విద్వాన్ విశ్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వరూపాచారి
జననం
మీసరగండ విశ్వరూపాచారి

అక్టోబరు 21, 1915
మరణంఅక్టోబరు 19, 1987
ఇతర పేర్లువిద్యాన్ విశ్వం
వృత్తిసంపాదకుడు
బిరుదుకళాప్రపూర్ణ
జీవిత భాగస్వామిపద్మ
పిల్లలువినత, బాలచంద్ర, విద్యాపతి, హేమచంద్ర, కాదంబరి, మమత
తల్లిదండ్రులు
  • మీసరగండ మునిరామాచార్యులు (తండ్రి)
  • లక్ష్మమ్మ (తల్లి)
ఆంధ్రపత్రిక ఎడిటర్ పోలవరపు శ్రీరాములు గారితో విద్వాన్ విశ్వం

విద్వాన్ విశ్వం, (1915 అక్టోబరు 21 - 1987 అక్టోబరు 19) గా చిరపరచితుడైన మీసరగండ విశ్వరూపాచారి విద్వాంసులకు విద్వాంసుడుగా పలువురి ప్రశంసలు పొందాడు. తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం.

జీవిత చరిత్ర[మార్చు]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

1915, అక్టోబరు 21న అనంతపురం జిల్లాలో తరిమెల గ్రామంలో ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి మీసరగండ మునిరామాచార్యులు. విశ్వం చిన్నతనంలో స్వగ్రామంలోని రామాయణం శంకరశాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. సంప్రదాయ పద్ధతిలో కర్నూలు, ప్రొద్దుటూరు లలో సంస్కృత కావ్య నాటకాలంకారాలను, తర్కశాస్త్రాన్ని ఆభ్యసించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలోనూ, ఆంధ్రంలోనూ విద్వాన్ పట్టాపుచ్చుకున్నాడు. అనంతపురంలో చిలుకూరు నారాయణరావు వద్ద శిష్యరికం చేశాడు. కాశీ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తూ అనారోగ్యం వలన పూర్తి చేయలేకపోయాడు.

రాజకీయరంగం[మార్చు]

బెనారస్‌ నుండి అనంతపురం తిరిగిరాగానే తరిమెల నాగిరెడ్డితో కలిసి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు. ప్రజలను చైతన్యపరచటానికి గ్రంథ ప్రచురణ అవసరమని భావించి నవ్యసాహిత్యమాల అనే ప్రచురణ సంస్థ ఏర్పాటు చేసి నవ్యసాహితి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఫాసిజం మొదలైన అంశాలపై పుస్తకాలను ప్రచురించాడు. దానితో బ్రిటీషు ప్రభుత్వం రాజద్రోహం క్రింద తరిమెల నాగిరెడ్డిని, విద్వాన్ విశాన్ని అరెస్టు చేసి మొదట బళ్ళారిలోని అల్లీపూర్ జైల్లోనూ ఆ తర్వాత తిరుచిరాపల్లి కారాగారం లోనూ నిర్బంధించింది. తిరుచిరాపల్లి జైలులో విశ్వం బెజవాడ గోపాలరెడ్డి వద్ద బెంగాలీ నేర్చుకున్నాడు. ఈ జైలులో రాజాజీ, టంగుటూరి ప్రకాశం వంటి నాయకుల సాహచర్యం లభించింది. ఇతను అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, రాయలసీమ కాంగ్రెస్ కమిటీ కార్యాలయ కార్యదర్శిగా, అనంతపురం జిల్లా జాతీయసభకు, జిల్లా లోకజనసంఘానికి, మండల క్షామనివారణ సభకు, జిల్లా ఆంధ్రమహాసభకు ప్రధాన కార్యదర్శిగా, జిల్లా రైతు మహాసభకు ఉపాధ్యక్షుడుగా పనిచేశాడు.

