విల్డెబీస్ట్
| విల్డెబీస్ట్ (ను అని కూడా అంటారు) Temporal range: Early Pleistocene – ప్రస్తుతం | |
|---|---|
| బ్లూ విల్డెబీస్ట్ న్గోరోంగోరో క్రేటర్, టాంజానియా | |
| బ్లాక్ విల్డెబీస్ట్ క్రూగర్స్‌డ్రాప్ గేమ్ రిజర్వ్, దక్షిణాఫ్రికా | |
| Scientific classification | |
| Unrecognized taxon (fix): | Connochaetes |
| Type species | |
| Antilope gnu[1] | |
| జాతి | |
|
కోనోచేటెస్ నౌ – బ్లాక్ విల్డెబీస్ట్ | |
| రేంజి మ్యాపు: బ్లాక్ విల్డెబీస్ట్ పసుపు రంగులో బ్లూ విల్డెబీస్ట్ నీలం రంగులో రెండూ కలిసి ఉన్నవి బ్రౌన్ రంగులో | |
విల్డెబీస్ట్, కోనోచెట్స్ జాతికి చెందిన జింకలు. ఇవి తూర్పు, దక్షిణ ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి. దీనిని ను (Gnu) అని కూడా అంటారు.[2] [3] [4] అవి బోవిడే కుటుంబానికి చెందినవి. ఇందులో జింకలు, పశువులు, మేకలు, గొర్రెలు, ఇతర సరి-సంఖ్యలో గిట్టలుండే గిట్టల జంతువులు ఉన్నాయి. విల్డెబీస్ట్లో రెండు జాతులు ఉన్నాయి. అవి: బ్లాక్ విల్డెబీస్ట్ లేదా వైట్-టెయిల్డ్ గ్ను (సి. గ్నౌ), బ్లూ విల్డెబీస్ట్ లేదా బ్రిండిల్డ్ గ్ను (సి. టౌరినస్).
శిలాజ రికార్డుల ప్రకారం, ఈ రెండు జాతులు దాదాపు పది లక్షల సంవత్సరాల క్రితం విడిపోయాయనీ, ఫలితంగా ఉత్తర, దక్షిణ జాతులు ఏర్పడ్డాయనీ తెలుస్తోంది. బ్లూ విల్డెబీస్ట్ దాని ఒరిజినల్ ఆవాస పరిధిలోనే ఉండిపోయింది. దాని పూర్వజ జాతి కంటే పెద్దగా మారలేదు. బ్లాక్ విల్డెబీస్ట్ మాత్రం దక్షిణాన దాని గడ్డి భూముల ఆవాసాలకు అనుగుణంగా పరిణామం చెందింది. ఈ రెండు జాతులను వేరు చేసే అత్యంత స్పష్టమైన అంశాలు, వాటి రంగు ఒకటి కాగా, వాటి కొమ్ములు మెలితిరిగిన పద్ధతి రెండోది.[5]
తూర్పు ఆఫ్రికాలో, బ్లూ విల్డెబీస్ట్ అత్యంత సమృద్ధిగా కనిపించే పెద్ద-జంతు జాతి; వీటి జనాభాలో కొన్ని, కొత్త మేత ప్రదేశాలకు ఏటా వలస పోతూంటాయి. కానీ బ్లాక్ విల్డెబీస్ట్ కేవలం సంచార జీవి. రెండింటిలోనూ సంతానోత్పత్తి వర్షాకాలం చివరిలో తక్కువ వ్యవధిలో జరుగుతుంది. దూడలు చిన్నవిగా ఉండగానే నడవడం మొదలుపెట్టి, మందతో పాటు సంచరిస్తాయి. వాటి మనుగడకు ఇది చాలా అవసరం. అయినప్పటికీ ఇవి, కొన్ని పెద్ద మాంసాహారులకు, ముఖ్యంగా మచ్చల హైనాలకు ఆహారమౌతూంటాయి.
విల్డెబీస్ట్లు తరచుగా జీబ్రాలతో కలిసి మందలుగా మేస్తూంటాయి. దీనివలన దాడిచేసేమాంసాహారులను ఇవి మరింత చురుగ్గా పసిగట్టగలుగుతాయి. బబూన్ల వంటి ఇతర జంతువులు చేసే హెచ్చరిక సంకేతాలతో కూడా అవి అప్రమత్తమౌతాయి. విల్డెబీస్ట్లు పర్యాటక ఆకర్షణ. కానీ మేత కోసం పెంపుడు జంతువులతో పోటీ పడతాయి. వీటివలన తమపశువులకు వ్యాధులు, పరాన్నజీవులు వస్తున్నాయని రైతులు ఆరోపిస్తూంటారు.[6] చట్టవిరుద్ధంగా వీటిని వేటాడ్డం జరుగుతూ ఉంటుంది. అయితే వీటి జనాభా మాత్రం చాలా స్థిరంగానే ఉంటోంది. విల్డెబీస్ట్లను జాతీయ ఉద్యానవనాలలోను, ప్రైవేట్ భూమిల్లోనూ కూడా చూడవచ్చు. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వారు ఈ రెండు రకాల విల్డెబీస్ట్లనూ ఆందోళన చెందనక్కరలేని జాతులుగా వర్గీకరించారు.
శబ్దవ్యుత్పత్తి
[మార్చు]విల్డెబీస్ట్ అనే పేరు డచ్చివారు పెట్టారు. దీనికి అర్థం అడవి ఎద్దు అని. 1700 ప్రాంతంలో ఇక్కడికి వలస వచ్చిన డచ్చివారు, ఇది అడవి ఎద్దును పోలి ఉన్నందున దీనికి ఆ పేరు పెట్టారు. ఆ తరువాత వందేళ్ళకు, పాశ్చాత్యులు దక్షిణాఫ్రికా ఉత్తర ప్రాంతంలో బ్లూ విల్డెబీస్ట్ల గురించి తెలుసుకున్నారు.
