Jump to content

విష్ణువు వేయి నామములు-301-400

వికీపీడియా నుండి
విష్ణు సహస్రనామ స్తోత్రము
వేయి నామముల వివరణ
1 - 100
101 - 200
201 - 300
301 - 400
401 - 500
501 - 600
601 - 700
701 - 800
801 - 900
901 - 1000
1 - 1000 లఘు వివరణ
కమలంపై పద్మాసనంలో కూర్చున్న విష్ణువు క్లోజప్. కవి జయదేవుడు విష్ణువుకు నమస్కరించడం, కాగితంపై గౌచే పహారీ, భక్తి చిత్రం, బేర్-బాడీ, తల వంచి, కాళ్లు, చేతులు ముడుచుకుని, జయదేవుడు ఎడమవైపు నిలబడి, పూజా సామగ్రిని పద్మాసనం ముందు ఉంచారు. అక్కడ కూర్చున్న విష్ణువు కవిని ఆశీర్వదించాడు.

విష్ణు సహస్రనామ స్తోత్రములోని వేయి నామాలలో 301 నుండి 400 వరకు నామములకు క్లుప్తంగా అర్ధాలు ఇక్కడ ఇవ్వడమైనది.

విష్ణు సహస్రనామాలను గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు రచించిన భాష్యము వీటిలో ప్రధమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము భగవద్గుణ దర్పణము అనే గ్రంథం విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించినది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.

వివిధ భాష్యకర్తలు వ్యాఖ్యానించిన నామముల జాబితా పరిశీలించినట్లయితే వారు పేర్కొన్న నామములలో స్వల్ప భేదాలు కనిపిస్తాయి. ఈ వ్యాసం చివరిలో చూపిన వనరులు ఆధారంగా వివిధ భాష్యకారుల భాష్యాలను సంక్షిప్తంగా చెప్పే వివిధ భావాలను ఇచ్చే ప్రయత్నం జరిగింది.

కొన్ని నామాలకు ప్రత్యేక వ్యాసాలు కూడా ఉన్నాయి.


విష్ణువు వేయి నామములు- 301-400

301) యుగావర్త: - యుగములను త్రిప్పువాడు.

302) నైకమాయ: - తన మాయాశక్తిచే అనేక రూపములను ధరించి, ప్రదర్శించువాడు.

303) మహాశన: - సర్వమును కబళించువాడు.

304) అదృశ్య: - దృశ్యము కానివాడు.

305) వ్యక్తరూప: - భక్తుల హృదయములలో వ్యక్తరూపుడై భాసిల్లువాడు.

306) సహస్రజిత్ - వేలకొలది రాక్షసులను సంగ్రామమున జయించువాడు.

307) అనంతజిత్ - అనూహ్యమైన శక్తి సామర్ద్యములు కలవాడై, రణరంగమున ఎదిరించువారిని జయించు శక్తి కలవాడు.

308) ఇష్ట: - ప్రియమైనవాడు.

309) అవిశిష్ట: - సర్వాంతర్యామియైనవాడు.

310) శిష్టేష్ట: - బుధజనులైన సాధుమహాత్ములకు ఇష్టుడైనవాడు.

311) శిఖండీ - శిరమున నెమలిపింఛమును ధరించినవాడు.

312) నహుష: - తన మాయచేత జీవులను సంసారమునందు బంధించువాడు.

313) వృష: - ధర్మస్వరూపుడైనవాడు.

314) క్రోధహా - సాధకులలోని క్రోధమును నశింపచేయువాడు.

315) క్రోధ కృత్కర్తా - క్రోధాత్ములగువారిని నిర్మూలించువాడు.

316) విశ్వబాహు: - బాహువులు విశ్వమంతట కలవాడు.

317) మహీధర: - భూమిని ధరించినవాడు.

318) అచ్యుత: - ఎట్టి వికారములకు లోనుగానివాడు. ( ఎటువంటి మార్పు పొందనివాడు.)

319) ప్రధిత: - ప్రఖ్యాతి నొందినవాడు.

320) ప్రాణ: - అంతటా చైతన్య స్వరూపమై నిండి, ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు.

321) ప్రాణద: - ప్రాణ బలము ననుగ్రహించువాడు.

322) వాసవానుజ: - ఇంద్రునకు తమ్ముడు.

323) అపాంనిధి: - సాగరమువలె అనంతుడైనవాడు.

324) అధిష్టానం - సర్వమునకు ఆధారమైనవాడు.

325) అప్రమత్త: - ఏమరు పాటు లేనివాడు.

326) ప్రతిష్ఠిత: - తన మహిమయందే నిలిచియుండువాడు.

327) స్కంద: - అమృత రూపమున స్రవించువాడు.

328) స్కందధర: - ధర్మమార్గమున నిలుపువాడు.

329) ధుర్య: - సర్వ జీవుల ఉత్పత్తి మొదలగు భారములను మోయువాడు.

330) వరద: - వరముల నొసగువాడు.

331) వాయువాహన: - సప్త వాయువులను బ్రహ్మాండమంతటను ప్రవర్తింపచేయువాడు.

332) వాసుదేవ: - అంతటను నిండియున్నవాడు.

333) బృహద్భాను: - ప్రకాశవంతమగు కిరణతేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు.

334) ఆదిదేవ: - సృష్టి కార్యమును ప్రారంభించినవాడు.

