వంటివాటి వాడుక పరిమితమని ఆనాటి విదేశీ యాత్రికులంతా నమోదుచేశారు. ఇటాలియన్ యాత్రికుడు లుడోవికో డి వర్తెమా తన రచనలో ఈ అంగీధారణ అన్నది రాజాస్తానీకులను మినహాయించి ఇతరుల్లో కనిపించదని రాశాడు. సామాన్య పురుషులు పై భాగం ఏ ఆచ్ఛాదనా లేకుండా, మొల కింద నుంచి మాత్రం పంచె, మొలగుడ్డ వంటివి కట్టుకునేవారు.[1] వైద్యులు, వైష్ణవ బ్రాహ్మణులు ధోవతి, పచ్చడం (ఉత్తరీయం), మేదరవాళ్ళు పుట్టగోచి, మాలదాసరులు తోలు అంగీ, తోలు టోపీ ధరించేవారనీ ఆనాటి తెలుగు సాహిత్యాధారాలు చెప్తున్నాయి.[3]
దుస్తుల పరిశ్రమ
[మార్చు]విజయనగర కాలంలో దుస్తులను రూపొందించే నేత పరిశ్రమ అత్యంత ముఖ్యమైన పరిశ్రమల్లో ఒకటి. నూలు వడకడం, నేయడం, బట్టలు కుట్టడం, అమ్మడం అన్నవి దీనిలో ముఖ్యమైన దశలు. శూద్ర కులస్తుల్లో ఎక్కువమంది రాట్నాల మీద నూలు వడికేవారనీ, వాటిని సాలెలు నేసేవారనీ సురవరం ప్రతాపరెడ్డి రాశాడు. సాలెల్లో సాలె, పద్మసాలె, పటుసాలె, అగసాలె, వానె వంటి వివిధ శాఖలుండేవి. వారిలో పట్టువస్త్రాలు నేసేవారు పటుసాలెలు, వ్యాపారస్తులు వానెలు.[3]
రాజకీయ, సాంస్కృతిక ప్రభావాలు
[మార్చు]హైందవ వస్త్రధారణ పద్ధతులు
[మార్చు]హైందవ సంస్కృతిలో వస్త్రధారణ వెనుక నేపథ్యాన్ని వివరిస్తూ ఫిలిప్ బి వాగనర్ - "హైందవ ధర్మం ప్రకారం, శరీరం మానవుని అస్తిత్వంలో ఒక విడదీయరాని భాగం. మనిషి లోపలి గుణ స్వరూపానికి ఒక బాహ్య సంకేతం. ఈ సాంస్కృతిక సందర్భంలో దుస్తుల ప్రయోజనం శరీరాన్ని కప్పడం, అంటే దాచిపెట్టటం కాదు. దుస్తుల ప్రయోజనం శరీరాన్ని ప్రదర్శించడం, శరీరాకృతికి అనుగుణంగా చుట్టుకొని, శరీరాన్ని బహిరంగపరచటం అవుతుంది." అంటాడు.[2] అందుకు అనుగుణంగానే ఆ కాలానికి చెందిన మిగిలిన స్వతంత్ర దక్షిణ భారత హిందూ రాజ్యాలలో రాజాస్థానాలలో పూర్వపు హిందూ పద్ధతుల్లోనే వస్త్రధారణ సంప్రదాయాలు కొనసాగాయి. దాని ప్రకారం ఆస్థానికుల్లో పురుషులు, ఇతర సాధారణ వ్యక్తులు, చివరికి మహారాజు సైతం పైభాగాన్ని ఆచ్ఛాదన లేకుండా వదిలివేసి, నడుము కింది భాగంలో మాత్రం పంచెలు ధరించేవారు. ఆ పంచెల నాణ్యత, నేతలో భేదాలు ఉండేవి. ఈ పద్ధతి కాలికట్, కొచ్చిన్ మొదలుకొని కుయిలోన్, సిలోన్ (శ్రీలంక), మాల్దీవులు వంటి ఇతర దేశాల్లో కూడా ఉన్నట్టు విదేశీ ముస్లిం యాత్రికులు అబ్దుల్ రజాక్, మా హుఆన్ గమనించి రాసుకున్నారు.[1] అనాచ్ఛాదితమైన ఛాతీపై పడేలా అంగవస్త్రాన్ని వేసుకునేవారు. తలపైన రాజులు బంగారంతో చేసి రత్నాలు పొదిగిన కిరీటాలు, రాజాస్థానీకులు తలపాగాలు ధరించేవారు.[2]
తీరాంధ్ర ప్రాంతంలో విద్యాధికారిగా వెలుగొందిన శ్రీనాథుడు ప్రౌఢదేవరాయల ఆస్థానానికి వెళ్ళినప్పుడు "పెద్ద కూర్పాసాన్ని (అంగీ) తొడుక్కొని, కుల్లాయి తలకు ధరించడాన్ని" తప్పనిసరి అవస్థగా కన్నడ రాజ్యలక్ష్మికి మొరపెట్టుకోవడాన్ని బట్టి అతను పనిచేసిన రెడ్డిరాజులు, ఇతర తెలుగు రాజుల ఆస్థానాల్లోనూ ఈ ఆచారాలు లేవని తెలుస్తోంది.
