విరాట పర్వము పంచమాశ్వాసము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పంచమాశ్వాసం[మార్చు]

అర్జునుడు దూరంగా ఉన్న సుయోధనుని చూడగానే " ఉత్తర కుమారా ! అడుగో సుయోధనుడు. రథం అటు పోనివ్వు " అన్నాడు. ఇంతలో కౌరవ సేనలోని ప్రముఖులైన వారు ఒక్కొక్కరు ఒక వెయ్యి రథములను తీసుకుని సుయోధనుని వైపు వెళ్ళారు. సుయోధనుడికి అర్జునినికి మధ్య సైన్యం మూడు నిలిచేయి.. చేత చిక్కిన గోగణములు అర్జునుడు తోలుకు పోవడం చూసి సుయోధనుడు నిట్టూర్చాడు.

ఉత్తరకుమారుడికి కురువీరులను పరిచయము చేయుట[మార్చు]

అర్జునుడు కురు సేనను తేరి పార చూసాడు. " ఉత్తరకుమారా ! కురుసేనను చూడు. కాంచనమయ వేదిక కేతనముగా కలవాడు ద్రోణాచార్యుడు. ఎగురుతున్న సింహం తోక కేతనముగా కలవాడు అశ్వథ్థామ. బంగారు గోవును కేతనముగా కలిగిన వాడు కృపాచార్యుడు. తెల్లని కేతనమ కల వాడు కర్ణుడు. పాము పడగను కేతనముగా కలిగిన వాడు సుయోధనడు. తాటి చెట్టును కేతనముగా అలంకరించిన వాడు భీష్ముడు " అని తిరిగి " ఉత్తరకుమారా ! ఇప్పుడు మన రథం గురువు గారు ద్రోణాచార్యునకు ప్రదక్షిణగా పోనిమ్ము. ధనుర్విద్యలో అపార పాండిత్యము కలిగిన గురువు గారిని అవమానించ కూడదు. కనుక నేను ముందుగా సుయోధనునితో యుద్ధం చేస్తాను. సుయోధనుని రక్షించడానికి గురువు గారు వస్తారు అప్పుడు నేను ఆయనతో యుద్ధం చేస్తాను. గురు పుత్రుడు అశ్వథ్థామ శివుని వరం వలన పుట్టాడు. భీకరమైన యుద్ధం చేయగల సమర్ధుడు. ఆ ప్రక్కన ఉన్న వాడు కృపాచార్యుడు. నాకు చిన్న నాటి గురువు, ద్రోణ సమాన పరాక్రమవంతుడు. కనుక వారితో యుద్ధం వద్దు , రథం పక్కకు పోనివ్వు. అక్కడ సుయోధనుని మిత్రుడు కర్ణుడున్నాడు చూడు పరశురాముని శిష్యుడైన ఇతడు మహా పరాక్రమ శాలి నాకు సరి జోడు . ఇతనితో యుద్ధం చేయాలని నా కోరిక. నన్నుచూస్తే ఊరుకోడు. కనుక రథం అతనికి ముందుగా నిలిపి మేము చేయబోయే యుద్ధం చూడు. మా పెదనాన కుమారుడు సుయోధనుడు. అతడు అభిమానధనుడు కోపం ఎక్కువ, పరాక్రమ వంతుడు, అత్యంత దుష్టుడు, మా మీద ద్వేషం పెంచుకున్న వాడు. అతడు కనపడితే వదల వద్దు. అదుగో పితామహుడైన భీష్ముడు, అత్యంత పరాక్రమ వంతుడు, బుద్ధి కుశలత కలిగిన వాడు, పరశురామని ఎదిరించిన ధీశాలి, ఎన్నో శస్త్ర రహస్యాలు తెలిసిన వాడు. ఆయనకు కోపం రానివ్వ వద్దు. అలా చేస్తే నన్ను సుయోధనుని దగ్గరకు చేరనివ్వడు " అని కురు వీరులను ఉత్తరునికి పరచయం చేసాడు.

అశ్వథ్థామ ఎత్తి పొడుపు[మార్చు]

ఆ సమయంలో అశ్వథ్థామ కర్ణుని చూసి " కర్ణా నిన్ను నీవు పొగుడు కున్నావు కదా! అర్జునుడు వచ్చాడు పోరాడు నీకు ఒక వేళ చేత కాకపోతే శకునితో మంతనాలు చెయ్యి. రారాజు ఈ యుద్ధ భారం నీ మీద పెట్టాడు కదా! తప్పుతుందా " అన్నాడు పరిహాసంగా. కర్ణుడు ఆగ్రహించి " నేను నీలా భీరువుని కాదు యుద్ధం, నుండి తప్పు కోవడానికి అర్జునుడే కాదు అతని తండ్రి ఇంద్రుడు వచ్చినా నేను ఎదిరించగల పరాక్రమ వంతుడను కావాలంటే చూడు " అన్నాడు. కర్ణుడు అలా మాట్లాడుతూ ఉండగానే భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వథ్థామ సుయోధనునికి రక్షణగా నిలిచారు. వారి వెనుక బాహ్లిక సోమదత్తులు తమతమ సైన్యాలతో పోరాడారు.

అర్జునుని వీరవిహారం[మార్చు]

అర్జునుడు గాండీవాన్ని ధరించి కురు సైన్యాలను నుజ్జు, నుజ్జు చేసాడు. కురు సైన్యం వజ్రవ్యూహంగా ఏర్పడి అర్జునిని ఎదిరించ సాగాయి. ఉత్తర కుమారుడు అర్జునిని పరాక్రమానికి పొంగి పోయి శ్లాఘించాడు. అర్జునుడు చెలరేగి యుద్ధం చేయసాగాడు. గాండీవం గుండ్రంగా తిప్పుతూ ఇరు వైపులా ఉన్న అమ్ముల పొది నుండి బాణాలు తీసి రెండు చేతులతో ఎడతెరిపి లేకుండా యుద్ధం చేస్తూ వజ్రవ్యూహాన్ని ఛేదించాడు. అర్జునిని ధాటికి గుర్రములు రథం విడిచి పారి పోతున్నాయి. రథికులు రథం నుండి కింద పడుతున్నారు.కింద పడ్డ వారిని విడిచి పెడుతూ ముందుకు సాగుతున్నాడు అర్జునుదు. ఒకసారి కనిపించిన వారు మరలా కనిపించడం లేదు. ఉత్తరకుమారుని జాగ్రత్తగా కాపాడుకుంటూ యుద్ధం చేస్తున్నాడు. అర్జునినితో యుద్ధం చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. అప్రతిహతంగా సైన్యాల మధ్య అర్జునిని ధాటికి సైన్యాలు నిస్తేజం ఔతున్నాయి.ద్రోణాదులపై శరసంధానం చేసాడు, కర్ణుని రథసారథిని బాణంతో కొట్టాడు, అతని రథాన్ని విరగకొట్టాడు, విల్లును విరిచాడు, దేవదత్తాన్ని పూరించాడు. కర్ణుని అవస్థ చూసి కురు సైన్యాలు భీష్ముని వెనక చేరారు. భీష్ముడు వారిని ఉత్సాహ పరిచాడు. కృపాచార్యుడు, ద్రోణుడు, వికర్ణుడు సుయోధనునికి రక్షణ కవచంగా నిలిచారు.