జన్యుశాస్త్రం, సంకరజాతులు
[మార్చు]విల్డెబీస్ట్లోని క్రోమోజోమ్‌ల డిప్లాయిడ్ సంఖ్య 58.[7] మగ, ఆడ విల్డెబీస్ట్లలో క్రోమోజోమ్‌లను అధ్యయనం చేశారు. ఆడదానిలో, చాలా పెద్ద సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్‌ల జత తప్ప మిగిలినవన్నీ అక్రోసెంట్రిక్గా ఉన్నట్లు కనుగొన్నారు. మగదాని క్రోమోజోమ్‌లలో మెటాఫేజ్లను అధ్యయనం చేశారు. దానిలో చాలా పెద్ద సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్‌లు ఉన్నాయి. పరిమాణం, నిర్మాణం రెండింటిలోనూ అవి ఆడదానిలో ఉన్నట్లే ఉన్నాయి. ఇతర క్రోమోజోమ్‌లు అక్రోసెంట్రిక్గా ఉన్నాయి. X క్రోమోజోమ్ పెద్ద అక్రోసెంట్రిక్ కాగా, Y క్రోమోజోమ్ చిన్నది.[8]
విల్డెబీస్ట్లోని రెండు జాతులు పరస్పరం సంకరం చెందుతాయి. మగ బ్లాక్ విల్డెబీస్ట్ ఆడ బ్లూ విల్డెబీస్ట్తో జతకట్టినట్లు నివేదించబడింది. అలాగే అందుకు వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. సామాజిక ప్రవర్తన, ఆవాసాలలోని తేడాలు చారిత్రికంగా జాతుల మధ్య అంతర్స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ను నిరోధించాయి. కానీ అవి రెండూ ఒకే ప్రాంతంలో ఉండాల్సి వచ్చినపుడు హైబ్రిడైజేషన్ సంభవించవచ్చు. ఫలితంగా కలిగే సంతానం, సాధారణంగా పునరుత్పత్తి దాయకంగా ఉంటాయి. దక్షిణాఫ్రికాలోని స్పియోఎన్కాప్ డ్యామ్ నేచర్ రిజర్వ్‌లో ఈ హైబ్రిడ్ జంతువులపై జరిపిన అధ్యయనంలో చాలా వాటికి దంతాలు, కొమ్ములు, పుర్రెలోని వార్మియన్ ఎముకలకు సంబంధించిన అననుకూలమైన అసాధారణలు ఉన్నాయని తేలింది. మరొక అధ్యయనంలో, తల్లిదండ్రులతో పోలిస్తే సంకరజంతువులు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయని తేలింది. కొన్ని జంతువులలో, టెంపోరల్ ఎముక యొక్క టిమ్పానిక్ భాగం చాలా వైకల్యంతో ఉంటుంది. మరికొన్నింటిలో, రత్ని(రేడియస్), అరత్ని (ఉల్నా)లు కలిసి ఉంటాయి. [9]
జాతుల లక్షణాలు
[మార్చు]
విల్డెబీస్ట్లోని రెండు జాతులకూ కాలి వేళ్లు సరిసంఖ్యలో ఉంటాయి. కొమ్ములు, బూడిద-గోధుమ రంగుతో ఈ గిట్టల జంతువులు పశువులను పోలి ఉంటాయి. మగవి ఆడ వాటి కంటే పెద్దవి. రెండింటికీ వాటి వెనుక భాగాలతో పోలిస్తే, ముందు భాగం భారీగా ఉంటుంది. వాటికి విశాలమైన కండలు, రోమన్ ముక్కులు, వంగిన జూలు, తోకలూ ఉంటాయి. [10] నలుపు, నీలం విల్డెబీస్ట్ల మధ్య కొట్టొచ్చినట్టు కనిపించే శరీరనిర్మాణ వ్యత్యాసాలు - వాటి కొమ్ముల వంపూ దిశా, వాటి శరీరపు రంగు. రెండు జాతులలోనూ బ్లూ విల్డెబీస్ట్ పెద్దది. మగ వాటిలో, బ్లూ విల్డెబీస్ట్, భుజం వద్ద 150 cm (59 in) ఎత్తు, 250 kg (550 lb) బరువూ ఉంటుంది. అయితే బ్లాక్ విల్డెబీస్ట్ 111–120 cm (44–47 in) ఎత్తు,[11] బరువు సుమారు 180 kg (400 lb) ఉంటుంది. ఆడవాటిలో, బ్లూ విల్డెబీస్ట్ భుజం ఎత్తు 135 cm (53 in), బరువు 180 kg (400 lb) ఉంటుంది. బ్లాక్ విల్డెబీస్ట్ ఆడ జంతువులు ఎత్తు 108 cm (43 in), బరువు 155 kg (342 lb) ఉంటాయి. బ్లూ విల్డెబీస్ట్ కొమ్ములు పక్కకు పొడుచుకు వచ్చి, తరువాత క్రిందికి వంగి, తరువాత పుర్రె వైపు తిరిగి వంగి ఉంటాయి, అయితే బ్లాక్ విల్డెబీస్ట్ కొమ్ములు ముందుకు తిరిగి, తరువాత క్రిందికి వంగి, ఆపై చివరల వద్ద పైకి వంగి ఉంటాయి. బ్లూ విల్డెబీస్ట్ చారలతో ముదురు బూడిద రంగులో ఉంటుంది, కానీ నీలి మెరుపును కలిగి ఉండవచ్చు. బ్లాక్ విల్డెబీస్ట్కు గోధుమ రంగు బొచ్చు ఉంటుంది, దీని జూలు క్రీమ్ నుండి నలుపు రంగులోను, తోక క్రీమ్ రంగు లోనూ ఉంటాయి. బ్లూ విల్డెబీస్ట్ అడవులలో, గడ్డి భూములతో సహా అనేక రకాల ఆవాసాలలో నివసిస్తుంది, అయితే బ్లాక్ విల్డెబీస్ట్ ప్రత్యేకంగా బహిరంగ గడ్డి భూములలో నివసిస్తుంది. కొన్ని ప్రాంతాలలో, బ్లూ విల్డెబీస్ట్ శీతాకాలంలో ఎక్కువ దూరం వలసపోతుంది, అయితే బ్లాక్ విల్డెబీస్ట్ అలా చేయదు. బ్లాక్ విల్డెబీస్ట్ పాలలో బ్లూ విల్డెబీస్ట్ పాల కంటే ఎక్కువ ప్రోటీన్, తక్కువ కొవ్వు, తక్కువ లాక్టోస్ ఉంటాయి. విల్డెబీస్ట్ 40 సంవత్సరాలకు పైగా జీవించగలదు. అయితే వాటి సగటు జీవితకాలం దాదాపు 20 సంవత్సరాలు.[12] [13]
ఇంటర్డిజిటల్ గ్రంథులు
[మార్చు]విల్డెబీస్ట్లో ఇంటర్డిజిటల్ (గొట్టం) గ్రంథులు దాని ముందు కాళ్లలో మాత్రమే ఉంటాయి. జింబాబ్వే (కాస్టన్ బ్లాక్) కు చెందిన బ్లూ విల్డెబీస్ట్ల రసాయన భాగాలపై చేసిన విశ్లేషణలో, ఈ గ్రంథిలో సైక్లోహెక్సానెకార్బాక్సిలిక్ ఆమ్లం, ఫినాల్, 2-ఫెనిలెథనాల్, మిథైల్ సైక్లోహెక్సానెకార్బాక్సిలేట్, ఆరు షార్ట్-చైన్ కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఉన్నాయని తేలింది.[14]
వ్యాప్తి, ఆవాసాలు
[మార్చు]విల్డెబీస్ట్ సహారాకు దక్షిణంగా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల మైదానాలు, బహిరంగ అడవులలో నివసిస్తుంది. బ్లాక్ విల్డెబీస్ట్ ఆఫ్రికాలోని దక్షిణ భాగాలకు చెందినది. [15] దీని చారిత్రక పరిధిలో దక్షిణాఫ్రికా, ఎస్వాటిని, లెసోతో లు ఉన్నాయి. కానీ చివరి రెండు దేశాలలో ఇది 19వ శతాబ్దంలో వేట కారణంగా అంతరించిపోయింది. ఆ దేశాల్లో వాటిని తిరిగి ప్రవేశపెట్టారు. నమీబియాలో కూడా ప్రవేశపెట్టగా, అది అక్కడ బాగా వృద్ధిచెందింది. [16] ఇది నిటారుగా ఉన్న పర్వత ప్రాంతాలు, 1,350 and 2,150 m (4,430 and 7,050 ft) మధ్య ఎత్తులో ఉన్న దిగువ ఎత్తుపల్లాల కొండలలో బహిరంగ మైదానాలు, గడ్డి భూములు, కరూ పొద భూములలో నివసిస్తుంది.[17] గతంలో, ఇది పొడి శీతాకాలంలో హైవెల్డ్ సమశీతోష్ణ గడ్డి భూములలో, వర్షాల సమయంలో శుష్క కరూ ప్రాంతంలో నివసించేది. అయితే, విస్తృతమైన వేట ఫలితంగా, బ్లాక్ విల్డెబీస్ట్ ఇకపై దాని చారిత్రక పరిధి అంతటా కనిపించదు, వలసలు చేయదు. ఇప్పుడు ఎక్కువగా గేమ్ ఫామ్‌లు, రక్షిత ప్రాంతాలకే పరిమితమైంది.[18]
బ్లూ విల్డెబీస్ట్ తూర్పు, దక్షిణ ఆఫ్రికాకు చెందినది. ఇవి కెన్యా, టాంజానియా, బోట్స్వానా, జాంబియా, జింబాబ్వే, మొజాంబిక్, దక్షిణాఫ్రికా, ఎస్వాటిని, అంగోలాల్లో ఉన్నాయి. [19] ప్రస్తుతం ఇవి మలావీలో కనిపించడం లేదు. నమీబియాలో మాత్రం విజయవంతంగా తిరిగి ప్రవేశపెట్టారు. బ్లూ విల్డెబీస్ట్ ప్రధానంగా అకాసియా సవాన్నాల సరిహద్దులోని చిన్న గడ్డి మైదానాలలో కనిపిస్తాయి. మరీ తడిగా గానీ మరీ పొడిగా గానీ ఉండని ప్రాంతాలలో ఇవి వృద్ధి చెందుతాయి. దట్టమైన పొదలు ఉన్న మేత ప్రాంతాల నుండి ఓపెన్ వుడ్‌ల్యాండ్ వరద మైదానాల దాకా వివిధ ఆవాసాలలో వీటిని చూడవచ్చు. [17] తూర్పు ఆఫ్రికాలో, బ్లూ విల్డెబీస్ట్లు జనాభా, జీవపదార్థం రెండింటిలోనూ అత్యంత సమృద్ధిగా ఉన్న పెద్ద గేమ్ జాతి.[10] టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్, కెన్యాలోని మాసాయి మారా నేషనల్ రిజర్వ్, జాంబియాలోని లియువా ప్లెయిన్ నేషనల్ పార్క్ లకు విల్డెబీస్ట్ చిహ్నం లాంటిది.[12]