335) పురంధర: - రాక్షసుల పురములను నశింపచేసినవాడు.

336) అశోక: - శోకము లేనివాడు.

337) తారణ: - సంసార సాగరమును దాటించువాడు.

338) తార: - గర్భ, జన్మ, జరా, మృత్యురూపమైన భయమునుండి తరింపజేయువాడు.

339) శూర: - పరాక్రమము గలవాడు.

340) శౌరి: - బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు.

341) జనేశ్వర: - జనులకు ప్రభువు.

342) అనుకూల: - సర్వులకు అనుకూలుడైనవాడు.

343) శతావర్త: - ధర్మ రక్షణార్థము అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడు.

344) పద్మీ - పద్మమును చేతియందు ధరించినవాడు.

345) పద్మనిభేక్షణ: - పద్మమువంటి నేత్రములు కలవాడు.

346) పద్మనాభ: - పద్మము నాభియందుండువాడు.

347) అరవిందాక్ష: - కమలరేకులవంటి కన్నులు గలవాడు.

348) పద్మగర్భ: - పద్మగర్భమున నివసించువాడు.

349) శరీరభృత్ - ప్రాణుల శరీరములను పోషించువాడు.

350) మహార్ది: - మహావిభూతులు కలవాడు.

351) బుద్ధ: - ప్రపంచాకారముతో భాసించువాడు.

352) వృద్ధాత్మా - సృష్టికి పూర్వమే ఉన్నవాడు.

353) మహాక్ష: - గొప్ప నేత్రములు గలవాడు.

354) గరుడధ్వజ: - తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడు.

355) అతుల: - సాటిలేనివాడు.

356) శరభ: - శరీరములందు ప్రత్యగాత్మగా ప్రకాశించువాడు.

357) భీమ: - భీకరమైన శక్తి సంపన్నుడు.

358) సమయజ్ఞ: - సర్వులను సమభావముతో దర్శించుటయే తన పూజగా భావించువాడు.

359) హవిర్హరి: - యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు.

360) సర్వలక్షణ లక్షణ్య: - సర్వప్రమాణములచే సిద్ధించు జ్ఞానముచేత నిర్ణయింపబడినవాడు.

361) లక్ష్మీవాన్ - సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు.

362) సమితింజయ: - యుద్ధమున జయించినవాడు.

363) విక్షర: - నాశములేనివాడు.

364) రోహిత: - మత్స్యరూపమును ధరించినవాడు.

365) మార్గ: - భక్తులు తరించుటకు మార్గము తాను అయినవాడు.

366) హేతు: - సృష్టికి కారణము అయినవాడు.

367) దామోదర: - దమాది సాధనలచేత ఉదారమైన బుద్ధిద్వారా పొందబడువాడు.

368) సహ: - సహనశీలుడు.

369) మహీధర: - భూమిని ధరించినవాడు.

370) మహాభాగ: - భాగ్యవంతుడు.

371) వేగవాన్ - అమితమైన వేగము కలవాడు.

372) అమితాశన: - అపరిమితమైన ఆకలి గలవాడు.

373) ఉద్బవ: - ప్రపంచసృష్టికి ఉపాదానమైనవాడు.

374) క్షోభణ: - సృష్టికాలమందు కల్లోలము కల్గించువాడు.

375) దేవ: - క్రీడించువాడు.

376) శ్రీ గర్భ: - సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు.

377) పరమేశ్వర: - ఉత్కృష్ట మైనవాడు.

378) కరణమ్ - జగదుత్పత్తికి సాధనము అయినవాడు.

379) కారణమ్ - జగత్తునకు కారణమైనవాడు.

380) కర్తా - సమస్త కార్యములకు కర్తయైనవాడు.

381) వికర్తా - విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు.

382) గహన: - గ్రహించ శక్యముగానివాడు.

383) గుహ: - వ్యక్తము కానివాడు. కప్పబడినవాడు.

384) వ్యవసాయ: - మానవాళి అభ్యున్నతికి తానే కృషిచేయువాడు.

385) వ్యవస్థాన: - సర్వవ్యవహారములను యధావిధిగ నడుపువాడు.

386) సంస్థాన: - జీవులకు గమ్యస్థానమైనవాడు.

387) స్థానద: - వారివారి కర్మానుసారముగా స్థానముల నందించువాడు.

388) ధ్రువ: - అవినాశియై, స్థిరమైనవాడు.

389) పరర్థి: - ఉత్కృష్టమైన వైభవముకలవాడు.

390) పరమస్పష్ట: - మిక్కిలి స్పష్టముగా తెలియువాడు.

391) తుష్ట: - సంతృప్తుడు.

392) పుష్ట: - పరిపూర్ణుడు

393) శుభేక్షణ: - శుభప్రధమైన దృష్టిగలవాడు.

394) రామ: - నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు.

395) విరామ: - సకలజీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.

396) విరత: - విషయ వాంఛలు లేనివాడు.

397) మార్గ: - మోక్షమునకు మార్గము తానైనవాడు.

398) నేయ: - ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు.

399) నయ: - జీవులను నడిపించి పరమపదస్థితికి గొనిపోవువాడు.

400) అనయ: - తనను నడుపువాడు మరొకడు లేనివాడు.

వనరులు

[మార్చు]