అర్జునుడు కర్ణునితో తలపడుట[మార్చు]

అర్జునుడు ఉత్తర కుమారునితో " ఉత్తర కుమారా! కొంచం సేపు రధాన్ని ఆపు. మనముందు మొహరించిన సైన్యాలను చూడు. కర్ణుని ముందు రధాన్ని ఆపు, వాడి పొగరు అణిస్తే కాని సుయోధనుని పొగరు అణగదు " అన్నాడు. ఉత్తర కుమారుడు రథాన్ని కర్ణుని ముందుకు పోనిచ్చాడు. కర్ణుని వైపు శరవేగంతో దూసుకు వెళుతున్న అర్జునుని చూసి చిత్రాంగధుడు, చిత్రరధుడు, సంగ్రామ చిత్తుడు, వివిశంతి, దుష్ప్రహుడు, చిత్రసేనుడు, దుర్ముఖుడు, దుర్జయుడు, వికర్ణుడు, శంత్రుంతపుడు, దుశ్శాసనుడు మొదలైన కురు కుమారులు అర్జునినిపై ఒక్క సారిగా ఉరికారు. ముందుగా వికర్ణుని విల్లు విరిచాడు వికర్ణుడు పారిపోయాడు. తరువాత శత్రుంతపుని చంపాడు. దానితో కురు కుమారులు పారి పోయారు. తరువాత కర్ణుని తమ్ముడు సంగ్రామ జిత్తుడు అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు ఒక బల్లెంతో వాడిని పొడిచి చంపాడు. కర్ణుడు కోపంతో అర్జునినిపై బాణం వేసాడు. ఈ విధంగా అర్జునుడు కర్ణుడు తలపడ్డారు. కౌరవ సేనంతా యుద్ధం చేయడం ఆపి వీరిని చూస్తూ నిలబడ్డారు. అర్జునుడు కర్ణుని చూసి " కర్ణా ! నిండు సభలో నాకు ఎదురు లేదని పలికావు ఇదిగో యుద్ధం వచ్చింది సభలలో ప్రగల్భాలు పలకడం కాదు ఇప్పుడు నీ ప్రతాపం చూపు నీ తమ్ముని చావు కనులార చూసావు కదా ఇంత దాకా వచ్చి పారిపోవడానికి ప్రయత్నించ వద్దు. ద్రౌపదిని నిండు సభలో అవమానించి నందుకు ఫలితం అనుభవించాలి కదా. ఆ రోజు ధర్మరాజు మాటకు కట్టుబడి నిన్ను వదిలాను ఇప్పుడు చిక్కావు తప్పించుకోలేవు " అన్నాడు. కర్ణుడు " అర్జునా! అన్నగారి మీద పెట్టి తప్పుకుంటావా ! అంత వీరుడివా? ఎలాగైనా అడవులలో తిరిగితే రాజ్యం వస్తుందిలే అని అడవులలో తిరిగిన పిరికి పందలు మీకు ధైర్యసాహసాలు ఉన్నాయా? నీవు ఏమేమో చేసావని అన్నారు, నిన్ను చూస్తుంటే అవి అన్నీ అసత్యాలు అనిపిస్తున్నాయి " అంటూ అర్జునిపై బాణాలు సంధించాడు. అర్జునుడు బదులుగా బాణాలతో సమాధానం ఇస్తున్నాడు. కర్ణుని విల్లు విరగ కొట్టాడు. కర్ణుడు శక్తి బాణాలను అర్జునినిపై ప్రయోగించాడు. అర్జునుడు దానిని తుత్తునియలు చేసాడు. కర్ణుడు విల్లు తీసుకుని ఆర్జునిని సారథిపై ఆరు బాణాలు అర్జునినిపై పది బాణాలు వదిలాడు. అర్జునుడు కోపించి కర్ణునిపై బల్లెములు వర్షంలా కురిపించాడు. కర్ణుడు వాటి ధాటికి ఆగలేక పారి పోయాడు. అర్జునుడు విజయ చిహ్నంగా దేవదత్తం పూరించాడు. అర్జునుడు " ఉత్తరకుమారా! కురుసేనలో ముఖ్య వీరుడు కర్ణుడు పారి పోయాడు. ఇక మనకు ఎదురు నిలిచేది ద్రోణాచార్యుఇలు మాత్రమే " అంటూ కురు సేనను చూసాడు. ఉత్తరకుమారుడు అర్జునినితో " అర్జునా ! నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం, భయం, విహ్వల భావం కలుగుతున్నాయి. నీ ధైర్యం, నీ శౌర్యం చూస్తుంటే నాకు భయం కలుగుతంది. నా మనసు వశం తప్పుతుంది, కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి రథం నడప శక్యం కాకున్నది. ఇలాంటి యుద్ధం నేనిది వరకు చూడ లేదు. మనసు పరవశించి పోతుంది " అన్నాడు.

అర్జునుడు ద్రోణునితో తలపడుట[మార్చు]

అర్జునుడు నవ్వి " ఉత్తరకుమారా! భయం వలదు నేనున్నాను నిర్భయంగా రధాన్ని ద్రోణుని వైపు మళ్ళించు ఎర్రని గుర్రాలు పూన్చిన రధాన్ని అధిరోహించి వారే ద్రోణుడు, నాకు గురువు నాకు హితుడు బహు శస్తాస్త్ర కోవిధుడు రాజ ధర్మంగా ఇప్పుడు నేను ఆయనతో పోరాడవలసి వచ్చినది " అన్నాడు. ఉత్తరుడు అలాగే చేసాడు. అర్జునుడు గురువును చూసి " గురుదేవా! నమస్కారం. అడవులలో పన్నేండేళ్ళు , అజ్ఞాతంలో ఒక ఏడు గడిపి ఎన్నో బాధలు పడ్డాము. ఇది మంచి తరుణం అని ఎంచి మీ ముందుకు వచ్చాను. నా మీద కోపగించకండి ముందుగా మీ పై బాణప్రయోగం చేయలేను ముందుగా మీరే నాపై బాణప్రయోగం చెయ్యండి " అని వేడుకున్నాడు. అతని మాటలకు సంతోషపడి ద్రోణుడు అర్జునినిపై పది బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు వాటిని మధ్యలో త్రుంచి వేసాడు. ఇప్పుడు అర్జునినికి ద్రోణుడికి ద్వంధ యుద్ధం ఆరంభమైంది. అతిరధులు, అస్త్రకోవిదులు, పరాక్రమోపేతులైన వీరి యుద్ధాన్ని కౌరవ సేనలు కుతూహలంతో చూస్తున్నాయి. ద్రోణుని అస్త్రాలను సమర్ధంగా ఎదుర్కొని అర్జునుడు వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు. కురుసేనను తనుమాడుతున్న అర్జునిని చూసి ద్రోణుడు ఆశ్చర్య చకితు డౌతున్నాడు. కురు సేనలు తరిగి పోతున్నాయి. అర్జునిని గెలవడం అసాధ్యమని అనుకున్నాడు. అర్జునుడు ద్రోణుని శరీరాన్ని, కేతనాన్ని, సారథిని ఒక్క సారిగా బాణాలతో కొట్టాడు. కురు సైన్యాలు హాహాకారాలు చేసాయి. తండ్రి పరిస్థితి చూసి అశ్వథ్థామ అతనికి సాయం వచ్చాడు.

