విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నవలను విశ్వనాథ సత్యనారాయణ రచించారు. హాస్యభరితమైన ఈ నవల భాష, వ్యాకరణాలకు సంబంధించిన గంభీరమైన అంశాలను కలిగి ఉన్నా, వ్యంగ్య, హాస్యాలతో సరదాగా సాగుతుంది. [1]

రచన నేపథ్యం

[మార్చు]

1961లో విశ్వనాథ సత్యనారాయణకు వచ్చిన ఓ కల ఈ నవల రచనకు బీజం వేసింది. చమత్కారమైన కల నుంచి కథను అల్లుకుంటూ విశ్వనాథ వారం రోజుల్లో విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నవలను రచించారు.

ప్రధాన ఇతివృత్తం

[మార్చు]

నవలలో ముఖ్యపాత్రగా రచయిత విశ్వనాథ సత్యనారాయణే ఉంటారు. నవల ప్రారంభంలో అభ్యుదయవాదియైన రచయిత స్నేహితుని పాత్ర ఏ కొత్త నవల రాస్తున్నదీ చెప్పమంటే ఆయనకు రచయిత కొత్త నవల చెప్పడంతో ప్రారంభమవుతుంది. అలా చిత్రంగా ప్రారంభమయ్యే ఈ నవలలో ఆపై మరిన్ని విచిత్రమైన అంశాలు ఎదురవుతాయి. వేర్వేరు కాలాలకు చెందిన పంచతంత్ర కర్త విష్ణుశర్మ, ఆంధ్ర మహాభారత కర్త, కవిత్రయంలోని ఒకడైన తిక్కన ముందుగా రచయిత కలలోకి, ఆపై నిజ జీవితంలోకీ వస్తారు. స్వర్గవాసులైన వారు కారణాంతరాల వల్ల రచయితను ఇంగ్లీషు నేర్పమని కోరగా ఆయన అంగీకరిస్తారు. ఈ క్రమంలో విష్ణుశర్మ, తిక్కనలు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. తిక్కన ప్రసంగాల వల్ల ధనం కూడబెట్టి, విష్ణుశర్మ వండిపెట్టగా హాయిగా తింటూ కాలం గడుపుతున్న రచయితను ఇంగ్లీషు నేర్పమని వారిద్దరూ గట్టిగా నిలదీస్తారు. తప్పనిసరై ఆంగ్లాన్ని నేర్పబోగా ఎదురైన అడ్డంకులు, చదువుతున్న విష్ణుశర్మ, తిక్కనలు ఆంగ్లాన్ని, సంస్కృతాంధ్ర భాషలతో పోల్చి చేసే వ్యంగ్య హాస్య భరిత వ్యాఖ్యలు చాలా ఆసక్తికరం. రచయితపై మిత్రుడు ప్రారంభంలో చేసే వ్యాఖ్యలు నాటి సమకాలీన సాహిత్యపరులు కొందరు విశ్వనాథపై, ఆయన సాహిత్యంపై చేసిన విమర్శలను పోలి ఉంటాయి.

పాత్రలు

[మార్చు]

నవలలోని ముఖ్యపాత్రలు:

  1. రచయిత
  2. రచయిత మిత్రుడు
  3. విష్ణుశర్మ
  4. తిక్కన
  5. రచయిత భార్య

కథనం-విశేషాలు

[మార్చు]

రచయిత నవలను ఆయన స్నేహితుడు అడగగా వినిపిస్తున్నట్టు ప్రారంభించడంతో చాలా ఆసక్తి కలిగిస్తుంది. వారిద్దరి మధ్య సంభాషణలో నవలలో అసంబద్ధంగా తోచే అంశాలు రచయిత మిత్రుడు విమర్శించడం దానికి చమత్కారంగా రచయిత సమర్ధించడం మంచి ఎత్తుగడ. ఈ సంభాషణల ద్వారా రచయితకు గొలుసుకట్టు కలలు రావడం, స్వర్గం నుంచి విష్ణుశర్మ, తిక్కన దిగిరావడం వంటి విచిత్రమైన అంశాలకు పాఠకుణ్ణి సిద్ధం చేస్తారు. ఇంగ్లీషు వాక్యనిర్మాణంలోని లొసుగులు, ఆధునిక విద్యాభ్యాసంలోని డొల్లతనం వంటి అంశాలను చెప్పడంలో నేర్పుగా రచయిత ఆంగ్ల భాష పక్షం తీసుకోవడం వంటివి రచయిత కథన నైపుణ్యాన్ని పట్టి ఇస్తుంది.

