విద్యాధర్ మునిపల్లె
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
విద్యాధర్ తెలుగు నాటక రచయితలలో ఒకరు. ఈయన 1981 జూలై 4న గుంటూరు పట్టణంలోని అరండల్‌పేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జన్మించారు. వీరు పద్మ, సూర్యనారాయణలకు తొలిసంతానం. సూర్యనారాయణ శ్రీగాయత్రీ విద్యామందిర్ అనే విద్యాసంస్థను స్థాపించి ఎందరో పేద విద్యార్థులకు ఉచిత విద్యాదానం చేశారు. తండ్రి వద్దనే ఏడవ తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. అప్పటి వరకూ ఇల్లే ప్రపంచమై తండ్రే అతనికి నాయకుడై ఆయననే అనుసరించిన విద్యాధర్ అతనికి తెలియకుండానే తండ్రిలోని కవిత్వరచనను ఆకళింపు చేసుకున్నారు. ఎనిమిదవ తరగతిలో ఆంధ్రజ్యోతి పత్రికలో విద్యాధర్ రాసిన తొలి కవిత కూ..కూ.. మని కోకిల అతనికి రచనలపట్ల మరింత ఆసక్తిని పెంచింది. అటుపై చిన్నచిన్న కథలు, కవితలు ఆయా పత్రికల్లో ప్రచురితమయ్యేవి.
విద్యాభ్యాసం[మార్చు]
విద్యాధర్ కి ఓనమాలు దిద్దించిన గురువు ఆయన తండ్రి సూర్యనారాయణ గురువుగారైన శ్రీ స్వయంపాకుల సూర్యనారాయణ. నిజానికి అతనికి నామకరణం చేసింది కూడా ఆయనే. అటుపై తండ్రి నెలకొల్పిన పాఠశాల శ్రీగాయత్రీ విద్యామందిర్‌లో విద్యాభ్యాసం మొదలుపెట్టారు. తండ్రి ఒడిలో కూర్చొని అక్షరాలు దిద్దుకున్నారు. ఆయన ఆఖరి మేనత్త రాధ వద్ద హిందీ నేర్చుకున్నారు. దక్షిణభారత హిందీ ప్రచార సభ వారు నిర్వహించే పరీక్షల్లో పాల్గొనాలని అనుకున్నా, నాటకాలపై వున్న మక్కువతో హిందీ చదువును ఆపివేశారు. అయినా మేనత్త ఇచ్చిన హిందీ పరిజ్ఞానంతో పాఠశాలలోని తరగతుల్లో హిందీ సబ్జక్టు వరకూ మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందేవారు. చిన్ననాటి నుండి తండ్రి నేర్పిన దేశభక్తి పాఠాలు, ప్రబోధాలు అతన్ని ఆకట్టుకునేవి. అల్లూరి సీతారామరాజు, సుభాష్‌చంద్రబోస్, గాంధీ, వల్లభాయ్‌పఠేల్ వంటి వారి జీవితచరిత్రలను 10 సంవత్సరాల వయసుకే ఆయన చదివేశారు. ఆయన్ని ఎక్కువగా అల్లూరి సీతారామరాజు జీవితచరిత్ర ఆకట్టుకుంది. నిజానికి సీతారామరాజు పుట్టిన తేదీ, ఈయన పుట్టిన తేదీ రెండూ కూడా ఒకటే అవ్వటం యాదృచ్ఛికం. విశ్వకవి రవీంద్రుని జీవిత చరిత్ర విద్యాధర్‌పై ప్రభావం చూపిందనటంలో