అశ్వథ్థామ కృపాచార్యులతో అర్జునిని యుద్ధం[మార్చు]

అశ్వథ్థామ విల్లందుకుని అర్జునిని గాండీవంలోని అల్లెత్రాటిని కొట్టాడు. అల్లెత్రాటిని బిగిస్తున్న అర్జునినిపై అశ్వథ్థామ ఎనిమిది బాణాలు ప్రయోగం చేసాడు. అర్జునుడు అల్లెత్రాటిని బిగించి అశ్వథ్థామ బాణాలను మధ్యలోనే త్రుంచాడు. అశ్వథ్థామపై అర్జునుడు శరపరంర సంధించాడు. అశ్వథామకు అర్జునిలా అక్షయతుణీరం లేదు కనుక అర్జునిపై బాణ ప్రయోగం చేయలేక పోయాడు. ఇది గమనించిన కృపాచార్యుడు అశ్వథ్థామకు సాయంగా వచ్చాడు. అర్జునుడు కృపాచార్యునిపై బాణప్రయోగం చేసాడు. కృపాచార్యుడు విజృంభించి అర్జునుని కపిధ్వజాన్ని కొట్టి జయధ్వానాలు చేసాడు. అర్జునుడు కోపించి కృపాచార్యుని రథాన్ని విరగకొట్టి, గుర్రాలను చంపాడు. విరధుడైన కృపాచార్యుడు ధైర్యంగా శక్తి ఆయుధాన్ని అర్జునినిపై విసిరాడు. అర్జునుడు శక్తి ఆయుధాన్ని ముక్కలు చేసాడు. కృపుడు చేసేది లేక కత్తి డాలు తీసుకుని అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కృపుని కత్తి విరిచాడు. కృపుడు అశ్వథ్థామ రథం ఎక్కాడు.

కురుసేనలను ఛేదిస్తూ అర్జునుడు భీష్మునితో తలపడుట[మార్చు]

కృపాచార్యునికి పట్టిన గతి చూసి కురు సేనలు భీష్ముని వెనుక చేరాయి. ఇది చూసి వృషసేనుడు అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు బల్లెం తీసుకుని వృషసేనుని విల్లు విరిచి అతని గూడెలపయి పొడిచాడు. ఆ దెబ్బకు వృషసేనుడు పారి పోయాడు. పక్కనే ఉన్న దుర్ముఖుడు, వివిశంతి, దుశ్శాసనుడు, వికర్ణుడు, శకుని ఒక్క సారిగా అర్జునిని చుట్టుముట్టారు. అర్జునుడు వారి రథాలను, విల్లును విరిచాడు. అర్జునిని ధాటికి తాళ లేక వారంతా పారి పోయారు. అర్జునుడు " ఉత్తర కుమారా ! ఇక మా తాత గారైన భీష్ముడు మాత్రమే మిగిలి ఉన్నాడు. తాళవృక్ష కేతనమున్న భీష్ముని వైపు రధాన్ని పోనిమ్ము " అన్నాడు. ఉత్తరుడు భీష్ముని వైపు రథం పోనిచ్చాడు. అర్జునుని చూసి భీష్ముడు శంఖం పూరించాడు. రెండు వృషభముల వలె వారు ఒకరిని ఒకరు చూసుకున్నారు. భీష్ముడు బాణాలతో కపిధ్వజాన్ని, దాని వెంట ఉన్న భూతములను, రథసారథిని కొట్టాడు. ఆ బాణముల్సన్నిటిని మధ్యలోనే అర్జునుడు తుంచేసాడు. అర్జునుడు తన బాణాలతో భీష్ముని కప్పాడు. అర్జునుడు వేసే ప్రతి బాణాన్ని భీష్ముడు తునాతునకలు చేసాడు. అర్జునుడు తన అస్త్రాలను తాతగారి ముందు ప్రదర్శిస్తుంటే వారు బాగున్నాయి ఇంకా చూపించు అన్నట్లుంది వారి యుద్ధం. అర్జునుడు కోపించి తాత విల్లు విరుగకొట్టాడు. తాతగారికి కోపం వచ్చి మనుమడిపై శరపరంపరను కురిపించారు. అర్జునుడు తాతగారి బాణాలను అన్నీ తుంచి భీష్ముని ఆయన రథాన్ని, సారథిని, గుర్రాలను కొట్టాడు. భీష్ముడు మరొక విల్లు తీసుకునే లోపు అర్జునుడు భీష్ముని గుండెలపై కొట్టాడు. భీష్ముడు రథంపై సోలి పోయాడు. సారథి రథాన్ని పక్కకు తొలిగించాడు.

అర్జునుడు సుయోధనుని ఎదుర్కొనుట[మార్చు]

