వివేచని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివేచని
వివేచని-సాహిత్య విమర్శ
కృతికర్త: తక్కెడశిల జాని
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: సాహిత్య విమర్శ
ప్రచురణ: HSRA PUBLICATIONS
విడుదల:వివేచని అనునది ఆధునిక సాహిత్యంపై వచ్చిన విమర్శా వ్యాసాల సంకనం.[1] దీని రచయిత తక్కెడశిల జాని.

విమర్శ క్షేత్రంలోకి ఆహ్వానం[మార్చు]

ఈ పుస్తకానికి రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ముందుమాట రాశారు. వారి మాటల్లో... జానీని గురించి అలోచించినప్పుడంతా ఆయన నాకు ఒక బాల సాహసవంతుడిగా కనిపిస్తుంటారు. ఇప్పుడు ఆయన వయసు 29 ఏళ్ళు. ఇప్పటికే ఏడు కావ్యాల కవిత్వం రచించారు. ఒక కవిత్వ సంకలనానికి సంపాదకత్వం వహించారు. మూడు పదుల లోపల ఇంత పని చేయడం అరుదైన కృషి. జాని కవిగా స్థిరపడ్డారు. ఆయన దృష్టి విమర్శపై కూడా మరలింది.

ఇదిగో ఈ వివేచని విమర్శ పుస్తకం మనకు అందించారు. వివేచని 50 వ్యాసాల విమర్శ సంపుటి. కవిత్వం, నవల, కథానిక, సాహిత్య విమర్శ ప్రక్రియలపైన రాసిన వ్యాసాలివి. ఇంకా నాటకం జోలికి పోలేదు. జాని రాసిన ఈ 50 సాహిత్య విమర్శ వ్యాసాలలో కువెంపు, గోర్కి ‘అమ్మ’ మీద రాసిన రెండు వ్యాసాలు పోను తక్కిన వ్యాసాలన్నీ తెలుగు సాహిత్యం మీదనే.

జాని తెలుగు నేలలో అన్ని ప్రాంతాల నుండి వస్తున్న సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. ఆధునిక రచయితల అధ్యయనం, అన్ని కాలాలకు, అన్ని భావజాలాలకు, చెందిన రచయితలను అధ్యయనం చేస్తున్నారు. అధ్యయనంలో ఆయన మడి కట్టుకోలేదు. కేంద్ర సాహిత్య అకాడమి, జ్ఞానపీఠ్ పురస్కారాలు పొందిన రచనల నుండి పురస్కారం పొందని రచనల దాక అన్నిటినీ పరామర్శించారు.

గురజాడ నుండి అనేక మంది కవులు ఒక వైపు కవిత్వం రాస్తూ, మరో వైపు విమర్శ కూడా రాస్తూ వచ్చారు. కట్టమంచి, పుట్టపర్తి, విశ్వనాథ, శ్రీశ్రీ, సినారె, కొలకలూరి ఇనాక్, ఎన్. గోపి వంటి వాళ్ళు అనేకులు ఈ పని చేశారు, చేస్తున్నారు. జాని ఈ తాడులో పోగు.

జానీది ఇప్పటికిప్పుడు ఫలానా వాదానికి, ఫలానా ఉద్యమానికి చెందిన విమర్శ అని నిర్వచించి చెప్పలేం. అట్లని ఆయనలో ఏ దృక్పథమూ లేదనీ అనలేం. సాహిత్య వాచకాలను చదువుతున్నారు. అవగాహన చేసుకుంటున్నారు. నచ్చినదీ, నచ్చనిదీ ముక్కుసూటిగా చెబుతున్నారు. రచయిత దృష్టి నుండి, రచన దృష్టి నుండి, సమాజ దృష్టి నుండి, పాఠక దృష్టి నుండి సాహిత్యాన్ని విశ్లేషిస్తున్నారు. ఒక సమగ్ర విమర్శకుడికి అవసరమైన లక్షణాలను జానీ సమకూర్చుకుంటున్నారు. సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ దానిని వివరిస్తూ తనను తాను విస్తరింపజేసుకుంటున్న జానీని ఒక సాహిత్య విమర్శకునిగా నేను ఆయనను సాహిత్య విమర్శ క్షేత్రంలోకి ఆహ్వానిస్తున్నాను.