ముస్లిం వస్త్రధారణ నేపథ్యం
[మార్చు]ఖురాన్‌లోనే శరీరాన్ని కప్పుకోవాల్సిన అవసరం కోసం దుస్తులు భగవంతుడు సృష్టించాడని చెప్పడంతో శరీరావయవాల సౌష్టవాన్ని కనిపించనివ్వకుండా వదులైన బట్టలతో శరీరాన్ని కప్పుకోవడం ముస్లింలకు ఒక ధార్మికమైన కర్తవ్యమైంది. శరీరాన్ని అనాచ్ఛాదితంగా ఉంచడం సిగ్గుచేటనీ, సౌష్టవం కూడా తెలియని విధమైన బట్టలతో కప్పుకోవడం మర్యాదకరమనీ ముస్లిం సంప్రదాయం.
సాంస్కృతిక ప్రభావం
[మార్చు]13-15 శతాబ్దాల నాటికి భారతదేశం ముస్లింల దండయాత్రలకే కాక విస్తృతమైన సాంస్కృతిక ప్రభావానికి కూడా లోనైంది. సిసిలీ మొదలుకొని ఇటువైపు భారతదేశం వరకూ విస్తృతమైన భూభాగం పర్షియా, టర్కీ దేశాల సాంస్కృతిక పరిధిలోకి వచ్చాయనీ చెప్తూ ఫిలిప్ బి వాగనర్ ఇస్లామీయకరణగా ప్రతిపాదించాడు. మతపరంగా స్వతంత్రంగా ఉంటూనే రాజకీయ, దౌత్య అవసరాల వల్ల, ఇస్లామీయ సంస్కృతిలోని అంశాలను స్వీకరించడం ద్వారా పర్షియా, టర్కీలు కేంద్రంగా ఉన్న విస్తృతమైన రాజకీయ అల్లికలో భాగం కాగలగడం దీనికి పునాదిగా నిలిచింది. మతరహితమైన సాంస్కృతిక ప్రభావం మెల్లమెల్లగా బలపడడంతో విజయనగర రాజాస్థానాల్లోకి తోటి హిందూ రాజాస్థానాల్లో లేని కుల్లాయిలు, అంగీలు వచ్చిచేరాయి.