వలస
[మార్చు]
విల్డెబీస్ట్లు అన్నీ వలస వెళ్ళే జీవాలు కావు. బ్లాక్ విల్డెబీస్ట్ల మందలు, సంచార జాతులుగా ఉంటాయి లేదా 1 km2 (0.39 sq mi) పరిధిలో సంచరిస్తూ ఉంటాయి. ఎద్దులు కొంత మేర భూభాగాన్ని ఆక్రమించుకుని స్వంతం చేసుకుని ఉంటాయి. సాధారణంగా ఈ భూభాగాల మధ్య దూరం 100 నుండి 400 మీటర్ల దూరం ఉంటుంది. అయితే, ఈ దూరం ఆవాసాల నాణ్యతను బట్టి మారుతూంటుంది. అనుకూలమైన పరిస్థితులలో, వాటిమధ్య దూరం, 9 మీటర్ల మాత్రమే ఉండవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో అవి 1600 మీటర్ల వరకూ ఉండవచ్చు.[20] ఆడ మందలు దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో సంచరిస్తాయి. తమకంటూ స్వంత ప్రాంతం లేని యువ మగ మందలు ఇష్టం వచ్చిన చోట్ల తిరుగుతూ ఉంటాయి. ఎక్కడ తిరగాలనే విషయమై వాటికి పరిమితులేమీ ఉన్నట్లు అనిపించదు.[21]
బ్లూ విల్డెబీస్ట్లలో వలస జనాభా, స్థిర జనాభా రెండూ ఉంటాయి. న్గోరోంగోరోలో, చాలా జంతువులు స్థిర నివాసం ఉంటాయి. మగ జంతువులు ఏడాది పొడవునా భూభాగాలను నిర్వహిస్తాయి. అయినప్పటికీ సంతానోత్పత్తి స్వభావం కాలానుగుణంగా ఉంటుంది. ఆడవి, చిన్నవీ సుమారు 10 జీవుల సమూహాలుగా ఉంటాయి. లేదా పెద్ద సమూహాలలో చేరతాయి. ఒక ప్రదేశమంటూ లేణి మగవి బ్యాచిలర్ సమూహాలను ఏర్పరుస్తాయి. [22] సెరెంగేటి, తరంగిర్ పర్యావరణ వ్యవస్థలలో, జనాభా ఎక్కువగా వలస వెళ్తాయి. తరచుగా ఆడా మగా రెండూ మందలుగా కదులుతాయి. కానీ స్థిరనివాసముండే ఉప జనాభా కూడా ఉంది. జతకట్టే ఋతువులో, మగ జంతువులు కొన్ని గంటలు లేదా ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువ కాలం తాత్కాలికంగా భూభాగాలను ఏర్పరుచుకుని, ఆడ జంతువులను సేకరించడానికి ప్రయత్నిస్తాయి. కానీ అనతి కాలంలోనే అవి ముందుకు సాగాల్సి ఉంటుంది. ముందుకు వెళ్ళి, మరొక తాత్కాలిక భూభాగాన్ని ఏర్పాటు చేసుకుంటాయి.[22]
మాసాయి మారా గేమ్ రిజర్వ్‌లో, వలస వెళ్ళని బ్లూ విల్డెబీస్ట్ల జనాభా 1977లో దాదాపు 1,19,000 జంతువుల నుండి 1997లో దాదాపు 22,000కి తగ్గింది. వ్యవసాయ పద్ధతుల్లో మార్పుల ఫలితంగా, మేత భూమి తగ్గడం, మేత కోసం పశువులతో పోటీ, వర్షపాతంలో హెచ్చుతగ్గులూ ఈ తగ్గుదలకు కారణమని భావిస్తున్నారు.[23]
ప్రతి సంవత్సరం, కొన్ని తూర్పు ఆఫ్రికా బ్లూ విల్డెబీస్ట్లు సుదూరాలకు వలసపోతాయి. ఏటా వచ్చే వర్షపాతం, గడ్డి పెరుగుదలను బట్టి ఈ వలస ఉన్నట్లు అనిపిస్తుంది. వర్షాకాలం, పొడి సీజన్లలో వాటి వలసల సమయం సంవత్సరానికి (నెలల వారీగా) గణనీయంగా మారవచ్చు. తడి సీజన్ అంటంలో (తూర్పు ఆఫ్రికాలో మే లేదా జూన్), తాగునీటికి కొరత ఏర్పడుతుంది. దీనికి ప్రతిగా విల్డెబీస్ట్లు పొడి-కాల ప్రాంతాలకు వలసపోతాయి. మళ్ళీ వర్షాకాలం ప్రారంభమైనప్పుడు (కొన్ని నెలల తర్వాత), మళ్ళీ వాటి తడి-కాల ప్రాంతాలకు తిరిగి వెళ్తాయి. వలసలను ప్రభావితం చేసే కారకాలు ఆహార సమృద్ధి, ఉపరితల నీటి లభ్యత, మాంసాహారులు, గడ్డిలో భాస్వరం కంటెంట్. భాస్వరం అన్ని జీవ రూపాలకు, ముఖ్యంగా పాలిచ్చే ఆడ బోవిడ్లకు కీలకమైన అంశం. ఫలితంగా, వర్షాకాలంలో, విల్డెబీస్ట్లు ముఖ్యంగా అధిక భాస్వరం స్థాయిలను కలిగి ఉన్న మేత ప్రాంతాలను ఎంచుకుంటాయి. [10] ఒక అధ్యయనంలో, భాస్వరంతో పాటు, సాపేక్షంగా అధిక నత్రజని కంటెంట్ కలిగిన గడ్డి ఉండే ప్రాంతాలను విల్డెబీస్ట్లు ఎంచుకుంటాయి.