అర్జునుడు ఎవరు మిగిలి ఉన్నారా అని చూడగా అక్కడ కర్ణుడు, ద్రోణుడు, కృపుడు నిలబడి ఉండటం చూసి అర్జునుడు " ఉత్తరకుమారా ! రధాన్ని వారి వైపు పోనివ్వు " అన్నాడు. అర్జునుడు తమవైపు రావ్సడం చూసి అశ్వథ్థామ " కర్ణా ! అర్జునుడు మన వైపు వస్తున్నాడు. అతనిని ఎదుర్కొని ఓడించ గలిగిన సమర్ధుడవు నువ్వే " అని కర్ణుని పరహాసంగా ముందుకు తోసాడు. కర్ణుడు " నేను ఇప్పుడే అర్జునిని ఎదుర్కొంటాను చూడు " అన్నాడు. అర్జునుడు కౌరవవీరు లందరినీ మట్టి కరిపించాడు. ఒక్కొక్కరే వారంతా అలసి పోయి తొలగి పోయారు. ఇక్కడ ఉత్తరకుమారుని పరిస్థితి అలాగే ఉంది అతడు అర్జునితో " అర్జునా! నీవేమో అలుపు లేకుండా యుద్ధం చేస్తున్నావు. నాకు దాహం వేస్తుంది కనీసం నీళ్ళు త్రాగ కుండా యుద్ధం చేయడమెలా? ఇక నేను సారధ్యం చేయలేను " అన్నాడు. అర్జునుడు " ఉత్తర కుమారా! ఓపిక పట్టు ఇక సుయోధనుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అభిమానధనుడు నాతో యుద్ధానికి సిద్ధం ఔతున్నట్లు ఉంది. రథం నడపడంలో నీకు నేను సాయం చేస్తాను. భయపడకు " అన్నాడు. సుయోధనుని వైపు రథాన్ని నడిపించాడు అర్జునుడు. అర్జునుడు ఆకలిగొన్న పులి వలె సుయోధనునిపై విరుచుకు పడ్డాడు. బదులుగా సుయోధనుడు అర్జునుని గుండెలపై రెండు బాణాలు వేసాడు. అర్జునిని నుదిటిపై రెండు బాణాలు వేసాడు సుయోధనుడు. వాటిని సునాయాసంగా విరిచి సుయోధనునుపై శరపరంపరను వేసాడు అర్జునుడు. సుయోధనుకి సాయంగా వికర్ణుడు ఏనుగు మీద ఎక్కి రాగా అర్జునుడు ఏనుగు కుంభ స్థలంపై పిడికిలితో కొట్టాడు. ఆదెబ్బకు ఏనుగు కూలబడింది. వికర్ణుడు ఏనుగు మీద నుండి పడి పక్కనే ఉన్న వివిశంతి రథంపై ఎక్కాడు. అర్జునుడు మరలా సుయోధనుని గుండెలను గురి పెట్టి పది బాణాలను వేసాడు. సుయోధనుడు గాయపడ్డాడు. సాయంగా వచ్చి వారందరిని అర్జునుడు గాయపరచగా విధి లేక సుయోధనుడు వెను తిరిగాడు. అర్జునుడు సుయోధనుని తరిమాడు. అది చూసి కర్ణుడు భీష్మునితో " అర్జునుడు తరుము కొస్తుండగా సుయోధనుడు పారి పోతున్నాడు. మనం అతనిని కాపాడాలి " అన్నాడు. కర్ణుని మాటలను భీష్మ ద్రోణ, కృపాచార్యులు లెక్క చెయ్య లేదు. సుయోధనుడు దీనంగా " అదేమిటి ఇలా ఒంటరిగా రాజైన నన్ను వదిలి పోవడం ధర్మమా? రాజైన నేను పరాజయం చెందు తున్నప్పుడు నన్ను ఆదుకోవడం మీ ధర్మం కాదా? " అన్నాడు. అందరూ సుయోధనుని మాటలకు ఆగారు. భీష్ముడు సుయోధనుని ఓదార్చాడు. అర్జునుడు సుయోధనుని చూసి " ఏమిటి సుయోధనా ! అలా పారి పోతున్నావు. ఇది క్షత్రియ ధర్మమా? నేను ఒక్కడిని కుంతీ పుత్రులలో చిన్న వాడిని ఒంటరిని నీవో గాంధారి పుత్రులలో అగ్రజుడవు అపార సేనా వాహినితో వచ్చావు మిత్రులు సాయం ఉన్నారు ఇలాంటి నీవు ఇలా పారిపోతే సాటి వారు ఎగతాళి చేయరా? కౌరవేశ్వరా ఇక నీవు హస్థినా పురంలో ఏనుగు మీద ఎలా ఊరేగగలవు. మణిమయ భూషణములు ధరించి నిండు సభలో ఎలా సింహాసనాధిష్టుడివి కాగలవు? కర్పూర చందన సుగంధ ద్రవ్యాలను సేవిస్తూ భోగభాగ్యములను ఎలా అనుభవించగలవు? సుందరీ మణులతో ఎలా క్రీడించగలవు? సుయోధనా నా మాట విను యుద్ధమున మరణిస్తే స్వర్గ సుఖాలు; గెలిస్తే ఇహలోక సుఖాలు అనుభవించవచ్చు కాని వెను తిరిగి పారిపోవండం తగునా? ఇది రణరంగం జూదం ఆడి గెలుచుట సాధ్యం కాదు. నీలాటి రారాజు పారి పోవడమేమిటి చీ సిగ్గుగా లేదా? " అని అధిక్షేపించాడు.

అర్జునుని సమ్మోహన అస్త్రప్రయోగము[మార్చు]

ఈ మాటలు విన్న సుయోధనుడు రోషంతో భీష్మద్రోణ కృపాచార్యులను యుద్ధసన్నద్ధులను చేసి ఒక్కసారిగా అర్జునిని మీద దాడి చేసాడు. వారంతా సుయోధనుని రక్షిస్తూ అర్జునినితో యుద్ధం చేస్తున్నారు. అర్జునుడు సారథిని కాపాడు కుంటూ వారందిరితో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు మనసులో " సుయోధనుని ఇప్పుడు చంపడం భావ్యం కాదు అది భీమసేనుని ప్రతిజ్ఞ. కువీరులందరితో యుద్ధం చేయడమైంది. ఇక వీరోచితంగా తప్పుకోవడం ఉచితం. ఉత్తరకుమారికి బొమ్మ పొత్తికలు తీసుకు వెళ్ళాలి. కురువీరుల తలపాగాలు పట్టుకెళ్ళడం అంటే వారందరిని జయించినట్లే. అందుకని కుబేరుడిచ్చిన సమ్మోహనాస్త్రాన్ని వీరిపై ప్రయోగిస్తాను " అనుకుని కురు సైన్యంపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు. అస్త్ర ప్రభావానికి కురు సైన్యమంతా నిస్తేజంగా పడి పోయింది. ఆ అస్త్రానికి అధి దేవత ఇంద్రుడు. అర్జునుడు " ఉత్తరకుమారా! కౌరవులంతా స్పృహతప్పి పడిపోయారు. నీవు పోయి సుయోధనుడు, అశ్వథ్థామ, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణాది వీరుల తపాగాలు తీసుకురా. భీష్ముని జోలికి మాత్రం పోవద్దు. అతడిని ఈ అస్త్రం ఏమాత్రం ప్రభావితం చేయజాలదు అతడు నిద్ర నటిస్తున్నాడంతే " అన్నాడు. ఉత్తరకుమారుడు అర్జునుడు చెప్పినట్లే తపాగాలు తీసుకుని రథం ఎక్కాడు. ఉత్తరకుమారునితో చెప్పి అర్జునుడు రథాన్ని కొంచం దూరం యుద్ధరంగంలో నుండి తీసుకు పోయి ఆగాడు. ఇంతలో కురువీరులందరికి తెలివి వచ్చింది. సుయోధనుడు అర్జునినితో యుద్ధానికి సిద్ధం అయ్యాడు. భీష్ముడు " సుయోధనా! జరిగినది నీవు ఎరుగవు. మీరంతా అస్త్రప్రభావానికి తెలివి తప్పారు అర్జునుడు మీ తల పాగాలు మాత్రమే తీసుకు వెళ్ళాడు. మీ తలలు నరికి తీసుకు వెళితే ఏమయ్యేది అర్జునిని కరుణ నిన్ను రక్షించింది. తిరిగి యుద్ధానికి సిద్ధం అయితే పూర్ణాహుతి ఇప్పుడే జరుగుతుంది. విడిపించిన గోవులు విరాటనగరానికి చేరాయి. జరిగినది చాలు వెనుకకు మరలుము " అన్నాడు. ఆ మాటలకు సుయోధనుడు నిట్టూర్ఛాడు. అర్జునిని వదలాలని లేకున్నా తాతాగారి మాటకు తలవంచాడు. కురుసైన్యం కూడా సుయోధనిని అర్జునుని బారి నుండి రక్షించాలంటే యుద్ధ విరమణ మంచిది అనుకున్నారు. కురు సైన్యం వెనుతిరిగింది.