దౌత్య, రాజకీయ కారణాలు
[మార్చు]దక్కన్‌లో తమకు చిరకాల ప్రత్యర్థులైన బహమనీ సుల్తానులు, వారి నుంచి చీలిపోయిన నాలుగు షాహీ వంశాలతో పోటీకి, పోరాటాలకు తట్టుకోవడానికి విజయనగర చక్రవర్తులు పర్షియా, టర్కీ, పోర్చుగీసు దేశస్థులతో దౌత్యానికి, వ్యాపారానికి చాలా ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ క్రమంలో ఇస్లాం ప్రపంచంలోని కీలక స్థానాల రాయబారులతోనూ, వ్యాపారులతోనూ విజయనగర చక్రవర్తులు సాగించిన దౌత్య, వ్యాపారాలు ఈ మార్పుకు దోహదం చేశాయి. దౌత్యవేత్తలకు, మంత్రులకు, కవులకు విజయనగర చక్రవర్తులు మేలిమి రకం కుల్లాయి, అంగీ బహుమతులుగా ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ప్రారంభించారు. ఇస్లాం సంస్కృతికి చెందిన దౌత్యవేత్తలు ఇతర హిందూ రాజుల వస్త్రధారణ అనాగరికంగా కనిపించేది. తమ తమ పుస్తకాల్లో "రాజుకీ బిచ్చగాడికీ తేడాలేద"నీ, "మనుషులూ, రాక్షసులూ కానివారిలా, పీడకలలు తెచ్చేట్లున్నార"నీ తీవ్రమైన వ్యాఖ్యలు నమోదుచేశారు. తిమూరిద్ సామ్రాజ్యపు దౌత్యవేత్త సమర్‌ఖండి విజయనగర చక్రవర్తిని మాత్రం "నగ్నంగా హిందువులా కాకుండా, మేలిమీ జేతూనీ పట్టుతో నేసిన అంగీ ధరించి శరీరాన్ని పద్ధతిగా కప్పుకుని వున్నాడని" వర్ణించి తన రాజుతో పోల్చదగ్గవాడనీ, ఉత్తముడనీ, సమర్థుడనీ పొగుడుతూ రాసుకున్నాడు. యుద్ధాల్లో బహమనీలను ఎదుర్కోవడానికి వారి అశ్వశక్తిని తట్టుకునే ఉత్తమ జాతి అశ్వాలను దిగుమతి చేసుకునేందుకూ విజయనగరానికి ఈ దౌత్యం, వ్యాపారం కీలకమైనవి.[3][నోట్స్ 1] ఒక దశలో విజయనగర సామ్రాజ్యం మధ్యప్రాచ్యం నుంచి ప్రతీ అశ్వాన్నీ తాను తప్ప మరే ఇతర ముస్లిం ప్రత్యర్థులు దిగుమతి చేసుకోలేని విధంగా విజయవంతమైన ఒప్పందాలు కుదుర్చుకోగలిగింది. హిందూ సంస్కృతిని విస్తృతమైన ఇస్లాం సంప్రదాయాలతో ఇలా అనుసంధానం చేసి దౌత్యపరమైన విజయాలు సాధించడంలో దుస్తులూ కీలకపాత్ర పోషించాయి.
నోట్స్
[మార్చు]- ↑
సింధురమహాశ్వముఖ్యము ల్చేర్చు దౌల
దీని వణిజులకూళ్ళు సద్గృహములు పురి
గొలుపుదేజంబు వెల మేలుగలుగ ప్రాత
వారిగా జేయు నరి నవి చేరకుండ.దూరతీరాల దీవులు, దేశాల నుంచి వర్తకులు ఏనుగులు, పెద్ద గుర్రాలను తీసుకువస్తారనీ, వారిని ఆదరించి, మంచి ఇళ్ళు ఇచ్చి, గ్రామాలిచ్చి, దర్శనమిచ్చి, మర్యాదలు చేయాలని, లేకుంటే వారు ఆ గుర్రాలు, ఏనుగులను శత్రురాజులకు అమ్ముతారనీ భావం వచ్చే ఈ పద్యాన్ని కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో రాసుకున్నాడు. ఈ నీతిని బాగా అనుసరించాడని ఆంధ్రుల సాంఘిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి రాశాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 ఫిలిప్ బి వాగనర్ 2010, p. 2.
- ↑ 2.0 2.1 2.2 ఫిలిప్ బి వాగనర్ 2010, p. 3.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 సురవరం, ప్రతాపరెడ్డి (1950). " 4 వ ప్రకరణము". ఆంధ్రుల సాంఘిక చరిత్ర. వికీసోర్స్.
ఆధార రచనలు
[మార్చు]- ఫిలిప్ బి వాగనర్ (1 July 2010). "రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం". ఈమాట. Retrieved 2 April 2019.
ఆంగ్లమూలం నుంచి మాధవ్ మాచవరం అనువదించిన వ్యాసం