ఎటువంటి సందేహం లేదు. అతనికి తెలుగులో విశ్వకవి అనే పేరుతో ఉపవాచకం వుండేది. దానిని విద్యాధర్ అనేక సార్లు చదివారు. ఏడవ తరగతి వరకూ గాయత్రీ విద్యామందిర్‌లో చదువుకున్న ఆయన ఎనిమిదవ తరగతి హైదరాబాద్‌లోని ఆయన పెదనాన్న శివరామకృష్ణ వద్ద చదవాలని అనుకున్నారు. అప్పటి వరకూ తెలుగు మీడియంలో చదివిన ఆయన అక్కడి నుండి ఇంగ్లీషు మీడియంలో చదవాలని శివరామకృష్ణ నిర్ణయించారు. సరోజనీనాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ వంటి వారు ఆంగ్లబోధనని నిరసించిన విధానం చదివి వున్న విద్యాధర్ చిన్ననాటి నుండి ఆంగ్లభాషపై వ్యతిరేకతని పెంచుకున్నారు. అయితే ఆయనకి ఎనిమిదవ తరగతి ఇంగ్లీషులో చదవక తప్పింది కాదు. విద్యాధర్ ఆంగ్లభాషా పరిజ్ఞానాన్ని చూసిన ఆ స్కూలు వారు ఆయన్ని ఆరవ తరగతిలోకి తోశారు. కనాకష్టంగా ఎలాగోలా ఆ సంవత్సరం అక్కడ ఇంగ్లీషు మీడియంలోనే చదివి ఎలాగోలా పాసయ్యాడు. ఇంగ్లీషు మీడియంలో చదవటం వల్ల తనకు సబ్జక్టులు అర్ధంకావని తిరిగి తెలుగు మీడియంలోనే తొమ్మిదవ తరగతి గుంటూరులోని జ్ఞానోదయ స్కూల్‌లో కొనసాగించారు. అక్కడ నిర్బంధ విద్యావిధానం నచ్చక పోయినా ఎలాగోలా వెనుక బెంచిలో కూర్చొని, ఆడుతూ, పాడుతూ చదువుకొనసాగించారు. అక్కడికి తొమ్మిదవ తరగతి పూర్తిచేశారు. అక్కడి నుండి ప్రకాశం జిల్లా టంగుటూరులో ఉంటున్న అతని బాబాయిగారు శ్రీ సత్యనారాయణ గారి వద్ద ఉండి శాతవాహన స్కూల్లో పదవతరగతి పూర్తిచేశారు. అయితే పదవ తరగతిలో సోషల్ సబ్జక్టు ఒకటి మిగిలిపోతే దానిని కూడా పూర్తిచేశారు. అటుపై ఇతనికి చదువు ఎక్కదని ఏదైనా వృ్తవిద్యా కోర్సలో చేర్పిస్తే జీవితం స్థిరపడుతుందని భావించిన తల్లిదండ్రులు ఐటిఐలో జాయిన్ చేశారు. గుంటూరులోని డాన్‌బోస్కో ఐటిఐలో ఎలక్ర్టికల్స్‌లో రెండు సంవత్సరాలు చదువుకొని థియరీ సబ్జక్టుపై రెండుసార్లు దండయాత్రలు చేసి మూడోసారి విజయం సాధించటం జరిగింది. తర్వాత ఎపిఎస్ ఆర్‌టిసి మంగళగిరి డిపోలో అప్రెంటీస్ పూర్తిచేసి ఆ పరీక్షలు ఒకే అటెంట్‌లో అన్ని సబ్జక్టులూ ఉత్తీర్ణులయ్యారు. ఆతర్వాత ఉద్యోగంలో చేరారు. కొన్ని సంవత్సరాల తర్వాత గ్రాడ్యుయేషన్ చేయాలనిపించి కాకతీయ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బి.ఏ పూర్తిచేశారు.