పత్రికారంగం[మార్చు]

ఉద్యమం, ఉపన్యాసం మాత్రమే కాకుండా మరింత లోతుగా రాజకీయాలు శాస్త్రపద్ధతిలో వివరించడానికి పత్రికారంగం వైపు దృష్టి సారించాడు. అడవి బాపిరాజు ఆహ్వానించడంతో మీజాన్ పత్రికలో 1945లో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరి కొంతకాలం పనిచేశాడు. తరువాత విజయవాడలో ప్రజాశక్తి దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా సుమారు మూడు సంవత్సరాలు పనిచేశాడు. "మీజాన్" పత్రికలో రచనావ్యాసంగం, "ప్రజాశక్తి"లో సంపాదకత్వం పాండితీభాషలోనే సులభశైలిని సాధించగలిగినా, పరిపాలనాయంత్రాంగపు నిర్బంధాలకు గురయ్యాడు. తర్వాత మద్రాసుకు తరలివెళ్ళి అక్కడ బాలభారత్ విద్యాలయంలో సంపాదకుడిగా కొన్నాళ్ళు పనిచేశాడు. 1952 ఆగష్టు 15న ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక ప్రారంభమైనపుడు దానిలో ఎడిటర్ ఇన్‌చార్జ్‌గా చేరి 1959 వరకు పనిచేశాడు. 1959లో ఆంధ్రపత్రిక దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా కొంతకాలం పనిచేసి 1960లో విజయవాడకు వచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేశాడు. మళ్ళీ 1963లో ఆంధ్రప్రభ దినపత్రికకు అసోసియేట్ ఎడిటర్‌ చేరాడు. 1967లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకుడిగా మారాడు. ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో పదవీవిరమణ చేసిన తరువాత 1981నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకునిగా వ్యవహరించాడు. ఈ సమయంలో విశ్వం కథాసరిత్సాగరాన్ని 12 సంపుటాలుగా తెనుగించాడు. "చందమామ"లో ద్విపద కావ్యం రూపంలో వ్రాసిన పంచతంత్ర కథలను బాపు బొమ్మలతో తి.తి.దే.ప్రచురణగా వెలువరించాడు. బ్రహ్మసూత్రాలు శంకరభాష్యం నాలుగు సంపుటాలను, అధర్వణ వేదాన్ని అనువాదం చేసి ప్రచురించాడు. 1987 అక్టోబర్ 19వతేదీ తనువు చాలించాడు.

రచనలు[మార్చు]

  • విరికన్నె (కావ్యం)
  • ఆత్మసాక్షి (కవిత్వం)
  • ప్రేమించేను (నవల)
  • పెన్నేటిపాట (కావ్యం)
  • ఒకనాడు (కావ్యం)
  • నాహృదయం (కావ్యం)
  • పాపం
  • రాతలూ గీతలూ
  • సమీక్ష
  • లెనిన్
  • స్టాలిన్
  • స్వతంత్రం
  • మహాశిల్పి
  • మహాసంకల్పం
  • అదీ రష్యా
  • స్వతంత్రం ఏం చేయటం
  • ఫాసిజం దాని ధ్వంసం
  • రష్యా యుద్ధకవులు
  • రానున్న సంక్షోభం
  • సత్యభామ
  • ప్రథమ ప్రేమ
  • ధర్మదుర్గం
  • పొద్దుతిరిగింది
  • స్వస్తిశ్రీ
  • కచదేవయాని
  • ద్వేషం
  • దురాక్రమణ
  • ఇరాన్
  • ఇండియా
  • ఇండోనేషియా
  • వియత్నాం
  • నీడలు - జాడలు
  • విక్రమోర్వశీయము (రేడియో నాటకము)
  • నాగానందము (రేడియో నాటకము)
  • యుద్ధం మాకొద్దు (రేడియో నాటకము)
  • ఏమి చెయ్యడం?
  • మాణిక్య​వీణ

అనువాదాలు[మార్చు]