అర్జునుడు కురుసేనకు వీడ్కోలు పలుకుట[మార్చు]

ఇదంతా దూరం నుండి చూస్తున్న అర్జునుడు దేవదత్తం పూరించాడు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులకు నమస్కరించాడు. ఒక్క బాణంతో సుయోధనుని కిరీటంలోని మణులను ఊడగొట్టాడు. ఇక నేను పోయివస్తానని పెద్దగా అరచి చెప్పాడు. ఉత్తరకుమారుని చూసి " కుమారా ! మనం కురుసేనను జయించాము, గోవులను మరలించాము, ఉత్తరకుమారికి బొమ్మ పొత్తికలు సేకరించాము ఇక రాజధానికి మరలి వెడతాము " అన్నాడు. ఉత్తరుడు రథాన్ని వెనుకకు మరల్చాడు. అర్జునుడు " కుమారా ! కురుసేనలను నీవే జయించావని చెప్పు " అన్నాడు. ఊత్తరుడు నవ్వి " అర్జునా ! కురుసేనలను నేను జయించలేనని అక్కడ వారందరికి తెలుసు. నిజం దాచడం కష్టం కాని నీ మాట కాదనలేను. నీవు చెప్పమన్నప్పుడే నిజం చెప్తాను " అన్నాడు. రథం శమీవృక్షాన్ని చేరుకుంది. గాండీవం మొదలైన ఆయుధాలను తిరిగి శమీవృక్షం మీద దాచారు. అర్జునుడు బృహన్నల వేషం ధరించి సారథ్యం చేపట్టాడు. ఉత్తరుడు రథాన్ని అధిరోహించాడు. అర్జునుడు --"-కుమారా ! మన విజయ వార్తను ముందుగా వెళ్ళి విరాటునికి తెలుపమని గోపాలురకు చెప్పు " అన్నాడు. వార్తాహరులు అలాగే వెళ్ళారు.

విజయవార్తను విరాటునికి తెలుపుట[మార్చు]

దక్షిణ గోగ్రహణంలో విజయం సాధించి నగరానికి తిరిగి వచ్చిన విరాటుని ఉత్తర గోగ్రహణం విషయం కలవర పరచింది. భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణాది మహా వీరులతో దండెత్తి వచ్చిన సుయోధనుని ఎదిరించడానికి బృహన్నల సారథ్యంలో వెళ్ళిన ఉత్తరుని తలచుకుని పరితపించాడు. వెంటనే సేనలను ఉత్తరకుమారునికి సహాయంగా వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఉత్తరకుమారుని క్షేమం తెలుసుకుని రమ్మని వార్తాహరులను పొమ్మని ఆజ్ఞాపించాడు. అంతలో అక్కడకు వచ్చిన వార్తా హరులు ఉత్తరకుమారుని విజయవార్త చేరవేసారు. విరాటుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కళ్ళవెంట ఆనంద బాష్పాలు రాలాయి. " ఏమి మన ఉత్తరుడు కురుసైన్యాలను గెలిచాడా. వెంటనే నగరమంతా చాటింపు వేయించండి. సువాసినులను, బ్రాహ్మణులను ఉత్తరునికి స్వాగతం చెప్పటానికి పంపండి " అని విరాటుడు ఉత్సాహంగా చెప్పాడు. కంకుభట్టుని చూసి " కంకా! ఈ ఆనంద సమయంలో ఒక ఆట ఆడదామా " అన్నాడు. ధర్మరాజు " మహారాజా! తమరు ఆనందంలో ఉన్నారు. నేను ఈ రోజు మీతో ఆడి గెలవగలనా " అన్నాడు. విరాటుడు పెద్దగా నవ్వి " సైరంధ్రీ! పాచికలు తీసుకురా " అని అక్కడ ఉన్న ద్రౌపదిని ఆజ్ఞాపించాడు.

విరాటుడు ధర్మరాజు మిదకు పాచికలు విసరుట[మార్చు]

ఆట ప్రారంభం అయింది విరాటుడు ధర్మరాజుతో " కంకా! అశేషమైన కురుసైన్యాలను జయించి నా కుమారుడు మా వంశ ప్రతిష్ఠ కాపాడాడు. అతని బాహుబలం ఎంత గొప్పదో కదా " అన్నాడు. ధర్మరాజు " బృహన్నల రథసారధిగా వుండగా విజయము సాధించటము పెద్దవిశేషము కాదు కదా " అన్నాడు. విరాటుడు ఆ మాటలకు ఆగ్రహించి " కంకుభట్టా ! నా కుమారుని విజయాన్ని సందేహిస్తున్నావా? ఇంత వరకు నీవు ఏమి మాట్లాడినా సహించాను ఇక మీదట అలా కాదు " అన్నాడు. కాని కంకుభట్టు అంతంటితో వదల లేదు " ఒక్క కౌరవ సేనే కాదు. దేవతలు, రాక్షసులు కలసి వచ్చినా బృహన్నల రధ సారధ్యం వహిస్తుండగా ఉత్తరుని జయించడం ఎవరికి సాధ్యం కాదు " అన్నాడు. విరాటుడు కోపం పట్ట లేక పోయాడు " కంకూ! ఇక చాలు నీవు ఎన్నో వింతలు చెప్పగా విన్నాను. ఒక పేడి అదియూ, సారధి శత్రువులను జయించడమా! నా కుమారుని విజయాన్ని ఎందుకు అంగీకరించవు. ఇక నీ మూర్ఖపు మాటలు కట్టి పెట్టు విప్రుడా " అన్నాడు. కాని ధర్మరాజు ఆపకుండా " అవును విరాటరాజా ! బృహన్నలకు యుద్ధం చేయాలని ఆశ కలిగి ఉంటుంది. ఉత్తరుని సారధిగా చేసి కౌరవసేనను జయించి గోవులను మరలించాడు. నా మాట అసత్యం కాదు. బృహన్నల విజయ వార్తను నగరంలో చాటించు " అన్నాడు. విరాటుడిక ఆగలేక " ఆ పేడిని నా ముందు పొగుడుతావా " అంటూ పాచికలను ధర్మరాజుపై విసిరాడు. అందులో ఒక పాచిక ధర్మరాజు నుదిటిపై బడి గాయం చేసింది. ధర్మరాజు అక్కడే నిలబడి ఉన్న ద్రౌపదిని చూసి తల వంచాడు. ద్రౌపది వెంటనే పరుగున వచ్చి ధర్మరాజు నుదిటి మీద స్రవిస్తున్న రక్తాన్ని తన పైట కొంగుతో అదిమింది. పక్కనే బంగారు కలశంలో ఉన్న నీటితో తన పైట తడిపి తుడిచింది. ఇదిచూసి విరాటుడు " సైరంధ్రీ ! అతని రక్తం నేలపై పడకుండా అలా తుడుస్తున్నావేంటి అన్నాడు " మహారాజా ! ఉన్నత వంశ సంజాతుడైన ఈ బ్రాహ్మణుని రక్తం ఎన్ని చుక్కలు భూమి మీద పడితే అన్ని రోజులు ఈ దేశంలో వర్షాలు పడవు. మన దేశానికి కలుగబోయే కీడుని నివారించడానికే అలా చేసాను " అన్నది సైరంధ్రి.