రచనా ప్రస్థానం సాగిందిలా...[మార్చు]
తండ్రి రాసే కవితలు పలువురు విని ఆయన్ని ప్రశంసించటం అది ఈయన గమనించటం వంటివి తరచూ జరుగుతుండేవి. ఎలాగైనా తనూ కవితలు రాయాలని అనుకున్నారు విద్యాధర్. అప్పుడే విద్యాధర్‌ని ఆకట్టుకున్న ఉపవాచకం విశ్వకవి. రవీంద్రుడు కవితలు ఎలా రాసేవాడో అలాగే తనూ కవితలు రాయాలని నిర్ణయించుకున్నాడు. రవీంద్రుని బాల్యంలో ఆయన రాసిన మొట్టమొదటి బెంగాలీ కవిత ఎలా ప్రాణం పోసుకుందో ఒకటికి పదిసార్లు చదివి తను రాయటం మొదలు పెట్టారు. దానిని తన తండ్రికి చూపించాడు. పొగుడుతారని అనుకున్న అతని తండ్రి నవ్వి ఊరుకున్నాడు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం పిల్లలకు కేటాయించిన పేజీలో కవితను ప్రచురించింది. దానిని తండ్రికి చూపించాడు. నిజానికి ఆ తండ్రి ఎంతో ఆనందించినా పైకి మాత్రం చదువుపై దృష్టిపెట్టమని సూచించారు. అలా ఈయన తన పన్నెండవ యేట నుంచి కవితలు రాయటం మొదలు పెట్టారు. చదువుకుంటూ కవితలు రాయటం వాటిని ఆయన స్నేహితులకు చదివి వినిపించటం, కొన్నింటిని స్నేహితులకు అంకితం చెయ్యటం వంటివి చేసేవారు. కాలక్రమంలో వయసు పెరిగింది. వయసుతోపాటు ఆలోచనలూ, పద్ధతులూ మారుతుంటాయి. అలాగే రచనలోనూ ఎదుగుదల కనిపించింది. దేశభక్తి కవితల స్థానంలో ప్రేమ కవిత్వం, శృంగార కవిత్వాలు చోటుచేసుకున్నాయి. ఆయన పదిహేడవ ఏట శ్రీ ఈమని శివారెడ్డి అనే యోగాచార్యుల పరిచయంతో యోగవిద్యాభ్యాసం చేయటం మొదలు పెట్టారు. అష్ఠాంగ యోగ విద్యలోని ఎన్నో రహస్యాలను ఆయన ద్వారా నేర్చుకున్న విద్యాధర్ మానసిక స్థితిలో అత్యంత మార్పు చోటుచేసుకుంది. శృంగారానికి అడ్డుకట్టవేసి ఆధ్యాత్మిక కవితలు రాయటం మొదలైంది. భక్తిరస శృంగార, వైరాగ్య గీతాలు రాయటం మొదలు పెట్టారు. వాటిని ఆయన వివిధ దేవాలయాలకు తిరుగుతూ ఆయా దేవాలయ హుండీల్లో ఈ కీర్తనలను పడవేస్తూ అవి స్వామికే చెందాయన్న భావన చెందేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి తలక్రిందులవటంతో సొంత ఇంటిని వదిలి అద్దె ఇంటికి మారటం, ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో రచనలకు తాత్కాలిక విరామం లభించింది. కాలగమనంలో శ్రీ బి.