వివేకవర్థని
వివేకవర్ధని కందుకూరి వీరేశలింగం ప్రారంభించిన మొట్టమొదటి తెలుగు పత్రిక. ఇది మాసపత్రికగా ప్రారంభమై, పక్ష పత్రికగా తొమ్మిదేళ్ళు నడిచి, తరువాత వార పత్రికగా స్థిరపడినది.
చరిత్ర
[మార్చు]ఇది 1874 సంవత్సరం ఆశ్వయుజమాసంలో రాజమండ్రిలో ప్రారంభించబడినది. పత్రిక చెన్నపురి లోని కొక్కొండ వేంకటరత్నం పంతులువారి సంజీవినీ ముద్రాక్షర శాలలో ముద్రించబడేది. కొందరు భాగస్వాములను కలుపుకొని 1876 ఏప్రిల్‌లో స్వగృహంలో సొంత ముద్రణాలయం నెలకొల్పి పత్రికను ముద్రించేవారు. 1876 జూలై నుంచి 1885 వరకు పక్షపత్రికగా నడిచి, ఆ తరువాత వారపత్రికగా మారింది.[1]
పత్రిక ఉద్దేశాలు
[మార్చు]వీరేశలింగం పత్రిక ముఖ్యోద్దేశాలను నాలుగు అంశాలుగా ప్రకటించారు.
- రాజకీయ ఉద్యోగులలో లంచాలు పుచ్చుకోవడం అనే అక్రమాన్ని మాన్పించడం.
- లంచాలు ఇచ్చే ప్రజలలో నీతిని పాటించాలనే దృష్టిని ఏర్పరచి వృద్ధిచేయాలి.
- సంఘంలోని వేశ్యాగమనాదులు వంటి కులాచారాలను చక్కబరుచుట.
- మత సంప్రదాయాల కన్నా సత్ప్రవర్తనము కలిగిఉండటం ముఖ్యమైనదని తెలియజేయుట.
ఇబ్బందులు
[మార్చు]పత్రికా నిర్వహణలో నిజాన్ని సూటిగా, నిర్మొగమాటంగా చెప్పినందుకు ఎటువంటి కష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయో అవన్నీ వీరేశలింగం ఎదుర్కొనవలసి వచ్చింది. వివేకవర్ధని పత్రిక కారణంగా వీరేశలింగం దౌర్జన్యాలను ఎదుర్కొనవలసి వచ్చింది. కోర్టు కేసులలో పోరాడవలసి వచ్చింది. వివిధ వర్గాల ఆగ్రహావేశాలకు గురికావలసి వచ్చింది.
సంఘంలోని వేశ్యాప్రియత్వం, లంచగొండితనం, అవినీతి ఆశ్రిత పక్షపాతం, తన పత్రిక ద్వారా వెల్లడించి దోషులను తలవంచుకొనేట్టు చేశాడు. రాజమండ్రిలోని ఒక వబ్లిక్ ప్రాసి క్యూటర్ అవినీతిని వివేకవర్థని వెల్లడించడంతో ప్రభుత్వం విచారణ జరపాల్సి వచ్చింది. నేరం వెల్లడి కావడంతో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వృత్తాంతం ఆంధ్రదేశమంతా కార్చిచ్చులా వ్యాపించి పెద్ద సంక్రోభం కలిగించిందని కొండా వెంకటప్పయ్య పంతులు స్వీయచరిత్రలో రాశాడు.[2]
సంఘోద్ధరణ
[మార్చు]వివేకవర్ధిని పత్రిక సంఘంలోని పలు సమస్యలకు వ్యతిరేకంగా పోరాడి మంచి పేరు తెచ్చుకుంది. స్త్రీవిద్యకు వ్యతిరేకంగా రచనలు చేసేవారితో సైద్ధాంతికమైన చర్చలతో ఒప్పించే ప్రయత్నం చేసేవారు ఈ పత్రిక ద్వారా. పత్రికలో స్త్రీవిద్యకు అనుకూలమైన వాదాలను ప్రతిపాదించేవారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ డా. జె., చెన్నయ్య (2003). తెలుగు దినపత్రికలు భాషాసాహిత్య స్వరూపం. హైదరాబాదు: రవికిరణ పబ్లికేషన్స్. p. 46.
- ↑ వై.వి., కృష్ణారావు; ఏటుకూరి, ప్రసాద్; సురవరం, సుధాకరరెడ్డి; మల్లిక్, eds. (1989). ఆంధ్రప్రదేశ్ దర్శిని-2. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. p. 535.
- ↑ వేంకటశివుడు, రాయసం (1910). "కడచిన 30 సం.ల నుండియు నాంధ్ర దేశమునందలి స్త్రీవిద్యాభివృద్ధి". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 73. Archived from the original on 28 సెప్టెంబరు 2017. Retrieved 6 March 2015.
- ఆంధ్రజాతి అక్షర సంపద తెలుగు పత్రికలు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ, హైదరాబాదు, 2004