శైలి, ఉదాహరణలు

[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ ఈ నవలకు నాటకీయ శైలిని ఎంచుకున్నారు. ప్రారంభంలో రచయిత, మిత్రుల సంభాషణలతో ప్రారంభమయిన నవల ఆపై రచయిత మిత్రునితో కథ చెప్పుకుపోతూండడంతో సాగుతుంది. దానితో నవల అంతా సంభాషణాత్మకంగానూ, విష్ణుశర్మ, తిక్కనల వర్ణనలు కూడా రచయిత మిత్రునికి చెప్తున్నట్టుగానూ సాగుతుంది. మాటల్లోని విరుపుతో, విచిత్రమైన వ్యాఖ్యలతో, వింతలు విడ్డూరాలతో ఇలా పలు విధాలుగా హాస్యాన్నీ, వ్యంగ్యాన్ని సాధించారు రచయిత. విష్ణుశర్మ మాటలు అమాయకంగా అనిపిస్తూనే నేటి విద్యావిధానంపై, ఆంగ్లభాషాంశాలపై నిశితమైన విమర్శ చేయడం వంటివి కడుపుబ్బా నవ్విస్తాయి. విశ్వనాథ సాహిత్యంపై మిత్రుడు చేసే విమర్శలు, వాటిని ఆయన ఖండించే తీరు కూడా హాస్యస్ఫోరకంగా ఉంటాయి. నిశితమైన వ్యంగ్యంతో పాటు హాస్యాన్ని కూడా నవలలో విరివిగా పండిస్తారు.

నవలలో భాషకందని భావం ఎంతో ఉంటుంది, మాటకి లొంగని ఊహాలెన్నో ఉన్నాయి వంటి భావజాలానికి ఇలా సమాధానమిస్తారు రచయిత

మాటకు ఈ శక్తిలేదు అని అందరూ అంగీకరించారు అన్నావే ఆ అందరూ ఎవరో తెలుసునా? మాటకు ఎంత శక్తి ఉందో తెలియనివాళ్ళు. మాట కున్నంత శక్తి మరొక దానికి లేదు. మాటకు అనేకములైన అర్థాలు ఉంటవి. వంద సందర్భాల్లో ఒకేమాట వంద అర్థా లిస్తుంది. ఒక్క మాటే ఇన్ని అర్థాలిస్తే రెండు మూడు మాటలు కలిస్తే ఎప్పుడు ఏ అర్థమిస్తుందో చెప్పలేము. కనుక మాటకు శక్తిలేదనకు. శక్తి లేనిది మనకు. మాట అర్థమిస్తుంది. అర్థం చేసుకోవలిసినది మనము.

ఎప్పుడూ తిట్టే మిత్రుని పాత్రను అడ్డుపెట్టి తన విమర్శకులకు సమాధానం ఇలా ఇస్తారు విశ్వనాథ

నీవు నన్ను తిడుతున్నావంటే అర్థమేమిటంటే నన్ను చదువు తున్నావన్న మాట! చదవక తప్పదన్న మాట. నీకు తెలియకుండానే నన్ను మెచ్చుకుంటున్నావన్న మాట.అసలు తిట్టడానికీ, మెచ్చుకోవడానికీ పెద్ద భేదం లేదు. రెండూ ఒకటేననుకో. రూపాయి ఉందనుకో. అక్షరాలవైపు ఒకటీ. బొమ్మ వైపు ఒకటీ. ఎటు తిప్పినా రూపాయే.

కొండరేం చేస్తారంటే అర్థరాత్రి వేళ వస్తారు. తలుపు తట్టుతారు. ఎవరు వారు అంటే నేను అంటారు. ఏమి నేను, శ్రాద్ధం నేను విష్ణుశర్మ విష్ణుశర్మ కాదని స్వర్గంలో కొందరు ఇంద్రునికి అర్జీపెట్టుకున్నప్పటి సంభాషణ:

నేను విష్ణుశర్మని కాదని అర్జీ పెట్టుకున్న వాళ్ళందరూ ఏకవాక్యంగా వీరేశలింగం పంతులు గారు గనుక ఒప్పుకుంటే పంచతంత్రం రాసింది ఈయనేనని ఒప్పుకుంటాము అన్నారు. నేనన్నాను "'నేను రాసిన పుస్తకానికి ఒకడు ఒప్పుకోవడమేమిటి? మీలో ప్రతివాడూ ఎవడో ఒకడై ఉంటాడు కదా! వాడు వాడేనని ఇంకొకడు చెప్తే గానీ కాడా ఏమిటి?"' అన్నాను. అందులో ఒకడు అంతే అన్నాడు. "ఎవ్వడూ ఎరగని వాడొకడుంటాడు, వాడి గతి ఏం కావాలి?" అన్నాను. అంటే అతడు "వాడి గతి అంతే" అన్నాడు.

ప్రాచుర్యం

[మార్చు]

విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నవల సాహిత్య రంగంలో విలక్షణమైన నవలగా ప్రాచుర్యం పొందింది. సి.ఎస్.రావు ఈ నవలను నాటకంగా మలిచారు. ఈ నాటకాన్ని చిత్రీకరించి దూరదర్శన్ లో ధారావాహికగా ప్రసారం చేశారు. డి.ఎస్‌.దీక్షితులు తదితరుల దర్శకత్వంలో ఈ నాటకం పలుమార్లు రంగస్థలంపై ప్రదర్శించారు. ఉత్తమ నాటకంగా బంగారు నంది పురస్కారాన్ని అందుకుంది. విశ్వనాథ సత్యనారాయణ పాత్ర పోషించిన డా.జి.బి.రామకృష్ణ శాస్త్రికి నంది బహుమతి లభించింది. ఇటీవల ఈ పుస్తకం నాటక రూపంలో కూడా ప్రచురితమయింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
  1. "పుస్తకం పీడీఎఫ్ ప్రతి, నకలు హక్కులు గౌరవించండి". Archived from the original on 2013-12-12. Retrieved 2013-12-13.
* విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు నవల