కె. విశ్వేశ్వరరావు అనే రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు, ఆంధ్రప్రదేశ్ బాలకళాపరిషత్ వ్యవస్థాపకుడు విద్యాధర్‌ని నటించటానికి రమ్మని 2004లో పిలిచారు. రెండు రోజులు రిహార్సిల్స్ చేసి నాటికను ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు విద్యాధర్. ఆ తర్వాత విద్యాధర్ తనే సొంతగా నాటిక ఎందుకు రాయకూడదని అనుకొని అంతం ఎప్పుడు అనే నాటికను రాసి తీసుకెళ్ళి విశ్వేశ్వరరావు గారికి వినిపించారు. గుంటూరులోని నెమలికంటి వెంకట రమణ అనే నాటక రచయిత వద్దకు విద్యాధర్‌ని పంపి నాటక రచనను నేర్చుకొమ్మని ఆయన సూచించారు. నంది నాటక పరిషత్‌లో ఆ సంవత్సరం ఆరు నందులు కైవశం చేసుకున్న ఆశలపల్లెకి నాటిక రచయిత అయిన నెమలికంటిని విద్యాధర్ కలవటం, వారిద్దరి మధ్యా ఎనలేని మైత్రి చిగురించటం కాలగమనంలో విద్యాధర్ ఆ నాటికలో ప్రతినాయకుని పాత్రపోషించి దాదాపు 30 ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. దీంతో పరిషత్ నాటికలలో నటించటం మొదలైంది. ఆ సమయంలో రాఘవేంద్రచరితం పద్యనాటకానికి విద్యాధర్ శ్రీకారం చుట్టారు. నెమలికంటి వెంకటరమణ సూచన మేరకు నాయుడు గోపి అనే రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు వద్దకు వెళ్ళి నాటకాన్ని చదివి వినిపించటంతో విద్యాధర్ జీవితం నాటక రచయితగా ఎదిగేందుకు దోహదపడింది. నాయుడు గోపి దర్శకత్వంలో రాఘవేంద్రచరితం పద్యనాటకం అత్యద్భుతంగా రూపుదిద్దుకొని అతి చిన్నవయసులో పద్యనాటకం రచించిన ఇటీవలి రచయితల్లో ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు విద్యాధర్ మునిపల్లె. నాయుడు గోపి ప్రోత్సాహంతో గమనం అనే సాంఘిక నాటికను రచించి ఆంధ్రరాష్ర్టంలోని నాటక రచయితల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చకున్నారు. ఉషోదయ ఆర్ట్స్ వెనిగండ్ల వారికి ఉత్తిష్ఠభారతి అనే నాటికను రాసి ఇచ్చి రాష్ట్ర వ్యాపితంగా 28 ప్రదర్శనలిచ్చి మంచి మాటల రచయితగా పేరొందారు. అలా మొదలైన ఆయన నాటక రచనా ప్రస్థానంలో స్వరార్ణవం, సుప్రభాతం నాటికలు కువైల్ తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన నాటిక రచనల పోటీల్లో ప్రోత్సాహక బహుమతులు పొందాయి. కొల్లా రాధాకృష్ణ అనే టీవీ, నాటక దర్శకుడు విద్యాధర్‌ని కలవటం, ఆయన ద్వారా సప్తగిరి ఛానల్ ద్వారా వెలుగు-నీడలు సీరియల్‌కు కథను, గురుదేవోభవ అనే టెలీ సీరియల్ కు దర్శకత్వం వహించటంతో విద్యాధర్‌ని రచయితగా, దర్శకునిగా మరొక మెట్టు ఎక్కించాయి. అటుపై అంతర్జాల ప్రసార మాధ్యమాలైన యుట్యూబ్‌లో పలు లఘుచిత్రాలకు రచనా, దర్శకత్వం వహించి నెటిజన్ల మన్ననలూ అందుకుంటున్నారు. వైవిధ్యభరిత నాటికలు, నాటకాలు రచించే విద్యాధర్ తొలిసారిగా 2016లో పిల్లిపంచాంగం అనే హాస్యనాటికను రచించారు. దీనిని గంగోత్రి, పెదకాకాని నాటక సమాజం పలుచోట్ల ప్రదర్శించి మన్ననలు అందుకుంది.