మంద కదలికలో ఒక స్థాయి వ్యవస్థీకరణ ఉంటుందని వైమానిక ఫోటోగ్రఫీలో తేలింది. ఇది ప్రతి జంతువుకూ ఇది స్పష్టంగా కనిపించదు; ఉదాహరణకు, కదిలే మందకు ముందుభాగంలో తరంగాల లాంటి కదలిక ఉంటుంది. దీన్నిబట్టి, ఇలాంటివి స్థానికంగా తీసుకునే నిర్ణయం వలన జరుగుతుందని భావిస్తున్నారు. అనేక డాక్యుమెంటరీలలో విల్డెబీస్ట్ నదులను దాటుతున్నట్లు చూపిస్తాయి. వాటిలో చాలా వాటిని మొసళ్ళు తింటాయి లేదా ఆ ప్రయత్నంలో మునిగిపోతాయి. ఇటీవలి పరిశోధనలో, విల్డెబీస్ట్ల మందకు "మంద మేధ" అనేది ఉంటుందని చూపించింది. దీని ద్వారా ఇవి ఒక క్రమపద్ధతిలో శోధించి, అడ్డంకులను ఒకటిగా అధిగమిస్తాయి.[24]
జీవావరణ శాస్త్రం
[మార్చు]ప్రిడేటర్లు
[మార్చు]
విల్డెబీస్ట్లను తినే ప్రధాన మాంసాహారులలో సింహం, హైనా, ఆఫ్రికన్ అడవి కుక్క, చిరుత, చిరుతపులి, నైలు మొసలి ఉన్నాయి. ఇవి ఇతర జంతువుల కంటే విల్డెబీస్ట్ను ఎక్కువ ఇష్టపడతాయి.[12] అయితే, విల్డెబీస్ట్ చాలా బలంగా ఉంటుంది. సింహాన్ని కూడా ఎదిరించి, దెబ్బతీయగలదు. విల్డెబీస్ట్ గరిష్టంగా 80 km/h (50 mph) వేగంతో పరిగెత్తగలదు.[25] [26] మందలుగా చరించడం అనేది, వాటి ప్రాథమిక ఆత్మరక్షణ వ్యూహం. ఈ మందల్లో చిన్న జంతువులను పెద్దవి రక్షిస్తూంటాయి. అన్నీ మందగానే పరిగెత్తుతాయి. సాధారణంగా, వేటాడే జంతువులు ఒక చిన్న జంతువునో, అనారోగ్యంతో ఉన్న జంతువునో మందనుంచి వేరుచేసి దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. ఈ పద్ధతులకు ప్రతిగా విల్డెబీస్ట్లు కూడా అదనపు అధునాతన సహకార ప్రవర్తనలను అభివృద్ధి చేసుకున్నాయి. ఇవి వంతులవారీగా నిద్రపోతూ, మెలకువగా ఉండేవి వేటాడే జంతువులను రాత్రి దాడి నుండి రక్షణగా నిలుస్తాయి. విల్డెబీస్ట్ వలసలను రాబందులు దగ్గరగా అనుసరిస్తూంటాయి. ఎందుకంటే విల్డెబీస్ట్ మృతదేహాలు ఈ స్కావెంజర్లకు ముఖ్యమైన ఆహార వనరు. అందుబాటులో ఉన్న విల్డెబీస్ట్ మృతదేహాలలో 70% దాకా రాబందులే తింటాయి. వలస వచ్చే విల్డెబీస్ట్ సంఖ్య తగ్గడం కూడా రాబందులపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. టాంజానియాలోని సెరెంగేటి పర్యావరణ వ్యవస్థలో, విల్డెబీస్ట్ల వలన ఇతర, చిన్న జంతువుల వలసలు కూడా పెరుగుతాయి. ఉదాహరణకు థామ్సన్స్ గాజెల్లు. విల్డెబీస్ట్ గడ్డి మేయగా, ఆ తరువాత మొలకలెత్తే కొత్త గడ్డి వీటికి చక్కటి ఆహారం.
మాంసాహారులు కాని వాటితో సంకర్షణలు
[మార్చు]వేటాడటానికి ఎక్కువ అవకాశం ఉండే బహిరంగ సవాన్నా వాతావరణాలలో జీబ్రాలు, విల్డెబీస్ట్లు కలిసి సమూహంగా ఉంటాయి. ఈ సమూహ వ్యూహం వలన, వేటాడే ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే పెద్ద సమూహాల్లో ఉండడం వలన ఒక్కో జంతువును వేటాడే అవకాశం తగ్గుతుంది. బహిరంగ ప్రదేశాలలో వేటాడే జంతువులను సులభంగా చూడవచ్చు. కాలానుగుణంగా వలస వెళ్ళే వేలాది విల్డెబీస్ట్ల ఉనికి వలన జిరాఫీ దూడలపై స్థానిక సింహాల వేట తగ్గిపోతుంది. ఫలితంగా జిరాఫీల మనుగడ ఎక్కువగా ఉంటుంది.