  • కథాసరిత్సాగరం కథాలహరిని 12 సంపుటాల్లో ఆంధ్రీకరణం చేశారు.
  • కాదంబరి (బాణుడు)
  • కిరాతార్జునీయం (భారవి)
  • దశకుమారచరిత్ర (దండి)
  • మేఘసందేశం (కాళిదాసు)
  • రఘువంశము (కాళిదాసు)
  • కుమార సంభవము (కాళిదాసు)
  • శిశుపాలవధ (మాఘుడు)
  • రాజతరంగిణి (కల్హణుడు)
  • మానవుడు (రోమారోలా నవల)
  • నేటి భారతదేశం (రజనీ పామీదత్)
  • ఫాసిజం
  • భూమి (ఓప్లే హార్డీ నవల)
  • వీడ్కోలు
  • కర్ణకుంతి
  • సతి
  • ముక్తకములు
  • చేకోవ్ కథలు
  • గోర్కీ కథలు
  • శిశు హృదయము
  • శిశు రహస్యము
  • యుద్ధానంతర ఆర్థిక పరిణామాలు
  • బిల్హణీయము
  • తెలుగు అధర్వ వేదసంహిత[1]
  • పూలచెట్లు[2]
  • రష్యా యుద్ధకథలు
  • పేదరాలు (కథాసంకలనం)
  • విలాసిని (కథల సంపుటి)
  • ప్రజావిరోధి (నాటకము)

నిర్వహించిన శీర్షికలు[మార్చు]

  • విశ్వభావన - శ్రీసాధన పత్రిక 1938-1939
  • తెలుపు-నలుపు - ఆంధ్రప్రభ వారపత్రిక 1952-1959
  • అవీ-ఇవీ - ఆంధ్రపత్రిక దినపత్రిక 1958-1959
  • ఇవ్వాళ - ఆంధ్రజ్యోతి దినపత్రిక 1960-1962
  • టీకా-టిప్పణి - ఆంధ్రజ్యోతి దినపత్రిక
  • మాణిక్యవీణ - ఆంధ్రప్రభ దినపత్రిక 1962-1966, ఆంధ్రప్రభ వారపత్రిక 1967-1987

మచ్చుతునక[మార్చు]

14-9-1948న ఒడ్డు గ్రామానికి చెందిన రంగారెడ్డి అనే భూస్వామిని చంపారన్న అభియోగం పై 17మందికి నిజాం ప్రభుత్వం 19-07-1950న ఉరిశిక్ష విధించింది. ఈ ఉదంతం పత్రికలలో చదివి ఒక ఐరిష్ కవి స్పందించి వ్రాసిన కవితకు తెలుగు అనువాదం ఇది. జనవాణి దినపత్రిక 1951 ఏప్రిల్ 24 సంచికలో ప్రచురింపబడింది.[3]


ఉరికంబం కదులుతోంది

స్వచ్చ రవికిరణ కాంతితో
స్వయం వ్యక్తిత్వంతో
జ్వలించవలసిన జీవితం
కాలుష్యాచ్ఛన్నమై మసకబారిపోయింది.
.............
పదిహేడుగురు తల్లులు
కదలకుండా కిటికీల వద్ద నిల్చొని
కంటనీరు పెడ్తున్నారు
కాళరాత్రి తెలంగాణాలో
కటిక చీకటిని పూసింది
..............
నవయుగ నాందీగీతం
నగారా మోగిస్తోంది
నేడో రేపో వినితీరాలి
నేడే వినడం మంచిది
..............
నరలోకపు గుండెల్లో
చిరచిరలాడుతోంది బాధ
ఉరికంబం కదులుతోంది
ఉచ్చు గాలికెగురుతోంది

మూలాలు[మార్చు]

  1. విద్వాన్, విశ్వం (1989). తెలుగు అధర్వవేద సంహిత. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానములు.-డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని పుస్తకప్రతి
  2. విద్వాన్, విశ్వం. పూలచెట్లు.-డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని పుస్తకప్రతి
  3. తెలంగాణా విమోచన సాహిత్యం - డా.ఎస్వీ సత్యనారాయణ - 2008 - పుట 40

వెలుపలి లంకెలు[మార్చు]

సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం (పుస్తకం) సంపాదకులు -నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీ మోహన్