నాటకరంగ ప్రవేశం[మార్చు]
విద్యాధర్ జీవితంలోకి శ్రీ మతుకుమల్లి పార్ధసారధిరావు అనే ఒక డ్రాయింగు టీచర్ ప్రవేశించారు. ఆయన నాటక రచయిత, దర్శకుడు. వీళ్ళ నాన్నగారు నడుపుతున్న స్కూల్లో సోషల్‌స్టడీస్ చెప్పటానికి నియమితులయ్యారు. ఆయన మైత్రి అనే బాలల నాటికను తీసుకొని వచ్చి సూర్యనారాయణ గారికి వినిపించారు. అందులో కథానాయకుని పాత్ర చేసేందుకు విద్యాధర్ సిద్ధపడినా కొన్నికారణాల వల్ల ఆ పాత్ర మరొకరు చేసేందుకు దర్శకుడు నిర్ణయించారు. అందులోనే చర్మకారుని పాత్రకు విద్యాధర్‌ని ఎంపిక చేసిన దర్శకుడు చదువు యొక్క ఆవస్యకతను ఇతని పాత్రద్వారా చెప్పించారు. అలా విద్యాధర్ నాటక రంగ ప్రవేశం ఆయన 12-13 సంవత్సరాల మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ బాలకళాపరిషత్ లో జరిగింది. అటుపై ఆయన పార్ధసారధిగారి రచనా దర్శకత్వంలో ఖబడ్దార్ నాటికలో నాయకునిగానూ, పాదుకాపట్టాభిషేకం పద్యనాటకంలో దశరథుని పాత్రలోనూ నటించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. తన తండ్రి సూర్యనారాయణ రచనా దర్శకత్వంలో దుర్యోధన, రామదాసు, గురజాడ, రాజకీయ నాయకుడు వంటి ఏకపాత్రలతోపాటు సమైక్యభారతి నాటికల్లో నటించి నటనలో రాణించారు. పదవ తరగతి పరీక్షలు పూర్తిచేసి గుంటూరు వచ్చిన విద్యాధర్‌ని రంగస్థల, సినీనటుడు అయిన బి.కె.విశ్వేశ్వరరావు బృందం నటిస్తున్న వరవిక్రయం నాటకంలో సింగరాజు బసవరాజు పాత్రపోషించవలసిందిగా పిలిపించారు. ఆయనతో కలిసి విద్యాధర్ ఆ నాటకాన్ని రెండుసార్లు ప్రదర్శించారు. తర్వాత కొంతకాలంపాటు నాటకరంగంతో విద్యాధర్‌కు పూర్తిగా బంధం తెగిపోయిందని అనుకునే తరుణంలో మళ్ళీ విశ్వేశ్వరరావుగారు ఆడపిల్ల అనే నాటికను ప్రదర్శించేందుకు రిహార్సిల్స్ చేసేందుకు పిలిపించారు. దాంతో విద్యాధర్ ఐదేళ్ళ తర్వాత తిరిగి నాటకరంగం వైపు అడుగులు వేశారు. ఆతర్వాత స్వర్ణభారతి కల్చరల్ ఆర్ట్స్ వారి ఆశలపల్లెకి నాటికలో ప్రతినాయకునిగా, అదే నాటక సమాజం వారు నిర్మించిన ఆపరేషన్, ఎంకిపెళ్ళి, క.సా.గు నాటికల్లో కథానాయకుని పాత్రలు పోషించారు. గంగోత్రి, పెదకాకాని నాటక సమాజం వారికి అందించిన విద్యాధర్ రచనలైన శ్రీ గురురాఘవేంద్రచరితంలో రాఘవేంద్ర పట్టాభిషేక మహోత్సవంలో వేదపండితునిగానూ అనేక ప్రదర్శనలు ఇవ్వగా, గమనం నాటికలో ప్రతినాయకునిగా ఒక ప్రదర్శనలో మాత్రమే పాల్గొన్నారు. తర్వాత గంగోత్రి నాటక సమాజం వారు 2016 సంవత్సరంలో ఆకెళ్ళ శివప్రసాద్ రచనలో, నాయుడు గోపి దర్శకత్వంలో నిర్మించిన పల్లవి-అనుపల్లవి నాటికలో వైవిధ్యమైన పాత్రను పోషించి ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేశారు. ఇలా ఆయన నాటక ప్రస్థానం నటుడిగా, రచయితగా కొనసాగుతోంది.
ఇతర రచనలు[మార్చు]
- ఉత్తిష్ఠభారతి
- స్వరార్ణవం
- సుప్రభాతం[1]
- అమృతవర్షిణి
- పిల్లిపంచాంగం
- దగ్ధగీతం
- గమనం
- వారసులు
- కొత్తనీరు
- మంచివాడు
- సా విరహే
మూలాలు[మార్చు]
- ↑ ప్రజాశక్తి. "ఆకెళ్ల నాటికకు ప్రథమ బహుమతి". Retrieved 4 July 2017.[permanent dead link]