సాహిత్య విమర్శకులు ఒక రచనలో తాము ఆమోదించినవి చెప్పడం సులభం. ఆమోదించని వాటిని చెప్పడానికి చాలామంది సంకోచిస్తారు. జానీకి ఈ సంకోచం లేదు. అలాగే చాలామందికి భిన్నంగా జాని సీనియర్ రచయితలకు సూచనలు చేయడానికి సంకోచించ లేదు. తెలంగాణ నుండి వచ్చిన అంపశయ్య నవలలో భాషను గురించి ఇలా అన్నారు. వాడిన భాషలో అడుగడుగునా ఇంగ్లిష్ కనపడుతుంది. అసలు ఇది తెలుగు నవలేనా అనే అనుమానం కూడా వచ్చింది. ఆఖరికి తెలంగాణ యాస కూడా పెద్దగా కనపడదు. కనీసం రవి తల్లిదండ్రుల పాత్రలలో తెలంగాణ యాస ఉండి ఉంటే బాగుండేదని అనిపించింది. ‘లజ్జ’ నవలలో “వస్తువు ప్రధాన పాత్ర పోషించి శిల్పాన్ని మింగేసింది” అన్నారు. అంతేకాదు “‘లజ్జ’ ఒక నవలగా అనిపించలేదు కొన్ని వ్యాసాలను కుదించి నవలగా రాయడానికి ప్రయత్నం చేశారని అనిపించింది” అన్నారు. ఈ ముక్కుసూటితనం ఎక్కువ మందిలో ఉండదు. హృదయనేత్రి నవల నిరాశపరిచింది అన్నారు. “పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా” నవలలో స్పష్టత లేదని, పాత్రలలో వాస్తవికత లేదని నిర్దారించారు. అట్లని జానీది నెగిటివ్ మైండ్ కాదు. ఆయన వ్యక్తిగత చర్యలలో కూడా ఎవరినీ ఏ రోజు కూడా చెడ్డ మాటలనరు, తాను విభేదిస్తున్న రచనలు చేసిన రచయితలను గౌరవిస్తూ పరామర్శిస్తున్నారు. జానీ సాధారణంగా మానవుల పట్ల గౌరవంగానే మాట్లాడుతారు అందులో స్త్రీల పట్ల మరింత గౌరవం ప్రకటిస్తారు. ఈ విమర్శలో స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవం చాలా చోట్ల వ్యక్తమౌతుంది.

సాహిత్య విమర్శకుడికి వస్తు విశ్లేషణలో సామాజిక వాస్తవికత జ్ఞానం, శిల్ప విశ్లేషణలతో సౌందర్య శాస్త్ర జ్ఞానం బాగా తెలిసుంటే మంచింది. విమర్శ పరిపక్వంగా ఉంటుంది. జానీ తమ విమర్శ రాసేటప్పుడు ఈ స్పృహలో ఉన్నట్లు ఈ పుస్తకం తెలియజేస్తుంది.

ఎప్పటి రచనైనా సాహిత్య విమర్శకులు విమర్శించవచ్చు. అయితే ఆ రచనలో వర్తమానంతో గల ప్రాసంగికతను చెప్పడం మరిచిపోరాదు. అది చెప్పకపోతే విమర్శ సమగ్రం కాదు. జానీకి ఈ వాస్తవం తెలుసు. గోర్కి ‘అమ్మ’ నవలలోని పరిస్థితులు మన సమాజంలో ఇంకా కొనసాగుతున్నాయని గుర్తించడంలో ఆయన వర్తమాన దృష్టి అర్థమౌతుంది.   సరోగసి, మెర్సీ కిల్లింగ్ వంటి అంశాల మీద వచ్చిన నవలల్లోని పరిశోధన లక్షణాలను జాని బాగా మెచ్చుకున్నారు. కవిగా ఆయన పరిశోధన చేయలేదు. ఇందుకో కారణం ఏ ప్రక్రియ మీద విమర్శ రాసిన విమర్శకుడికి ఆ ప్రక్రియ చరిత్ర స్థూలంగానైనా తెలిసి ఉండాలి. జానీకి ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర జ్ఞానం బాగా ఉంది. చాలా వ్యాసాల్లో ఈ నిజం తెలుస్తుంది. ప్రక్రియ చరిత్రతో పాటు స్వరూప స్వభావాలు కూడా విమర్శకులకు తెలియడం అవసరం. జానీకి ఈ జ్ఞానం కూడా ఉంది.

“కవిత్వం కవికి, రీడర్ కి వంతెనలా ఉండాలి” కవిత్వం మనిషి పక్కన కూర్చొని ముచ్చటించాలి” “రీడర్ విఫలం అవ్వడానికి కారణం కవే” "సాధారణమైన మాటల్లో చెప్పేది కవిత్వం కాదు”

ఇలాంటి అభిప్రాయాలు కవిత్వం పట్ల జానీకి గల పరిజ్ఞానానికి నిదర్శనాలు, జానీ విమర్శ అకడమిక్ గా ఉండదు. ఒక ఫ్రీలాన్స్ విమర్శకుడు రాసినట్లు ఉంటుంది. ఒక సాహితి మిత్రుడితో తాను చదివిన రచనను గురించి తన మిత్రునికి యథాలాపంగా చెప్పినట్లు ఉంటుంది. ఒక బాధ్యతగా ఉంటుంది. విమర్శ భాష పఠనీయంగా, సరళంగా ఉంటుంది.

తెలుగు సాహిత్య విమర్శ ఎదుగుదలలో భవిష్యత్తులో జాని మరింత దోహదం చేయగలరని ఈ పుస్తకం హామీ ఇస్తుంది. ఆయనకు నా అభినందనలు, శుభాకాంక్షలు.

రాచపాళెం చంద్రశేఖర రెడ్డి [2]

మూలాలు[మార్చు]

  1. "HSRA PUBLICATIONS | Self-Publishing In India | Book Publishers |". HSRA PUBLICATIONS (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-11-16.
  2. "అఖిలాశ.. సాహిత్య అభిలాష | జోష్". m.navatelangana.com. Retrieved 2021-11-16.
"https://te.wikipedia.org/w/index.php?title=వివేచని&oldid=4132991" నుండి వెలికితీశారు