ఉత్తరకుమారునికి నగరం స్వాగతం పలుకుట[మార్చు]

ఉత్తరకుమారుని విజయానికి ఆనందపడి ఉత్తర తన చెలికత్తెలతో అన్నయ్యకు ఎదురు వెళ్ళి వారిరువురి మీద చందనం, కుంకుమ, పూవులు చల్లి స్వాగతం పలికింది. మిగిలిన వారు కూడా ఉత్తరునికి ప్రశంశల జల్లు గురిపించారు. ఉత్తర కుమారుడు ప్రశంశలకు తట్టుకోలేక బృహన్నల సహకారంతో ఈ విజయం సాధించానని నర్మ గర్భంగా చెప్పాడు. ఇంతలో ఊత్తర కుమారుడు విజయుడై వస్తున్నాడన్న వార్త విరాటునికి చేరింది. విరాటుడు ఆనందంగా వారిని రమ్మని చెప్పమని సేవకులను ఆజ్ఞాపించాడు. ఉత్తర కుమారుడు తండ్రికి నమస్కరించాడు. పక్కనే ఉన్న కంకుభట్టును చూసి నమస్కరించాడు. కంకుభట్టు నుదుటి మీద గాయాన్ని చూసి ఎలా జరిగిందని అడిగాడు. విరాటుడు " నేను నీ విజయాన్ని పొగుడుతుంటే విజయం నీది కాదు బృహన్నలది అన్నాడు. అందుకని నాకు కోపం వచ్చి పాచికలు విసిరాను. కంకుభట్టుకు గాయం అయ్యింది " అన్నాడు ఉత్తరునితో. ఊత్తరుడు తండ్రితో " తండ్రీ ! మహాపరాధం చేసారు. ఇలాంటి మహాత్ములను అగౌరవపరిస్తే మనకు ఆయువు, ఐశ్వైర్యం క్షీణిస్తాయి. ముందు వారిని క్షమాపణ అడగండి " అన్నాడు. విరాటుడు కుమారుని మాట పాటించి కంకుభట్టును క్షమాపణ కోరాడు. కంకుభట్టు నవ్వి ఉత్తర కుమారునితో " అసలు నాకు కోపమే రాలేదు ఇక క్షమాపణలతో పని ఏమి?. విరాటుడు ఉత్తముడు. ఏదో చెడు ఘడియలో అలాచేసాడు " అన్నాడు. విరాటుని మనస్సు కుదుట పడింది.

విరాటుడు ఉత్తరకుమారుని వద్ద యుద్ధవిశేషాలు వినకోరుట[మార్చు]

విరాటుడు కుమారుని చూసి " కుమారా భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కృపాచార్యుల వంటి మహారషులున్న సుయోధన సైన్యాలను నువ్వు ఒక్కడివే ఎలా గెలిచావు. ఒక్కడు పరశురాముని గెలిచిన వాడు. ఒకడు శివుని వరాన పుట్టిన వాడు. ఒకడు అర్జునినికి యుద్ధ విద్యలు నేర్పిన ఆచార్యుడు. దృతరాష్ట్ర కుమారులు ఒక్కొక్కరు ఈ భూమిని గెలువగల సమర్ధులు. అలాంటి వారిని నీవు ఒక్కడివే ఒక్క గాయం కూడా పడకుండా ఎలా గెలిచావు ఆవులను ఎలా మరలించావు. ఒక్కరిని కొడితే పది మంది చుట్టు ముడుతారు కదా. సుయోధనుడిని ఎలా పలాయనం చేయించావు. వినాలని కుతూహలంగా ఉంది చెప్పు " అన్నాడు ఉత్తరుడు " తండ్రీ! కౌరవ సేనలను నేను గెలవ లేదు, గోవులను నేను మరల్చ లేదు. దైవాధీనంగా ఒక దైవాంశ సంభూతుడు వచ్చి కౌరవ సేనలను గెలిచి గోవులను మరల్చి సుయోధనుని పలాయనగతుని చేసాడు. అసలు యుద్ధం ఎలా జరిగిందో చెబుతాను వినండి " అని ఉత్తరుడు చెప్పనారంభించాడు. " బృహన్నలను సారథిగా చేసి నేను యుద్ధానికి వెళ్ళాను. కురు సేనలను చూడగానే నాకు కాళ్ళు చేతులు ఒణకసాగాయి. రథం దిగి పోయాను అప్పుడు ఒక మహానుభావుడు వచ్చి నాకు ధైర్యం చెప్పి నన్ను సారథిగా చేసి కౌరవ సేనలను ఓడించి గోవులను మరలించాడు. సుయోధనుని అడ్డగించి అతనితో ఘోరంగా పోరాడాడు. కౌరవ సేనలను చిత్తు చేసాడు. కర్ణుని తమ్ముని చంపాడు. భీష్మునిపై బాణ ప్రయోగం చేసాడు. ద్రోణుని ఎదిరించాడు. రణ రంగంలో వీరవిహారం చేసాడు " అని చెప్పాడు. విరాటుడు ఆ మహాను భావుని చూపించమని అడుగగా ఉత్తరుడు అతడు అంతర్ధాన మయ్యాడని నేడో రేపో కనపడగలడని చెప్పాడు. కంకు భట్టు తన గాయాన్ని బృహన్నల చూడకుండా ఊత్తరీయాన్ని గాయంపై కప్పుకుంటూ జాగ్రత్త పడుతూ అంతా అర్జునిని పరాక్రమే అని ఆనంద పడ్డాడు.

ధర్మజుని మందిరంలో పాడవుల ద్రౌపది సహిత సమావేశం[మార్చు]

బృహన్నల ఉత్తరుని సమయస్పూర్తికి మెచ్చుకున్నాడు. వారిరువురు సుధేష్ణ వద్దకు వెళ్ళి ఆమె ఆశీర్వాదం పొందారు. ఉత్తర కొరకు నర్తనశాలకు వెళ్ళారు. ఉత్తరుడు బొమ్మ పొత్తికలను ఉత్తరకు ఇచ్చాడు. ఆమె అన్నయ్య పరాక్రమానికి మురిసి పోయింది. ఆ తరువాత పాండవులందరూ ద్రౌపదితో కలిసి ధర్మరాజు మందిరంలో రహస్యంగా సమావేశ మయ్యారు. అర్జునుడు జరిగినదంతా చెప్పాడు. తల వంచుకుని ఉన్న ధర్మజుని చూసి భీమునితో అర్జునుడు " అన్నయ్య నా వైపు ఎందుకు చూడటం లేదని అడిగాడు. ఇక దాచడం కుదరదని ధర్మరాజు " అర్జునా! విరాటుడు తన కుమారుని పొగుడుతుంటే నేను బృహన్నల ఉండగా ఉత్తరుడు విజయం సాధించడంలో విశేష మేమిటని అన్నాను. విరాటుడు కోపించి ఒక పేడిని పొగుడుతావా అని వివేకం నశించి పాచికలు నాపై విసిరాడు. నాకు చిన్న గాయం అయింది " అన్నాడు. ఆమాటలకు భీముడు ఉగ్రుడై " ఆ దురాత్ముని సకుంటుంబంగా యమపురికి పంపి వాని రాజ్యం మనం కైవశం చేసుకుంటాము " అన్నాడు. ధర్మరాజు వారిరువురిని వారించి " కష్టకాలంలో మనకు ఆశ్రయం ఇచ్చిన విరాటుని చంపడం భావ్యము కాదు. అతని పట్ల మనం కృతజ్ఞత మాత్రమే చూపాలి. మనమెవ్వరమో అతనికి వివరిస్తాము. ఆతరువాత కూడా అతడు మనపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే అప్పుడు మీ ఇష్టం అన్నాడు.