విల్డెబీస్ట్లు ఇతర జాతుల అరుపులను కూడా విని అర్థం చేసుకోగలవు. తద్వారా, తమను వేటాడే జంతువుల నుండి కాచుకుంటాయి. ఒక అధ్యయనం ప్రకారం, ఇతర గిట్టల జంతువులతో పాటు విల్డెబీస్ట్లు, బబూన్లు పరస్పరం పోటీ పడేటపుడు చేసే కేకలతో పోలిస్తే అవి ఆందోళనతో చేసే అరుపులకు మరింత బలంగా ప్రతిస్పందిస్తాయని తేలింది - ఈ రెండు రకాల శబ్దాలకూ ఒకే విధమైన నమూనా, తీవ్రత, వ్యవధి వగైరాలు ఉన్నప్పటికీ. అరుపులు, బబూన్లు సింహాలను చూసి ప్రతిస్పందనగా చేసినవి కాగా, కేకలు రెండు మగ బబూన్ల మధ్య వివాదం రేగినప్పుడు రికార్డు చేసినవి. విల్డెబీస్ట్లు మేత కోసం పెంపుడు జంతువులతో పోటీపడుతాయి. కొన్నిసార్లు వాటినుండి వ్యాధులు, పరాన్నజీవులూ తమ పశువులకు సంక్రమిస్తున్నాయని రైతులు ఆరోపిస్తారు.[27]
ప్రజననం, ప్రత్యుత్పత్తి
[మార్చు]విల్డెబీస్ట్ల మధ్య శాశ్వత జంట బంధాలుండవు. సంభోగం సమయంలో లేదా జతకూడే సమయంలో, మగవి తాత్కాలిక భూభాగాలను ఏర్పరచుకుని ఆడ జంతువులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. ఈ భూభాగాల విస్తీర్ణం, దాదాపు 3,000 square metres (32,000 sq ft; 0.74 acres), 1 square kilometre (0.39 sq mi; 250 acres) వరకూ ఊండవచ్చు. మగ జంతువులు ఈ భూభాగాలను ఇతర మగ జంతువుల నుండి రక్షించుకుంటూ, ఎదకొచ్చిన ఆడ జంతువుల కోసం పోటీ పడతాయి. మగ జంతువులు ఆడ జంతువులను తమ భూభాగాల్లోకి ఆకర్షించడానికి గుసగుసలు, విలక్షణమైన ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. విల్డెబీస్ట్లు సాధారణంగా వర్షాకాలం చివరిలో, పుష్టిగా ఆహారం తిన్నాక, వాటి ఫిట్నెస్ గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు సంతానోత్పత్తి చేస్తాయి.[10] ఇది సాధారణంగా మే - జూలై మధ్య జరుగుతుంది. జననం సాధారణంగా జనవరి - మార్చి మధ్య, వర్షాకాలం ప్రారంభంలో జరుగుతుంది. ఆడ విల్డెబీస్ట్లు కాలానుగుణంగా సంతానోత్పత్తి చేస్తాయి. ఆకస్మికంగా అండోత్సర్గము చేస్తాయి.
ఎద చక్రం దాదాపు 23 రోజులు, గర్భధారణ కాలం 250 నుండి 260 రోజులు ఉంటుంది. పుట్టినప్పుడు దూడలు దాదాపు 21 kg (46 lb) ఉంటాయి.[28] పుట్టాక నిమిషాల్లోనే కాళ్ళపై లేచి నిలబడి, ఆ తర్వాత వెంటనే మందతో కదలగలవు.[12] ఇలా ఉంటేనే అవి మనగలుగుతాయి.[29] దూడలను ప్రధానంగా తినేది, మచ్చల హైనా. దూడల బాల్యం గరిష్టంగా 2-3 వారాల పాటు ఉంటుంది. చిన్నచిన్న ఉప జనాభా గుంపుల్లోను, వివిక్త సమూహాలలోనూ దూడల మరణాలు 50% వరకు ఉండవచ్చు. అయితే, పెద్ద సమూహాలలో లేదా పెద్ద మందల దగ్గర నివసించే చిన్న సమూహాలలో, మరణాల రేటు 20% కంటే తక్కువగా ఉండవచ్చు.[30]
మగ విల్డెబీస్ట్లు ఏర్పాటు చేసిన చిన్న ప్రాంతాలలో ఆడ విల్డెబీస్ట్లు, చిన్న జంతువులూ సమూహాలుగా నివసిస్తాయి. విల్డెబీస్ట్ సమూహాలు విలీనమైనప్పుడు, ఆడ జంతువులు మగ జంతువులు తక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతాలకు వెళ్లడానికి ఎంచుకుంటాయి. అంచేత, ఆడ-మగ నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ స్త్రీ-ఆధిపత్య లింగ నిష్పత్తి అక్రమ వేట, మానవ అంతరాయం వల్ల కావచ్చు. వేట కారణంగా మగ జీవుల మరణాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తారు.
