Jump to content

విద్యా శంకర్

వికీపీడియా నుండి
విద్యాశంకర్
2007లో భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డును స్వీకరిస్తున్న విద్యాశంకర్
వ్యక్తిగత సమాచారం
జననం(1919-12-28)1919 డిసెంబరు 28 [1]
మద్రాసు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా
(ప్రస్తుతం చెన్నై, తమిళనాడు, భారతదేశం)
మరణం2010 జూన్ 29(2010-06-29) (వయసు 90)[2]
మైలాపూర్, చెన్నై, తమిళనాడు, భారతదేశం[2]
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివైణికురాలు
వాయిద్యాలువీణ

విద్యా శంకర్ (1919—2010) ఒక భారతీయ సంగీతజ్ఞురాలు, విద్యావేత్త, వైణికురాలు.[3]

వృత్తి

[మార్చు]

ఈమె 1919, డిసెంబరు 28వ తేదీన చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్, సీతాలక్ష్మి దంపతులకు మద్రాసులో జన్మించింది. ఈమె హైస్కూలు వరకు ఇంటిలోనే చదివింది. ఈమెకు గణితశాస్త్రంలో ఆసక్తి ఉండేది. ఈమెకు గణితశాస్త్రంలో డిగ్రీ చదవాలని కోరిక ఉండేది కానీ ఈమె తండ్రి ఆడపిల్లలకు గణితం కష్టమైన సబ్జెక్టు అని భావించి ఈమెకు సంగీతం నేర్పించాడు.[4] కానీ ఈమె టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత చెన్నై కళాక్షేత్రలోని కళానిలయం పిల్లల స్కూలులో గణితం బోధించింది. తరువాత కేంద్రీయ కర్ణాటక సంగీత కళాశాలలో సంస్కృతం, సంగీత శాస్త్రాలను బోధించింది. [4]

ఈమె మొదట సంగీతం టి.ఎస్.సబేశ అయ్యర్ వద్ద నేర్చింది. తరువాత మద్రాస్ సభాపతి అయ్యర్, టి.ఎల్.వెంకటరామ అయ్యర్‌ల వద్ద తన సంగీతాన్ని అభివృద్ధి చేసుకుంది. ఈమెకు సంస్కృత ఆంగ్లభాషలలో ప్రావీణ్యం ఉండడం వల్ల వాగ్గేయకారుడు శ్యామశాస్త్రిపై అనేక వ్యాసాలు, పుస్తకాలు రచించింది. 200లో ఈమెకు సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.[3] మద్రాసు సంగీత అకాడమీ ఈమెకు టి.టి.కె. స్మారక అవార్డును ప్రకటించింది.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ చెల్లెలు, మరొక నోబెల్ పురస్కార గ్రహీత సి.వి.రామన్ అన్న కుమార్తె.[3] ఈమె భర్త వి.ఎస్.అయ్యర్ ప్యారీ & కో సంస్థలో కార్యనిర్వాహకాధికారి. వీరికి వి.ఎస్.శివకుమార్, వి.ఎస్.మహేష్, వి.ఎస్.సుందర్ అనే ముగ్గురు కుమారులున్నారు. [2]

ఈమె తన 90వ యేట మైలాపూర్‌లోని తన నివాసంలో 2010, జూన్ 29న మరణించింది.[3]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "TTK Memorial Award". The Journal of the Music Academy (Madras). 70: 40. 1999.
  2. 2.0 2.1 2.2 "Veena Vidushi passes away". Mylapore Times. 30 June 2010. Retrieved 3 December 2020.
  3. 3.0 3.1 3.2 3.3 Krishnan, Lalithaa (1 July 2010). "Art and science converged here". The Hindu. Retrieved 3 December 2020.
  4. 4.0 4.1 "Vainika Vidya Shankar no more". The Hindu. 30 June 2010. Retrieved 3 December 2020.