పాండవులు తమను తాము బహిరంగ పరచుకొనుట[మార్చు]

మరునాటి ఉదయం పాండవులు ద్రౌపది తమ నిజరూపాలు తెలిసేలా వస్త్రధారణ చేసి సభా ప్రవేశం చేసారు. ధర్మరాజు విరాటుని సింహాసనాన్ని అధిష్టించాడు. విరాటుడు కొలువుకు రాగానే సింహాసనంపై కూర్చున్న ధర్మరాజుని చూసి " ఏమిటిది కంకా ! మా సింహాసనం అధిష్టించింది చాలక మమ్ములను చూసి కూడా లేవకుండా కూర్చున్నావా ఇంతటి అహంకారమా? " అన్నాడు. అర్జునుడు " విరాటా ! ఈయన ధర్మరాజు ఎంతో మంది సామంతులను కను సన్నలతో శాసంచగల చక్రవర్తి. భూమిని నాలుగు చెరగులా జయించి రాజసూయాన్ని నిర్వహించిన మహాను భావుడు. అజాతశత్రువు, సత్యవ్రతుడు, ధర్మమూర్తి అయిన ఇతడు దేవేంద్రుని సింహాసనాన్ని అధిష్టించడానికి కూడా అర్హుడు నీ ఇంత చిన్న సింహాసనాన్ని అధిష్టించడానికి తగడా? " అన్నాడు. అది విన్న విరాటునికి ఆశ్చర్యం, ఆనందం, అనుమానం ఒకేసారి కలిగి " మరి ఈయన ధర్మరాజైతే మిగిలిన వారు ఎవరు. ద్రౌపది ఎక్కడ? " అని అడిగాడు. అర్జునుడు " మహారాజా! ఇప్పటి వరకు నీ వంట శాలలో రుచికరమైన వంటలు చేసి, మల్లయుద్ధాలు చేసి నిన్ను మెప్పించిన వలలుడే భీముడు. అతడు బకాసురుడు, కిమ్మీరులను వదించిన బలశాలి. నీ అశ్వశాలలో అశ్వాలను రక్షిస్తూ నిన్ను సేవించే తంత్రీ పాలుడే మా తల్లి మాద్రి పెద్ద కుమారుడు నకులుడు. గోశాలలో గోవులను కాపాడుతూ సేవిస్తున్న దామ్రగంధి మాద్రి చిన్న కుమారుడు సహదేవుడు. అంతఃపురంలో సైరంధ్రిగా సుధేష్ణను సేవించే మాలినియే ద్రౌపది. ఆమెను అవమానించినందుకే భీముడు కీచకుని, ఉపకీచకులని వధించాడు " అనగాగానే భీముడు అందుకుని " నర్తనశాలలో నాట్యం నేర్పే బృహన్నల అర్జునుడు. ఇంద్రలోకంలో ఊర్వశి ఇచ్చిన శాపం అర్జునినికి ఇలా అజ్ఞాతవాస సమయంలో సహాయపడింది. ఖాండవవనాన్ని దహించి ఇంద్రుని జయించిన మహా వీరుడు. కాలకేయులను చంపిన ఘనుడు. అతడే " అన్నాడు. ఇదంతా కలా నిజమా అని విరాటుడు సంభ్రమాశ్చర్యాలతో మునిగి తేలుచున్న సమయంలో ఊత్తరకుమారుడు " అవును తండ్రీ! నేను చెప్పిన దైవాంశ సంభూతుడు ఇతడే. భయంతో వణుకుతున్న నాకు ధైర్యం చెప్పి యుద్ధం చేసి మనలను గెలిపించిన దివ్యపురుషుడు ఇతడే.

ఉత్తరకుమారుడు అర్జునిని గురించి వర్ణించుట[మార్చు]

అంత ఘోరయుద్ధం నేను ఇంతవరకు చూడ లేదు. రథాన్ని కూడా నడప లేకపోయిన నాకు ధైర్యం చెప్పి కురు సైన్యాలను చిత్తు చేసిన మహా వీరుడు.. అతని అభ్యర్ధన వలన నేను నిన్న ఇతని పేరు వెల్లడించ లేదు. విరాటుడు పరవశించి పోయాడు. అర్జునిని గట్టిగా కౌగలించుకున్నాడు. ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు. భీమ నకుల సహదేవులను ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. అర్జునుడు తన తమ్ములను ఉత్తర కుమారునికి పరిచయం చేసాడు. విరాటుడు తన తమ్ములను, కుమారులను, మంత్రులను పాండవుల దర్శనానినికి పిలిపించాడు. ద్రౌపదిని గురించి చెప్పి తగురీతిన గౌరవించమని సుధేష్ణకు వర్తమానం పంపాడు. అర్జునుడు " విరాటరాజా ! దుస్తరమైన అజ్ఞాతవాసాన్ని మీతో నిర్భయంగా గడిపాము " అన్నాడు. విరాటుడు " అర్జునా ! నేను పరాయి వాడినా. మీ అజ్ఞాతవాసం మా వద్ద గడపటం నా పూర్వజన్మ సుకృతం. ఇక ఈ మత్స్యదేశం మీది. మేమంతా మిమ్మలిని సేవించుకుంటాము. కౌరవుల మీదికి దండెత్తి రావలసి వస్తే మేము మీతో యుద్ధం చేస్తాము " అన్నాడు. ఉత్తరుడు " అదేమిటి తండ్రీ ! మనకంటూ ఒక రాజ్యం ఉందా? కౌరవులతో యుద్ధం చేసి మనలను గెలిపించి మన రాజ్యాన్ని గెలిపించింది వీరే కదా. ఇక ఇది వీరి రాజ్యం. వారి రాజ్యం వారికి ఇవ్వడం హాస్యాస్పదం కాదా. ఇంత కాలం నివురు కప్పిన నిప్పులా ఉన్న వీరిని మనం కూడా అవమానించి అనరాని మాటలన్నాం. వీరిని క్షమాపణ అడగడం మన ధర్మం. ఈ సంపద ఈ సామ్రాజ్యం వీరిదే కనుక వీరికి కానుక ఇవ్వాలంటే ఊత్తరకుమారిని పిలిపించండి " అని తండ్రితో చెప్పాడు.

అర్జునుడు విరాటునితో వియ్యమందుటకు అంగీకరించుట[మార్చు]