ముప్పు, పరిరక్షణ
[మార్చు]IUCN రెడ్ లిస్ట్‌లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వారు అతి తక్కువ ఆందోళన కలిగించే జాతిగా బ్లాక్ విల్డెబీస్ట్ను వర్గీకరించారు. ఈ జాతుల జనాభా పెరుగుతోంది. ఇప్పుడు, 18,000 కంటే ఎక్కువ జంతువులు ఉన్నాయని భావిస్తున్నారు. వాటిలో 7,000 నమీబియాలో, వాటి సహజ పరిధికి వెలుపల, దానిని పెంచే ప్రదేశాలలో ఉన్నాయి. దాదాపు 80% విల్డెబీస్ట్ ప్రైవేట్ ప్రాంతాలలో ఉంటుంది. మిగిలిన 20% రక్షిత ప్రాంతాలలో ఉంటుంది. నమీబియాలో దీని పునరుత్థాన ప్రయత్నం విజయవంతమైంది. అక్కడ వీటి జనాభా 1982లో 150 నుండి 1992లో 7,000కి గణనీయంగా పెరిగింది.[16]

బ్లూ విల్డెబీస్ట్ను కూడా అతి తక్కువ ఆందోళన కలిగించే జంతువుగా రేటింగు ఇచ్చారు. జనాభా ధోరణి స్థిరంగా ఉంది. వాటి సంఖ్య దాదాపు 15,00,000 ఉంటుందని అంచనా వేసారు - ప్రధానంగా సెరెంగేటి నేషనల్ పార్క్ (టాంజానియా)లో 1998 నాటికి జనాభా 13,00,000కి పెరగడం వల్ల [31] అయితే, ఉపజాతులలో ఒకటైన తూర్పు తెల్లటి గడ్డం గల విల్డెబీస్ట్ ( C. t. albojubatus ) సంఖ్య బాగా తగ్గింది. జనాభా సాంద్రత హ్వాంగే, ఎటోషా జాతీయ ఉద్యానవనాలలో 0.15/కిమీ 2 నుండి న్గోరోంగోరో కన్జర్వేషన్ ఏరియా, సెరెంగేటి జాతీయ ఉద్యానవనంలో 35/కిమీ 2 వరకు ఉంటుంది.[17]
జీవ ప్రక్రియగా భూ వలసలకు పెద్ద, నిరంతరాయంగా ఉండే నేల అవసరం. ప్రకృతిపై మానవుడు పోటీ పడుతున్నప్పుడు వీటిని నిర్వహించడం చాలా కష్టం. కంచెలు, రోడ్లు వంటి అడ్డంకులు పెట్టినందున వలసలకు అత్యంత తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది. కంచెల వలన వలసలపై పడే విపరిణామాలకు ఒక ఉదాహరణ, బోట్స్వానాలో అధికారులు కలహరి అంతటా ఏర్పాటు చేసిన వేల కిలోమీటర్ల కంచెలు. ఈ కంచె విల్డెబీస్ట్లు నీటి గుంటలు, మేత స్థలాలకు చేరనీయకుండా అడ్డుకుంది. దీని ఫలితంగా పదివేల మంది వ్యక్తులు మరణించారు. విల్డెబీస్ట్ల జనాభా దాని మునుపటి పరిమాణంలో 10% కంటే తక్కువకు తగ్గిపోయింది.[32] అనేక ప్రాంతాలలో అక్రమ వేట ఒక ప్రధాన సమస్య. ప్రధాన మాంసాహారులు (ఇందులో సింహాలు, చిరుతలు, ఆఫ్రికన్ వేట కుక్కలు, చిరుతలు, హైనాలు ఉన్నాయి) కలిగించే సహజమైన ముప్పు ఎలాగూ ఉండనే ఉంది. నలుపు, నీలం విల్డెబీస్ట్లు సాధారణ పరిధిని పంచుకునే చోట్ల, రెండూ సంకరీకరించగలవు. బ్లాక్ విల్డెబీస్ట్ల జనాభాకు దీన్ని ముప్పుగా పరిగణిస్తున్నారు. [33]
ఉపయోగాలు, మానవులతో పరస్పర చర్య
[మార్చు]విల్డెబీస్ట్ అనేక ఉపయోగకరమైన జంతు ఉత్పత్తులను అందిస్తుంది. దీని చర్మం మంచి-నాణ్యత గల తోలును ఇస్తుంది. మాంసం ముతకగా, పొడిగా, గట్టిగా ఉంటుంది.[20] విల్డెబీస్ట్లను ఆహారం కోసం, ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో బిల్టాంగ్ తయారీకి చంపుతారు. ఈ ఎండిన గేమ్ మాంసం ఆఫ్రికాలో రుచికరమైన, ముఖ్యమైన ఆహార పదార్థం.[10] ఆడ జీవుల మాంసం మగవాటి కంటే మృదువుగా ఉంటుంది. శరదృతువు కాలంలో మరింత మృదువుగా ఉంటుంది. విల్డెబీస్ట్ అక్రమ మాంసం వేటగాళ్లకు ఒక సాధారణ లక్ష్యం. ఎందుకంటే వాటి అధిక సంఖ్య కారణంగా వాటిని కనుక్కోవడం సులభం. వంటవారు విల్డెబీస్ట్ మృతదేహాన్ని సాధారణంగా 11 ముక్కలుగా కోస్తారు. 2008 ప్రాంతంలో విల్డెబీస్ట్ మాంసం అంచనా ధర 1 kilogram (2.2 lb) కు 0.47 డాలర్లుండేది. బ్లాక్ విల్డెబీస్ట్కు ఉండే సిల్కీ, ప్రవహించే తోకను ఫ్లై-విస్క్‌లు లేదా చౌరీలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.[20]
విల్డెబీస్ట్లు వాటి విసర్జనతో నేల సారాన్ని పెంచడం ద్వారా పర్యావరణ వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తాయి. అవి ప్రధాన పర్యాటక ఆకర్షణ కావడం వలన అవి మానవులకు ఆర్థికంగా కూడా ముఖ్యమైనవి. అవి తోలు వంటి ముఖ్యమైన ఉత్పత్తులను కూడా మానవులకు అందిస్తాయి. [34] అయితే, విల్డెబీస్ట్ మానవులపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇవి వాణిజ్య పశువులకు పోటీదారులు. వాటిలో వ్యాధులను వ్యాపింపజేస్తాయి. జంతువులలో, ముఖ్యంగా పెంపుడు పశువులలో అంటువ్యాధులను కలిగిస్తాయి. అవి పేలు, ఊపిరితిత్తుల పురుగులు, టేప్‌వార్మ్‌లు, ఈగలు, పారాంఫిస్టోమ్ ఫ్లూక్లను కూడా వ్యాప్తి చేస్తాయి.[35]

GNU ప్రాజెక్ట్ఉకు,[36] GNU ఆపరేటింగ్ సిస్టమ్కూ చిహ్నంగా విల్డెబీస్ట్ను ఎంచుకున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Wilson, D.E.; Reeder, D.M., eds. (2005). Mammal Species of the World: A Taxonomic and Geographic Reference (3rd ed.). Johns Hopkins University Press. ISBN 978-0-8018-8221-0. OCLC 62265494.