ఉత్తరకుమారుని పలుకులు విన్న విరాటుడు ఉత్తరను తీసుకురమ్మని సేవకులను ఆజ్ఞాపించాడు. వారు సుధేష్ణ అనుమతితో ఉత్తరను సర్వాలంకార భూషితను చేసి తీసుకు వచ్చారు. ఉత్తరకు ఎదురు వెళ్ళి విరాటుడు ఆమెను చేయి పట్టి ధర్మరాజు వద్దకు తీసుకు వచ్చి ధర్మరాజుతో " ధర్మరాజా! అజ్ఞానంతో నీ పట్ల చేసిన అపరాధాలు మన్నించి మమ్ము క్షమించమని ప్రార్ధిస్తున్నాను. మీతో బంధుత్వం మాకెంతో శ్రేయస్కరం మా కుమార్తె ఉత్తరను అర్జునుని కిచ్చి వివాహం చేయడం మాకు సమ్మతం. మీ అంగీకారం తెలుపితే ఆనందం " అన్నాడు. ఇదంతా గమనిస్తున్న అర్జునుడు ధర్మరాజు వైపు చూసి అతని చూపులలో అర్ధం గ్రహించి విరాటునితో " విరాటరాజా ! నేను ఉత్తరకు గురువును గురువు తండ్రితో సమానం. కాబట్టి ఈమెను కోడలిగా స్వీకరిస్తాను. నా కుమారుడు అభిమన్యుడికిచ్చి వివాహం చెయ్యండి. అభిమన్యుడు శ్రీకృష్ణుని మేనల్లుడు సుభద్ర కుమారుడు సౌందర్య వంతుడు, విద్యావంతుడు, బాహుబలం కలిగిన వీరుడు, ఉదారుడు, శౌర్యపరాక్రమం కలిగిన వాడు, గుణవంతుడు, పెద్దలమన్నలను పొందిన వాడు " అని కుమారుని గుణగణాలను వివరించాడు. ఆ మాటలకు విరాటుడు సంతోషించి " అర్జునా ! నీతో వియ్యమందడం కంటే కావలసినదేముంది. అన్నగారు కార్య నిర్ణయం చేసి చెపితే దానిని మేము ఆచరిస్తాము " అన్నాడు. ధర్మరాజు " అర్జునుడు మాట్లాడినది ఎంతో సముచితంగా ఉంది. ఇది నాకు సమ్మతమే. మన బందు మిత్రులకు ఈ విషయం తెలియచేయండి " అన్నాడు. విరాటుడు మీ పాండవ వంశంతో వియ్యమందడంతో మా మత్స్యదేశం పావనం అయింది అని ఉత్తర కుమారిచే భీమ, అర్జున, నకుల సహహదేవులకు ప్రణామము చేయించాడు. వారాంతా ఉత్తరను మనసారా దీవించారు. ఉత్తరకుమారి అంతఃపురానికి వెళ్ళింది. పురోహితులను పిలిపించి సుమూహూర్తం నిర్ణయించారు. ఇరు పక్షాలవారికి వివాహఆహ్వాన పత్రిక పంపించారు. ధర్మరాజు విరాటుని కౌగలించుకుని " విరాటా! అజ్ఞాతవాస సమయంలో మాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నందుకు కృతజ్ఞతలు. మాకు శ్రీకృష్ణుడెంతో ఇకపై మీరూ అంతే " అని అభినందనలు తెలిపాడు.

సుయోధనుని సందేహం[మార్చు]

విరాటరాజు కొలువులో పెళ్ళి సంరంభం జరుగుతుండగా హస్తినకు తిరిగి వెళుతున్న సుయోధనునికి ఇంకా సందేహం నివృత్తి కాలేదు. అతనికి కర్ణుడు, శకుని మాటల మీద ఉన్న నమ్మకం భీష్మునిని పలుకులపై లేదు. సందేహ నివృత్తి కొరకు ధర్మరాజు వద్దకు ఒక దూతను పంపి " ధర్మరాజా ! మీ అజ్ఞాతవాసం ముగియక ముందే అర్జునుడు బయట పడ్డాడు. నీవు లెక్క చూసి ఏది ఉచితమో అది చెయ్యి " అని చెప్పించాడు. ఆ మాటలలో ఉన్న అంతరార్ధం గ్రహించి ధర్మరాజు నవ్వి " మేము సమ్మతించి నట్లు పదమూడు సంవత్సరాలు నిండాయి. ఇది నిజం ఈ మాట నీవు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వింటుండగా సుయోధనునికి తెలియ చెయ్యి " అని దూతతో చెప్పాడు. దూత ఆవిషయాన్ని అలానే చెప్పాడు. సుయోధనుడు తాను దూతను పంపిన విషయం దాచి " తాతాగారూ ! ఆచార్యా ! మనం మోసపోయి అనవసరంగా అర్జునినితో యుద్ధం చేసాము. అర్జునుడు పదమూడేళ్ళు నిండిన తరువాత బయటకు వచ్చాడా లేదా అన్న విషయం మనం సరిగా విచారించ లేదు " అన్నాడు. భీష్ముడు " సుయోధనా ! జరిగింది చాలు ప్రతిజ్ఞా భంగం కాలేదు నీ మాటలు ఇక కట్టి పెట్టు ఎవరైనా వింటే నవ్వగలరు. మారు మాటాడక హస్థినకు పద " అన్నాడు. చేసేది లేక సుయోధనుడు హష్తినకు మరలి వెళ్ళాడు.

పాండవులు ఉపప్లావ్యం చేరుట బంధుమిత్రుల రాక[మార్చు]

పాండవులు శమీ వృక్షం దగ్గరకు వెళ్ళి ఆయుధాలకు తగినట్లు పూజించి తమ వెంట తీసుకు వెళ్ళారు. పాడవులు అంతా ఉపప్లావ్యం చేరుకున్నారు. విరాటుని ఆజ్ఞపై ప్రజలంతా పాండవులకు కానుకలు సమర్పించారు. విరాటుడు సమకూర్చిన సౌకర్యాలతో పాండవులు ఉపప్లావ్యంలో సుఖంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు రుక్మిణి, సత్యభామ, సుభద్ర, అభిమన్యుడు, సాత్యకి, కృతవర్మ, సాంబుడు, ప్రద్యుమ్నుడు, యుయుధానుడు, రుక్మి, అకౄరుడు, ఇంద్రసేనుడు మొదలగు వీరులు వెంట రాగా యాదవప్రముఖులతో ఉపప్లావ్యం చేరాడు. పాండవులు శ్రీకృష్ణునికి ఎదురేగి సాదరంగా ఆహ్వానించారు. దృపద మహారాజు, కాశీరాజు శైబ్యుడు తమతమ భార్యా పుత్రులతో ససైన్యంగా ఉపప్లావ్యం చేరారు. అనేక దేశాలనుండి రాజులు ఉత్తరాభిమన్యుల వివాహానికి ఆహుతులుగా వచ్చారు. వివాహ వేదిక అత్యంత శోభాయమానంగా తయారైంది. ఉత్తరను పెళ్ళి కూతురుగా అలంకరించారు. పాండవులను పెళ్ళికి తరలి రమ్మని పురోహితులతో విరాటరాజు ఆహ్వానం పంపాడు. అభిమన్యుని కూడా పెళ్ళి కుమారునిగా అలంకరించి అందరూ పెళ్ళికి తరలి వెళ్ళారు. విరాటుడు శ్రీకృష్ణుని, పాండవులను సాదరంగా ఆహ్వానించాడు. పెళ్ళి తంతు ఆరంభం కాగానే శ్రీకృష్ణుడు, బలరాముడు, ధర్మరాజు, అర్జునుడు, విరాటరాజు సముఖంలో వధూవరులు తెరదగ్గర నిలిచారు. జ్యోతిష్కులు నిర్ణయించిన శుభమూహూర్తం సమీపించింది అని తెలిపిన పిమ్మట వధూవరులు ఒకరిని ఒకరిని చూసుకుని ఆనందించారు. దోసిళ్ళతో తలంబ్రాలు పోసుకున్న పిమ్మట అభిమన్యుడు ఉత్తరపాణి గ్రహణం చేసి ఆపై ఒకే ఆసనంపై ఆసీనులైయ్యారు. విరాటరాజు పాండవులకు, శ్రీకృష్ణునికి, ద్రౌపతిపకి, సుభద్రకు వస్త్రాభరణాలు బహూకరించాడు. ఉత్తరా భిమన్యుల వివాహం వైభవంగా జరిగింది.

బయటి లింకులు[మార్చు]