- ↑ "Gnu | Define Gnu at Dictionary.com". Dictionary.reference.com. 12 ఏప్రిల్ 1997. Retrieved 25 మార్చి 2014.
- ↑ "gnu noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 25 మార్చి 2014.
- ↑ "gnu – definition of gnu by the Free Online Dictionary, Thesaurus and Encyclopedia". Thefreedictionary.com. Retrieved 25 మార్చి 2014.
- ↑ "wildebeest noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 6 సెప్టెంబరు 2025.
- ↑ "wildebeest noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 6 సెప్టెంబరు 2025.
- ↑ Skinner, J. D.; Chimimba, C. T. (2005). The Mammals of the Southern African Subregion (3rd ed.). Cambridge: Cambridge University Press. pp. 645–8. ISBN 978-0-521-84418-5.
- ↑ Groves, C.; Grubb, P. (2011). Ungulate Taxonomy. Baltimore, Maryland: Johns Hopkins University Press. ISBN 978-1-4214-0093-8.
- ↑ De Klerk, B. (2008), An osteological documentation of hybrid wildebeest and its bearing on black wildebeest (Connochaetes gnou) evolution (Doctoral dissertation)
- 1 2 3 4 5 Ulfstrand, Staffan (2002). Savannah Lives: Animal Life and Human Evolution in Africa. Oxford University Press. ISBN 978-0-19-850925-7. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "ulfstrand" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "wildebeest noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 6 సెప్టెంబరు 2025.
- 1 2 3 4 "Wildebeest". National Geographic. 11 నవంబరు 2010. Archived from the original on 3 ఫిబ్రవరి 2010. Retrieved 25 మార్చి 2014.
- ↑ "gnu noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 25 మార్చి 2014.
- ↑ "wildebeest noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 6 సెప్టెంబరు 2025.
- ↑ "wildebeest noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 6 సెప్టెంబరు 2025.
- 1 2 Vrahimis, S.; Grobler, P.; Brink, J.; Viljoen, P.; Schulze, E. (2017). "Connochaetes gnou". IUCN Red List of Threatened Species. 2017.
{{cite journal}}:|access-date=requires|url=(help) - 1 2 3 IUCN SSC Antelope Specialist Group (2016). "Connochaetes taurinus". IUCN Red List of Threatened Species. 2016.
{{cite journal}}:|access-date=requires|url=(help) ఉల్లేఖన లోపం: చెల్లని<ref>ట్యాగు; "iucntaur" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Estes, R. D. (2004). The Behavior Guide to African Mammals: Including Hoofed Mammals, Carnivores, Primates. University of California Press. p. 133. ISBN 978-052-0080-850.
- ↑ "wildebeest noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 6 సెప్టెంబరు 2025.
- 1 2 3 Nowak, R. M. (1999). Walker's Mammals of the World (6th ed.). Johns Hopkins University Press. pp. 1184–6. ISBN 978-0-8018-5789-8. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "nowak" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Huffman, B. "Connochaetes gnou: White-tailed gnu, Black wildebeest". Ultimate Ungulate. Retrieved 19 జనవరి 2014.
- 1 2 Leuthold, Walter (1977). "The Influence of Environmental Factors on the Spatial and Social Organization". African Ungulates. Zoophysiology and Ecology. Vol. 8. pp. 227–235. doi:10.1007/978-3-642-81073-2_18. ISBN 978-3-642-81075-6.
- ↑ "wildebeest noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 6 సెప్టెంబరు 2025.
- ↑ "gnu noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 25 మార్చి 2014.
- ↑ "wildebeest noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 6 సెప్టెంబరు 2025.
- ↑ "gnu noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 25 మార్చి 2014.
- ↑ "wildebeest noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 6 సెప్టెంబరు 2025.
- ↑ Benirschke, Kurt (2002). "Wildebeest, Gnu". Comparative Placentation. University of California San Diego. Retrieved 25 మార్చి 2014.
- ↑ "wildebeest noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 6 సెప్టెంబరు 2025.
- ↑ "gnu noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 25 మార్చి 2014.
- ↑ "gnu noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 25 మార్చి 2014.
- ↑ Williamson, D.T.. "Wildebeest Mortality During 1983 at Lake Xau, Botswana".
- ↑ Grobler, J. P.. "Management of hybridization in an endemic species: decision making in the face of imperfect information in the case of the black wildebeest—Connochaetes gnou'".Grobler, J. P.; Rushworth, I.; Brink, J. S.; Bloomer, P.; Kotze, A.; Reilly, B.; Vrahimis, S. (5 August 2011).
- ↑ Geraci, G. "Connochaetes taurinus: blue wildebeest". University of Michigan Museum of Zoology. Animal Diversity Web. Retrieved 22 జనవరి 2014.
- ↑ Talbot, L. M.; Talbot, M. H. (1963). Wildlife Monographs:The Wildebeest in Western Masailand, East Africa. National Academies. pp. 20–31.
- ↑ "gnu noun – definition in the British English Dictionary & Thesaurus – Cambridge Dictionaries Online". Dictionary.cambridge.org. 18 ఫిబ్రవరి 2014. Retrieved 25 మార్చి 2014.